తెలుపకనే తెలుసుకునే ‘తెలుపు’ కథ!
సమస్య
మగాడికి ‘తెలుపు’ అంటే భయం!
‘తెలుపు’... ఒక ఆలోచన!
‘తెలుపు’... ఒక పరిశోధన!
‘తెలుపు’.. ఒక స్థిత ప్రజ్ఞత!
తెలుపే సమస్య... తెలుపే పరిష్కారం.
ఇప్పుడు ఈ విషయాన్ని మరింత వివరంగా ‘తెలుపు’కుందాం.
.
ఆ క్షణం... మిన్ను విరిగి వెన్నుమీద పడ్డట్టు... కిరీటం జారి కిందపడ్డట్టు... అధికారం ఆవిరైపోయినట్టు... కాళ్లకింద నేలను ఎవడో లాగేసినట్టు... ఒక్క మాటలో చెప్పాలంటే... ఒక మగాడికి అదో అవమానభరిత క్షణం! భవిష్యత్తు అగమ్యంగా గోచరించే క్షణం.
అరచేతిలోని అద్దం అబద్ధం చెప్పదని తెలిసినా... ‘ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు’ అనే అత్యాశ అలముకునే క్షణం. ఆ క్షణం ఏదంటే... మగాడి తలలో తొలి తెల్లవెంట్రుక తలెత్తిన క్షణం!
తొలి ‘తెలుపు’ దశ: ‘ఏముంది... ఒక్క వెంట్రుకే కదా నెరిసింది. పీకిపారేస్తే సరి’ అని మగాడు సరిపెట్టుకోలేడు. కానీ, తక్షణ కర్తవ్యం మాత్రం అదే! ఆ తరువాత అంతర్మథనం మొదలు. ‘నాకు ఎందుకొచ్చింది? నాకే ఎందుకొచ్చింది?’... ఒక్క తెల్ల వెంట్రుక ఇలా మగాడికి మనశ్శాంతిని దూరం చేయడం మొదలుపెడుతుంది. ఈ మనోవేదన నుంచి బయటపడేందుకు... మగాడు బయట ప్రపంచాన్ని గమనించడం మొదలుపెడతాడు! అంటే... ‘నా ఫ్రెండ్స్‌లో ఎవరికైనా తెల్ల వెంట్రుకలు వచ్చాయా..? నా వయసులో ఉన్న మరెవరికైనా తల నెరిసిందా?’... అంటూ వెతకడం మొదలుపెడతాడు. సినిమాకి వెళ్లినా... షికారుకి వెళ్లినా... తన వయసు మగాడు కనిపించగానే చూపులు చురకత్తుల్లా అతడి తలలోకి దూరిపోతాయి. ఒక్క తెల్లవెంట్రుక కనిపిస్తే చాలు... ‘హమ్మయ్య... ఫర్వాలేదు. నాకు ఒక్కడికే కాదు, వీడికీ తెల్ల వెంట్రుకలు ఉన్నాయి’ - అనే ఆత్మ సంతృప్తి కలుగుతుంది. తనకున్న సమస్య తనొక్కడికే కాదు, చాలామందికి ఉందనుకుంటే అదో రకమైన ఉపశమనం! ఆరోజుకి హాయిగా నిద్రపోతాడు.
మలి ‘తెలుపు’ దశ: రోజురోజుకీ తెల్లబడుతున్న వెంట్రుకల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అద్దం ముందు నిలబడితే అది వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. గాలింపు చర్యలకు దిగుతాడు మగాడు! తల్లోని తెల్లవెంట్రుకల్ని వెతికివెతికి వాటి పనిపట్టేస్తాడు. అవసరమైతే కత్తెర అనే ఆయుధాలని రంగంలోకి దించుతాడు. అయినా, మనశ్శాంతి కరువు అవుతుంది. దినదిన ప్రవర్ధమానమౌతున్న ‘శ్వేత వర్ణ’ కేశ సంపద వెక్కిరిస్తుంటుంది. ‘ఎవరూ నా తలవైపు చూడకూడదు. చూసినా వాళ్లకి నా తెల్ల వెంట్రుకలు కనిపించకూడదు. కనిపించినా వాళ్లు వాటి గురించి మాట్లాడకూడదు’... ఈ తరహా అనుమానంతో కూడిన భయం లాంటి ఒక వేదన వెంట తరుముతూ ఉంటుంది. ముఖ్యంగా.. అందమైన అమ్మాయిలు ఎదురైనా పక్కనుంచి పలకరిస్తూ వెళ్లినా ఇంతకుముందున్న ఆనందం ఉండదు. ఒకరకమైన కంగారు! ఈ దశలో మగాడికి చేతినిండా పనే. అస్సలు ఖాళీ ఉండదు. ఇంట్లో ఉంటే ఒకచేతిలో అద్దం... మరో చేతిలో జుత్తు! కూంబింగ్ జరుగుతూనే ఉంటుంది.
తొలి ‘వర్ణ’ దశ: ‘ఇలా పీక్కుంటూ పోతే ఏం మిగలదు. ఏదో చేయాల్సిందే. తలకి ఏదో పుయ్యాల్సిందే’ - పై రెండు దశలూ దాటాక మగాడికి వచ్చే క్లారిటీ ఇది. ఎవరు చూసినా చూడకపోయినా.. చూసి నవ్వుతున్నా... నవ్వుకుని జోకులు వేసుకుంటున్నా... తెల్లవెంట్రుకలు తెగపెరిగిపోతున్నాయన్న సత్యాన్ని మగాడు గుర్తిస్తాడు. ఒకసారి సత్యాన్ని గుర్తించాక అనుమానాలు తొలగిపోతాయి. అపోహలు చెరిగిపోతాయి. రంగేద్దాం అని నిర్ణయించుకుంటాడు. తెల్ల జుత్తును కవర్ చేద్దాం అన్న ఆలోచన రాగానే మగాడు ‘టీ డికాక్షన్ మరిగించడం’లో ఎక్స్‌పర్ట్ అయిపోతాడు! హెన్నా తయారు చేసుకోవాలంటే ఇది ఉండాలి కదా! కలర్ కాస్త డార్క్‌గా రావాలంటే ఎవరో చెప్పారని నిమ్మకాయ రసం అందులో పిండుతాడు. తొలిసారి హెన్నా పెట్టుకుంటాడు. గంట తరువాత స్నానం చేసి, అద్దం ముందు నిలబడి... రంగుమారిన జుత్తును చూస్తూ మురిసిపోతాడు. ‘హెయిర్ కాస్త రెడిష్‌గా ఉండటం ఇప్పుడు ఫ్యాషన్’ అని సర్ది చెప్పుకుంటాడు. ఒకటి... రెండు.. మూడు... నాలుగు... మహా అయితే ఐదేళ్లు... అంతే, తరువాత మరో దశకి చేరుకుంటాడు మగాడు!
మలి ‘వర్ణ’ దశ: తల తెలుపును హెన్నా కప్పిపుచ్చలేని స్థితికి చేరుకుంటాడు మగాడు. ‘హెయిర్ మరీ రెడ్‌గా ఉంటోంది. నేచురల్ లుక్ ఉండటం లేదు’- ఇలా ఒక కొత్త రూల్‌ని ఫ్రేమ్ చేసుకుంటాడు. హెయిర్ డై మీదికి దృష్టి మళ్లుతుంది. ప్రకాష్‌రాజ్, బొమన్ ఇరానీ, ఐశ్వర్యారాయ్, మలైకా అరోరా, సోనమ్ కపూర్... వీళ్లందరికీ మగాడు అభిమానిగా మారిపోతాడు.
ఎందుకంటే, రకరకాల హెయిర్ డైలకి అంబాసిడర్లు వీళ్లే మరి! వీళ్లలో ఎవరిదో ఒకరి మాట తలకెక్కేస్తుంది. ‘హెయిర్ డై వేసుకుంటూ సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయటగా..? ఆ... ఎంతమంది వేయడం లేదు. హెయిర్ డై వేసుకున్నట్టు అందరికీ తెలిసిపోతుందా..? ఆ... మా వెంకిగాడు వేసుకున్నట్టు ఎవరికైనా తెలుస్తోందా’ - ప్రశ్నకి సమాధానం వెంటనే దొరికేస్తుంటుంది. మొత్తానికి రంగు వేసుకోవడం అలవాటైపోతుంది. మగాడి అలమరలోకి ఒక డై ప్యాకెట్, ఒక బ్రష్ వచ్చి చేరిపోతాయి. తెల్లవెంట్రుకలు మటుమాయం. అక్కణ్నుంచీ మగాడి జీవితంలో ఓ కొత్త రంగు! మగాడు... మళ్లీ మగాడిగా మారిపోతాడు.
(నోట్: బట్టతలకి కూడా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. ప్రతీ దశలోనూ ‘తెల్ల వెంట్రుక‘ స్థానంలో ‘బట్టతల’ అనే మాటను పెట్టుకొని ఆలోచిస్తే చాలు. మగాడు స్థితప్రజ్ఞుడైపోతాడు.)