ప్రియా.. దత్తత తీసుకోండి ప్లీజ్...!
సెలబ్రిటీలు తమకున్న క్రేజ్‌ను ఆస్వాదించడమే కాకుండా.. సమాజం పట్ల కాస్తంత బాధ్యతను కూడా తీసుకుంటే.. వారిపై అభిమానం మరింత పెరుగుతుంది. ఆ బాధ్యతలో ఇంకాస్త నిజాయితీ, జాలి, దయ మిక్స్ అయ్యాయంటే అభిమానం ఎన్నో రెట్లకు పెరుగుతుంది. అలాంటి వ్యక్తిత్వంతో అభిమానధనాన్ని సంపాదించుకున్న సుప్రసిద్ధులు చాలా మంది ఉన్నారు. ప్రధానంగా జంతువులను దత్తత తీసుకుని వార్తల్లోకి వచ్చిన వారికి మంచి గుర్తింపు దక్కింది. గుప్తంగా సాటి మనుషులకో, అనాథలకో సహాయం చేసే సెలబ్రిటీల కన్నా జంతువులను దత్తత తీసుకుంటున్న సెలబ్రిటీలకు ఎక్కువ క్రేజ్ లభిస్తోంది. ఇలా భూతదయను చూపించడం ద్వారా సదరు సెలబ్రిటీలు అభిమానుల్లో దయార్ధ్రహృదయులుగా పేరు తెచ్చుకొంటున్నారు.
ఈ క్రమంలో సెలబ్రిటీలు జూ లోని జంతువులను దత్తత తీసుకొంటే అది పెద్ద వార్తే అవుతోంది. ఈ నేపథ్యంలో చాలా జూ ల నుంచి సెలబ్రిటీలకు ప్రతిపాదనలు వెళుతున్నాయి. తమ జూ లోని జంతువులను దత్తత తీసుకొమ్మని జూ అధికారులు సినిమా వాళ్లకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలకు విజ్ఞప్తులు పంపుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు రాంచీ జూ అధికారులు ఇటువంటి ప్రతిపాదనే ఒకటి పంపారట. ఒక ఆడసింహాన్ని, ఒక పులిని, ఒక మర్కటాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా జూ అధికారులు కోరారట. దీనిపై ప్రియాంక చోప్రా కుటుంబం సానుకూలంగానే స్పందించింది. ప్రియాంక తల్లి ఇటీవలే రాంచీ జూను సందర్శించి అక్కడి జంతువులను చూసి వచ్చారు. త్వరలోనే తమ నిర్ణయాన్ని చెబుతామని ఆమె జూ అధికారులకు చెప్పారట.
ప్రియాంక తల్లి స్పందనపై జూ అధికారులు ఆనందపడుతున్నారు. ఇప్పటికే జంతువులను దత్తత తీసుకోవడంలో ప్రియాంక కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. 2011 లో తొలిసారి ప్రియాంక ‘దుర్గ’ అనే ఆడపులిని దత్తత తీసుకుంది. ఆ తర్వాత ఏడాది ఈ మాజీ విశ్వసుందరి ‘సుందరి’ అనే ఆడ సింహాన్ని ఏడాది పాటు దత్తత తీసుకొంది. ఆ దత్తత సమయం ముగిసిపోవడంతో అధికారులు ఇప్పుడు ప్రియాంకకు మూడు జంతువుల విషయంలో ప్రతిపాదనలు పంపారు. మరి ప్రియాంక ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పులి లేదా సింహాన్ని ఒక ఏడాది పాటు దత్తత తీసుకోవాలంటే దాదాపు రు.2.95 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అదే మర్కట పోషణకు అయితే రు.13 వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మరి ప్రియాంక ఈసారి ఎన్ని జంతువులను దత్తత తీసుకుంటుందో!