నేలపై ఉన్నవారిని మనం కరుణిస్తే...నింగిలో ఉన్నవాడు మనని అనుగ్రహిస్తాడు!
తలపెట్టింది దైవ కార్యమైనా, ఆయన దాసులు ఆకలితో అలమటిస్తుంటే, వస్త్రాలు లేక విలవిల్లాడుతుంటే, దైవకార్యాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి అన్నార్తుల క్షుద్బాధను తీర్చడం, వారికి వస్త్రాలు సమకూర్చడం అన్నిటికన్నా శ్రేష్ఠతరకార్యమని కూడా మనకు అర్థమవుతోంది. అందుకే ‘నేలపై ఉన్నవారిని కరుణించండి, నింగిపై వాడు మిమ్మల్ని కరుణిస్తాడు’ అన్నారు ముహమ్మద్ ప్రవక్త (స).
ఇస్లాం ధర్మంలో ఐదు మౌలిక సూత్రాలున్నాయి. ఈ ఐదింటిలో ఏ ఒక్కదాన్ని విస్మరించినా, విశ్వాసం పరిపూర్ణం కాదు. వీటిలో మొదటిది సృష్టికర్త ఒకే ఒక్కడన్న విశ్వాసం. రెండవది నమాజ్(దైవప్రార్థన), మూడవది రోజా (ఉపవాసం). నాల్గవది జకాత్(ఆర్థికదానం). ఐదవది హజ్(కాబా సందర్శన యాత్ర). ఇవి దైవ విశ్వాస ప్రకటనకు ఆచరణాత్మక రుజువులు. విశ్వాస ప్రకటనతో సహా మిగిలిన అన్ని ఆరాధనలకూ ఆత్మ ‘హజ్’. ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ముస్లింపై ‘హజ్’ విధిగా నిర్ణయించబడింది.
కనుక ఆర్థిక స్థోమత కలిగిన వారు జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ‘హజ్’ అంటే కాబా సందర్శనాయాత్ర చేయడం తప్పనిసరి. అయితే హజ్‌ను మించిన ఆరాధన సాటివారిని ఆదుకోవడమేనన్నది ఇస్లామ్ ధర్మసూక్ష్మం. ఇందుకు సంబంధించిన కథనొకదానిని పరిశీలిద్దాం... ఒకసారి హజ్రత్ అబ్దుల్లాబిన్ ముబారక్ (రహ్మ) ‘హజ్’ యాత్రకోసం మక్కాకు బయల్దేరారు. ఆయన అలా కొన్ని మైళ్లు ప్రయాణించిన తరువాత ఒకసారి పొలిమేరలో ఓ బాలిక దేనికోసమో ఆతృతగా వెదుకులాడుతూ కనిపించింది.
మాసిపోయిన బట్టలతో, తైల సంస్కారం లేని జుట్టుతో కడు పేదరికంలో ఉన్నట్లు కనిపిస్తున్న ఆ పదేళ్ల బాలిక వెదుకులాట ఆయన్ను ముందుకు సాగనివ్వలేదు. అంతలో ఆ బాలిక అటూ ఇటూ చూసి ఓ చచ్చిన పక్షిని తీసి ఒళ్లో వేసుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన ముబారక్ గారు వెంటనే గుర్రం దిగి ఆ అమ్మాయిని సమీపించి ‘పాపా! ఏమిటిది? చచ్చిన పక్షి కదా, ఇది ఎందుకు పనికొస్తుంది? దీన్నేం చేసుకుంటావు?’ అంటూ అనునయంగా అడిగారు. సమాధానంగా దుఃఖాన్ని దిగమింగుకుంటూ గద్గద స్వరంతో ఇలా చెప్పిందా అమ్మాయి... ‘అయ్యా! నేను అమ్మానాన్నలు లేని అనాథను. నాకో తమ్ముడున్నాడు.
తినడానికి సరైన తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు లేక చాలా బాధపడుతున్నాం. రెండు రోజులనుండి మాకు తినడానికేమీ దొరకలేదు. నేను తట్టుకోగలను కానీ, తమ్ముడు తట్టుకోలేకపోతున్నాడు. ఇదిగో ఈ చచ్చిన పక్షిని చూడగానే నా తమ్ముడే కళ్లలో కదిలాడు. దీన్నయినా కాల్చి పెడితే ప్రాణాలు నిలుస్తాయన్న ఆశతో దీన్ని ఒళ్లో వేసుకున్నా’’ ఆమె కళ్లు వర్షిస్తున్నాయి.
బాలిక నోట ఈ మాటలు విన్న హ. అబ్దుల్లా బిన్ ముబారక్ (రహ్మా) చలించి పోయారు. ఆయన కళ్లనుండి అప్రయత్నంగా అశ్రుబిందువులు టపటపా రాలాయి. బాలికను దగ్గరకు తీసుకుని... ‘పాపా! బాధ పడకు. దైవం తప్పకుండా నీ బాధను దూరం చేస్తాడు’ అంటూ తాను ‘హజ్’ కోసం తెచ్చుకున్న పైకమంతా ఆమె చేతిలో పెడుతూ, ఈ డబ్బులతో మీకు కావలసిన వస్తు సామగ్రి, బట్టలు కొనుక్కోండి. హాయిగా జీవించండి. ఈ ఏర్పాటు చేసిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోండి’ అన్నారు.
ఒక్కసారిగా అన్ని డబ్బులు చూసిన ఆ బాలిక కళ్లు ఆనందంతో అశ్రుబిందువులు రాల్చాయి. ఆమె ముఖంలో కోటికాంతుల కలువ వికసించింది. బాలిక ముఖంలో మెరిసిన ఆనందం చూసి ముబారక్ గారి మనసు పులకించిపోయింది. అంతలో ఆ అమ్మాయి ‘అయ్యా! చచ్చిన దాన్ని తినడం ధర్మసమ్మతం కాదని మాకు తెలిసినా, గత్యంతరం లేని స్థితిలో పొయ్యే ప్రాణం నిలుస్తుందన్న ఆశతో ఇలా చేయవలసి వచ్చింది’ అంటూ ఆ పక్షిని అవతల పారేసింది.
‘అమ్మా! ఇక వెళ్లు. తమ్ముడు ఎదురు చూస్తుంటాడు. త్వరగా అతనికి భోజనం పెట్టు’ అంటున్న ముబారక్‌గారి ముఖాన్ని చూస్తూ ఇంటిదారి పట్టింది. ఆ బాలిక వెళ్లిన వైపే తృప్తిగా చూస్తున్న ముబారక్ గారితో ఆయన సేవకుడు, ‘అయ్యా! డబ్బంతా ఇచ్చేశారు. మరి తమరి హజ్ యాత్ర ఎలా?’ అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ముబారక్ గారు ఇలా అన్నారు. ‘మన హజ్ ఇక్కడే నెరవేరింది. ప్రస్తుతం ఇది కాబా యాత్ర కన్నా గొప్ప ఆరాధన. దైవ చిత్తమైతే వచ్చే యేడాది మళ్లీ హజ్ యాత్రకు వెళదాం. ఈ యేడు మాత్రం హజ్‌ను అల్లాహ్ ఇక్కడే స్వీకరించాడు’ అని వెనుదిరిగి వెళ్లిపోయారు.
అంటే, ఎవరైనా కష్టాల్లో ఉంటే, వారికి వేరే గత్యంతరం లేకపోతే, అలాంటి అభాగ్యులను ఆదుకోవడం తక్షణ కర్తవ్యమని ఈ సంఘటన ద్వారా మనకి తెలుస్తోంది. తలపెట్టింది దైవ కార్యమైనా, ఆయన దాసులు ఆకలితో అలమటిస్తుంటే, వస్త్రాలు లేక విలవిల్లాడుతుంటే, దైవకార్యాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి అన్నార్తుల క్షుద్బాధను తీర్చడం, వారికి వస్త్రాలు సమకూర్చడం అన్నిటికన్నా శ్రేష్ఠతరకార్యమని మనకు అర్థమవుతోంది. అందుకే ‘నేలపై ఉన్నవారిని కరుణించండి, నింగిపై వాడు మిమ్మల్ని కరుణిస్తాడు’ అన్నారు దైవ ప్రవక్త (స).
- యండీ ఉస్మాన్ ఖాన్