భర్తతో వైద్యురాలు మాధవీలత(ఫైల్)
ఇటీవల చోటుచేసుకున్న దంత వైద్యురాలు మాధవీలత ఆత్మహత్య ఘటన నంద్యాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. భర్తతో అన్యోన్యంగా, ఆర్థికంగా బలంగా ఉన్న ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏమై ఉంటాయని పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో ఉన్న వివరాలు పోలీసులు బయటకు చెప్పకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నంద్యాల: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మణకిశోర్, గుంటూరుకు చెందిన మాధవీలత(47) మెడిసిన్ చదుకునే సమయంలో ప్రేమించుకొని, 20 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌లో సొంతంగా శ్రీరమణ కాస్మొటిక్ దంతవైద్యశాలను నడుపుతున్నారు. వీరికి మెడిసిన్ చదివే కుమారుడు ఉన్నాడు. పట్టణంలోని టెక్కె భరతమాత ఆలయం వద్ద ఇల్లు కొనుగోలు చేసి, ఇక్కడే నివాసం ఉంటూ ఆసుపత్రిని నడుపుతున్నారు.
మృతదేహం వద్ద సూసైడ్ నోట్..
ఈనెల 16న మాధవీలత(47) ఆత్మహత్య చేసుకుంది. భర్తతో ఎలాంటి ఇబ్బందులు లేవని, వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని మృతురాలి తండ్రే చెబుతున్నాడంటే వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే మృతదేహం వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు విలేకరులకు వెల్లడించిన టూటౌన్ సీఐ కంబగిరిరాముడు.. అందులో ఏముందో ఇంతవరకు బయట పెట్టలేదు. ఈ కేసు విషయంలో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించనట్లు తెలుస్తోంది. అసలు మాధవీలత మృతి మిస్టరీని పోలీసులు ఛేదిస్తారా.. లేక కేసును నీరుగారుస్తారా.. అన్న విషయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా దర్యాప్తులో భాగంగానే సూసైడ్ నోట్‌లో ఉన్న వివరాలను బయటకు వెల్లడించడం లేదని టూటౌన్ సీఐ కంబగిరిరాముడు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment