స్వర్గ ప్రసాద మార్గం
రమజాన్ కాంతులు
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (ర) ప్రకారం, ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా చెప్పారు. ‘రోజా’, ఖురాన్’ – ఇవి రెండూ దాసుని కోసం సిఫారసు చేస్తాయి. అంటే, పగలంతా రోజా పాటించి, రాత్రులు నమాజుల్లో ఖురాన్ పఠించడం, లేక వినడం చేసిన దాసుల కోసం, రోజా ఇలా అంటుంది. ‘ప్రభూ! నేనితన్ని ఆకలిదప్పులు, మనోవాంఛలు తీర్చుకోకుండా ఆపి ఉంచాను. కనుక ప్రభూ ఇతని విషయంలో నా సిఫారసును స్వీకరించు’. ఖురాన్ ఇలా అంటుంది. ‘దేవా! నేనితణ్ణి రాత్రులు నిద్రకు, విశ్రాంతికి దూరంగా ఉంచాను. కనుక పరాత్పరా! ఇతని విషయంలో ఈ రోజు నా సిఫారసును అంగీకరించు. దయాగుణంతో ఇతనికి మన్నింపును ప్రసాదించు’.
ఈ విధంగా దాసుని విషయంలో రోజా, ఖురాన్‌ల సిఫారసును ఆమోదించడం జరుగుతుంది. అతనికి మన్నింపును, స్వర్గాన్ని ప్రసాదించాలని నిర్ణయం జరుగుతుంది. ప్రత్యేక అనుగ్రహంతో అతన్ని సత్కరించడం జరుగుతుంది. రోజాలు ఆచరించి, నఫిల్ మొదలగు వాటిలో వారు స్వయంగా పఠించిన, లేక విన్న ఖురాన్, రోజాల సిఫారసుకు అర్హులైన పుణ్య పురుషులు, స్త్రీలు ఎంత అదృష్టవంతులో కదా! అంతటి మహాభాగ్యాన్ని పొందిన ఆ క్షణాలు... వారు ఆనందం, హర్షాతిరేకాలతో పొంగిపోయే ఆనంద ఘడియలు. అల్లాహ్ మనందరికీ అలాంటి మహదానుగ్రహభాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం.
రోజా, ఖురాను నీకు చేస్తాయట సహాయం ఆదరించు ఈరెంటిని ఎంతమంచి ఉపాయం ! వస్తుందో రాదో మరి మరోసారి అవకాశం ఆచరించు ఆరాధన అల్లాహ్ ప్రేమ అపారం !!
– యండి.ఉస్మాన్ ఖాన్