వర్షాల్లో వాహనాలకు యాడ్ ఆన్ రక్షణ..
ఒక మోస్తరు వర్షం కురిస్తేనే చాలు రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి. మోకాల్లోతు నీళ్లల్లో మనం కదలడమే కష్టం అనుకుంటే.. ఇక వాహనం కూడా మొరాయిస్తే ఇక ఆ బాధ వర్ణనాతీతం. బండిని ఎలాగోలా బైటికి తెచ్చుకున్నా దాని రిపేర్లకు తడిసి మోపెడవుతుంటుంది. అయితే, ఇలాంటి సందర్భాల్లో కూడా పనికొచ్చేలా వాహన బీమాకి సంబంధించి యాడ్ ఆన్ కవరేజీలు ఉన్నాయి. ప్రీమియానికి కొంత అదనం చెల్లించి వీటిని తీసుకోవచ్చు. అలాంటి కవరేజీల్లో కొన్ని..
ఇంజిన్ ప్రొటెక్టర్ కవర్
వర్షాల వేళ వాహనం ఇంజిన్‌లోకి నీరు చొరబడటం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల ఇంజిన్‌లో భాగాలు, గేర్ బాక్సులు దెబ్బతిన్నా, అటు పైన లూబ్రికేటింగ్ ఆయిల్ లీకయినా.. తలెత్తే సమస్యలకు ఈ కవరేజీ ఉపయోగపడుతుంది.
రోడ్‌సైడ్ అసిస్టెన్స్
ఒకవేళ వాహనం మొరాయిస్తే .. రిపేర్ చేయించడం కోసం సమీప గ్యారేజికి తరలించడానికి, టైర్ పంక్చర్ అయితే సరి చేయడానికి అయ్యే ఖర్చులకు ఇది పనికొస్తుంది. వాహనం పూర్తిగా బ్రేక్‌డౌన్ అయితే ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం, తాళం చెవులు పోగొట్టుకున్నా, వాహనంలో ఇంధనం అయిపోతే అత్యవసరంగా సమకూర్చడం వంటి వాటికి కూడా ఈ కవరేజీ ఉపయోగపడుతుంది.
కన్జూమబుల్స్ కవర్
స్క్రూలు, నట్లు, బోల్ట్‌లు, వాషర్లు, కూలెంట్, ఇంజిన్ ఆయిల్ వంటివి మార్చాల్సి వస్తే అయ్యే ఖర్చులకు ఇది పనికొస్తుంది.