ఊరికి బంధువులు... | Relatives in village | Sakshi
Sakshi News home page

ఊరికి బంధువులు...

Published Fri, Jun 19 2015 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

ఊరికి బంధువులు...

ఊరికి బంధువులు...

ఆ ఇంటి వరకూ మామూలుగా నడిచేది. ఆ ఇల్లు రాగానే బాబోయ్ ఇందులో పిచ్చోడుంటాడు అని పరుగు పెట్టేది. చిన్న ఊరు కదా. తొందరగా చీకటైపోయేది. తొందరగా మనుషులు తినేసి తలుపులు బిడాయించేవారు. ఎనిమిదీ ఎనిమిదిన్నరకు అంతా సద్దుమణిగాక ఆ దూరపు ఇంట్లో నుంచి ఆ పిచ్చివాడు పెద్ద పెద్దగా కేకలు పెడుతుంటే విని భయం వేసేది. అతడికి పిచ్చి ముదిరినప్పుడల్లా గదిలో వేసేవారు. నెమ్మదించినప్పుడు బజారున నడుస్తుంటే మామూలు మనిషే... నల్లటి రూపం.. గుబురు మీసం... కొంచెం మెల్లకన్ను... ఇస్త్రీ చొక్కా... భయం మాత్రం తగ్గేది కాదు.
 
కాని పెదత్తకు పట్టిన పిచ్చి వేరేగా ఉండేది. ఆమె రోజూ ఇంటి హాలులో గొంతుక్కూచుని, బియ్యం ఏరుతూ, వంకాయలు తరుగుతూ, లేదంటే చిరుగులు పడ్డ బట్టలను కుడుతూ గాలిలో కనిపించే ఎవరితోనో మాట్లాడేది. మెల్లగా గొణుగుతూ మాట్లాడేది. రహస్యాలు మాట్లాడినట్టుగా మాట్లాడేది. భాష అర్థమయ్యేది కాదు. కాని అప్పుడప్పుడు ఆమె ఆ గాలిని చూస్తూ చూపుడు వేలు ఆడించేది. ఒక్కోసారి వెర్రెత్తినట్టుగా కనుగుడ్లు పెద్దవి చేసి దానిని తరిమేయడానికి పెనుగులాడుతుండేది. పిల్లలను ఏమీ అనేది కాదు. పిల్లలు కూడా ఆమెను చూసి ఎప్పుడూ నవ్వేవాళ్లు కాదు.
 
ఎక్కడి నుంచి వచ్చాడో పిచ్చి కోటయ్య ఊరికి బంధువుగా వచ్చాడు. కర్నూలు తెలుగు మాట్లాడేవాడు.  కన్నడం కూడా పలికేవాడు. ఎవర్నీ ఏమీ అనకుండా ఎప్పుడూ జేబులోని బొగ్గు ముక్కను తీసి గోడల మీద ఎవరికీ అర్థం కాని లిపిలో రాసుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు చాలా హాయిగా నవ్వేవాడు. చాలా తక్కువసార్లు కోప్పడుతూ గాలిని తిట్టి పోస్తుండేవాడు. ఎవరో తప్పనిసరిగా ప్యాంటు ఇచ్చేవారు. మరెవరో బతిమిలాడి చొక్కా తొడిగేవారు. సొంత చెల్లెలు వస్తే చెమ్చాడు నూనె ఇవ్వడానికి జాడించి వదిలిపెట్టే అమ్మ కోటయ్య ఆకలిని మాత్రం దయగా పట్టించుకునేది. గోడల మీద రాతలను వెతుక్కుంటూ వెళ్లి పిలిచి అన్నం పెట్టేది. బదులుగా నీళ్లు చేది పోసేవాడు. డబ్బులిస్తే పారేసుకునేవాడు. ఐదారేళ్లకు పిచ్చి పూర్తిగా తగ్గిపోయి ఊరెళ్లిపోతూ ఉంటే అందరూ ఏడ్చి వెక్కిళ్లు పెట్టినవారే.
 
కచ్చేరి వేపచెట్టు కింద సాయంత్రం ఐదూ ఆరుకు ఆ పెద్దమనిషి శుభ్రంగా స్నానం చేసి, నుదుటిన విభూతి రాసుకుని,  లుంగీ, పొడవు చేతుల చొక్కా వేసుకువచ్చి పద్యాలు అందుకునేవాడు. పిల్లలందరినీ పోగేసి ఇంగ్లిష్‌లో మాట్లాడేవాడు. అటూ ఇటూ తిరుగుతూ పొట్ట కదిలేలా గంతుతూ నవ్వు తెప్పించేవాడు. పిల్లలు నవ్వుతుంటే తానూ నవ్వేవాడు. ఆటల్లో పడి ఎవరూ వినకపోయినా చాలాసేపు ఉపన్యాసం ఇచ్చి అలసిపోయేవాడు. రాత్రి భోజనం సమయానికి ఎవరో వచ్చి చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. మరుసటి రోజు మళ్లీ షో మొదలయ్యేది.
 
ఎర్రగా బుర్రగా అందంగా ఉండే ఆ రెడ్డిగారు ఉన్నట్టుండి మారిపోయారు. ఇల్లు  వదిలేశారు. ఇరవై నాలుగ్గంటలూ రోడ్ల మీదే ఉంటూ కింద పడ్డ ప్రతి కాగితాన్ని ఏరి జాగ్రత్తగా మూటగట్టేవారు. ఏడిపించడానికి పిల్లలు ఆ మూటను తాకబోతే కర్రెత్తి కొట్టడానికి మీద మీదకు వచ్చేవారు. ఆ మూట కనిపించకపోతే ఆయన ప్రాణం పోయేది. ఉండి ఉండి ఆవలించేవాడు. ఆ ఆవలింత చప్పుడు చాలా దూరం వినిపించేది. బాగా ఆస్తిపాస్తులున్న మనిషి. పెళ్లాం పిల్లలు లేరు. పిచ్చి కాగితాల మూటలో నిజం డబ్బు కూడా ఉండేదని అందరూ అనుకునేవారు. కళ్లతో ఎవరూ చూసింది లేదు. ఏ రోజు ఎక్కడ రాలిపోయారో ఎవరికీ తెలిసిందీ లేదు.
 
ఇళ్లల్లో వేడుకలప్పుడు తక్కువ కూలీకి చేస్తారని యానాదులను వెతికేవారు. పిచ్చివాళ్లను కూడా. వాడి పేరు ఎవరికీ తెలియదు. చిన్నపిల్లలు కూడా అరే... ఒరే.. అనేవారు. చాలా వేగంగా నడిచేవాడు. వాణ్ణి అందుకోవాలంటే పరిగెత్తినంత పని చేయాల్సి వచ్చేది. టేబుళ్లను మోసేసేవాడు. గంగాళాలను ఈడ్చేసేవాడు. కట్టెలు కొట్టమంటే మొద్దులను చీల్చి అవతల పడేసేవాడు. కాని మొదటి పంక్తి అటు మొదలవుతుండగానే ఇటు మొదటి విస్తట్లో నిండుగా పలావు పెట్టిమ్మని పేచీకి కూచునేవాడు. అందరూ సరే అనేవారు. మూలన కూచుని వాడు తింటూ ఉంటే ఇంకొంచెం కావాలా అని అక్కరగా వడ్డించి తృప్తి పడేవారు. వాడికి పెళ్లి చేసుకోవాలని ఉండేది. కనిపించిన ఇంటామెనల్లా పిల్లనిమ్మని అడిగేవాడు. పెళ్లి బాజాలు మోగలేదు. కాని పోయినప్పుడు అంత ఘనంగానే ఊరు సాగనంపింది.
 
ఊరు మొత్తాన్ని ఆ పొట్టివాడే ఉరకలెత్తించేవాడు. ఉండి ఉండి చేతిలో రాయి అందుకునేవాడు.  కదిలామంటే పైకి విసిరేసేవాడు. ఎదిరించకుండా కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ అధికారాన్ని అంగీకరిస్తే రాయి పక్కన పడేసి క్షమించేసేవాడు. ఎప్పుడూ ఏదో అర్జెంట్ పనున్నట్టు బెల్‌బాటమ్ ప్యాంటు చిమ్ముకుంటూ వీధిన వెళుతుండేవాడు. ఆడవాళ్లు మాత్రం వాడు కనిపిస్తే బయట ఆడుతున్న పిల్లల్ని పెద్దగా అరిచి ఇళ్లల్లోకి పిలిచేసేవారు.

జ్వరం వచ్చిన పిచ్చివాళ్లను ఎప్పుడూ చూళ్లేదు. చలికి వణికే పిచ్చివాళ్లను ఎప్పుడూ చూళ్లేదు. ఆకలి అని గోల చేసిన పిచ్చివాళ్లను, ఎవరికైనా ప్రమాదం తెచ్చి పెట్టిన పిచ్చివాళ్లను కూడా చూళ్లేదు. ఊళ్లో అన్ని కులాలు, మతాలు, వర్గాలు ఉన్నట్టే పిచ్చివాళ్లు కూడా ఒక భాగంగా ఉండేవారు. నిజంగా ఆ రోజులు గొప్పవి.
 
మనుషులు చిన్న చిన్న కలతలకే కలతపడి, ఉపద్రవాలకు చలించిపోయి, కర్కశత్వాలకు వణికిపోయి పిచ్చివాళ్లైపోయేవారు. ఇవాళ ఎంత పెద్ద ఘోరం జరిగినా బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆఫీసుకు వెళ్లడం అలవాటయ్యింది. ఎందుకనో ఇప్పుడు-నార్మల్‌గా ఉన్నవాళ్లను చూస్తేనే భయం వేస్తోంది.
 - ఖదీర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement