ఎ.సి.తో వచ్చే కష్టాలు!
లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్
నా వయసు 37. చాలాసేపు ఎయిర్ కండిషన్ గదిలోనే గడుపుతుంటాను. ఇటీవల నేను తీవ్రమైన అలసటతో బాధపడుతున్నాను. నా సమస్య ఏసీ వల్లనేనా? నాకు సరైన పరిష్కారం చెప్పండి. – వినయ్‌కుమార్, హైదరాబాద్
ఎయిర్ కండిషన్‌డ్ వాతావరణంలో చాలా ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి చాలా సౌకర్యంగా అనిపించే ఏసీ, మరికొందరి ఆరోగ్యానికి కొన్ని రకాల అనర్థాలు తెచ్చిపెట్టవచ్చు. ఏసీ వల్ల దాదాపు ఐదు ప్రధానమైన సమస్యలు వస్తాయి. అవి...
తీవ్రమైన అలసట: చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పనిముగిసే సమయానికి భరించలేని తలనొప్పి, తీవ్రమైన నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు.
పొడి చర్మం: చాలాసేపు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది, పొడిబారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.
దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం: కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే ఆర్థరైటిస్, న్యూరైటిస్ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో ఆ సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ.
అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం: గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు ఇక ఏమాత్రం వేడిమిని భరించలేరు. వేసవిలో బయటకు రావడమే కష్టంగా అనిపిస్తుంది. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు.
శ్వాస సమస్యలు: చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతుండటం వల్ల తేలిగ్గా
శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
– డాక్టర్ సుధీంద్ర ఊటూరి
లైఫ్‌స్టైల్ ఎక్స్‌పర్ట్, కిమ్స్, సికింద్రాబాద్
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మళ్లీ... చెవినొప్పి !
మా పాప వయస్సు ఆరేళ్లు. రెండు నెలల కిందట మా పాపకు జలుబు వస్తే ఈఎన్‌టీ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాం. చికిత్స తర్వాత సమస్య తగ్గింది. అయితే ఇప్పుడు మళ్లీ మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? తెలియచేయగలరు.– సుమతి, ఖమ్మం
మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. ఈ గ్రంథులకు టాన్సిల్స్ తరహాలో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇది కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. చిన్న పిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఇలాంటిది జరిగినప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రిషన్ లేదా ఈఎన్‌టీ సర్జన్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి.
– డా. రమేశ్ బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, హైదరాబాద్
కార్డియాలజీ కౌన్సెలింగ్ ...
అలా తింటే అనర్థమా!
నా వయసు 45 ఏళ్లు. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటాను. మాంసాహారం, ఫాస్ట్‌ఫుడ్‌తో గుండెజబ్బులు ఎక్కువగా వస్తాయని ఫ్రెండ్స్ అంటున్నారు. దాంతో ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
– భూమేష్, వరంగల్
గుండెజబ్బులకు కొలెస్ట్రాల్ అనేది ఒక ముఖ్యమైన రిస్క్‌ఫ్యాక్టర్. మాంసాహారం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఫాస్ట్‌ఫుడ్స్‌లో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలు. గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్‌ను ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రొటీన్) అనీ, మేలు చేసేదాన్ని హెచ్‌డీఎల్ (హై డెన్సీటీ లైపోప్రొటీన్) అని అంటారు. మన రక్తంలో ఎల్‌డీఎల్ 100 కంటే తక్కువగానూ, హెచ్‌డీఎల్ 40 కంటే ఎక్కువగానూ ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరానికి రెండు రకాలుగా అందుతుంది. మొదటిది ఆహారం ద్వారా, రెండోది కాలేయం పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు శరీరంలో 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు, నరాల వ్యవస్థ ఇలా శిశువు పూర్తిగా ఎదగడానికి రెండేళ్ల వయసు వచ్చే వరకు కొలెస్త్రాల్ ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది.
రెండేళ్ల తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే వ్యక్తుల్లోని జన్యుతత్వాన్ని బట్టి కూడా మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి ఎక్కువ/తక్కువగా అవుతుంటుంది. మాంసాహారం మాత్రమేగాక... వేపుళ్లు, బేకరీ పదార్థాలు, నెయ్యి లాంటి వాటిని పరిమితి కంటే మించి ఎక్కువగా తీసుకుంటే ఆహారం కాస్తా కొవ్వుగా మారుతుంది. అది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, దాన్ని పరిమితిలో ఉంచుకోడానికి మందులు వాడుతుంటే, వాటిని మధ్యలో మానేయకూడదు. మీరు మాంసాహారం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ కొవ్వులు తక్కువగా ఉండే చికెన్ తీసుకోవచ్చు. అయితే చికెన్ కంటే కూడా చేపలు మరీ మేలైనవి.
– డాక్టర్ అనూజ్ కపాడియా, కేర్ హాస్పిటల్స్
గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్
కాలేయ వ్యాధులు వంశపారంపర్యమా?
నా వయసు 23. మా తాతగారి కాలం నుంచి కుటుంబంలో దాదాపు అందరికీ కామెర్ల వ్యాధి వచ్చింది. మా తాతగారు, పెదనాన్న, పెద్ద మేనత్త కాలేయ క్యాన్సర్‌తో చనిపోయారు. నాకూ జాండీస్ వచ్చింది. కామెర్లు వ్యాధి వచ్చిన వాళ్లందరికీ తర్వాత కాలేయ క్యాన్సర్ వస్తుందా? కాలేయ క్యాన్సర్ కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. – రమేశ్, కందుకూరు
కామెర్లు వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. కానీ వంశపారంపర్యంగా వచ్చే ఫ్యాటీలివర్ మాత్రం ఒక రకమైన క్యాన్సర్‌కు కారణం కావచ్చు. మితిమిరిన మద్యపానం (నాలుగైదేళ్లకు పైబడి), హెపటైటిస్ ఎ, బి, సి, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువ మంది మొదట కామెర్ల వ్యాధికి గురవుతుంటారు. హెపటైటిస్ ఏ, ఈ వైరస్‌ల వల్ల హఠాత్తుగా కామెర్ల వ్యాధి సోకి మరణించే ప్రమాదం ఉంటుంది. కామెర్ల వ్యాధికి గురై దాన్ని గుర్తించడంలో ఆలస్యం, నాటు మందుల వాడకం కాలేయానికి తీరని నష్టం చేస్తాయి.
కాలేయ క్యాన్సర్ అనగానే చాలామంది మితిమీరిన మద్యపానం వల్ల వచ్చే వ్యాధి అనుకుంటారు. కానీ వందరకాల కాలేయ క్యాన్సర్లలో ఒక్కరకం క్యాన్సర్ మాత్రమే అదుపు లేని ఆల్కహాల్ వల్ల వస్తుంది. ప్రధానంగా హెపటైటిస్ వైరస్‌ల వల్ల వచ్చే కామెర్లు, బిలియరీ ఎట్రిసియా, మెటబాలిక్ డిసీజెస్ వంటివి కాలేయ క్యాన్సర్లకు దారితీస్తుంటాయి. వీటిలో హెపటైటిస్ వైరస్‌లే కామెర్లు, పెద సంఖ్యలో కాలేయ క్యాన్సర్లకు కారణం అవుతుంటాయి. హెపటైటిస్ సోకినా కొంతమంది చాలా ఏళ్ల వరకు దాని వల్ల జరుగుతున్న నష్టం గుర్తించరు. దాంతో 20 – 30 ఏళ్ల తర్వాత అది కాలేయ క్యాన్సర్ రూపంలో బయటపడుతుంది. బహుశా మీ కుటుంబంలో ఎక్కువ మంది యాదృచ్ఛికంగా ఈ విధంగా కాలేయ క్యాన్సర్‌కు గురై ఉండవచ్చు.
కామెర్లకు ఇప్పుడు మంచి ఫలితాలు ఇవ్వగల ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. కానీ దీర్ఘకాలం పాటు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం పరిస్థితి విషమించే ప్రమాదం ఉన్నందున కామెర్లు వచ్చినవారు తప్పనిసరిగా డాక్టరుకు చూపించుకొని తగిన చికిత్స తీసుకోవాలి. ఇక కాలేయ క్యాన్సర్ విషయానికి వస్తే కలుషితమైన ఆహారపదార్థాలు తినడంవల్ల, ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, వంశపారంపర్యంగా వచ్చే ఫ్యాటీలివర్ డిసీజ్ వల్ల కాలేయం దెబ్బతిని క్యాన్సర్ వస్తున్నట్లు వెల్లడైంది. శరీరంలో కొంత కొవ్వు ఉండటం సహజమే. కానీ శరీరపు బరువులో అది పది శాతాన్ని మించినప్పుడు ఫ్యాటీ లివర్ వస్తుంది. మధ్య వయసు, ఊబకాయం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువ. హీమోక్రొమటోసిస్ (శరీరంలో ఇనుము ధాతువు పెరిగిపోవడం), చాలాకాలంగా తగ్గకుండా ఉన్న హెపటైటిస్ వ్యాధుల వల్ల కూడా కాలేయానికి క్యాన్సర్ సోకవచ్చు. కారణం ఏదైనా సరే కామెర్లు కనిపించగానే తగిన పరీక్షలు చేయించుకొని, డాక్టర్లతో చికిత్స చేయించుకోవడం ద్వారా కాలేయం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో ప్రాణాపాయకరమైన కాలేయ క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు.
– డాక్టర్ హరికుమార్ ఆర్ నాయర్,
సీనియర్ హెపటాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్