మనిషి జీవితంలో తనకున్న వాటిలో ముఖ్యంగా మూడు విషయాల్లో ఎప్పుడూ అసంతృప్తి పొందకూడదని పెద్దలు చెబుతారు. సంతోషస్త్రిషు కర్తవ్యో కళత్రే భోజనే ధనే... వాటిలో మొదటిది కళత్రం. అంటే తనకు జీవిత భాగస్వామిగా లభించినవారు. అంటే వివాహం తరువాత తాను తాళికట్టి తెచ్చుకున్న భార్య. ఏడడుగులు వేసి సహధర్మచారిణిగా ఉంటానని భర్తగా అంగీకరించి అతని వెంట నడిచి వచ్చిన స్త్రీ. ధర్మం, అర్థం, కామం... ఈ మూడూ వారికే పరిమితం. పరస్పరం దాటి వెళ్ళడానికి వీలు లేదు.
సముద్రుడు చాలా శక్తిమంతుడు. తలచుకుంటే భూమినంతటినీ ముంచెత్తగలడు. అయినా తనకు తాను ఒక నియమం పెట్టుకున్నాడు. నేను చెలియలికట్ట దాటను... అన్నాడు. అందువల్ల కెరటాలు ఒడ్డువరకు వచ్చి వెనక్కి వెళ్లిపోతాయి. అలా కాకుండా ఏ రోజయినా సునామీలాంటివి వచ్చి చెలియలికట్ట దాటితే అది చరిత్రలో భయంకరమైన రోజవుతుంది. అంటే తమలో వచ్చిన భావావేశాన్ని భార్యాభర్తలలో ఏ ఒక్కరయినా నియంత్రించుకోలేకపోతే ... అది చెలియలికట్ట దాటిన పరిస్థితి.
అందుకే ఎప్పుడూ వారిరువురూ పరస్పరం పూర్తి సంతృప్తి పొంది ఉండాలి. ఏకారణం చేతనయినా వారిలో ఏ ఒక్కరికయినా అసంతృప్తి పొడసూపిందనుకోండి. అప్పుడెలా ఉండాలి... అంగవైకల్యంతో తమ కడుపున పుట్టిన బిడ్డను తల్లిగా కానీ, తండ్రిగా కానీ ఎంత ఎక్కువ శ్రద్ధతో, అధిక ప్రేమానురాగాలతో, అన్నిటికీ మించి అత్యధిక ఓర్పుతో చూసుకుంటారో భార్యాభర్తలు కూడా తమలో పుట్టిన అసంతృప్తిని దిగమింగి తమ భాగస్వామిని అంత శ్రద్ధగా చూసుకోగలగాలి.
బంగారు పాత్రలో పోసుకు తాగినా పాయసమే, కడుక్కుని కుండలో పోసుకు తాగినా పాయసమే. పాత్రలు వేరయినా పాయసం మాత్రం ఒక్కటే. అందుకే జీవిత భాగస్వామిని దాటి ధర్మార్థకామములను పొందే ప్రయత్నం చేయవద్దు. అలా చేస్తే అధార్మికమైన కార్యాలపట్ల మనసు లగ్నం అవుతుంది. దానివలన ధర్మం పట్టుకోల్పోతుంది. అశాంతి కలుగుతుంది. ప్రశాంతంగా ఉండలేరు. కారణం... ఉన్నదానిలో తృప్తి లేదు. కోరుకున్నది అన్నివేళలా అందుబాటులో ఉండదు.
పైగా చేయకూడనిది చేస్తున్నానేమో అన్న అపరాధ భావన వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, జీవితాలను పతనం చేస్తుంది. ‘పరస్త్రీసంగ దోషేన బహవో మరణంగతా..’ పరస్త్రీ (పరపురుషుడి) వ్యామోహం ... ఆ భావన, ఆ ఉద్వేగం, ఆ భయం... లోపల ఆ రహస్యాన్ని దాచుకోవడంలో ఉన్న ఉద్విగ్నత... అనారోగ్యానికి, అకాలమరణానికి కూడా దారితీస్తాయి. అందుకే జీవిత భాగస్వామి విషయంలో ఎప్పుడూ అసంతృప్తి అన్నమాట దరిచేరనీయవద్దు. భార్యలో భర్తకు కానీ, భర్తలో భార్యకు కానీ బలముంటే సంతోషించాలి, బలహీనతుంటే... భగవంతుడిచ్చిన పిల్లల విషయంలో చూపిన ఓర్పు, సానుభూతి, ప్రేమానురాగాలనే చూపాలి. అంతేతప్ప జీవితంలో జీవిత భాగస్వామి విషయంలో ఎప్పుడూ అసంతృప్తికి స్థానం ఇవ్వకూడదు.
Comments
Please login to add a commentAdd a comment