
ప్లాస్టిక్ వద్దు... క్లాత్ బ్యాగ్ ముద్దు
పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ సంచులను వదిలేసి ఈ టిఫిన్ బాక్స్‌లను, క్లాత్ బ్లాగ్‌లను వినియోగిస్తున్నాను. మీరు కూడా టిఫిన్ బాక్స్ చాలెంజ్‌ను స్వీకరించి ప్లాస్టిక్ రహిత సమాజానికి పాటుపడాలి. సాధ్యమైనంత వరకు కవర్ల వాడకాన్ని తగ్గించాలి. పేపర్, జ్యూట్ బ్యాగ్స్ వాడాలి. ప్రభుత్వం కూడా ఎక్కువ ప్రచారం కల్పించాలి.
ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. తాగే గ్లాసు నుంచి తినే కంచ వరకు ప్రస్తుతం అంతా ప్లాస్టిక్ భూతమే కనిపిస్తోంది. పర్యావరణాన్ని కబళించే ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు నడుం బిగించాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అనుకున్నదే తడవుగా ఎక్కడికి వెళ్లినా.. టిఫిన్ బాక్స్ తీసుకువెళుతూ అందరికి చాలెంజ్ విసురుతున్నాడు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను పారదోలేందుకు గత ఏడాది ఉగాది పండుగ రోజున ‘టిఫిన్ బాక్స్’ చాలెంజ్ తీసుకొచ్చాడు హైదరాబాద్‌కు చెందిన దోసపాటి రాము. ఎల్బీనగర్‌లో ఉండే రాము ఈ చాలెంజ్ ద్వారా కొన్ని లక్షల ప్లాస్టిక్ కవర్లను తగ్గించి ఎంతో మందికి పర్యావరణంపై అవగాహన కలిగిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు.
నగరంలో వాడుతున్న కవర్లలో కొన్ని కవర్ల వాడకాన్ని అయినా తగ్గించాలని తన ప్రయత్నాన్ని గత ఏడాది ఉగాదిన తన ఇంటిలోనే మొదలు పట్టాడు. ‘మటన్, చికెన్ షాపునకు వెళ్తే టిఫిన్ బాక్స్ తీసుకెళ్లండి. కూరగాయల మార్కెట్‌కి వెళ్లే జ్యూట్ లేదా క్లాత్ బ్యాగును తీసుకెళ్లండి’’ అంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ తాను పాటించడం మొదలు పెట్టాడు. అంతేగాక ‘మీరు కూడా ప్లాస్టిక్‌కు బదులు టిఫిన్ బాక్స్‌లు వాడండి’ అంటూ ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో స్నేహితులకు చాలెంజ్ విసిరారు. వాళ్లు ఈ ఐడియా నచ్చి మరికొంత మందికి చాలెంజ్ చేస్తూ ప్లాస్టిక్ కవర్ల వాడాకాన్ని తగ్గించారు.
కూరగాయల మార్కెట్లలో..
సాధారణంగా కూరగాయల మార్కెట్‌లలో ప్లాస్టిక్ కవర్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించిన రాము ఎల్‌బీనగర్, నాగోల్, కొత్తపేట, రాక్‌టౌన్ కాలనీలోని వారపు సంతలో మకాం వేస్తూ ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల కలిగే అనర్థాలను మైక్ పట్టుకుని సంతకు వచ్చే వారికి వివరించడంతోపాటు స్థానికుల సాయంతో పేపర్ బ్యాగ్స్ తయారు చేయించి, ఆ బ్యాగులను కూరగాయలు అమ్మే వారికి పంపిణీ చేశాడు. ఇలా రెండు నెలల పాటు చేయడంతో మార్కెట్‌కు వచ్చే వాళ్లకు అవగాహన వచ్చి ఇంటినుంచి వచ్చేటప్పుడే క్లాత్ బ్యాగులు తెచ్చుకోవడం మొదలు పెట్టారు. దీంతో కొన్ని వందల కవర్ల వాడకం తగ్గిపోయిందని, ఇక్కడే గాక నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో సైతం టిఫిన్ బాక్స్ చాలెంజ్‌కు మంచి స్పందన వచ్చిందని రాము చెబుతున్నాడు.
– మంగినేపల్లి సాయి కుమార్,
సాక్షి, నకిరేకల్
Comments
Please login to add a commentAdd a comment