దాదాపు పది లక్షల ఏళ్ల క్రితం మనిషి తన రెండుకాళ్ల మీద నిలబడి, తన చేతులను పనులు చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టగానే నాగరికత ఆవిర్భవించడం మొదలైంది. ఇలా నడక ప్రారంభమయ్యాక పాదాలను వేడి, చలి, గాయాలనుంచి రక్షించుకునేందుకు పాదరక్షలు మొదలయ్యాయి. పాదరక్షలు వాడటం మొదలయ్యాక అందులోనూ నాగరకత చూపించుకునేందుకు హైహీల్స్ వాడకంతో 80 శాతం జనాభాలో పాదాల సమస్యలు మహిళల్లోనే ఎక్కువ. అలాగని పురుషుల పాదాల ఆరోగ్యం బాగుందా అంటే అదీ లేదు. కూర్చుని చేసే పనులు ఎక్కువయ్యాక స్థూలకాయం రావడం, శరీరం బరువంతటినీ పాదాలే మోయాల్సి రావడంతో సమస్యలు పెరిగాయి. మన బరువును జీవితాంతం మోసేటి మీ పాదాలకు వచ్చే సమస్యలేమిటి, వాటి నుంచి రక్షణ పొందడం ఎలా అన్న అంశాలను తెలుసుకుందాం.
పాదాలకు వచ్చే సమస్యల్లో కొన్ని...
మడమ బెణకడం ఆర్థరైటిస్ అథ్లెట్స్ ఫుట్ (పాదాలకు రింగ్‌వార్మ్స్ అనే సూక్ష్మక్రిములు సోకడం వల్ల వచ్చే దురదల, పగుళ్లతో కూడిన ఒక రకం సమస్య) పాదాల మంట డయాబెటిస్‌ను నియంత్రణలో పెట్టుకోకపోవడం వల్ల వచ్చే డయాబెటిక్ ఫుట్ పాదాలు పొడిబారిపోయి పగుళ్లు రావడం ఫ్లాట్ ఫీట్ పాదాల నుంచి దుర్వాసన రావడం పాదాలపై పుండ్లు రావడం పాదాలకు ఫంగస్ సోకడం గౌట్ (యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ చేరడం వల్ల పాదం బొటనవేలు ఎర్రగా మారి వాపు, నొప్పి రావడం) న్యూరోపతి (పాదాలకు వచ్చే నరాల సమస్య వల్ల స్పర్శజ్ఞానం తగ్గి, తిమ్మిరి రావడంతో పాటు పాదం నుంచి చెప్పు జారిపోయినా తెలియని పరిస్థితి) ఆర్థోటిక్స్ (పాదంలో ఒంపు ఉండే చోటు సక్రమంగా ఉండేలా చూడటం) షిన్ స్ల్పింట్ (మోకాలి కింది భాగంలో నొప్పి) స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అగ్లీ నెయిల్ సిండ్రోమ్ వార్ట్స్ (పాదాలకు పులిపిరులు రావడం)
ఎవరెవరిలో రిస్క్ ఎక్కువ...
పాదాల సమస్య వచ్చే అవకాశాలు సాధారణ వ్యక్తులతో పోలిస్తే కొందరిలో మరింత ఎక్కువ. వారెవరంటే... పాదాలకు రక్తసరఫరా ఒకింత తక్కువగా ఉన్నవారిలో ఏవైనా గాయాలు, పగుళ్లు వస్తే అవి తగ్గడానికి చాలాకాలం పడుతుంటుంది పాదాల నరాలు దెబ్బతినడం వల్ల వాటికి గాయాలైనా నొప్పితెలియదు. దాంతో సమస్య ముదిరాక గానీ అది తెలియరాదు. ఈలోపు జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుంది డయాబెటిస్ ఉన్నవారికి పాదాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
డయాబెటిస్ ఉన్నవారికి సూచనలు...
డయాబెటిస్ సమస్య ఉన్నవారు తమ పాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా ‘పోడియాట్రిస్ట్’ (పాదాల స్పెషలిస్ట్ డాక్టర్)కు చూపిస్తూ ఉండాలి. తమ పాదానికి ఏదైనా దెబ్బతగిలినా, పగుళ్లు వచ్చినా గాయాలైనా జాగ్రత్తగా చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా గాయాలు తగిలినప్పుడు పాదాల్లో నొప్పి ఉందా లేదా అన్నది చూసుకుంటూ ఉండాలి. నొప్పి తెలియకపోవడం ప్రమాదకరమైన సంకేతం. ఇక ఇలాంటి ఏదైనా సమస్యతో పాటు గోరు లోపలికి తిరిగి పెరుగుతూ ఉంటే పోడియాట్రిస్ట్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. మీ రక్తంలోని చక్కెరపాళ్లు ఎప్పుడూ అదుపులో ఉంచుకుంటూ ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారి పాదాలకు ఏదైనా గాయం అయితే ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
వృద్ధులలో పాద సమస్యలు...
చాలామంది వృద్ధులు తమ వయసు రీత్యా చూపు తగ్గడం వల్ల తమ పాదాలకు జరిగిన నష్టాన్ని గుర్తించలేరు. వారి పాదాల చర్మానికి సమస్యలు రావచ్చు. గోళ్లు సరైన ఆకృతిని కోల్పోవడం వంటి సమస్యలతో పాటు సాఫ్ట్ టిష్యూ డిజార్డర్స్, ఆర్థరైటిస్ వంటి పాద సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ.
ఆటలాడే వారిలో...
ఆటలాడే స్పోర్ట్స్ పర్సన్స్‌లో కాళ్లకు, పాదాలకు గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ. వారికి స్ట్రెస్ ఫ్రాక్చర్స్, ఆర్చ్ పెయిన్ (ప్లాంటార్ ఫేసైటిస్), మడమ వద్ద మంటలు (అచిలిస్ టెండనోపతి), పాదం బొటన వేలి వద్ద నొప్పి (సెసామోడైటిస్) వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
చిన్నపిల్లల్లో వచ్చే పాదాల సమస్యలు...
పాదాలకు వచ్చే సమస్యలు చిన్నపిల్లల్లోనే ఎక్కువ. వాళ్లు విస్తృతంగా ఆటలాడుతుంటారు. దాంతో బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు మొదలు, చురుగ్గా ఆటలాడే పెద్దపిల్లల వరకూ అన్ని వయసుల పిల్లల్లోనూ సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అందుకే చిన్న పిల్లల పాదాలకు అయ్యే గాయాలను విస్మరించకూడదు.
మంచి షూను ఎంచుకోవడం ఎలా...
ఈ విషయంలో పోడియాట్రిస్ట్ మీకు మంచి సలహా ఇవ్వగలరు. అయితే ఆరోగ్యకరమైన పాదాలకోసం... మంచి, సౌకర్యవంతమైన పాదరక్షల ఎంపిక చాలా ముఖ్యం. మంచి షూస్ ఎంపికలో పాటించాల్సిన జాగ్రత్తలివి...
మరీ ఎక్కువ హీల్ లేకుండా మీ మడమకు మంచి రక్షణ కల్పించేలాంటి షూను ఎంపిక చేసుకోవాలి నడిచే సమయంలో పాదం జారకుండా, మడతపడకుండా, స్లిప్ కాకుండా ఉండేలా మీ షూ ఉండాలి మీ పాదం బొటన వేలి తర్వాత కూడా కొంత ఖాళీ స్థలం ఉండేలా మీరు మీ షూ ఎంపిక సమయంలో జాగ్రత్త తీసుకోవాలి మీ పాదాల వేళ్లు అన్నీ సౌకర్యవంతంగా పట్టేంత స్థలం ఉండాలి. మీ వేళ్లకు షూ ఇరుకుగా ఉండకూడదు మీ పాదాలు కూడా శ్వాసించేలాంటి మెటీరియల్‌ను షూ కోసం వాడాలి. అంతేగానీ పాదాలు ఉక్కపోతకు గురయ్యేలాంటి మెటీరియల్ మీ పాదం ఆరోగ్యానికి సరికాదని గుర్తుంచుకోండి. అందుకే ప్లాస్టిక్ వంటి మెటీరియల్ కంటే ఎల్లప్పుడూ లెదర్ షూ వాడటమే మేలు షూ కింద ఉపయోగించే సోల్ ఎప్పుడూ రబ్బర్‌తో చేసిన ఒకింత మెత్తటి మెటీరియల్‌తో చేసినదై ఉండాలి. మీరు నడిచేప్పుడు కలిగే బంప్‌ను ఆ సోల్‌కు ఉపయోగించిన మెటీరియల్ తీసుకొని పాదానికి షాక్ అబ్జార్బర్‌లా పనిచేయాలి.
ఆరోగ్యవంతమైన పాదాల కోసం
కొన్ని సూచనలు...
ఏడాదికి ఒకసారి మీ పాదాలను నిపుణులైన ‘పోడియాట్రిస్ట్’కు చూపించుకోండి. ఒకవేళ మీకు దగ్గర్లో ఆ అర్హత గలిగిన వైద్య నిపుణులు లేకపోతే కనీసం ఆర్థోపెడిక్ నిపుణుడినైనా సంప్రదించండి మీరు ధరించే షూస్, సాక్స్ ఈ రెండూ సౌకర్యవంతంగా ఉండాలి. అవి ధరించాక అసౌకర్యం ఉంటే దాన్ని భరిస్తూ అలాగే ఉండకండి. దాని వల్ల పాదానికి జరిగే నష్టం ఎక్కువ ప్రతిరోజూ పాదాలను పరీక్షించుకుంటూ ఉండండి. పాదాలు ఎక్కడైనా ఎర్రబడ్డాయా, నొప్పి ఉందా, పాదంపైన ఎక్కడైనా చర్మం మందంగా మారిందా అనే విషయాలను పరీక్షించుకోండి పాదానికి ఏదైనా దెబ్బతగిలినప్పుడు, దాని నొప్పి తెలియకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. నొప్పి తెలియని సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు మీ కాళ్ల గోళ్లను పరిశీలించుకుంటూ ఉండండి. ఏదైనా గోరు లోపలివైపునకు పెరుగుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి మీ పాదాల వద్ద పులిపిరుల్లాంటివి ఏవైనా పెరుగుతుంటే వాటిని బ్లేడ్‌తో కోసివేయకండి. డాక్టర్‌ను సంప్రదించండి మీరు షూ ధరించేముందు ప్రతిసారీ లోపల అంతా బాగుందేమో చూడండి. పదునైన వస్తువులుగానీ, రాళ్లవంటివిగానీ షూలో లేకుండా చూసుకోండి అంచుల గుర్తులు చర్మంపై ముద్రించుకుపోయేలా ఉన్న సాక్స్ వాడకండి మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి. ఈ అలవాటు మీ పాదాలకు రక్తసరఫరాను తగ్గించి అనేక తీవ్రమైన సమస్యలు వచ్చేలా చేస్తుంది. ఈ సమస్యల తీవ్రత ఎంతగా ఉంటుందంటే ఒక్కోసారి మీరు పాదాన్ని కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు.
పాదాల పరిశుభ్రత ఇలా...
ప్రతిరోజూ మీ పాదాలను శుభ్రంగా కడు క్కోండి. ముఖ్యంగా కాలివేళ్ల మధ్య శుభ్రమయ్యేలా సబ్బుతో నురగ వచ్చేంతవరకు కడుక్కోండి ఆ తర్వాత పాదాన్ని పొడిగా తుడుడుచు కోండి. తడిగా ఉన్నప్పుడే సాక్స్, షూ ధరించకండి గోళ్లను తొలగించే సమయంలో మూలలు లోపలికి కట్ అయ్యేంత లోతుగా కట్ చేసుకోకండి. గోళ్లను కూడా మరీ చర్మం కనిపించేంత లోపలికి కట్ చేసుకోకండి. కాస్త అంచుకనిపించేంత వేలి గోరును చివరన ఉంచుకోండి పాదాలపై పులిపిరి కాయలు ఉంటే వాటిని కోయవద్దు. వాటిని కరిగించేలాంటి గాఢమైన ద్రవాలను (యాసిడ్స్ వంటివాటిని) పులిపిరికాయలపై పోయకండి మీరు ధరించే సాక్స్ ప్రతిరోజూ మారుస్తూ, శుభ్రమైన వాటినే వాడండి. మరీ పొట్టివి, చాలా బిగుతుగా ఉండేవి వాకండి కొందరి పాదాలకు చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. ఇలాంటివారు సింథటిక్ మెటీరియల్‌తో చేసిన షూ కంటే గాలి తగులుతూ ఉండేలా శాండిల్స్ వాడటం మేలు.
డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి,
కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
పాఠకదేవుళ్లకు పాదసేవ
Published Tue, Jun 9 2015 11:41 PM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM
Advertisement
Advertisement