రాఖీ పౌర్ణమికి అన్నయ్య కావాలి | rakhi spcial story | Sakshi
Sakshi News home page

రాఖీ పౌర్ణమికి అన్నయ్య కావాలి

Published Fri, Aug 28 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

రాఖీ పౌర్ణమికి  అన్నయ్య  కావాలి

రాఖీ పౌర్ణమికి అన్నయ్య కావాలి

రిషితేశ్వరి, మనీష, నందిత, రవళి, యామిని, శ్రీలేఖ...  ఇలా ఎంతోమంది చెల్లెళ్ళు ఈ రాఖీ పండగకు ఉండక... మన చేయి బోసిపోతోంది... మన మనస్సు బాధతో క్రుంగిపోతోంది... ఈ బంగారు తల్లులు లేకుండా ‘రక్షా బంధన్’ పండుగ జరుపుకొంటుంటే...
 ఒక ఆలోచన మన హృదయాలను గుచ్చక మానదు... బజారులో రాఖీలు దొరుకుతున్నాయి... కానీ, అన్నయ్యలే కరువయ్యారు!
 ఆడపిల్ల తనను తాను ప్రొటెక్ట్ చేసుకోలేదని అనుకోను... ఆడపిల్ల శక్తిస్వరూపిణి అని నమ్ముతాను. కానీ, దుర్మార్గులు గుంపులుగా వస్తే... అన్నయ్య సింగిల్‌గా వచ్చి... కాపాడతాడనిపించింది. అంతేకాదు... ఇంకో అమ్మాయిని చూసినప్పుడు చెల్లెల్ని గుర్తు చేసుకుంటాడనిపించింది. రేపు చెల్లెళ్ళకు రక్షాబంధన్... ఇవాళ అన్నయ్యలకు దీక్షాబంధన్!
 
ఒప్పుకునే వాడు కాదు!
మా అమ్మ చనిపోయింది. నాన్న మరో పెళ్లి చేసుకుని, నన్ను మా మేనత్త ఇంట్లో ఉంచాడు. ఆ తర్వాత నన్ను చూడటానికే రాలేదు. అత్త నన్ను ఓ ఇంట్లో పనిలో పెట్టింది. చిన్న పొరపాటు చేసినా ఆ ఇంట్లో వాళ్లు విపరీతంగా కొట్టేవాళ్లు. ఆ బాధలు తట్టుకోలేక ఓరోజు రాత్రి బయటపడి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాను.. బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న ఓ రెలైక్కాశాను. రైలు ఓ స్టేషన్‌లో ఆగితే దిగాను. నాలుగురోజులు అక్కడే ఉన్నాను. ఐదో రోజు ఒక అక్క పరిచయమైంది. నన్ను తనతో తీసుకెళతానంది. ఆమెతో వెళుతుంటే  పోలీసులు వచ్చి, నా గురించి అడిగారు. నా సంగతి తెలుసుకున్నాక వారు ఆ అక్కను తిట్టి, నన్ను హోమ్‌లో చేర్చారు. ఆరేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాను. నాకో అన్న ఉండి ఉంటే, మా మేనత్త నన్ను ఎక్కడో పనిలో పెడితే ఒప్పుకునేవాడు కాదు కదా!
 - మానస, అనాథాశ్రమం, హైదరాబాద్
 
 అన్నయ్యే మాకు అండ

 ప్రతీ రాఖీ పౌర్ణమికి అత్తగారింటి నుంచి అన్నకు రాఖీ కట్టడానికి తప్పక వస్తాం. డిజైనర్ రాఖీలు ఎన్ని వచ్చినా.. పసుపు, కుంకుమ రంగు నూలుదారంతో ఉండే రాఖీ ఈ పండగలో మాకు చాలా ముఖ్యం. పీచు తీయని కొబ్బరికాయకు ఎర్రదారం చుట్టి, అన్నచేతికి ఇస్తాం. తర్వాత రక్షాబంధం తీసుకొని మా అన్నకు రాఖీ కట్టి, తీపి రుచి చూపించి, మంగళహారతి ఇస్తాం. అన్న ఆశీస్సులు తీసుకుంటాం. అన్న ప్రేమగా ఇచ్చే ఎంత చిన్న కానుకైనా ఆనందంగా పుచ్చుకొని, మా ఇళ్లకు బయల్దేరుతాం. మా అన్నాచెళ్లెళ్ళ ప్రేమ, బంధం కొబ్బరినీళ్లంత స్వచ్ఛంగా, లోపలి కొబ్బరి అంత రుచిగా, పైన పెంకు అంత దృఢంగా ఉండాలని మా పెద్దలు దీన్నో సంప్రదాయంగా మాకు పరిచయం చేశారు. దీన్ని మా పిల్లలకూ నేర్పించాం. మా ముగ్గురికి మా అన్న బ్రిజ్‌గోపాల్ ఎంతో అండగా ఉంటాడు.
 - రీనా, పూజ, రాజకుమారి (తల్లి శకుంతల, తండ్రి రామ్‌నివాస్, అన్న బ్రిజ్‌గోపాల్, భార్య, దీపాలి) హైదరాబాద్
 
 దౌర్జన్యాలను అరికట్టవచ్చు
చిన్నారులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు మా దృష్టికి వచ్చిన సందర్భాలెన్నో... ఇక స్కూళ్లలో, కాలేజీల్లో, హాస్టళ్లలోనూ ఎన్నో దారుణాలు. వీటిని కొంతైనా అరికట్టాలనే ఉద్దేశంతో ఈ రాఖీ పండుగ రోజున రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ప్రతినిధులకు, అధికారులకు, పోలీసులకు అమ్మాయిల చేత రాఖీలు కట్టిస్తున్నాం. అమ్మాయిలకు అండగా ఉండండి అని చెబుతున్నాం. మీ వీలు మేరకు రేపు మీ ప్రాంతాల్లో ఈ విధంగా రాఖీ పండుగ జరుపుకొంటే కొంతవరకైనా దౌర్జన్యాలను అరికట్టవచ్చు. అఘాయిత్యాలకు పాల్పడేవారిలో రాక్షస ప్రవృత్తిని విడనాడే ఆలోచనను తీసుకురావచ్చు.
 - అనూరాధారావు, అధ్యక్షురాలు,
 బాలలహక్కుల సంఘం
 
నాకా దుఃస్థితి వచ్చేది కాదు
కన్న తండ్రి చేతిలో, సవతి తల్లి చేతిలో ఎంతో నరకం అనుభవించి బయటపడ్డాను. ఇన్ని రోజులకు నా ఆరోగ్యం కుదుటపడింది. నాకో అన్న ఉండి ఉంటే శారీరకంగా, మానసికంగా ఇన్నేళ్లు ఇంతగా చిత్రహింసలు అనుభవించి ఉండేదాన్ని కాదు. నా అన్న నా వెన్నంటే ఉండి నా బాగోగులు చూసుకునేవాడు. అమ్మలా కంటికి రెప్పలా కాపాడేవాడు. తోబుట్టువులు లేకపోవడంతోనే అనాథనయ్యాను. పడరాని పాట్లు పడ్డాను. ఒక్క తోబుట్టువున్నా నాకా దుస్థితి వచ్చేది కాదు. నా పరిస్థితి చూసి, చలించి, దయతలచి, సీఎం సహా ఎందరో పెద్దలు స్పందించారు. లేదంటే..  ఏమయ్యేదాన్నో తలచుకోవడానికే భయమేస్తోంది.
 - ప్రత్యూష (తండ్రి, సవతి తల్లి వేధింపుల నుంచి బయటపడి, కొత్తజీవితం మొదలుపెడుతున్న బాలిక)
 
 ముందే హెచ్చరించేవాడు
మాది ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామం. అమ్మనాన్నలకు ఒక్కదాన్నే. నాన్న నా చిన్నతనంలోనే చనిపోతే, అమ్మ మల్లక్క కష్టపడి పెంచింది. ఇదే గ్రామానికి చెందిన రాజాబాబు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతన్ని పూర్తిగా నమ్మాను. ఇంట్లోని రూ.80 వేలతో పాటు బంగారు చెవికమ్మలు, వెండిపట్టీలు తీసుకుని అతడు చెప్పిన చోటికి వెళ్లాను. బైక్‌పై ఏటూరు సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ మాటల్లో పెట్టి బ్లేడుతో గొంతు కోశాడు. డబ్బు, నగలతో పారిపోయాడు. ఆ రాత్రంతా నరకం చూశాను. తెల్లవారగానే నెత్తురోడుతూనే రోడ్డుపైకి వచ్చాను. స్థానికులు ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఇప్పుడు ఎంజీఎంలోనే చికిత్స పొందుతున్నాను. ప్రస్తుతం మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే నా కథంతా కాగితంపై రాస్తున్నా. నాకే ఓ అన్నయ్య ఉంటే నా మంచి చెడ్డలు చూసేవాడు. నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పేవాడు.
 - జనగామ లక్ష్మి, బుట్టాయిగూడెం, వరంగల్
 
 
రక్షాబంధం తానే కట్టింది... రక్షించుకోవడమూ తానే చేసింది!
 
ఆ తమ్ముడిది అందమైన ముఖవర్చస్సు. ఆకర్షణీయమైన తేజస్సును కురిపించే కళ్లు.
హైదరాబాద్‌లోని ఆ తమ్ముడి పేరే షేక్ సైదులు. వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. ఆయనకు మూత్రపిండాల వ్యాధి వచ్చింది. కిడ్నీలు రెండూ చెడిపోయాయి. అయినా తన బాధను ఎవ్వరికీ పంచలేదు. అయితే, అతడి అక్క తోటివారు వారించినా, దగ్గరివారు అడ్డగించినా వినకుండా తన కిడ్నీని తమ్ముడికి ఇచ్చింది. తమ్ముడికి తన ఆయుష్షును ఇచ్చి బతికించింది. తన అక్క ఖాసీమ్ బీ మనోవైశాల్యాన్ని వివరిస్తూ ఆ తమ్ముడు సైదులు అనే మాటలివి... ‘‘మామూలుగా సోదరీమణులు వచ్చి సోదరులకు రాఖీ కట్టి, తమ రక్షణ బాధ్యతను స్వీకరించమని అడుగుతారు. కానీ మా అక్క... తన కిడ్నీ నాకిచ్చింది. నా చేతికి రక్షరేకు కట్టింది. మృత్యువును వెనుదిరగమని శాసించింది. దగ్గరి బంధువులు వారిస్తే... తాను ఒకే మాట అంది. ‘నేను చూడాల్సిన జీవితాన్ని చూసేశాను. నా తమ్ముడు చూడాల్సిన జీవితం ఇంకా ఉంది. అందుకే నాకు ఏమైనా పరవాలేదు. మరణించినా బాధలేదు. అందుకే ఒక కిడ్నీని ఇచ్చేస్తా’నంటూ మనస్ఫూర్తిగా చెప్పింది. కిడ్నీ ఇచ్చి, నన్ను బతికించుకుంది. తాను రాఖీ కట్టి తానే బహుమతి ఇచ్చింది మా అక్క. మా అమ్మ నాకు జన్మనిస్తే, మా అక్క నాకు మరుజన్మనిచ్చింది’’ అన్నారు సైదులు భావోద్వేగాలతో, అశ్రునయనాలతో..
 
 ఐ కేర్! ఐ రియాక్ట్!!
 ‘‘రాఖీ కట్టడమనేది ఒక తంతుగా మారకూడదు. చెల్లెలితో రాఖీ కట్టించుకొని, పక్కన కనిపించిన మరో అమ్మాయిని తప్పుగా చూడడమనే దృష్టి దోషం నుంచి బయటపడాలి. రెండున్నరేళ్ళ క్రితం ‘నిర్భయ’ ఘటన జరిగినప్పుడు కదిలిపోయా. ఎక్కడ, ఏ చిన్న సంఘటన జరిగినా రియాక్ట్ కావాలనే కాన్సెప్ట్‌తోనే ‘ఐ కేర్... ఐ రియాక్ట్’ అని రాసిన బ్యాడ్జ్ చేయించా. కొన్ని వేల మందికి ఆ బ్యాడ్జ్‌లు పంచాం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ బ్యాడ్జ్‌లు పెట్టుకొని కాలేజ్‌కు వెళ్ళమని స్టూడెంట్స్‌కు చెప్పా. అదేమిటని అడిగినప్పుడు చుట్టుపక్కలవాళ్ళకు సంఘటన గురించి చెప్పి, వాళ్ళలో చైతన్యం తీసుకురమ్మన్నా. కాలేజ్‌లకు వెళ్ళి, నా భావాలు పంచుకున్నా. నా మాటలు విన్న వేలమందిలో కొందరు మారినా నేను సఫలమైనట్లే!

మన అమ్మ, చెల్లే కాదు... మన ఇంట్లో పని పిల్ల, బస్సులో అమ్మాయి అందరూ స్త్రీలే. ఆమెకూ వ్యక్తిత్వం, ఓ అభిప్రాయం ఉంటాయని గ్రహించాలి. ఇవాళ కులం, ప్రాంతం గురించి ఏ మాత్రం అగౌరవంగా తెరపై చూపినా ధ్వజమెత్తుతారు. కాబట్టి, భయపడతాం. కానీ, స్త్రీలను అగౌరవంగా చూపితే ఎవరూ ఏమీ అనరు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా, ‘లైఫ్ గోస్ ఆన్’ వైఖరితో ‘నిద్రపోతున్న సమాజం’గా మారుతున్నాం. దీనిపై తీవ్ర ప్రతిఘటన వస్తే, మనం ‘చైతన్యశీల సమాజం’గా మారినట్లు లెక్క. స్త్రీని భోగవస్తువుగా చూస్తే, మనకీ మృగాలకీ తేడా ఏంటి?’’
 - శేఖర్ కమ్ముల, ప్రముఖ ిఫిల్మ్ డెరైక్టర్
 
అన్నకి చెల్లి గుర్తుచేయాలా?
‘‘నన్నడిగితే, ఒక సోదరి రక్షణ చూసుకోవాలని సోదరుడికి గుర్తు చేయాల్సిన అవసరం ఉందంటారా? రక్తసంబంధంలో అది అన్న, తమ్ముడి కనీసబాధ్యతే కదా! అయితే, అసలు స్ఫూర్తిని మర్చిపోయి, దీన్ని మార్కెటింగ్‌గా మార్చేశాం.
 చెల్లెల్ని కాపాడుకోలేకపోయిన మామూలు మనిషి ఆ బాధ నుంచి స్త్రీలోకానికే అన్న ఎలా అయ్యాడన్నది ‘రాఖీ’ సినిమాలో చెప్పా. సింబాలిక్‌గా ‘రాఖీ’ని వాడా. కానీ, రాఖీ కట్టించుకొంటేనే అన్న అనీ, చెల్లెలనీ అనుకోనక్కర్లేదు. తోటి స్త్రీ పట్ల, ఆ మాటకొస్తే తోటి మనిషి పట్ల అక్కర చూపాలి. కష్టనష్టాల్లో వాళ్ళకు అండగా, అన్నలా నిలబడాలి. అదే అసలైన బంధం.

కానీ, ఇవాళ అందరం డబ్బు యావలో పడిపోయాం. టెక్నాలజీ వల్ల అనుబంధాలు తెగిపోతున్నాయి. అందరిలో ఒక అశాంతి! ఎందుకు, ఎక్కడికి పరిగెడుతున్నామో తెలియకుండానే పరిగెడుతున్నాం. వీటి ఎఫెక్టే ఇవాళ నిర్భయ, రిషితేశ్వరి ఘటనలు. ఈ రెస్ట్‌లెస్‌నెస్ నుంచి మనిషి బయటపడాలంటే, ప్రకృతి నేచురల్ కరెక్షన్ చేయాలి. చేస్తుంది!’’
 - కృష్ణవంశీ, ప్రముఖ సినీ దర్శకుడు
 
ఇది బాధ్యతకు పునశ్చరణ!
‘‘కాలగమనంలో విలువలు మారిపోతుంటాయి. అవి వాటి ఉనికినీ, ప్రాధాన్యాన్నీ కోల్పోయే పరిస్థితి వస్తుంటుంది. అందుకనే, మర్చిపోతున్న ఆ విలువల తాలూకు మంచిని మనం ఎప్పటికప్పుడు ఎత్తిపట్టి, తరువాతి తరానికి గుర్తుచేయాలి. ఆ క్రమంలో వచ్చినవే మన పండుగలన్నీ! అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని గుర్తుచేసే ‘రక్షాబంధన్’ జరుపుకోవడంలోని పరమార్థం కూడా అదే! ఆకాశం లాంటి అన్నయ్యుంటే... చందమామల్లాంంటి చెల్లెమ్మల చిరునవ్వు నిత్యం నిండు పౌర్ణమే. ఇక్కడ అన్న చేతికి చెల్లెలు రాఖీ కట్టడం - కేవలం సింబాలిక్ చర్యే! కాపాడే అన్న ఉన్నాడనేది ఆ స్త్రీకి ఒక భరోసా. అలాగే, తనకూ ఒక చెల్లి ఉందనే భావన ఆ మగవాడి ప్రవర్తనకు చెక్‌పాయింట్. మహిళను సోదరిగా గుర్తించి, గౌరవించాలని భయోద్విగ్న ‘నిర్భయ’ సమాజంలో మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం ఈ ‘రాఖీ’ ప్రయోజనం. ఆ దృష్టితో చూస్తే ఇప్పుడీ పండుగ చాలా అవసరం. రాఖీ... ఒక బంధానికి ప్రతీక... ఒక బాధ్యతకు పునశ్చరణ.’’
     - రామజోగయ్య శాస్త్రి, ప్రముఖ సినీ కవి
 
 ఐ నీడ్ యు బ్రదర్ అనాలనుంది!

 ‘‘సొంత అన్నాచెల్లెళ్ళున్నా, లేకపోయినా, ప్రతి ఒక్కరిలో బ్రదర్లీ, సిస్టర్లీ ఫీలింగ్ కలిగిస్తుంది కాబట్టి, ‘రాఖీ’ పండుగ ఎప్పటికీ రిలవెంటే! రాఖీ కట్టినంత మాత్రాన అందరూ మారిపోతారని అనలేం. కాకపోతే, కనీసం వేరే అమ్మాయిని తప్పుగా చూడాలనే భావన కలిగినప్పుడు ఒక్క క్షణం సొంత చెల్లెలి ముఖం, ఆమె కట్టిన రాఖీ గుర్తుకు వస్తే చాలు. బ్రేక్ పడుతుంది. అందుకే, ఇవాళ మన సంస్కృతిని మర్చిపోతూ, ‘నిర్భయ’ ఘటన లాంటి అత్యాచారాలు, ‘రిషితేశ్వరి’ ఘటన లాంటి వేధింపులు, ర్యాగింగ్‌లు ఎక్కువైపోతున్న పరిస్థితుల్లో
‘రాఖీ’ ఒక సెల్ఫ్‌చెక్.

ఈ మధ్యే వాట్సప్‌లో ఒక వీడియో చూశా. రాఖీ కట్టడానికి వెళుతూ, బస్‌స్టాప్‌లో వెయిట్ చేస్తున్న ఒక అమ్మాయిని ఎవరో ఏడిపించబోతారు. అదే బస్‌స్టాప్‌లో ఉన్న వేరే అబ్బాయికి రాఖీ గుర్తుకొచ్చి, ‘షి ఈజ్ మై సిస్టర్’ అంటాడు. చూసినవారిలో ఆలోచన రేకెత్తించే ఇలాంటివి ఇంకా రావాలి. నా మటుకు నేను ఆపదలో ఉన్న అమ్మాయి ఎవరైనా సరే చటుక్కున తన అన్న లాంటి వ్యక్తి సాయం కోరేందుకు వీలుగా, ‘ఐ నీడ్ యు బ్రదర్’ పేరుతో హెల్ప్‌లైన్ పెట్టాలని అనుకుంటున్నా. హైదరాబాద్‌లో ఇది స్టార్ట్ చేయాలని ఫ్రెండ్స్‌తో ప్లాన్ చేస్తున్నా. ప్రభుత్వ మద్దతు అవసరమయ్యే ఈ ప్రయత్నం సక్సెసైతే, మిగిలిన ప్రాంతాలకూ విస్తరిస్తా. అప్పుడు ఏడాది పొడుగూతా ‘రక్షాబంధన్’ జరుపుకొన్నట్లే!’’
     - మధుశాలిని, సినీ నటి - కూచిపూడి నృత్య కళాకారిణి
 
 
ఎవరైనా కోరుకొనేది అలాంటి అన్నయ్యనే!

 ‘‘నాకు ఒక్కగానొక్క అన్నయ్య. పేరు సిద్ధార్థ్. రాఖీ పండగనాడు కంపల్సరీగా రాఖీ కడతాను. అయితే పెద్ద పెద్ద రాఖీలు కట్టను. ఎందుకంటే, వాడు ఎన్ని రోజులైనా అలానే ఉంచుకుంటాడు. అందుకే చిన్నది కడతాను. అది కూడా దేవుడి దారం కడుతుంటా. పోయిన ఏడాది నాకు ఎర్లీ మార్నింగ్ షూటింగ్ ఉంటే, వాడు నిద్రపోతుంటే చేతికి రాఖీ కట్టాను. నిద్ర కళ్లతోనే నాకు గిఫ్ట్స్ ఇచ్చాడు. మా అన్నయ్యకి క్రియేటివిటీ ఎక్కువ. తనిచ్చే బహుమతులు డిఫరెంట్‌గా ఉంటాయ్. ఈసారి ఏమిస్తాడో! మావాడు సినిమాటిక్ బ్రదర్ కాదు. ఓవర్ చేయడు. అయితే సడన్‌గా పెద్దరికం గుర్తొచ్చేస్తుంది. అప్పుడు ‘ఏం ఎలా ఉన్నావ్? షూటింగ్ బాగా జరుగుతోందా? ఎవరైనా ట్రబుల్ ఇస్తున్నారా?’ అనడుగుతాడు. నాకు నవ్వొస్తుంది. కానీ, ‘నిర్భయ’ సమాజంలో ఏ చెల్లెలైనా కోరుకునేది అలాంటి ఆప్యాయతతో అండగా నిలిచే అన్ననే కదా!’’
 - స్వాతి, సినీనటి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement