కూతురు సౌందర్య తీసిన సీన్‌ని మానిటర్‌లో చెక్ చేస్తున్న రజని
పుత్రుడు జన్మించినప్పుడు కాదు... ప్రజలు అతణ్ణి మెచ్చుకున్నప్పుడు తండ్రికి నిజమైన పుత్రోత్సాహం కలుగుతుందని సుమతీ శతకంలో చెప్పారు. రజనీకాంత్‌కి పుత్రులు లేరు. ఐశ్వర్య, సౌందర్య... ఇద్దరూ అమ్మాయిలే. వాళ్లను పుత్రులకు ఏమాత్రం తక్కువ కాదనే రీతిలో పెంచి పెద్ద చేశారు. అక్కాచెళ్లెళ్లు ఇద్దరూ మెగాఫోన్ పట్టారు. రజనీ పెరియ మాపిళ్లయ్ (పెద్ద అల్లుడు) ధనుష్ హీరోగా చిన్న పొన్ను (అమ్మాయి) సౌందర్య దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘వీఐపీ–2’ రూపొందుతోంది.
పిల్లలు ప్రయోజకులు అయితే కళ్లారా చూడాలని ఏ తండ్రికి ఉండదు! అమ్మాయి ఎలా దర్శకత్వం వహిస్తుందో చూడాలని అప్పా (తండ్రి) రజనీ మనసు కోరుకుంది. ‘వీఐపీ–2’ షూటింగ్ గురించి వాకబు చేస్తే... శనివారమే చిత్రీకరణ చివరిరోజని ఆయనకు తెలిసింది. వెంటనే సెట్‌కి వెళ్లారు. ఆయన్ను చూసి యూనిట్ అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. స్టార్ట్... కెమేరా... యాక్షన్... అని సౌందర్య చెబుతుంటే రజనీ దగ్గరుండి గమనించారు. అంతే కాదండోయ్... సౌందర్య తీసిన ప్రతి ఫ్రేమ్‌నూ విశ్లేషించి, ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని నిర్మాత తెలిపారు. అన్నట్టు... ఈ చిత్రానికి నిర్మాత ఎవరో కాదు... రజనీతో ‘కబాలి’ తీసిన కలైపులి ఎస్. థాను.