తలకు రంగేస్తున్నారా..? ఈ పొరపాట్లు చేయకండి..! | Identify The Problems Caused By Hair Colors And Take Proper Precautions | Sakshi
Sakshi News home page

తలకు రంగేస్తున్నారా..? ఈ పొరపాట్లు చేయకండి..!

Published Fri, Nov 22 2024 9:55 AM | Last Updated on Fri, Nov 22 2024 12:57 PM

Identify The Problems Caused By Hair Colors And Take Proper Precautions

తెల్ల జుట్టు నల్లగా అవ్వాలంటే.. ఈ రోజుల్లో ఉన్న అతి పెద్ద సమస్యలలో ఇదొకటి. వయసు పైబడిన వారికే కాదు యువతలోనూ జుట్టు తెల్లబడటం గమనిస్తున్నాం. ఇలాంటప్పుడు జుట్టును నల్లబరచడానికి సాధారణంగా కలర్స్‌ వాడుతుంటారు. కొందరు స్టైల్‌ కోసం వివిధ రకాల రంగులను ఉపయోగిస్తుంటారు. అవగాహన ఉంటే హెయిర్‌ కలర్స్‌ వల్ల వచ్చే సమస్యలను గుర్తించి.. ముందే సరైన జాగ్రత్తలు తీసుకోవచ్చు. 

ప్రాచీన కాలంలో తెల్లజుట్టు రంగు మార్చడానికి గోరింటాకును ఉపయోగించేవారని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది. సింథటిక్‌ హెయిర్‌ డై లు మాత్రం వందేళ్ల క్రితం పుట్టుకొచ్చాయి. నాటినుంచి వివిధ రకాల హెయిర్‌ కలర్స్‌ జుట్టును నల్లబరచడానికి వివిధ మోడల్స్‌లో మార్కెట్లోకి వచ్చి చేరుతున్నాయి.

తీవ్ర ప్రభావం
షాడో కలర్స్‌తో పాటు ఎక్కువగా వినేమాట బ్లాక్‌ హెన్నా. ఇది కూడా కలరే. హెయిర్‌ని బ్లాక్‌ చేసే షాంపూలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కలర్స్‌లో అమ్మోనియా ఫ్రీ అని మార్కెటింగ్‌ చేస్తుంటారు. ఇక పారాటోలిన్, డయమిన్‌ కెమికల్స్‌ బ్లాక్‌ కలర్‌ రావడానికి ఉపయోగిస్తారు. వీటివల్ల రియాక్షన్స్‌ వస్తాయి. కొందరికి వెంటనే రియాక్షన్‌ ప్రభావం చూపుతుంది. వెంటనే మాడుపైన దురద పుడుతుంది.

కొందరికి తల, కళ్లు, ముఖం వాస్తాయి. దీర్ఘకాలంలో అయితే పిగ్మెంటేషన్‌ సమస్య వస్తుంది. మొటిమలు, యాక్నె బాధిస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే మెడికేటెడ్‌ హెయిర్‌ కలర్‌ వాడుకోవాలి. బ్లాక్‌ హెన్నా సేఫ్‌ అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఇది కూడా హెయిర్‌ కలరే. మిగతా వాటితో పోల్చితే రెడ్‌ హెన్నా కొంతవరకు సేఫ్‌. 

మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి... 
హెయిర్‌ కలర్‌ వేసుకునేవారు ముందుగా చెవి వెనక జుట్టుకి కొద్దిగా వేసి, ఒకరోజు అలాగే ఉంచి, చెక్‌ చేసుకోవాలి. కలర్‌ వేసుకునే ముందు ముఖానికి, మాడుకు కూడా మాయిశ్చరైజర్‌ అప్లై చేసి, తర్వాత డై వేసుకోవాలి. అప్పుడు కలర్‌ చర్మానికి అంటినా, డార్క్‌ అవదు. డై వేసుకోవడానికి ఎవరికి వారుగా కాకుండా మరొకరి సాయం తీసుకోవడం ఉత్తమం.

వాష్‌ చేసుకునేటప్పడు... 
కలర్‌ వేసుకున్న తర్వాత శుభ్రపరిచేటప్పుడు ముఖం మీదుగా కాకుండా తల వెనక నుంచే కడగాలి. దీంతో ముఖంపైన కలర్‌ పడకుండా ఉంటుంది. మెడికేటెడ్‌ హెయిర్‌ కలర్స్‌ మార్కెట్లో దొరికేటంత డార్క్‌ కలర్‌ని ఇవ్వవు. త్వరగా కలర్‌ పోతుంది. 

అందుకే, మార్కెట్లో లభించే వాటికే వెళతారు. కానీ, డై కి ఇచ్చిన ప్రాముఖ్యం మన ఆరోగ్యానికి కూడా ఇవ్వాలనేది గుర్తుంచుకోవాలి. జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు మార్గాలేవీ లేవు కనుక ప్రొటెక్టివ్‌ మెడికేటెడ్‌ కలర్స్, షాంపూలను ఉపయోగించడం మేలు. 
పొడిబారడం 

ప్రధాన సమస్య...
సోరియాసిస్‌ సమస్య ఉన్నవాళ్లు హెయిర్‌కలర్స్‌ వేసుకునే ముందు మెడికేషన్‌ తీసుకోవాలి. కలర్‌ సమస్యతో పాటు ఈ కాలం చలి వల్ల చాలా మంది తల స్నానం చేయరు. లేదంటే స్నానానికి వేడిగా ఉండే నీటిని ఉపయోగిస్తారు. దీంతో చర్మం, వెంట్రుకలు కూడా పొడి బారుతాయి. కలర్స్‌ వల్ల కూడా మాడు దురద పెడుతుంది. పొడిబారిన మాడు చుండ్రును పెంచుతుంది. యువతలో ఈ సమస్య అధికం.

అందుకని, వారానికి రెండు సార్లు ఆయిల్‌ మసాజ్‌ చేసుకొని, మెడికేటెడ్‌ లేదా యాంటీ డాండ్రఫ్‌ షాంపూతో తలస్నానం చేయాలి. చుండ్రు సమస్య ఉన్నవాళ్లు నూనె రాసి, అలాగే ఉంచకూడదు. వెంట్రుకల మృదుత్వానికి, కలర్‌కి హెన్నా, అలోవెరా... వంటివి తలకు ప్యాక్స్‌ వేస్తుంటారు. వీటిని రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు స్నానం చేస్తుంటారు. దీనివల్ల సైనస్‌ సమస్యలు రావచ్చు. తలకు నేచురల్‌ ప్యాక్స్‌ వేసుకున్నా గంటలోపు తలను శుభ్రపరుచుకోవడం మంచిది.
– డాక్టర్‌ స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్‌ 

(చదవండి: ఫ్యాషన్‌కి వయసు అడ్డంకి కాదంటే ఇదే..! లెజండరీ గ్రానీ స్టిల్స్‌ అదుర్స్‌..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement