
నవయువం : మంచి అబ్బాయి అంటే...
జీవితంలో తోడును అందించే అబ్బాయి ఎటువంటి వ్యక్తి అయి ఉండాలి? అందం, ఉద్యోగం సరే... వ్యక్తిత్వం విషయంలో అతనికి ఉండాల్సిన గుణగణాలు ఏమిటి? ‘ ఇతను నా లైఫ్ పార్ట్‌నర్ అయితే బావుంటుంది..’ అని అమ్మాయిలు ఎలాంటి వ్యక్తిని చూసి అనుకుంటారు? ఈ ప్రశ్నలకు... పాట్ కానర్ అనే ఆస్ట్రేలియా పరిశోధకుడు... విస్తృత అధ్యయనం జరిపి మరీ సమాధానాలు కనిపెట్టారు!
స్నేహానికైనా, ప్రేమకు అయినా.. బెస్ట్ పార్‌టనర్‌ని ఎంచుకోవడం ఎలా? ప్రత్యేకించి భర్తను ఎంచుకోవడం విషయంలో వారు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వారిని ఎంపిక చేసుకోవాలి? అనేది అత్యంత ముఖ్యమైన అంశం. దీని గురించి అమ్మాయిలకు రిస్క్‌ను తగ్గించడానికి బాగా పరిశోధించి.. ఒక గైడ్ తయారు చేశాడు ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కానర్ అనే పరిశోధకుడు.
వివాహ వ్యవస్థ గురించి ఆయన చాలా పరిశోధనలు చేశాడు. మానసిక విశ్లేషణలో డిగ్రీలు పూర్తి చేసి, రకరకాల మనస్తత్వాలను పరిశోధించడంలో పాండిత్యాన్ని సంపాదించిన కానర్ ఒక ఎవర్‌గ్రీన్ థీసిస్‌ను రాశాడు. అనేక జంటలపై తాను జరిపిన పరిశోధనల ఫలితంగా అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ప్రేమించకూడదు, ఎలాంటి అబ్బాయిని ప్రేమ విషయంలో పరిగణనలోకి తీసుకోవచ్చు... అనే అంశం గురించి చెప్పుకొచ్చాడు. సంసార సాగరంలో చిక్కుకుపోయి ఆవేదన చెందుతున్న కొంతమంది మహిళలను, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను గమనించాక.. తాను ఈ థీసిస్ రాసినట్టుగా ఆయన చెప్పాడు. తన దగ్గరకు కౌన్సెలింగ్‌కు వచ్చే ఆడవాళ్లందరికీ కొన్ని ప్రశ్నలు వేసి.. మంచి అబ్బాయిని ఎంచుకునే విషయంలో అనుసరించాల్సిన ఒక గైడ్‌ను తయారు చేశాడు. తన పరిశోధనలు, సర్వేలను ఆధారంగా చేసుకొని కానర్ తయారు చేసిన ‘గైడ్’లో నుంచి కొన్ని విషయాలు...
ఎంతసేపూ ఇళ్లు, ఆఫీసులకు పరిమితమవుతూ స్నేహితులు, సరదాలు లేని అబ్బాయిలను పట్టించుకోవద్దు.
సరదాల కోసమని డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసే వాళ్లు మీకు టచ్‌లో ఉంటే వాళ్లకు దూరంగా జరగండి.
మూడోవ్యక్తి ఉన్నప్పుడు మిమ్మల్ని అవమానిస్తూ మాట్లాడే వాడిని ప్రేమికుడిగా అంగీకరించవద్దు.
అలాగే మీరు అతడి మీద వేసే చిన్నపాటి జోక్‌లను భరించలేని వాడితో కూడా లైఫ్‌లాంగ్ జర్నీ కష్టమే!
బద్దకంగా ఉండేవాళ్లకు, వ్యసన బాధితులకు దూరంగా ఉంటే మేలు.
తరచుగా అబద్దాలాడేవాళ్లు, కోతలరాయుళ్లకు దూరంగా ఉండడమే బెటర్.
మీతో ఏదీ డిమాండ్ చేయలేని వారిని, ఎంతసేపూ నువ్వే రైట్ అనే అబ్బాయిలను కూడా ఎంటర్‌టైన్ చేయవద్దు.
ఒక అబ్బాయికి ‘ఎస్..’ చెప్పడానికి ‘నో..’ చెప్పడానికి మధ్య సమయంలో ఒక నిర్ణయానికి రావడానికి కానర్ రూపొందించిన గైడ్ ఉపయుక్తంగా ఉంటుంది. ఇది కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా గైడ్ లాంటిదే. ఉత్తమ లక్షణాలతో అమ్మాయిలను ఆకట్టుకోవడానికి ఈ గైడ్ లక్షణంగా ఉపయోగపడుతుంది.