నాటి బీజం... నేటి సేవా వృక్షం | ramzan festivel special story | Sakshi
Sakshi News home page

నాటి బీజం... నేటి సేవా వృక్షం

Published Sat, May 27 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

రంజాన్‌ మాసం కోసం బియ్యం, దినుసుల పంపిణీసంస్థ స్థాపకులు రషాదీ

రంజాన్‌ మాసం కోసం బియ్యం, దినుసుల పంపిణీసంస్థ స్థాపకులు రషాదీ

బంధువులు కానీ స్నేహితులు కానీ హాస్పిటల్‌లో ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? పండ్లు తీసుకెళ్లి ఆత్మీయంగా పలకరిస్తారు. ఆదరంగా మాట్లాడతారు. ఏమీ కాదని ధైర్యం చెబుతారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తారు... ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అయితే... మౌలానా గియాజ్‌ అహ్మద్‌ రషాదీ అంతటితో ఆగిపోలేదు. హైదరాబాద్, ఉస్మానియా హాస్పిటల్‌లో తన బంధువుని పరామర్శించి, మరో బెడ్‌ మీద ఏకాకిగా ఉన్న 65 ఏళ్ల పేషెంటును కూడా పలకరించాడు.

కుశలం అడుగుతూ... ‘మీకు ఎవరూ లేరా? మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ రాలేదేమిటి’? అని అడిగాడు. అప్పుడా పెద్దాయన ‘నాకు ఎవరూ లేరని, అల్లా నా కోసం నిన్ను పంపించాడు’ అన్నాడు. ఆ మాట రషాదీ మార్గాన్ని మార్చేసింది. ఇప్పుడు రషాదీ గొప్ప సమాజసేవకుడు. ఆ పెద్దాయనతో మొదలు పెట్టిన సహాయం... నేడు శాఖోపశాఖలుగా విస్తరించింది. పదకొండు రాష్ట్రాల్లో ‘సఫా బైతుల్‌ మాల్‌’ ఆపన్నులకు సేవలందిస్తోంది. రంజాన్‌ మాసంలో అన్నం పెడుతోంది. వందలాది ఇళ్లలో ఈదుల్‌ ఫిత్ర్‌ పండుగ చేస్తోంది.

ఉస్మానియాతో మొదలు!
ఉస్మానియాలో పరిచయమైన ఆ పెద్దాయనకు ఆహారం, మందులు తెచ్చి ఇచ్చాడు. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యే వరకు అలాగే చేశాడు. అలా సమాజంలో ఎంతమంది ఉన్నారోననే ఆలోచన. అది బీజంలా నాటుకుంది. స్నేహితులను కలుపుకుని 2006లో ‘సఫా బైతుల్‌ మాల్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌’ స్థాపించాడు. ఈ పదేళ్లలో అది నగరంలోని 70 బస్తీలకు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడ, ఒరిస్సా, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు విస్తరించింది.  

ఎక్కడెక్కడ అవసరం?
రషాదీ హైదరాబాద్, ఓల్డ్‌ మలక్‌పేటలో అరబిక్‌ టీచర్‌. మదర్సాలలో చదువుకునే విద్యార్థుల్లో ఈ సేవాగుణాన్ని అలవరిచి, వారినే స్వచ్ఛంద సహాయకులుగా మార్చుకున్నారు. విద్య, వైద్యంతోపాటు అనారోగ్యంతో ఉన్న వారికి మందులు, తిండి లేని వారికి దినుసులు ఇస్తారు. పిల్లల పోషణ భారంతో కుంగిపోతున్న మహిళలు, వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ కార్డును పోలిన కార్డును మంజూరు చేస్తున్నారు. నెలనెలా బస్తీల్లో 4,500 కుటుంబాలకు సరుకులను పంచుతారు. రెండొందలకు పైగా వితంతువులకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్‌ ఇస్తున్నారు. మానసిక, శారీరక వికలాంగులకు వైద్యంతోపాటు పెన్షన్‌ ఇస్తున్నారు.
ఒక వ్యక్తిలో మొదలైన ఒక మంచి ఆలోచన... మంచి ఫలాలనే ఇస్తుందని మరోసారి నిరూపితమైంది. రషాదీ ఆ పని చేసి చూపించారు.    
–  మంజూర్‌

రంజాన్‌ నెలలో పేదవారికి బియ్యం, 15 రకాల నిత్యావసర సరుకులు ఇస్తారు. రంజాన్‌ పండగ చేసుకోవడానికి ఈద్‌ ప్యాక్‌లు ఇస్తారు.
ఆనాథ పిల్లల కోసం ప్రత్యేక హాస్టల్‌ కమ్‌ స్కూల్‌ ఏర్పాటు చేశారు. ఇందులో నగరంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన 330 మంది పిల్లలున్నారు.
పేదలకు అంత్యక్రియలు, ఆనాథలైన ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు.

సంస్థ నిర్వహణ!
ఐదు వందలకు మించిన విరాళం తీసుకోరు. ఇంట్లో పాత పేపర్లు, పాత సమాను కూడా ఇవ్వవచ్చు. ఇందుకోసం జీపీఎస్‌తో అనుసంధానమైన సంస్థ వాహనాలు బస్తీల్లో తిరుగుతాయి.
ఇల్లు, ఊరు మారే వాళ్లు వద్దనుకున్న సామాను, దుస్తులను ఇచ్చేస్తుంటారు. ఈ సంస్థ హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేసి సమాచారం ఇస్తే వాహనం వెళ్తుంది.

వైద్యం ఒక్కటే చాలదు!
ఈ పదేళ్లలో లక్షల మందికి విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో సహయపడుతున్నాం. మొదట్లో రోగులకు మందులు ఇవ్వాలనుకున్నాం. పేదల బస్తీల్లో సర్వే చేసినప్పడు వారుపడుతున్న ఇబ్బందులను చూశాక వైద్యం ఒక్కటే చాలదనిపించింది. దాంతో విద్య, ఇతర సంక్షేమాలను కూడా చేర్చాం. రంజాన్‌ శుభ మాసం సందర్భంగా... సంస్థ ద్వారా జకాత్, సదకాత్, ఫిత్రా ఇవ్వాలంటే హెల్ప్‌లైన్‌ (09394419820). – మౌలానా గియాజ్‌ అహ్మద్‌ రషాదీ సఫా బైతుల్‌ మాల్‌ అధ్యక్షులు

మందులు... పెన్షన్‌ కూడా!
నా భర్త చనిపోయాడు. పిల్లలు లేరు. బీపీ, షుగర్, థైరాయిడ్‌తో బాధపడుతున్నాను. సఫా బైతుల్‌ మాల్‌ సభ్యులు తెల్లకార్డు ఇచ్చారు. మూడేళ్ల నుంచి ప్రతి నెలా వైద్యం చేసి మందులు, వితంతు భృతి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు.
– మహెమూద్‌ బీ  ఫలక్‌నుమా, హైదరాబాద్‌

క్యాన్సర్‌కు వైద్యం!
నేను ఆటో డ్రైవర్‌ని. రెండేళ్ల క్రితం క్యాన్స్‌ర్‌ వచ్చింది. సఫా బైతుల్‌ మాల్‌ వారు వైద్యం చేయిస్తున్నారు. నా కుటుంబాన్ని పోషిస్తున్నారు.
– మహ్మద్‌ షుకూర్, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement