
మహేశ్‌బాబునీ, రాహుల్‌బాబునీ కలిపి కొట్టినట్లున్న ఈ బాబు ప్రిన్స్ హ్యారీబాబు. డయానాకి మురిపాల బాబు. ప్రిన్స్ చార్ల్స్‌కి కొరకరాని కొయ్యబాబు. అన్న విలియమ్‌కి చిట్టిబాబు. క్వీన్ ఎలిజబెత్‌కి మనవడు బాబు. బ్రిటన్ అమ్మాయిలకు ముద్దులబాబు. మేఘన్ మార్కల్‌కి కాబోయే హబ్బీబాబు! ఏంటి బాబూ ఇదంతా?! అవును బాబూ. రాజమాత ఈ బాబు పెళ్లికి ‘ఎస్’ అంది బాబూ. రేపో మాపో హ్యారీకి, మార్కల్‌కీ ఎంగేజ్‌మెంట్ బాబూ.
ఇక ‘బాబు’ని వదిలేద్దాం బాబూ. బాబుకి కాబోయే భార్య మార్కల్ ఎవరో చూద్దాం. మార్కల్ అమెరికా అమ్మాయి. సినిమా అమ్మాయి. ఆల్రెడీ పెళ్లయింది. భర్తతో విడిపోయి వచ్చేయడమూ అయింది. హ్యారీకి నచ్చేయడమూ అయింది! లాస్ట్ ఇయర్ లవ్ స్టార్ట్ అయింది. రాణిగారింట్లో తెలిశాక ‘వార్’ అయింది. ‘పెళ్లయిన అమ్మాయి ఎందుకురా?’ అంటే రాజప్రాసాదం చిన్నదైపోదూ! ‘నీకన్నా మూడేళ్లు పెద్దదిరా!’ అంటే హ్యారీ చిన్నబుచ్చుకోడూ! ‘మూవీ డాల్ ఎందుకురా మనకు’ అంటే ఆ పిల్ల మూతి ముడుచుకోదూ! అందుకే అంతా సైలెంట్ అయిపోయారు. హ్యారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మీరీ న్యూస్ చూసేటప్పటికే ‘రింగేజ్‌మెంట్’ అయినా అయిపోవచ్చు. రింగు పెట్టేసుకుంటారు కదా, అందుకే రింగేజ్‌మెంట్.