మీ ప్రేమ కోరే చిన్నారులం..
- అమ్మానాన్నలు కలిసి ఉండాలని చిన్నారుల మారాం
- దంపతులను ఒక్కటి చేసిన వైనం
సాక్షి, హైదరాబాద్: ‘అమ్మా నాన్నలు కలసి ఉండాలని పిల్లలు ఎన్నో దేవుళ్లను మొక్కుకోవడం... ఆలయాలను దర్శించుకోవడం... దేవ తలే దిగివచ్చి పిల్లలకు అండగా నిలవడం... చివరకు తల్లిదండ్రులను ఒక్కటి చేయడం...’ ఇదీ సుమారు దశాబ్దం క్రితం వచ్చిన ‘దేవుళ్లు’ సినిమాలోని దృశ్యం.
అచ్చంగా అలాంటి ‘చిత్రమే’ నగరంలో చోటుచేసుకుంది. ‘అమ్మ కొడుతుంది... అమ్మకంటే నాన్నే మంచి వాడు.. మేం అమ్మ దగ్గరకు పోం... నాన్నతో కలసి ఉంటేనే ఆమె దగ్గర ఉంటాం..’ అంటూ ఇద్దరు చిన్నారులు పోలీసుల వద్ద మారాం చేశారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న తల్లి ఎట్టకేలకు భర్తతో కలసి ఉండడానికి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. ఆసక్తి కలిగించే ఈ సంఘటన వివరాలివీ... వెంకటగిరికి చెందిన కాంట్రాక్టర్ తలారి సత్యంతో రామలక్ష్మి పన్నెండేళ్ల క్రితం వివాహమైంది.
వీరికి పవన్ కార్తీక్ (10), అంజనా సౌమ్య (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. తనను అనుమానిస్తున్న భార్య రామలక్ష్మితో గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయిన సత్యం గత ఏడాది ఆగస్టు 20న భార్య ఇంట్లో లేని సమయంలో ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లిపోయాడు.
అదే రోజు పిల్లలు కనిపించడం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు రామలక్ష్మి ఫిర్యాదు చేసింది. కే సు నమోదు చేసిన ఎస్‌ఐ వీరభద్ర కుమార్ వీరి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. తన భార్యకు దొరకరాదని భావించిన సత్యం ఫోన్ నంబర్లను, చిరునామాలను మార్చుతూ... చివరకు మచిలీపట్నంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఉంటూ పిల్లలను స్థానికంగా ఓ పాఠశాలలో చదివిస్తున్నాడు.
చిన్నారుల పట్టుదలతో...
- భర్తను వెతికి పట్టుకొని పిల్లలను తనకు అప్పగించాలంటూ ఏడు నెలలుగా రామలక్ష్మి పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాల్లో పోలీసులు వెదుకుతూ వస్తున్నారు. చివరకు సత్యం బంధువుల ద్వారా మచిలీపట్నంలో ఉన్నట్లు తె లుసుకున్న పోలీసులు పిల్లలిద్దరినీ సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
- అయితే తాము తండ్రి దగ్గరే ఉంటామని...తల్లి దగ్గరకు వెళ్లేది లేదని పిల్లలు తేల్చిచెప్పారు. దీంతో ఆ చిన్నారులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉంటే సమాజంలో వచ్చే గుర్తింపు ఎలాంటిదో ఇన్‌స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి వివరించారు. ఆ మాటలతో దిగివచ్చిన చిన్నారులు... తల్లితో వెళ్లాలంటే తండ్రిపై ఆమె పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని పట్టుబట్టారు. తండ్రిని కూడా ఇంటికి రానివ్వాలని గట్టిగా కోరారు. పిల్లల కోరిక మేరకు భర్తతో కలిసి ఉండేందుకు రామలక్ష్మి అంగీకరించింది. అనుమానాలను విడిచిపెట్టి భర్త, పిల్లలను సరిగా చూసుకోవాలని పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ చేసి పంపించారు. దీంతో కథ సుఖాంతమైంది. ఆ పిల్లల మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది.