హైదరాబాద్ (Hyderabad) ఇళ్ల మార్కెట్ నీరసించింది. ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది కంటే 5 శాతం తక్కువగా నమోదు కావొచ్చంటూ రియల్ ఎస్టేట్ (Real Estate) కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. 58,540 యూనిట్ల అమ్మకాలు ఉంటాయని అంచనా వేసింది. క్రితం ఏడాది విక్రయాలు 61,715 యూనిట్లుగా ఉన్నాయి.
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు 4 శాతం తగ్గి రూ.4.6 లక్షల యూనిట్లుగా ఉండొచ్చంటూ.. 2024 ఏడాదిపై అంచనాలతో అనరాక్ నివేదిక విడుదల చేసింది. గతేడాది ఇవే నగరాల్లో 4,76,530 యూనిట్లు అమ్ముడయ్యాయి. కాకపోతే గతేడాదితో పోల్చితే ఇళ్ల అమ్మకాల విలువ ఈ ఏడాది 16 శాతం పెరిగి రూ.5.68 లక్షల కోట్లుగా ఉంది.
ఒక ఇల్లు సగటు విక్రయ ధర ఈ ఏడాది 21 శాతం పెరిగింది. భూముల ధరలు, కార్మికుల వేతనాలు, ముడి సరుకుల ధరలు పెరగడం ఇందుకు కారణాలుగా ఉన్నాయి. అలాగే, సాధారణ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియంత్రణ పరమైన అనుమతుల్లో జాప్యంతో కొత్త హౌసింగ్ ప్రాజెక్టుల ప్రారంభం నిదానించడాన్ని కూడా కారణంగా పేర్కొంది.
ఇదీ చదవండి: రూ.16.8 కోట్ల అడ్వాన్స్.. నెల అద్దె తెలిస్తే షాకవుతారు!
ఇళ్ల ధరలు పెరగడంతో అమ్మకాల విలువ గతేడాది కంటే అధికంగా ఉన్నట్టు వివరించింది. ‘‘భారత హౌసింగ్ రంగానికి 2024 మిశ్రమంగా ఉంది. సాధారణ ఎన్నికలకు తోడు, నిర్మాణ అనుమతుల్లో జాప్యం నెలకొంది. నూతన ఇళ్ల సరఫరాపై దీని ప్రభావం పడింది. గతేడాదితో పోల్చితే ఇళ్ల అమ్మకాలు సంఖ్యా పరంగా తగ్గినప్పటికీ, ధరల పెరగుదలతో అమ్మకాల విలువ 16 శాతం పెరిగింది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు.
సరఫరాలో క్షీణత
➤తాజా ఇళ్ల సరఫరా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది 7 శాతం తగ్గి, 4,12,520 యూనిట్లుగా ఉండొచ్చు.
➤ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోల్చితే 6 శాతం తగ్గి 61,900 యూనిట్లుగా ఉంటాయి. గతేడాది 65,625 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
➤ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో అమ్మకాలు ఒక శాతం పెరిగి 1,55,335 యూనిట్లకు చేరొచ్చు.
➤బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 2 శాతం వృద్ధితో 65,230 యూనిట్లుగా ఉండొచ్చని అంచనా.
➤పూణేలో 6 శాతం తక్కువగా 81,090 యూనిట్ల విక్రయాలు నమోదు అవుతాయి.
➤కోల్‌కతాలో 20 శాతం క్షీణతతో 18,335 యూనిట్లకు అమ్మకాలు పరిమితం కావొచ్చు.
➤చెన్నైలో 11 శాతం తగ్గి 19,220 యూనిట్లుగా ఉంటాయని అనరాక్ నివేదిక అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment