మూత్రంలో ఇబ్బందా?  ప్రోస్టేట్‌ పరీక్ష అవసరం!  | Prostate testing is required | Sakshi
Sakshi News home page

మూత్రంలో ఇబ్బందా?  ప్రోస్టేట్‌ పరీక్ష అవసరం! 

Published Thu, Aug 30 2018 12:37 AM | Last Updated on Thu, Aug 30 2018 12:37 AM

Prostate testing is required - Sakshi

పురుషుల్లో ప్రోస్టేట్‌ గ్రంథికి సోకే క్యాన్సర్‌ను ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ అంటారు. ఈ గ్రంథి ‘వాల్‌నట్‌’ ఆకారంలో ఉంటుంది. మనకు వీర్యంలో కనపడే ద్రవపదార్థాన్ని ఇది తయారుచేస్తుంది. వీర్యకణాలను మోసుకెళ్లడానికి ఈ ద్రవం తోడ్పడుతుంది. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ అనేది పురుషుల్లో మాత్రమే కనిపించే అతి సాధారణ క్యాన్సర్‌. ఇది చాలా నెమ్మదిగా పెరుగుతుంది. మొదటిదశలో ప్రోస్టేట్‌ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ పరిస్థితిలో చికిత్స అవసరం అతి తక్కువగా ఉంటుంది లేదా అసలు అవసరమే రాకపోవచ్చు. అయితే కొన్ని రకాల ప్రోస్టేట్‌ క్యాన్సర్‌లు వేగంగా విస్తరిస్తాయి. గ్రంథికి మాత్రమే పరిమితమైన దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. అయితే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ మొదటిదశలో ఎలాంటి లక్షణాలూ బయటపడకపోవచ్చు. వ్యాధి తీవ్రమైన దశలో మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రంలో లేదా వీర్యంలో రక్తం పడటం, మూత్రం ధారగా రాకపోవడం, కాళ్లవాపు, ఎముకలలో నొప్పి, పొత్తికడుపులో ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

కారణాలు : ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ రావడానికి కచ్చితమైన కారణాలు తెలియదు. వయసు పెరగడం, కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉండటం, స్థూలకాయం వంటివి క్యాన్సర్‌కు కారకాలు అయ్యే అవకాశం ఉంది. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను విస్మరిస్తే అది ఇతర భాగాలకు వ్యాపించడం, అంగస్తంభన సమస్యలు మొదలైనవి రావడానికి అవకాశం ఉంది. యాభై ఏళ్లు నిండిన పురుషులు క్రమం తప్పకుండా ప్రోస్టేట్‌ స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకోమ్మని ఎన్నో అంతర్జాతీయ సంస్థలు సూచిస్తున్నాయి. 

పరీక్షలు : డిజిటల్‌ రెక్టల్‌ ఎగ్జామ్‌ (డీఆర్‌ఈ), ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజెన్‌ (పీఎస్‌ఏ) పరీక్షలను చేయించుకోవడం వల్ల వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. ఈ పరీక్షల్లో రిపోర్ట్‌ ‘అబ్‌నార్మల్‌’గా వస్తే అల్ట్రాసౌండ్, బయాప్సీ పరీక్షలు చేయించుకోవాలి. బయాప్సీలో పాజిటివ్‌ వస్తే గ్రేడింగ్‌ చేయించుకోవాలి. అంటే వ్యాధి తీవ్రత ఏ దశలో ఉందో గుర్తించాలి. ఇందుకోసం క్యాన్సర్‌ కణాలను, ఆరోగ్యంగా ఉన్న ప్రోస్టేట్‌ కణాలతో పోల్చిచూస్తారు. క్యాన్సర్‌ కణాలు ఆరోగ్యకరమైన కణాల కంటే ఎంత ఎక్కువగానూ, భిన్నంగానూ ఉంటే వ్యాధి అంత తీవ్రంగా ఉన్నట్లు లెక్క. వ్యాధి తీవ్రతను కొలిచే కొలమానాన్ని ‘గ్లీసన్‌ స్కోర్‌’ అంటారు. ఈ స్కోరు 2 నుంచి 10 వరకు ఉంటుంది. 2 ఉంటే తీవ్రత తక్కువగా ఉన్నట్లు. అదే 10 ఉంటే తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు చెప్పవచ్చు. 

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ దశలు :
స్టేజ్‌ – 1 : మొదటి దశలో ఉందంటే క్యాన్సర్‌ చాలా ప్రాథమిక దశలో ఉందని అర్థం. మైక్రోస్కోప్‌తో చూడగలిగే పరిమాణంలోనే ఉందని అర్థం. 
స్టేజ్‌ – 2 : ఈ దశలో క్యాన్సర్‌ సులభంగా కనిపిస్తూ ఉంటుంది. అది ప్రోస్టేట్‌ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది. 
స్టేజ్‌ – 3 : ఈ దశలో క్యాన్సర్‌ ప్రోస్టేట్‌ గ్రంథిని దాటి వీర్యవాహికలు లేదా ఇతర సమీప కణజాలానికి పాకి ఉండవచ్చు. 
స్టేజ్‌ – 4 : ఈ దశలో క్యాన్సర్‌ లింఫ్‌ గ్రంథులు, ఎముకలు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు పాకి ఉంటుంది. 

చికిత్స : ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ చికిత్స ప్రక్రియ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు క్యాన్సర్‌ ఎంత వేగంగా వృద్ధి చెందుతోంది, ఎంత వేగంగా ఇతర అవయవాలకు పాకుతోంది, రోగి ఆరోగ్యస్థితి, చికిత్స దుష్ప్రభావాలు... ఇలా అనేక అంశాలపై ఆధారపడి చికిత్స ప్రక్రియను నిర్ణయిస్తారు. 

చికిత్స వెంటనే అవసరం పడకపోవచ్చు : క్యాన్సర్‌ మొదటి దశలో ఉన్నవారికి వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు రోగులను అప్రమత్తతతో వేచి ఉండమని సూచిస్తారు. అంటే క్రమం తప్పకుండా రక్తపరీక్షలు, పురీషనాళ పరీక్షలు, అవసరమైతే బయాప్సీ వంటివి చేయించుకుంటే శరీరంలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం. అప్రమత్తతతో వేచి చూడటం అనేది క్యాన్సర్‌ చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతున్న వారికి, క్యాన్సర్‌ లక్షణాలు బయటపడని వారికి మాత్రమే. క్యాన్సర్‌ వేగంగా వృద్ధిచెందుతున్నట్లు గమనిస్తే ఆపరేషన్, రేడియోథెరపీ వంటి చికిత్స పద్ధతులను అనుసరించాల్సి రావచ్చు. 

రేడియేషన్‌ థెరపీ : ఈ థెరపీలో అధికశక్తి గత రేడియోధార్మిక కిరణాలను ఉపయోగించి క్యాన్సర్‌ కణాలను తుదముట్టిస్తారు. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌లో రేడియేషన్‌ను రెండు రకాలుగా ఇస్తారు. శరీరం బయటనుంచి రేడియోధార్మికతను ఇవ్వడం. శరీరం లోపల రేడియో ధార్మికతను ఉంచడం. 

హార్మోన్‌ థెరపీ : హార్మోన్‌ థెరపీలో శరీరంలోని టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తిని నిలిపివేస్తారు. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌లో క్యాన్సర్‌ కణాలు టెస్టోస్టెరాన్‌ మీద ఆధారపడి వృద్ధిచెందుతుంటాయి. టెస్టోస్టెరాన్‌ సరఫరాను నిలిపివేయడం వల్ల క్యాన్సర్‌ కణాల వృద్ధి మందగించడం గానీ లేదా చనిపోవడం గానీ జరుగుతుంది. హార్మోన్‌ థెరపీని వివిధ రకాలుగా ఇవ్వవచ్చు. క్యాన్సర్‌ ప్రాథమిక దశలో ఉన్నవారికి హార్మోన్‌ «థెరపీ సరిపోతుంది. హార్మోన్‌ థెరపీ వల్ల క్యాన్సర్‌ కణుతులు కుంచించుకుపోతాయి. ఆ తర్వాత రేడియేషన్‌ చికిత్స చేస్తే ఫలితాలు మెరుగ్గా వస్తాయి. 

శస్త్రచికిత్స : శస్త్రచికిత్స ద్వారా ప్రోస్టేట్‌ గ్రంథిని, దాని చుట్టుపక్కల కణజాలాన్ని, లింఫ్‌ గ్రంథులతో కొంత భాగాన్ని తొలగిస్తారు. అయితే దీనివల్ల అంగస్తంభన సమస్య, మూత్రవిసర్జన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 

కీమోథెరపీ : ఈ ప్రక్రియలో మందులతో క్యాన్సర్‌ కణాలను చంపడానికి యత్నిస్తారు. కీమోథెరపీలో మందులను ఇంజెక్షన్ల రూపంలోగానీ లేదా మాత్రల రూపంలోగాని ఇస్తారు. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ బాగా ముదిరి శరీరంలోని ఇతర భాగాలకు కూడా పాకినట్లయితే కీమోథెరపీని ఇస్తారు. 

నివారణ : నిత్యం వ్యాయామం చేయడం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. 

క్యాన్సర్‌ వ్యాప్తిని గుర్తించడం ఇలా 
క్యాన్సర్‌ వ్యాధి ప్రోస్టేట్‌ గ్రంథిని దాటి ఇతర అవయవాలకు వ్యాపించిందనే అనుమానం వస్తే ఎముకల స్కానింగ్, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. ఈ పరీక్షల వల్ల క్యాన్సర్‌ ఏ దశలో ఉందో నిర్ధారణ అవుతుంది. 

Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, 
Kurnool 08518273001

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement