దండనలోనూ ప్రేమే ఉండాలి
కేరెంటింగ్
‘‘పిల్లలు ఏ వయసువారయినా, తల్లిదండ్రులు వారిని కొట్టకూడదు’’ అని చైల్డ్ సైకాలజిస్టులు చెబుతుంటారు. ఎందుకు కొట్టకూడదు?ఈ ప్రశ్నకు సమాధానంగా వైద్యనిపుణులు, మనోవైజ్ఞానికులు తమ తమ విలువైన అభిప్రాయాలను తెలియపరిచారు. అందులో, డాక్టర్ జాన్‌హంట్ వ్యక్తపరిచిన కొన్ని అభిప్రాయాలను గురించి తెలుసుకుందాం.తలిదండ్రులు తమ బిడ్డలను కొట్టడం ద్వారా, తమ పిల్లలు ఇతరులను కొట్టేవారుగా తయారవడానికి దోహదపడతారు.
* తలిదండ్రులు కోపంతోనే బిడ్డను కొడతారు. బిడ్డకు కూడా బాధ వల్ల కోపం వస్తుంది. కోపం పెద్ద వాళ్లకు గానీ, పిల్లలకు గానీ మంచిది కాదు. అన్ని గుణాల కంటే కోపం ప్రమాదకరమైనది.
* కొందరు తలిదండ్రులు పిల్లలను చేతితో కాక కర్రతో కొడతారు. అలా కొట్టినట్లయితే పొరబాటున తగలకూడని చోట తగిలితే, లేనిపోని సమస్యల్ని ఎదుర్కొనవలసి వస్తుంది.
* అస్తమానం కొడుతున్న తల్లిదండ్రుల పట్ల పిల్లలకు గౌరవం పోతుంది. విలువ తగ్గిపోతుంది. తలిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉండే బంధం కాస్తా పలచబడి పోతుంది. కొట్టిన చేతుల్ని చాపితే, బిడ్డలు మనస్ఫూర్తిగా ఆ కౌగిట్లోకి వెళ్లలేరు. తమకు పడిన దెబ్బలే వారికి గుర్తువస్తాయి.
* కొట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. అప్పటికప్పుడు భయం చేత, ఆ అల్లరిని తాత్కాలికంగా పిల్లలు ఆపేస్తారు. తర్వాత మళ్లీ అదే పని చేస్తారు. తిరగబడడానికి ప్రయత్నిస్తారు. చేతకాకపోతే తనకు తాను హింసించుకుంటారు.
* అన్నింటికంటే ముఖ్యం... పిల్లల్ని కొట్టడం మొదలుపెట్టిన తరువాత, పిల్లల ముఖంలో అప్పటివరకూ ఉన్న కళ పోతుంది. వారికి తలిదండ్రుల ముఖంలో క్రూరత్వమే కనబడుతుంది. దాంతో వారి కళ్లల్లోకి సూటిగా చూడ బుద్ధికాదు.
* అందుకే పిల్లలను కొట్టకుండానే వారిలో పరివర్తన తీసుకు వచ్చేందుకు కోపంతో కాకుండా, ప్రేమతో చెప్పడం మంచిదని లేదంటే సున్నితంగా మందలించడం సురక్షితమని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.