నాకు ఆర్నెల్ల క్రితం పంటినొప్పి వచ్చింది. డెంటిస్ట్ పైవరస పళ్లలో, కింది వరస పళ్లలో రెండు కొత్త క్యాప్స్ పెట్టారు. మళ్లీ రెండు నెలలకు నొప్పి, చిగురువాపు వచ్చాయి. అప్పుడు క్యాప్స్ తొలగించి క్లీన్ చేసి మళ్లీ వాటిని తిరిగి అమర్చారు. కొంతకాలంలోనే ఇలా రెండుమూడుసార్లు చేయాల్సి వచ్చింది. నా సమస్యకు పరిష్కారం చూపండి.
- బి.జగన్, సికింద్రాబాద్
మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వ్యాధి నిర్థారణలోగాని, చికిత్సలో కాని లోపం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇంత చికిత్స జరిగాక కూడా ఇలా మాటిమాటికీ పంటినొప్పి, చిగురు వాపు రావడం పంటి ఆరోగ్యానికి సరైన సూచన కాదు. ప్రతిసారీ క్యాప్‌ను తీసి అమర్చుతుండటం వల్ల మీకు ఉన్న సమస్య పరిష్కారం కాదు. నొప్పి నివారణ మందులను అదేపనిగా వాడటం వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చి మళ్లీ అదో సమస్య కావచ్చు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేలా అవసరాన్ని బట్టి సరైన చికిత్స చేయించాల్సి ఉంటుంది. మీరు మరో డెంటిస్ట్‌ను కలిసి వారి అభిప్రాయం తీసుకోండి.
నా వయసు 19. ఇటీవల నాకు దవడ చివరన కొత్తగా పళ్లు రావడం గమనించాను. అవి అప్పటికే ఉన్న పళ్లపై వస్తున్నాయి. ఇలా పన్ను మీద పన్ను పెరగకుండా చేయడానికి ఏమైనా మార్గం ఉందా?
- వి. అలేఖ్య, వరంగల్
మీరు చెబుతున్న దాన్ని బట్టి మీకు జ్ఞానదంతాలు వస్తుండటం వల్ల ఈ ఇబ్బంది కలుగుతోంది. సాధారణంగా జ్ఞానదంతాలు యుక్తవయసు దాటాక వస్తుంటాయి. అయితే కొందరిలో కొన్నిసార్లు అప్పటికే దవడపై ఉన్న స్థలాన్ని మిగతా పళ్లు ఆక్రమించడం వల్ల ఇలా పంటి పైనే పన్ను రావడం లేదా ఎముకలోనే ఇరుక్కుపోయి బయటకు వచ్చేందుకు సాధ్యం గాక మీరు చెబుతున్న ఇబ్బందుల వంటివి రావచ్చు. అప్పుడు నొప్పి రావడం, రక్తస్రావం జరగడం మామూలే. ఇలాంటి సందర్భాల్లో ఒక చిన్న శస్త్రచికిత్సతో ఆ జ్ఞానదంతాలను తొలగించాల్సి ఉంటుంది.
మా బాబుకు ఆరేళ్లు. ఇప్పటికీ వాడి పాలపళ్లు ఊడిపోలేదు. పైగా పళ్ల మధ్య సందులు ఎక్కువగా ఉన్నాయి. మావాడి సమస్యకు తగిన పరిష్కారం చెప్పగలరు.
- జి. అరుణ్‌కుమార్, విశాఖపట్నం
సాధారణంగా పిల్లల్లో ఆరేళ్ల నుంచి పన్నెండేళ్ల మధ్యలో పాల పళ్లు ఊడి, వాటి స్థానంలో శాశ్వత దంతాలు వస్తాయి. అయితే ఇవి ఊడటానికి, మళ్లీ రావడానికి పట్టే వ్యవధి వారి శరీరతత్వాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా ఉంటుంది. అయితే ఎనిమిదేళ్ల తర్వాత కూడా పాలపళ్లు ఊడకపోతే అప్పుడు డాక్టర్‌ను సంప్రదించి, కారణాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎండోక్రైన్ వ్యవస్థలో లోపాలు, ఎదుగుదలలో లోపాల వల్ల కూడా పాలపళ్లు ఊడటంలో తేడాలు రావచ్చు. ఇక పళ్ల మధ్య సందుల విషయానికి వస్తే పిల్లల్లో ఇలా ఉండటం సహజమే. కాబట్టి ప్రస్తుతానికి మీ బాబు సమస్య గురించి, పళ్ల మధ్య సందుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి మీ బాబును తీసుకుని డెంటిస్ట్‌ను కలిస్తే, ఆపై ఇక నిశ్చింతగా ఉండవచ్చు.
డెంటల్ : తరచు చిగురువాపు, పంటినొప్పి..?
Published Sat, Dec 14 2013 12:22 AM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM
Advertisement