Qadir
-
చలి రోజులలో...
సీజన్ ముందు ఒక చిన్న కథ. ఒక ఊళ్లో ఒక ముసలామె. దేనికీ భయపడదు. ఎవరినీ లెక్క చేయదు. ఒక రాత్రి ఆ ముసలామె ఇంటి మీదకి దొంగలు వచ్చారు. కర్ర తీసుకొని తరిమి కొడితే మళ్లీ ఆరేళ్ల వరకూ ఆ ఇంటివైపు ఏం ఖర్మ ఆ ఊరి వైపే ఏ దొంగా కన్నెత్తి చూడలేదు. మరోసారి అడవిలో నుంచి పులి ఊరి మీద పడి మేకల్ని తినడానికి వచ్చి నేరుగా ఈ ముసలామె ఇంటి ముందు బైఠాయించింది. బయట పులి. లోపల ముసలామె. భయపడిందా? ఊహూ. ఏమే... దొంగముకందానా... ఇంత అడవీ వదిలిపెట్టి నా ఇల్లే కావాల్సి వచ్చిందా అని పొయ్యిలో నుంచి కాలే నిప్పుల్ని చేటలో తీసుకొని విసిరితే పులి అదే పరుగు. రోజులు గడిచాయి. ఉన్నట్టుండి ముసలామె బయట కనపడటం తగ్గిపోయింది. ఇంట్లోనే ఉంటోంది. ఎప్పుడూ తలుపులూ కిటికీలు వేసుకొని ఉంటుంది. ముసుగుతన్ని ఉంటోంది. ఇది గమనించిన దారిన పోయే మనవరాలు ఏం అవ్వా... ఎందుకలా ఉన్నావు అనడిగితే ముసలామె ఓపిక తెచ్చుకుని లేస్తూ ఏం చెప్పనమ్మా నిజం పులికి భయపడలేదు... కాని ఈ పులికి భయపడుతున్నానే అంది. ఏ పులి అవ్వా అంది మనవరాలు. ఇంకేపులి చలి పులి... అని బయట ఉన్న చలికి మళ్లీ ముసుగు తన్నింది ముసలామె. ఆ ముసలామెనేంటి మహామహా మొనగాళ్లను కూడా మూలకూచోబెట్టే మహా బలాఢ్యురాలు చలి. తెల్లవారకముందే పల్లె లేచింది... తనవారినందరినీ తట్టి లేపింది... అని ఏ సీజన్లో అయినా పాడుకోవచ్చేమోగాని చలికాలంలో మాత్రం కాదు. తట్టి లేపితే ఎవరూ లేవరు. తన్నిలేపినా ఎవరూ లేవరు. మంచాలనే నెచ్చెలులుగా భావించి కరుచుకుని పడుకుని ఉంటారు. వాళ్లేనా సూర్యుడు కూడా మబ్బులను కప్పుకుని బద్దకించడూ? చలికాలం మనుషులు దగ్గరగా కూడే కాలం. నిండు వస్త్రాలతో మనుషులు మర్యాదగా ఉండే కాలం. జగడాలు తక్కువ. రెండు చేతులూ ప్యాంట్ జేబుల్లో ఉంటే కొట్లాటకు స్థానం ఎక్కడ? ప్యాంట్, షర్ట్, షూస్, స్వెటర్, కోట్... డబ్బున్నవాడు బీదవాడు అన్న తేడా లేదు. అందరికీ కావాలి. కాని కొందరికే దక్కుతాయి. గమనించారా? ఎండకు ఆరుబయలు చాలు. వానకు కారని ఒక చూరు చాలు. కాని చలికి గది కావాలి. దుప్పటి కావాలి. రగ్గు కావాలి. మేజోళ్లు కావాలి. వెచ్చటి ఒక పడక కావాలి. రోడ్ల మీద తిరిగే దీనులకు అభాగ్యులకు అనామకులకు పరిగెత్తిపోవడానికి స్థలం ఉండదు. చలి కోతను కాచుకోవడానికి వీలు ఉండదు. పేపర్లను కప్పుకుని ఒకరు గోతం పట్టాలు కప్పుకుని ఒకరు టాప్ వేసుకుంటే రిక్షావాడు దొరక్కుండా పోతాడా... ఆ వెనుక సీట్లో వణుకుతూ నిదురిస్తున్న ఆటో డ్రైవర్ తెల్లారి పాసింజర్ల కోసం రాత్రంతా పళ్లను అరగదీసుకుంటాడు. అందరికీ ఎంతో సంతోషాన్నిచ్చే చలి... వీళ్లను మాత్రం నిర్దాక్షిణ్యంగా మేసేసి వెళ్లిపోతుంది. ఈ కాలం పూలు భలే బాగుంటాయి. బంతిపూలు విరగబూస్తాయి. గుమ్మడి తీగలు పసుపుపచ్చటి పూలను ఇళ్ల పైకప్పుల మీద వెదజల్లుతాయి. పున్నాగలు, పారిజాతాలు. పొగడలు... పొగమంచుకు తడిసి తుషార బిందువుల వస్త్రాలతో ముస్తాబు చేసుకుంటాయి. ఇక పూలూ పిల్లలూ ఒకటే కదా. ఈ కాలంలో వీళ్లసలు కళ్లే తెరవరు. ఎంత బలవంతం చేసినా స్కూళ్లకు త్వరగా తెమలరు. పడుకోనీయమ్మా... ఆ బుజ్జితండ్రులు అడిగే వరాన్ని ఇచ్చే తపశ్శక్తి ఎందరు తల్లిదండ్రులకు ఉంది కనక. ఎండాకాలమే ఎందుకు సెలవులిస్తారో... అసలు చలికాలం కదా ఇవ్వాలి. ఆడవాళ్లకు కొంచెం విసుగు. బట్టలు దిబ్బలు దిబ్బలుగా పోగుపడతాయి. ఉతికేద్దామంటే ఆరక సతాయిస్తాయి. అన్నం చప్పున చల్లారి పోతుంది. కూరలు మొహాలు వేలాడేస్తాయి. వేణ్ణీళ్ల స్నానానికి గ్యాస్ అయిపోతుందేమోనే భయం. గీజర్ వేద్దామంటే కరెంటు బిల్లును చూసి భీతి. కాని కొత్త పెళ్లికూతురు మాత్రం మగని ఛాతీ మీద నెగడు కాచుకుంటుంది. నేపాలీలు చలికాలం అతిథులు. కొండకు వెళ్లే స్వాములు ఈ కాలపు యోగులు. స్థితిమంతులు శబరిమలకు వెళ్లి జ్యోతిని చూస్తారు. లేనివాళ్లు చలిమంటలోని అగ్నికి నమస్కారం పెట్టుకుంటారు. వృద్ధులు జ్ఞాపకాల ట్రంకుపెట్టెలను తెరిచే కాలం ఇది. హాని చేస్తాయని తెలిసినా చుట్టలను చుట్టాలుగా చేసుకునే కాలం. తేగల్ని కాల్చి తినాలి. పాత పేపర్లనీ పుస్తకాలనీ కాలనివ్వాలి. ఇంట్లో అడ్డంకులన్నీ స్వాహా. బజారున నడుస్తుంటే బజ్జీలు బోర విరుచుకుని కనిపిస్తాయి. ఇక ఈ మూడు నెలలూ టీ- జాతీయ పానీయం. యాలకులు కొట్టి. అల్లం దంచి, నిమ్మకాయ పిండి.... చల్లటి చేతిలో పొగలు కక్కే టీ.... తేయాకు చెట్టుకి కిరీటం పెట్టాల్సిన సమయం ఇది. తొందరగా రాత్రి అయిపోతుంది. ఊరు తొందరగా సద్దుమణిగిపోతుంది. ఫస్ట్ షో ఫస్ట్ హాఫ్‌కే ఏ అర్ధరాత్రో అయిపోయిన ఫీలింగ్. సెకండ్ షోకి వెళ్లి వస్తుంటే పళ్లు మొలిచిన చలి కొరికి కొరికి వేధిస్తుంది. అభయ హస్తం అంటే ఏమిటో అరిచేతులను చూస్తేనే తెలుస్తుంది. పాపం కాస్త గట్టిగా రుద్దుకోగానే చెకుముకిలా పని చేసి వేడిని బుగ్గలకు చేరవేస్తాయి. అసలు బలహీనులు చెవులు. తాళాలు లేని ఈ గేట్లలో నుంచి శత్రుదేశపు సైన్యాధిపతిలా చలి దూరిపోతుంది. దూది అడ్డం పెట్టి అడ్డుకట్ట వేయాలి. తలపాగా చుట్టి కందకం తవ్వాలి. ఇళ్ల ముందు ఆడపిల్లలు ముగ్గులు వేసి మొగ్గలకు రంగులు అద్దుతారు. కాసిన్ని రోజుల్లో గుమ్మాలకు క్రిస్మస్ స్టార్లు వేళ్లాడగడతారు. మంకీ క్యాపులతో మార్నింగ్‌వాక్ చేస్తున్నవారు అజా వింటూ నమాజుకు వెళుతున్న ముస్లిం భాయ్లకు హలో చెబుతారు. కొందరు దయార్ద్ర హృదయులు సేవా కార్యక్రమాలు మొదలుపెడతారు. సముద్రమంత చలిని కాచుకోవడానికి బకెట్టంత ప్రయత్నం చేస్తారు. కొందరికి కొన్ని రగ్గులు అందుతాయి. అవి కప్పుకుని పడుకున్న రాత్రి అంత కన్నా దౌర్భాగ్యులు వాటిని దోచుకుని వెళతారు. సాటి మనిషి వైపు చూడమని చెప్పడానికి చలికాలం వస్తుంది. సాటి వానికి సాయం చేయమని చెప్పడానికి చలికాలం వస్తుంది. అది అందరినీ సమానంగా చూస్తుంది. మరి మనం ఎందుకు సమానంగా ఉండకూడదు? - ఖదీర్ రోడ్ల మీద తిరిగే దీనులకు అభాగ్యులకు అనామకులకు పరిగెత్తిపోవడానికి స్థలం ఉండదు. చలి కోతను కాచుకోవడానికి వీలు ఉండదు. పేపర్లను కప్పుకుని ఒకరు... గోతం పట్టాలు కప్పుకుని ఒకరు... టాప్ వేసుకుంటే మాత్రం రిక్షావాడు దొరక్కుండా పోతాడా... ఆ వెనుక సీట్లో వణుకుతూ నిదురిస్తున్న ఆటో డ్రైవర్ తెల్లారి పాసింజర్ల కోసం రాత్రంతా పళ్లను అరగదీసుకోక తప్పదు. -
ఇద్దర్ని బలిగొన్న లారీ
ఆలేరు మండల కేంద్రానికి సమీపంలో హైదరాబాద్ - వరంగల్ జాతీయరహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను హైదరాబాద్ కి చెందిన ఖదీర్(58), అబ్దుల్ నజీర్(37)గా గుర్తించారు. వీరిద్దరూ వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి వరంగల్ కారులో బయలుదేరగా..మార్గమధ్యంలో టైరు పంక్చరైంది. రోడ్డు పక్కన కారుకు మరమ్మతులు చేస్తుండగా వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. వెలుతురు సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సంఘట నాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిప్పు లో తడి
నిప్పులో నిమ్ము ఉంటుంది. అబ్బ ఛా! నిప్పులో తడి ఉంటుందా? కావాలంటే కాలుతున్న కట్టెను చూడు... నిప్పు అంచున నీరు కనపడుతుంది. భగభగ మండే గుండె అంచున కూడా చెమ్మ ఉంటుంది. దేహం కాలే ముందు.. ఖననం అయ్యే ముందు.. చాలా ముందు... ప్రక్షాళన జరగాలి.. మనలని మనం.. నిప్పుతో కడుక్కోవాలి. ఇక్కడే.. వీలైతే ఇప్పుడే.. మన బాధను, కష్టాన్ని, కోపాన్ని, నష్టాన్ని.. మనసులో ఒక పీడలా మిగిలిపోకుండా... ఇక్కడే కడిగేసుకోవాలి. నిప్పులో ఉన్న తడితో కడిగేసుకోవాలి. మసాన్ సినిమా చూస్తే అదే అర్థమయింది.. దేహం కంటే ముందు.. చాలా ముందు.. మనసును నిప్పులాంటి సత్యంతో.. తడితడిగా ఉండే ప్రేమతో... కడిగేసుకోవాలి. కాశికి పోయినవాడు కాటికి పోయినట్టే లెక్క. కాని కాదు. కాశిలో ఉన్నా సరే కాటికి పోయేంత వరకూ జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ముందుకు సాగాల్సి ఉంటుంది. ఒక్కో దశలో ఒక్కో బాధను వదిలేసుకుంటూ ముందుకు ప్రవహించాల్సి ఉంటుంది. అదే ఈ కథ. మసాన్. కాశి పవిత్ర పుణ్యక్షేత్రం. భూలోక కైలాసం. మానవులను ముక్తిని పొందే అంతిమస్థలం. కాని అక్కడా ప్రజలు ఉంటారు. వాళ్లకూ జీవన వ్యాపారాలు ఉంటాయి. అక్కడా హోటళ్లు ఉంటాయి. ఇళ్లు ఉంటాయి. ఇంటర్నెట్ సెంటర్లు ఉంటాయి. మనుషుల చేతుల్లో ఫోన్లు ఉంటాయి. వాటిలో అవసరమైనవీ అవసరం లేనివీ కూడా అందుబాటులో ఉంటాయి. ఆ అమ్మాయి అలాంటివి కొన్ని చూసింది. ఒక అబ్బాయి అమ్మాయి చేసుకునే పనిని చూసింది. అదెలా ఉంటుంది? క్యూరియాసిటీ. దానిని తెలిసేసుకుంటే. తనేం చిన్న పిల్ల కాదు. డిగ్రీ చదివింది. ప్రస్తుతం కంప్యూటర్ సెంటర్లో ట్యూటర్‌గా పని చేస్తూ ఉంది. అక్కడికి వచ్చి వెళ్లే ఒక కుర్రవాడితో స్నేహం కూడా ఉంది. ఇద్దరూ మంచివాళ్లే. ప్రేమలో ఉన్నారు. వయసులో ఉన్నారు. తెలుసుకోవాల్సిందేదో తెలుసుకోవాలనే ఆసక్తిలో ఉన్నారు. అమ్మాయి ఒప్పుకుంది. అతడు ఏర్పాట్లు చేశాడు. హోటల్ గది. ఇద్దరూ దగ్గర దగ్గరగా కూడి... కావలించుకుని... అంతలో తలుపు దడదడలాడింది. పెద్ద చప్పుడుతో ఊగిపోయింది. పోలీసులు. అమ్మాయి అబ్బాయి అదిరిపోయారు. ఒణికిపోయారు. ఏం చేయాలో గ్రహించే లోపు తలుపు బద్దలు కొట్టుకుంటూ పోలీసులు వచ్చేశారు. పట్టేసుకున్నారు. అబ్బాయి బెదిరిపోయి బాత్రూమ్లో దూరాడు. అమ్మాయిని ఇన్స్పెక్టర్ సెల్ఫోన్లోకి ఎక్కించేశాడు. తప్పులు ఏవైనా కావచ్చు. చట్టాలు ఎన్నైనా ఉండొచ్చు. కాని ఒక తప్పును నిరోధించడానికి ఎదుటివాళ్ల దగ్గర పైశాచిక శక్తి దుర్మార్గమైన పద్ధతి మాత్రం ఉండటానికి వీల్లేదు. కాని ఇక్కడ ఉంది. పోలీసులకు ఉంది. వాళ్లు తలుచుకుంటే ఎంత దూరమైనా పోగలరు. ఎంత ఘోరమైనా చేయగలరు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే? అబ్బాయి అంతకు మించి ఊహించలేకపోయాడు. బాత్రూమ్లో చేయి కోసేసుకున్నాడు. అంతకు కాసేపటి ముందు వరకూ ఎంతో సంతోషంగా గడిపిన అబ్బాయి... ఎంతో భవిష్యత్తు ఉండి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్న అబ్బాయి... ఇప్పుడు లేడు. చనిపోయాడు. కాశిలో ఒక చావు. బలవన్మరణం. ఎందరో అక్కడ చావు కోరుకుని వస్తారు. ఇక్కడ బతుకు కోరేవాడు చావును పొందాడు.కాశిలో ఎన్నో ఘాట్స్ ఉంటాయి. మృతదేహాలను దహనం చేసే ఘాట్స్. ఈ కుర్రాణ్ణి కూడా అలాంటి ఘాట్స్‌లో దహనం చేశారు. అంత తీరుబడి, శోకాన్ని అనుభవించేంత వెసులుబాటు ఏమీ ఉండవు. రోజూ వచ్చే అనేకానేక శవాల్లో ఇదీ ఒకటి. వాటి నడుమ దీనినీ వేసి తగులబెట్టాల్సిందే. ఆ అమ్మాయి దూరం నుంచి తన ప్రియుడి దహనకాండను చూసి వెను తిరుగుతుంది. కానీ అక్కడే మరో కథ మొదలవుతుంది. ఆ ఘాట్‌లోనే ఒక కుర్రాడుంటాడు. పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్లో ఉంటాడు. దళితుడు. శవాలను దహనం చేసే అతడి కుటుంబంలో తండ్రి, అన్న వృత్తిలో ఉంటే వారికి చేదోడువాదోడుగా ఉంటూ చదువుకుంటూ ఉంటాడు. ఘాట్‌లో శవాల రద్దీ ఉంటే ఇతడూ పొడవైన కట్టె పట్టుకుని మంటకు పైకి లేస్తున్న పుర్రె మీద అయినవారితో అయిదు దెబ్బలు కొట్టించే పని చేయాల్సిన వాడే. ఇతడికి ఒకమ్మాయి మీద మనసవుతుంది. ఇతడు వాడ అబ్బాయైతే ఆమె ఊరి అమ్మాయి. వైశ్యుల ఇంటిపిల్ల. కాని ప్రేమకు ఈ కులం మతం ఏముంటాయి. వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. ఆ అమ్మాయికి కవిత్వం ఇష్టం. మిర్జా గాలిబ్, బషీర్ బద్ ్రఅని ఏవేవో పేర్లు చెబుతుంటుంది. వాళ్లెవ్వరూ ఆ కుర్రాడికి తెలియదు. కాని ఆ కవిత్వం అంత స్వచ్ఛంగా నవ్వడం తెలుసు. అంత కన్నా స్వచ్ఛంగా ప్రేమించడం తెలుసు. మాది తక్కువ కులం. చండాలుల వృత్తిలో ఉన్న కులం. నన్ను నీవు స్వీకరించగలవా? ఆ కుర్రాడు అడిగాడు. ఇది సాధ్యం కాదు. ఒక వైశ్యుల ఇంటి అమ్మాయి ఒక చండాలుని భార్య ఎప్పటికీ కాబోదు. ఇందుకు ఆమె తల్లిదండ్రులు ఎన్నటికీ సమ్మతించబోరు. కాని ప్రేమకు ఒక నిమిత్తాలతో నిమిత్తం ఏముంది? ఎవరు ఏమైనా అననీ నేను నీతో వచ్చేస్తాను అంటుంది ఆ అమ్మాయి. ఆ నిర్ణయం విన్నాక ఆ రోజు రాత్రి ఆ కుర్రాడు హాయిగా ఆదమరిచి నిద్రపోతాడు. బహుశా తెల్లవారుజాము. ఘాట్‌కు చాలా శవాలు వస్తాయి. ఆ కుర్రాడి అన్నకు, తండ్రికి చేతికి మించిన పని. వచ్చి ఈ కుర్రాణ్ణి నిద్ర లేపి సాయానికి పిలుస్తారు. ఇన్ని శవాలా? ఒక్కో శవాన్ని అగ్ని ఆహుతి చేయడంలో నిమగ్నం అవుతాడు. ఒక శవం దగ్గర ఎందుకో అనుమానం వస్తుంది. ఆ చేతికి ఉన్న ఉంగరం ఎక్కడో చూసిన గుర్తు. అదిరిపడే గుండెలతో పైవస్త్రం తొలిగించి చూస్తాడు. అదే... ఆ అమ్మాయే. వైశ్యుల అమ్మాయి. తను ప్రేమించిన అమ్మాయి. బస్సు యాక్సిడెంట్ అయ్యి నదిలో పడిపోయిందట. ఒక్కరూ మిగల్లేదట. కుటుంబంతో పుణ్యక్షేత్రాల యాత్రకు బయలు దేరిన ఆ అమ్మాయి పాపం పుణ్యం ఎరగని ఆ కుర్రాడిని ఏకాకిని చేసి వెళ్లిపోయింది. ప్రేమకు స్త్రీలింగం పుంలింగం లేదు. శవం అనే మాటకు కూడా స్త్రీలింగం పుంలింగం లేదు. ఆ అమ్మాయి తను ప్రేమించినవాడి చేతిలోనే చితి మంటకు చితచితలాడుతూ అంతిమవీడ్కోలు తీసుకుంటుంది. సృష్టిని నువ్వు తప్పించలేవు. లయను కూడా.ఈ రెంటి మధ్య జీవితం మాత్రం నీదే. నడూ. పరిగెత్తు. కింద పడు. పైకి లెయ్. తప్పులు చెయ్. ప్రాయశ్చిత్తం పొందు. ప్రక్షాళనం చేసుకో. కాని బతుకు. ముందుకు సాగు. హోటల్లో ప్రియుడి చావుకు కారణమైన ఆ అమ్మాయి తాను చనిపోవాలనుకోదు. తనను హేళనగా, తిరుగుబోతుగా, బరితెగించినదానిగా చూస్తున్న సమాజానికి భయపడిపోవాలనుకోదు. జరిగిన తప్పును ఒక తప్పుగా స్వీకరిస్తుంది. అది ఇరువురు కలిసి చేసిన తప్పుగా భావిస్తుంది. నిరాశ వల్లో నిస్పృహ వల్లో కృశించకుండా ఇంకా ముందుకు ఎలా వెళ్లాలా ఆలోచిస్తుంది. యూనివర్సిటీకి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అంత వరకూ ఉద్యోగం చేయాలని కూడా అనుకుంటుంది. ఆమె తండ్రి కూడా జరిగిన దారుణానికి ఉరి పోసుకోడు. కూతురి గొంతు నులిమి చంపేయాలని అనుకోడు. ప్రేమిస్తాడు. ఆమె తప్పును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమెకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇదంతా అంత సులువైన పని కాదు. చావు కంటే కష్టమైన పనే. ఎన్నో అవమానాలు ఈసడింపులు... ఇద్దరూ పడతారు... కాని నిలబడతారు. బతుకును కొనసాగిస్తారు. తన ప్రియురాలిని కోల్పోయిన ఆ దళిత కుర్రాడు కూడా అంతే. మొదట పిచ్చివాడైపోతాడు. వెర్రివాడైపోతాడు. ఆమె జ్ఞాపకాలలో తనను తాను మర్చిపోతాడు. కాని మెల్లగా ఆ దు:ఖం నుంచి కోలుకొని ఉద్యోగంలో చేరి కొత్త జీవితాన్ని మొదలుపెడతాడు. కాశిలో ప్రాణశక్తి ఉంది. అవును. అక్కడ ప్రాణం పోసే శక్తే ఉంది. మసాన్- కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. రెండు కాన్స్ అవార్డులు పొందింది. తాజాగా విడుదలయ్యి దేశంలో అనేకమంది ప్రశంసలు పొందుతోంది. దర్శకుడు నీరజ్ ఘేవాన్ కొత్తవాడు. నటించినవాళ్లూ కొత్తవాళ్లే. కానీ అందులో కనిపించిన జీవితం మాత్రం సనాతనమైనది. సుపరిచితమైనది. మానవ రక్త సంచయంలో ఏదో ఒక పురాస్మృతిని తట్టి లేపేది. సినిమా మొదలు నుంచి దర్శకుడు గంగానది ప్రక్షాళనను ప్రస్తావిస్తుంటాడు. అయితే అంతకన్నా ముందు ప్రక్షాళనం కావలసినవి ఈ దేశంలో ఎన్నో ఉన్నాయని చెబుతాడు. కుల వ్యవస్థ ప్రక్షాళన, హోటల్లో దొరికిన అమ్మాయినీ అతడి తండ్రినీ మూడు లక్షలు ఇవ్వమని పీక్కు తీనే పోలీసు వ్యవస్థ వంటి పాలనా వ్యవస్థల ప్రక్షాళన, ఆ డబ్బు కోసం అంత మంచి తండ్రి కూడా ఒక అనాథ పిల్లవాణ్ణి నదిలో దూకే ఆటకు ప్రేరేపించి ఆ పిల్లవాణ్ణి చావు వరకూ తీసుకెళ్లడానికి వెనుదీయని మానవ బలహీనతల నుంచి ప్రక్షాళన, ఈ జన్మలో చేసిన తప్పులకు ఈ జన్మలోనే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి చేసే ప్రక్షాళన... ఇవన్నీ అవసరం అంటాడు. ఒక్క గుడి కూడా చూపించడు.కాని మానవ హృదయాలలోని గర్భగుడులలో ఉండే చీకటిని చూపిస్తాడు. మసాన్ అంటే- స్థానిక పలుకుబడిలో శ్మశానం అని అర్థం. అక్కడ ఇంత సుందరమైన బంతిపువ్వు పూయడమే ఇటీవలి విడ్డూరం. - ఖదీర్ -
కనపడని పాతమిత్రులు...
ఆ రోజులు... ఊరంతా దీపాలు ముట్టించుకున్నాక ఊరు మధ్యగా వెళ్లే రోడ్డు మీద కూడా ఒక దీపం వెలుగుతుంది. ఖాళీ నెరొలాక్ డబ్బాలో వెడల్పాటి వత్తి గుచ్చి కిరోసిన్ పోసి ఎంత గాలి కొట్టినా ఆరిపోనంత మొండిగా సిద్ధమైన ఆ దీపం రాత్రంతా మండుతూ రంగుల చాక్‌పీసులతో గీసిన దయామయుడైన ఏసుప్రభువును చూపిస్తూ ఆ బొమ్మను గీసిన చేతులకు సాయం చేయమని ప్రాధేయ పడుతూ ఉంటుంది. బస్సులు వెళుతూ ఉంటాయి. లారీలు వెళుతూ ఉంటాయి. పాదచారులు కూడా. ఇంతమంది వెళుతుంటే వారి కాళ్లు పడకుండా పారేసిన అరటిగెలల మోడులను రక్షగా అమర్చి నా పని అయిపోయిందన్నట్టుగా దూరంగా వెళ్లి నిద్రపోతున్న ఆ అనామక చిత్రకారుడికి ఏదైనా ఇమ్మని కరుణామయుని గుండెల మీద ఉన్న శిలువ మౌనంగా ప్రతి ఒక్కరికీ మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఐదు పైసలు పడతాయి. సిల్వర్ కలర్లో మెరుస్తూ కొత్త పది పైసలు పడతాయి. కాని చీకటిలో కలిసిపోయే పావలా కాసే అతడికి కాసింత టీ పోస్తుంది. ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, కాషాయ వర్ణాలలో ఉన్న షిర్డీ సాయిబాబా.... రోడ్డు మీదన్న దుమ్మును పదే పదే అరచేతుల్తో తోస్తూ తోస్తూ రంగు సుద్దలతో దైవానికి ప్రాణం పోస్తూ పోస్తూ ఎంత పెద్ద దేవుణ్ణి గీసినా ఒక్క పది రూపాయలు గిట్టక అలసి పోయి ఆకలితో అలమటించిపోయి ఒక్క మాట మాట్లాడకుండా కనపడకుండా పోయిన ఆ పాత మిత్రుడు ఒక చిననాటి జ్ఞాపకం. సినిమా హాళ్ల దగ్గర ఫస్ట్ షో మొదలవుతుంది. చిన్న ఊళ్లలో వేరే వ్యాపకం లేకుండా ఉంటుంది. అటూ ఇటూ చూసి ఆ బక్కపలచటి మనిషి మెల్లగా మట్టి లోడటం మొదలుపెడతాడు. అతడు చేయబోయేది తెలిసి పిల్లలు చుట్టూ మూగుతుంటారు. దారిన పోయేవారు ఒక కన్నేసి పెడుతూ ఉంటారు. నడుముకు ఒక వస్త్రం తప్ప వేరే ఏ భాగ్యం లేని ఆ మనిషి అప్పుడిక మెల్లగా తాను తీసిన జానెడు లోతు గొయ్యిలో తలను దూర్చి తల కిందులుగా నిలబడి కంఠం వరకూ మట్టిని కప్పుకుని తన పీకల్లోతు కష్టాలను లోకానికి చెప్పుకుంటాడు. చిల్లర పడుతుంది. అదృష్టం బాగుంటే రూపాయి నోటు కూడా పడుతుంది. ఇంకా బాగుంటే ఇటుక రంగులో ఉండే రెండు రూపాయల నోటు! లోపల ఉన్నవాడికి గాలి ఎలా ఆడుతుంది? ఏమో. కాని ఆ గాలాడని బతుకు వదలని ఒక జ్ఞాపకం. రాత్రి ఎనిమిదైతే జుట్టు తెల్లబడ్డ ఆ పండు ముసలాయన చూపులు ఏమాత్రం మరల్చకుండా చేతిలో కంచు గంటను మోగిస్తూ అంగళ్లు ఉన్న బజారులో ఆ మూల నుంచి ఈ మూలకు తిరుగుతాడు. ఇక షాపులు కట్టేసే సమయం వచ్చిందని గణగణలతో హెచ్చరిక చేస్తాడు. అతడి మాటే వేదవాక్కుగా మరో పదిహేను ఇరవై నిమిషాలలో షాపులన్నీ మెల్లమెల్లగా కట్టేసి బజార్లు నిర్మానుష్యమై పోతాయి. నిద్రలను దొంగిలించే టీవీలు రాని ఆ కాలంలో రాత్రి తొమ్మిదికంతా ఊరు నిద్రపోయిన జ్ఞాపకం. నిద్ర పోయే ముందు ఇంట్లో అందరూ ముచ్చట్లు చెప్పుకున్న మేలిమి జ్ఞాపకం. భుజానికి డప్పు తగిలించుకున్న మనిషి కూడలిలో డమడమమని మోగించి ఫలానా రోజున పోలేరమ్మకు పొంగళ్లు పెడతారహో అని ప్రకటిస్తాడు. ఇక పసుపూ కుంకుమలతో పోలేరమ్మబండలు కళకళలాడతాయి. వేప మండలు తోరణాలు అవుతాయి. తలస్నానం చేసి వదులుముడులలో మందారాలు గుచ్చిన ఆడవాళ్లు వరసలు కడతారు... బాగా బలిసి మదమెక్కి కనపడిన బర్రెగొడ్డునల్లా భయపెట్టే బలిష్టమైన పోలేరమ్మ దున్నపోతు వీధిన ఠీవిగా నిలబడి స్కూళ్లకెళ్లే పిల్లలను బెదరగొడుతుంది. ఆ ముంగిస కూచోగా ఎప్పుడూ చూడలేదు. నిద్రపోగా అసలే చూడలేదు. నేలకు దించిన మోకు చుట్టూ అవిశ్రాంతంగా అది తిరుగుతూ ఉంటే బుట్టలో ఉన్న నాగన్న పడగ దించి పడుకుని ఉంటే ఆ రెంటికీ కాసేపట్లో ఫైటింగ్ అని అట్టహాసం చేసి నలుగురూ పోగయ్యాక డోలు వాయించే కుర్రాణ్ణి నెత్తురు కక్కుకునేలా చేసి కదిలారో మీ గతి ఇంతే అని బెదరగొట్టి చేతికందిన మూలికను రూపాయి రెండు రూపాయిలకు అంటగట్టి ఆ పూటకు రైల్వేరోడ్డులోని హోటలు నుంచి పార్శిలు భోజనం తెచ్చి కుటుంబానికంతటికీ నాలుగు ముద్దలు తినిపించే మోళీ సాయెబూ అతడి వదులు లాల్చి చక్కటి ముక్కూ తెల్లటి పళ్లూ... ఆట మొదలయ్యేంత వరకూ అతడు వాయించే బుల్బుల్తారా దాని మీద పలికించే ఆకుచాటు పిందె తడిసే.... నిన్న మొన్నే చూసినట్టుగా తాజా జ్ఞాపకం. సంవత్సరానికి ఒకసారి ఊరికి పులుల్ని సింహాలనీ ఏనుగుల్నీ ఒంటెల్నీ తీసుకొచ్చి సాయంత్రం కాగానే ఊరి మీద ఫోకస్ తిప్పే ఆ సర్కస్‌లు.... ఉర్సుల్లో తిరునాళ్లలో కెమెరాలు మెడలో వేసుకుని ఎన్టీఆర్ పక్కన ఏఎన్నార్ పక్కన శ్రీదేవి పక్కన ఫోటోలు తీసి గంటలో కడిగి ఇచ్చే ఆ స్టూడియోలు.... స్కూటర్ మీద కూచుని దిగిన ఫొటో... ఇద్దరు మిత్రులు డబుల్ ఫోజ్ ఫొటో.... నాలుగు బల్లల మీద పరిచిన ఎర్ర జంపఖానా మీద మెడలో బంతిపూల మాలతో హరికథను మొదలెట్టే భాగవతారుడు, భర్దే జోలీ పాడే చప్పట్ల ఆ ఖవాలీ బృందం.... ఈ బుగ్గ నుంచి ఆ బుగ్గకు కత్తిని దూర్చే రౌద్ర భక్తుడు... బవిరి గడ్డంతో నాపరాతిని విసిరి పారేసే పక్కీరు.... సొంటి కాపీ... అని ఒకరకంగా అరుస్తూ చురుగ్గా తిరిగి అమ్మే ఆ పెద్ద మనిషి, ఒంటి మీద చొక్కా లేకుండా బెజ్జాల బనీను, చారల లుంగీ కట్టుకుని భుజాన లెదర్బ్యాగుతో గుబిలి తీస్తానని సైకిల్ పట్టుకుని తిరిగే ఆ ముసల్మాను, భాగ్య లక్ష్మి స్టేట్లాటరీ... టికెట్టు వెల ఒక్క రూపాయి... అంటూ గొంతు చించుకుంటూ రిక్షాలో క్లిప్పులకు టికెట్లు వేలాడదీస్తూ తిరిగే ఆ పంతులుగారు.... ఫలానా హాలులో ఫలానా సినిమా వచ్చిందంటూ వీధివీధినా బండి తోసుకు తిరిగే లోకల్ టాలెంట్ స్టార్ అనౌన్సర్లు.... చింతామణి నాటకం పోస్టర్లు.... సత్య హరిశ్చంద్ర కోసం డి.వి.సుబ్బారావు వస్తున్నాడొస్తున్నాడంటూ ఆర్టీసీ బస్సు వెనుక ప్రకటనలు.... కాలేజీ గోడల మీద ఇంక్విలాబ్ జిందాబాద్.... కావిరంగుతో గీసిన కణకణలాడే పిడికిళ్లు.... కనపడుట లేదు. కనపడుట లేదు. బి.టెక్ చదువు... అమెరికా కదులు... ఎవరు ఎలాగైనా పోనీ. - ఖదీర్ -
ఊరికి బంధువులు...
ఆ ఇంటి వరకూ మామూలుగా నడిచేది. ఆ ఇల్లు రాగానే బాబోయ్ ఇందులో పిచ్చోడుంటాడు అని పరుగు పెట్టేది. చిన్న ఊరు కదా. తొందరగా చీకటైపోయేది. తొందరగా మనుషులు తినేసి తలుపులు బిడాయించేవారు. ఎనిమిదీ ఎనిమిదిన్నరకు అంతా సద్దుమణిగాక ఆ దూరపు ఇంట్లో నుంచి ఆ పిచ్చివాడు పెద్ద పెద్దగా కేకలు పెడుతుంటే విని భయం వేసేది. అతడికి పిచ్చి ముదిరినప్పుడల్లా గదిలో వేసేవారు. నెమ్మదించినప్పుడు బజారున నడుస్తుంటే మామూలు మనిషే... నల్లటి రూపం.. గుబురు మీసం... కొంచెం మెల్లకన్ను... ఇస్త్రీ చొక్కా... భయం మాత్రం తగ్గేది కాదు. కాని పెదత్తకు పట్టిన పిచ్చి వేరేగా ఉండేది. ఆమె రోజూ ఇంటి హాలులో గొంతుక్కూచుని, బియ్యం ఏరుతూ, వంకాయలు తరుగుతూ, లేదంటే చిరుగులు పడ్డ బట్టలను కుడుతూ గాలిలో కనిపించే ఎవరితోనో మాట్లాడేది. మెల్లగా గొణుగుతూ మాట్లాడేది. రహస్యాలు మాట్లాడినట్టుగా మాట్లాడేది. భాష అర్థమయ్యేది కాదు. కాని అప్పుడప్పుడు ఆమె ఆ గాలిని చూస్తూ చూపుడు వేలు ఆడించేది. ఒక్కోసారి వెర్రెత్తినట్టుగా కనుగుడ్లు పెద్దవి చేసి దానిని తరిమేయడానికి పెనుగులాడుతుండేది. పిల్లలను ఏమీ అనేది కాదు. పిల్లలు కూడా ఆమెను చూసి ఎప్పుడూ నవ్వేవాళ్లు కాదు. ఎక్కడి నుంచి వచ్చాడో పిచ్చి కోటయ్య ఊరికి బంధువుగా వచ్చాడు. కర్నూలు తెలుగు మాట్లాడేవాడు. కన్నడం కూడా పలికేవాడు. ఎవర్నీ ఏమీ అనకుండా ఎప్పుడూ జేబులోని బొగ్గు ముక్కను తీసి గోడల మీద ఎవరికీ అర్థం కాని లిపిలో రాసుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు చాలా హాయిగా నవ్వేవాడు. చాలా తక్కువసార్లు కోప్పడుతూ గాలిని తిట్టి పోస్తుండేవాడు. ఎవరో తప్పనిసరిగా ప్యాంటు ఇచ్చేవారు. మరెవరో బతిమిలాడి చొక్కా తొడిగేవారు. సొంత చెల్లెలు వస్తే చెమ్చాడు నూనె ఇవ్వడానికి జాడించి వదిలిపెట్టే అమ్మ కోటయ్య ఆకలిని మాత్రం దయగా పట్టించుకునేది. గోడల మీద రాతలను వెతుక్కుంటూ వెళ్లి పిలిచి అన్నం పెట్టేది. బదులుగా నీళ్లు చేది పోసేవాడు. డబ్బులిస్తే పారేసుకునేవాడు. ఐదారేళ్లకు పిచ్చి పూర్తిగా తగ్గిపోయి ఊరెళ్లిపోతూ ఉంటే అందరూ ఏడ్చి వెక్కిళ్లు పెట్టినవారే. కచ్చేరి వేపచెట్టు కింద సాయంత్రం ఐదూ ఆరుకు ఆ పెద్దమనిషి శుభ్రంగా స్నానం చేసి, నుదుటిన విభూతి రాసుకుని, లుంగీ, పొడవు చేతుల చొక్కా వేసుకువచ్చి పద్యాలు అందుకునేవాడు. పిల్లలందరినీ పోగేసి ఇంగ్లిష్‌లో మాట్లాడేవాడు. అటూ ఇటూ తిరుగుతూ పొట్ట కదిలేలా గంతుతూ నవ్వు తెప్పించేవాడు. పిల్లలు నవ్వుతుంటే తానూ నవ్వేవాడు. ఆటల్లో పడి ఎవరూ వినకపోయినా చాలాసేపు ఉపన్యాసం ఇచ్చి అలసిపోయేవాడు. రాత్రి భోజనం సమయానికి ఎవరో వచ్చి చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. మరుసటి రోజు మళ్లీ షో మొదలయ్యేది. ఎర్రగా బుర్రగా అందంగా ఉండే ఆ రెడ్డిగారు ఉన్నట్టుండి మారిపోయారు. ఇల్లు వదిలేశారు. ఇరవై నాలుగ్గంటలూ రోడ్ల మీదే ఉంటూ కింద పడ్డ ప్రతి కాగితాన్ని ఏరి జాగ్రత్తగా మూటగట్టేవారు. ఏడిపించడానికి పిల్లలు ఆ మూటను తాకబోతే కర్రెత్తి కొట్టడానికి మీద మీదకు వచ్చేవారు. ఆ మూట కనిపించకపోతే ఆయన ప్రాణం పోయేది. ఉండి ఉండి ఆవలించేవాడు. ఆ ఆవలింత చప్పుడు చాలా దూరం వినిపించేది. బాగా ఆస్తిపాస్తులున్న మనిషి. పెళ్లాం పిల్లలు లేరు. పిచ్చి కాగితాల మూటలో నిజం డబ్బు కూడా ఉండేదని అందరూ అనుకునేవారు. కళ్లతో ఎవరూ చూసింది లేదు. ఏ రోజు ఎక్కడ రాలిపోయారో ఎవరికీ తెలిసిందీ లేదు. ఇళ్లల్లో వేడుకలప్పుడు తక్కువ కూలీకి చేస్తారని యానాదులను వెతికేవారు. పిచ్చివాళ్లను కూడా. వాడి పేరు ఎవరికీ తెలియదు. చిన్నపిల్లలు కూడా అరే... ఒరే.. అనేవారు. చాలా వేగంగా నడిచేవాడు. వాణ్ణి అందుకోవాలంటే పరిగెత్తినంత పని చేయాల్సి వచ్చేది. టేబుళ్లను మోసేసేవాడు. గంగాళాలను ఈడ్చేసేవాడు. కట్టెలు కొట్టమంటే మొద్దులను చీల్చి అవతల పడేసేవాడు. కాని మొదటి పంక్తి అటు మొదలవుతుండగానే ఇటు మొదటి విస్తట్లో నిండుగా పలావు పెట్టిమ్మని పేచీకి కూచునేవాడు. అందరూ సరే అనేవారు. మూలన కూచుని వాడు తింటూ ఉంటే ఇంకొంచెం కావాలా అని అక్కరగా వడ్డించి తృప్తి పడేవారు. వాడికి పెళ్లి చేసుకోవాలని ఉండేది. కనిపించిన ఇంటామెనల్లా పిల్లనిమ్మని అడిగేవాడు. పెళ్లి బాజాలు మోగలేదు. కాని పోయినప్పుడు అంత ఘనంగానే ఊరు సాగనంపింది. ఊరు మొత్తాన్ని ఆ పొట్టివాడే ఉరకలెత్తించేవాడు. ఉండి ఉండి చేతిలో రాయి అందుకునేవాడు. కదిలామంటే పైకి విసిరేసేవాడు. ఎదిరించకుండా కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ అధికారాన్ని అంగీకరిస్తే రాయి పక్కన పడేసి క్షమించేసేవాడు. ఎప్పుడూ ఏదో అర్జెంట్ పనున్నట్టు బెల్‌బాటమ్ ప్యాంటు చిమ్ముకుంటూ వీధిన వెళుతుండేవాడు. ఆడవాళ్లు మాత్రం వాడు కనిపిస్తే బయట ఆడుతున్న పిల్లల్ని పెద్దగా అరిచి ఇళ్లల్లోకి పిలిచేసేవారు. జ్వరం వచ్చిన పిచ్చివాళ్లను ఎప్పుడూ చూళ్లేదు. చలికి వణికే పిచ్చివాళ్లను ఎప్పుడూ చూళ్లేదు. ఆకలి అని గోల చేసిన పిచ్చివాళ్లను, ఎవరికైనా ప్రమాదం తెచ్చి పెట్టిన పిచ్చివాళ్లను కూడా చూళ్లేదు. ఊళ్లో అన్ని కులాలు, మతాలు, వర్గాలు ఉన్నట్టే పిచ్చివాళ్లు కూడా ఒక భాగంగా ఉండేవారు. నిజంగా ఆ రోజులు గొప్పవి. మనుషులు చిన్న చిన్న కలతలకే కలతపడి, ఉపద్రవాలకు చలించిపోయి, కర్కశత్వాలకు వణికిపోయి పిచ్చివాళ్లైపోయేవారు. ఇవాళ ఎంత పెద్ద ఘోరం జరిగినా బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆఫీసుకు వెళ్లడం అలవాటయ్యింది. ఎందుకనో ఇప్పుడు-నార్మల్‌గా ఉన్నవాళ్లను చూస్తేనే భయం వేస్తోంది. - ఖదీర్ -
ఇంటి ముందుకొచ్చే మనుషులు...
ఆ రోజులు... రాలిన బాదంకాయల కోసం పిల్లలు వచ్చేవారు. ఎర్రగా పూసి, గోడ బయటకు తలవాల్చిన మందారాల కోసం యూనిఫాముల్లో ఉన్న ఆడపిల్లలు వచ్చేవారు. దేవుని పటాలకు కాదనేదెవరని నందివర్థనాల కోసం పక్కింటామె వచ్చేది. చనువున్న కాలేజీ స్టూడెంట్ కాదనడానికి వీల్లేని పద్ధతిలో రోజాపువ్వును తెంపుకెళ్లేది. రెండు చేతులున్న ప్రతి మహాలక్ష్మి గుప్పెడు గోరింటాకు కోసం హక్కుగా గేటు బాదేది. నాలుగు పుదీనా రెబ్బల కోసం ఎవరైనా రావచ్చు. చారెడు కరివేపాకుకు అడగాల్సిన పనీ లేకపోవచ్చు. సవరాలు చేసిస్తాం అని మురికిగా ఉన్న ఆ ముగ్గురు ఆడవాళ్లు ఆశగా చూసేవారు. కాసింత సద్దన్నం పెడితే రేకుడబ్బాలో ఉన్న చెక్కదువ్వెనలిచ్చి నక్కలోళ్లు చక్కాపోయేవారు. తీరిగ్గా నడిచే ఒంటెద్దు బండి నుంచి శేర్ల లెక్కన ఉప్పు చేటల్లో ఒంపుకు రావాలి. ముగ్గు పిండి అమ్మే ముసలామెకు మొదటగా మంచినీళ్లు అందించాలి. కట్టెల మోపు అమ్మేవారికి చెమట ఆరేలోపు డబ్బులిస్తేనే పుణ్యం. నెయ్యి అమ్మేవాళ్ల మోసం ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు. తేనె అమ్మేవాళ్లు తియ్యగానే మట్టి నాకిస్తారు. ప్లాస్టిక్ వస్తువులకు అతుకులు వేస్తామని వచ్చిన మనిషి పచ్చటి బిందెకు ఎర్రటి పాచ్ వేసేవాడు. కుడితి కోసం వచ్చే ఆడమనిషి అంతపెద్ద కుండను చులాగ్గా నడుముకు ఎత్తుకునేది. బావిలో పడ్డ వస్తువులను తీస్తాననేవాడు పలుచగా, రివటగా, అప్పుడే నీటి నుండి తీసిన గవ్వలా మెరుస్తుండేవాడు. సోది చెప్పే అమ్మి రేడియో లేని వెలితిని పోగొడుతూ చాలాసేపు రాగాలు తీసేది. కబళం మీద ఆశ లేని బుడబుక్కలవాడు చిల్లర డబ్బులు తీసుకుని బొంగురుగా ఆశీర్వదించేవాడు. ముస్లింల ఇంటి ముందు కూడా హరిదాసు కమ్మని కీర్తన ఆలపించేవాడు. హిందువుల గడపలు ఫకీరు దువాను ఆహ్వానించేవి. సంవత్సరానికి ఒకసారి పసుప్పచ్చ బట్టల్లో యామాలసామి గుర్రాన ఊరేగి ఇంటింటినీ కటాక్షించేవాడు. సత్రం వంకాయలు అమ్మే ఆమె తక్కెడలో మోసం ఉండేది కాదు. ప్రతి తెల్లారి చేపల బుట్టలతో వచ్చే బెస్త ఆడవాళ్లకు కపటం తెలిసేది కాదు. రంగురంగుల కోడిపిల్లలు ఆరు తీసుకుంటే రెండే బతికేవి. ఉడుము నుంచి తీసిన తైలం మోకాళ్లకు మంచిదని ఎవరో తచ్చాడేవారు. గాజుల మలారం దించి చేయి పట్టుకున్నాక డజనుకు రెండు కొసరుగా ఇవ్వాలి. చీరల మూట ఆసామి సులభ ఇ.ఎమ్.ఐలు కనిపెట్టేవాడు. చెవిలో గుబిలి తీసేవాడితో మగాళ్లకు బేరం తెగేది కాదు. కక్కు కొడతాం అని వచ్చేవాళ్లు ఎండన కూచుని నున్నబడ్డ పొత్రాల ఒళ్లు హూనం చేసేవారు. సిరిచాపలు అమ్మేవారు కాసింత నడుము వాల్చే తీరిక లేక అదే పనిగా తిరుగుతుండేవారు. పాముబుట్టతో వచ్చినవాడు పైసలిస్తే తప్ప పడగను తట్టేవాడు కాదు. ఎలుగుబంటి స్వయంగా వచ్చి ఇచ్చే తావీదును భయం భయంగా కొనాల్సి వచ్చేది. కోతిని తెచ్చేవాడికి అంతగా మతింపు లేదు. సోడాబండి వచ్చిందనే సంగతి సోడానే కయ్యిన కూసి దండోరా వేసేది. ఆకురాయి మీద సానపడుతున్న కత్తి చక్కున మెరిసేది. మల్లెల కన్నా ముందే వాటి పరిమళం వీధిలో ఆగి ఆగి ఒంటిని తాకేది. పీచుమిఠాయి గంట ఒన్ టూ త్రీగా మోగేది. చేతికి తీపి గడియారం చుట్టే మనిషి మొత్త చూసుకుని కూలబడ్డాడంటే మరి కదిలేవాడు కాదు. నల్ల ఈతకాయలు రుచా, పెద్ద ఈతకాయలు రుచా అంటే డబ్బును బట్టి ఉంటుంది. ప్రతి విజయదశమికి కళుగోళ్లమ్మ తల్లి పల్లకీ ఎక్కివచ్చేది. తొలి ఏకాదశికి విష్ణుమూర్తి రథమెక్కి వైభోగం తెచ్చేవాడు. శివరాత్రికి ఆదిదేవుడు తేరువుపై ఊరేగుతూ అభయమిచ్చేవాడు. మకరజ్యోతికి వెళ్లే స్వాములను సాగనంపుతూ ఆడపిల్లలంతా ప్రమిదలతో వెలుగు నింపే వారు. తప్పెట్ల మోతలో పీర్లు కవాతు చేసేవి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం సైకిల్‌కి బిగించిన తెల్లని మినీ హారన్‌తో ఏసు పాటలు పాడుతూ క్రైస్తవ బృందాలు వచ్చేవి. అమ్మ తరపు వాళ్లు వచ్చేవారు. అయ్య తరపు వాళ్లు వచ్చేవారు. అలిగిపోయిన వారు వచ్చేవారు. వచ్చి అలిగిపోయేవారు. తలుపు మూసిపెట్టడం చాలా అమర్యాదగా ఉండేది. ఇవాళలాగా మనుషులు వచ్చి పోయే ఇల్లంటే గౌరవం ఇనుమడించేది. ఇప్పుడు కొన్నే ఉన్నాయి. చాలా పోయాయి. కొన్నే గుర్తున్నాయి. చాలా కనుమరుగైపోయాయి. కాని- ఇన్నాళ్లు గడిచినా ఇన్నేళ్లు గడిచినా ఒక మిట్టమధ్యాహ్నం పూట తాగుడుకు బానిసైన భర్త అన్నీ తెగనమ్మగా ఆకలికి తాళలేక ఇంట్లో ఉన్న అడుగుబొడుగు వంటపాత్రలు తీసుకుని వాటిని అమ్మడానికి ఇంటి ముందుకు వచ్చిన పంతులుగారి భార్య ముఖం మరుపుకు రాలేదు. ఆ పాత్రలు తీసుకో నిరాకరించి అమ్మ తన దగ్గర ఉన్న డబ్బు ఇచ్చింది. అప్పుడు పంతులుగారి భార్య ఏడవడం గుర్తు. అమ్మ కూడా పెద్దగా ఏడవడం గుర్తే. - ఖదీర్ -
మీకూ కావాలి మరి రీగల్ ఆ రోజులు...
‘టింకూ లాంటి బాబు మీకూ ఉంటే కావాలి మరి రీగల్’... బట్టలు మురికి చేసుకుని, ముద్దుగా కనిపిస్తున్న ఆ అల్లరి పిల్లవాడి యాడ్ ఆంధ్రప్రభ వీక్లీలోనో చందమామ మంత్లీలోనో. రిన్ కొన్నది లేదు. రీగల్ కొనే ముచ్చట తీరనే లేదు. పెంకుటిళ్లవాళ్లకి, వసారా ఇళ్ల వాళ్లకి, నాలుగు సిమెంటు రేకులను బోల్టులతో బిగించి ‘మాది కొత్తగా కట్టిన రేకుల ఇల్లు గదా’ అని బడాయి పోయేవాళ్లకి, గాడ్రేజీ బీరువా కొనుక్కోగలిగేవారికి, ఇంటికి ఎవరైనా వస్తే నులక, నవారు గాకుండా ఫ్యాషనుగా వైరు మంచాలను వాల్చేవాళ్లకి బట్టలు ఉతకాలంటే డెట్ సోపే దిక్కు. డిఇటి డెట్. అరవై పైసలకు ఒకటి. ఇక తక్కిన సవాలక్షమందికి శెట్టిగారి కొట్టుకు వెళితే దారాన్ని లాఘవంగా తిప్పి పావలాకు కోసి ఇచ్చే మైసూరుపాకులాంటి ముక్క- 501 ఉండనే ఉంది. బట్టల సోప్ రేపర్ని పుస్తకాల మధ్య ఉంచుకుంటే మజా లేదు. ఆ మాటకొస్తే లైఫ్‌బాయ్ కవర్లు కూడా ఎన్ని దాచుకున్నా గౌరవం ఏముంది? హమామ్ ఒక మాదిరిగా సరే. రెగ్జోనా, లక్స్... ఎవరైనా చేసే పనే. కాని సింథాల్ రేపర్ అలా నాన్ డీటైల్‌లో మందంగా దాక్కుని ఉందంటే మరిక ఆ కుర్రవాడు కలిగిన బిడ్డ కిందే లెక్క. ఇస్త్రీ యూనిఫామ్, బాటా షూస్, పై జేబులో హీరో పెన్, టెక్స్ట్బుక్కుల్లో సింథాల్ రేపర్ ఇవన్నీ కలిమికి గుర్తులు. కాని- ప్రతి వీధికీ ఒక మహరాణి ఉండేది. ఆవిడ పియర్స్ తోనే మొహం కడిగేది. అది చూసి మరీ అంత మిడిమేలమా అని సున్నిపిండితో సరిపుచ్చుకునే అమ్మలక్కలందరూ ఆమెను అయినకాడికి ఆడిపోసుకునేవారు. పియర్స్‌ను చాలామంది చాలాసార్లు దూరం నుంచి చూసి ఊరుకునేవారు. ఎప్పుడైనా ముఖం కడుక్కునే చాన్స్ దొరికిందా? పదే పదే చేతులని ముక్కు దగ్గర పెట్టుకుని మురిసిపోవడమే. బ్రాండ్స్ తెలియడం మొదలయ్యింది. కంపెనీ వస్తువుతో ఇంటికి కొత్త మర్యాద వస్తుందనే ప్రచారం ప్రబలింది. ర్యాలీ సైకిల్, హెచ్ఎంటి వాచీ, డయొనారా టీవీ, సోనీ కెమెరా, బజాజ్ స్కూటర్, విమల్ షర్ట్ క్లాత్, కొరియా ప్యాంట్ బిట్, హిందూ పేపర్, గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్, క్యుటికూర పౌడర్... పాతకాలంలోలా పలాస్త్రి వేసుకున్నవాడు పల్లెటూరి బైతు. లేటెస్ట్గా జాన్సన్స్ వారి రోజా పూరంగు బ్యాండ్ ఎయిడ్? ఫ్యాషన్. జలుబు చేస్తే ముక్కు చీదడం ఏం మర్యాద? విక్స్ ఇన్హేలర్ పట్టుకు తిరిగేవాడే హీరో. ప్రాధాన్యాలు మారాయి. శీకాయపొడి, కుంకుళ్లకు ఇన్సల్ట్స్ మొదలయ్యాయి. పేనుజాతికి పెను ప్రమాదం ముంచుకొచ్చింది. కొత్తగా వచ్చిన చిక్ షాంపూ నెత్తికెక్కి వెంట్రుక వెంట్రుకలో రసాయనాలు కూరింది. నిమ్మరసాన్ని రస్నా చప్పరించింది. నిర్మా పౌడర్ కొత్తబంధువుగా స్థిరపడింది. గానుగలో కొబ్బరినూనె కొన్నా కాసింత రీటా కలిపితే తప్ప శ్రీమతికి సంతృప్తి కలగదు. డాల్డాకు కుర్చవేయడం మొదలుపెట్టారు. సేమ్యాల స్థానాన్ని బాంబినో వెర్మిసెల్లి తీసుకుంది. బ్రిటానియా బిస్కెట్లు కొని సాయంత్రం పూట కాఫీతో పాటు తీసుకుంటున్నారంటే ఆ ఏరియాలో ఆ ఇంటికి ప్రత్యేక హోదా. వస్తువులకు స్థలం కావాలి. బ్రాండెడ్ వస్తువులకు మర్యాదగలిగిన ఇల్లు కావాలి. అందుకు తగ్గట్టుగా మనిషి ఎదగాలి. కాసింత పెరడు దొరికితే బంతో, చేమంతో, నీడనిచ్చే వేపో, అమ్మ జ్ఞాపకంగా ఊరి నుంచి తెచ్చిన అంటుమామిడో పెంచుదామని ఆలోచించేరోజుల నుంచి ఇంటి మీద ఇల్లు, ఇంటి ముందు ఇల్లు, ఇంటితోపాటు ఇల్లు, లంకంత ఇల్లు కట్టడం మొదలయ్యింది. మెల్లమెల్లగా ఊరు ఒక పెద్ద సిమెంట్ రూఫ్‌గా మారింది.వస్తువులు లోపలికెళ్లాయి. ఎండలు బయట ఉండిపోయాయి. పాపం, ఏ బ్రాండూ లేని మనుషులు కొందరు వస్తువుల ప్రీతి కోరుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. - ఖదీర్ -
ఆ 60 నిమిషాలు...
నైన్టీ మినిట్ క్యాసెట్ ఎప్పుడూ కొనొద్దని చెబుతారు. టేప్‌రికార్డర్ లోడ్ లాగలేదట. సిక్స్టీ ఓకే. అటు తర్టీ మినిట్స్. ఇటు తర్టీ మినిట్స్. అటు ఎనిమిది.. ఇటు ఎనిమిది.. మొత్తం పదహారు పాటలు. ఇష్టమైన పాటలు. మన కోసం మనం సెలెక్ట్ చేసుకొని మేడ మీద సన్నజాజుల పొద దగ్గర చాప పరుచుకుని నెత్తిన చంద్రుణ్ణి చూస్తూ ఆ దాపు నుంచి వచ్చే సముద్రపు గాలికి ‘ఏ రాతే.. ఏ మౌసమ్.. నదీకా కినారా’... వినిపిస్తూ...షావుల్ భాయ్ ఒక పట్టాన ఇవ్వడు. సిక్స్టి మినిట్స్ క్యాసెట్‌కు పది రూపాయలు తీసుకుంటాడు. మనం వెళ్లి క్యాసెట్ సెలెక్ట్ చేసుకోగానే సొరుగులో నుంచి పసుప్పచ్చ, నీలం, పింక్ కలర్ చార్ట్ బుక్కులను ముందు పడేస్తాడు. స్కెచ్ పెన్లతో చేత్తో రాసిన పాటల క్యాటలాగులు. సంకీర్తన, అభినందన, గీతాంజలి... ఎప్పుడు షాపుకెళ్లినా స్టూల్ మీద నిలబెట్టిన రెండడుగుల స్పీకర్ బాక్సుల్లో అదే పనిగా రికార్డయ్యే పాట ఒకటి వినిపించేది. హృదయమనే కోవెలలో... నిను కొలిచానే దేవతగా.... ఇంకో పాట కూడా. ఒక లైలా కోసం... తిరిగాను లోకం... కోళ్లదిన్నె, తుమ్మలపెంట వైపు నుంచి వచ్చే బెస్తవాళ్లకు ఇవన్నీ పట్టవు. పుట్టింటోళ్లు తరిమేశారు... దీనిని ఎక్కించాక యమగోల, అత్తమడుగు వాగులోనా... లారీ డ్రైవర్లు, ట్రాక్టర్ కూలీలూ, హెయిర్ కటింగ్ సెలూన్ ఓనర్లూ... షావూల్ భాయ్ ఎంతమందికని జవాబు చెప్తాడు? అందరికీ పాటల క్యాసెట్లు కావాలి. వాళ్లు ఎంచుకున్న పాటలతో నిండిన క్యాసెట్లు. మొగుడు మారడు. పెళ్లాం టేస్ట్ పట్టించుకోడు. ఆమెకు కూడా తనకంటూ ఇష్టమైన పాటల క్యాసెట్ ఒకటి చేయించుకోవాలని ఉంటుంది కదా. మసాలాలో, మిరప్పొడిలో రూపాయి రూపాయి దాచి... షావుల్ భాయ్‌ని బతిమాలి... ఒకవైపు న్యాయం కావాలి... ఒకవైపు పుణ్యస్త్రీ.... ఈ రోజే ఆదివారము... అందాకా పడుచువారము... చాలాస్నేహాలు సర్వనాశనం అయిపోయాయి. వాడా... ఇళయరాజా క్యాసెట్ అడిగితే ఇవ్వనన్నాడు... అరిగిపోతాడా... కరిగిపోతాడా.... అవును. అరిగిపోతాడు. తెగిన క్యాసెట్లను అతికించి ఇమ్మని ఇచ్చినవి ఒక వైపు గుట్టగా పడి ఉంటాయి షావుల్ భాయ్ షాపులో. మనం అతికించలేము. పెన్ను పెట్టి రివైండ్ చేసి ప్లాస్టిక్ టేపుతో సరిగ్గా ఈ అంచునూ ఆ అంచునూ జతచేయలేము.కాకపోతే కొంచెం జంపవుతుంది. పల్లవిలో ఒక తుంటపోతుంది. లేకుంటే చరణంలో. గాలివానలో... వాన... కర్రరర్... తెలియదు పాపం... ఉంగరాలు, బంగారు బొంగరాలు... ఇవి ఉన్నవాడు కాదు ఐశ్వర్యవంతుడు. స్పైన్ మీద మన పేరు ఉన్న క్యాసెట్లు డజన్... అలా అల్మారాలో కనిపిస్తూ... కింద ఎల్లో శాటిన్ క్లాత్ కప్పిన టూ ఇన్ ఒన్ మిడిసిపడుతూ... వాడూ వీధిలో గౌరవనీయుడు. ఎప్పుడైనా సరదా పుడితే రెడ్ కలర్ రికార్డ్ బటన్, బ్లాక్ కలర్ ప్లే బటన్ ఒక్కసారే నొక్కి పిల్లల మాటలు రికార్డ్ చేసి వాళ్ల మాటలు వాళ్లకే వినిపిస్తూ మెరుస్తున్న కళ్లతో వాళ్లు చూస్తుంటే గర్వపడుతూ... అదీ వైభోగం. రేడియో పాత చుట్టం. టేప్ రికార్డర్ కొత్త అతిథి. సోనీ నైన్టీ కొనే డబ్బులు ఎప్పుడూ ఉండవు. సిక్స్టీ కూడా. ఖరీదు ఎక్కువ. టి-సిరీస్ చీపేగాని తొందరగా నలిగిపోతాయని కటింగ్ చేసే మాల్యాద్రన్న చెప్పేవాడు. ఇక మధ్యస్తంగా మిగిలింది టిడికె క్యాసెట్లే. నల్లగా, బరువుగా టి..డి...కె.. అనే అక్షరాలతో ఆకర్షిస్తూ... అలాంటి ఒక క్యాసెట్ కొని... ఇష్టమైన రఫీ పాటలు చేయించుకొని... కాని ఎలా? సంవత్సరమంతా వడగాడ్పులు వీచినా రంజాను నెలలో అత్తరు వానలు కురుస్తాయి. పిల్లల చేతుల్లో కుర్రాళ్ల జేబుల్లో నాలుగు డబ్బులు కదలాడతాయి. షావుల్ భాయ్... ఇక నీ షాప్‌కు వచ్చి ఉత్త చేతులతో తిరిగెళ్లే సమస్యే లేదు. గోడలకు వేళ్లాడగట్టిన శంకరాభరణం, ఆనందభైరవి ఎల్.పి కవర్లను చూస్తూ ఒక టిడికె క్యాసెట్ కొని... రఫీ పాటలు కావాలంటే... ఏ సినిమాల్లోని పాటలు అన్నాడు షావుల్ భాయ్. పేర్లేం తెలుసు. ఆ సినిమాలు చూస్తే కదా. రేడియోలో వినడమే. సరే... నీకు నచ్చిన నాలుగు పాటలు చెప్పు... నీ టేస్ట్ కనిపెట్టి మిలిగిన పాటలు చేసిస్తాను అన్నాడు షావుల్ భాయ్. కౌన్ హై జో సప్నోమే ఆయా... చాహుంగ మై తుజే సాంజ్ సవేరే... లిఖ్ఖేజో ఖత్ తుఝే ఓ తేరి యాద్ మే.... ఆజారే ఆ జరా... చాలు. అర్థమైంది. వారం తర్వాత రా. క్యాసెట్ అందుకుని దానికి ఒక కాగితం చుట్టి రబ్బర్ బ్యాండ్ వేసి పైన పేరు రాశాడు. వారం వరకూ నిద్రే లేదు. ప్రేమలో పడ్డవాడు కూడా అంత విరహం అనుభవించడు. వారం తర్వాత పాటలను అలంకరించుకున్న ఆ నిరుపమాన సౌందర్యవతి చేతుల్లో పడింది. షావుల్ భాయ్ టేస్ట్ కనిపెడతానన్నాడు. ఎలా కనిపెడతాడు. ప్లే బటన్ నొక్కితే మొదటి పాట- ఏక్ థ గుల్ ఔర్ ఏక్ థి బుల్బుల్... రెండో పాట- తేరే మేరే సప్నే అబ్ ఏక్ రంగ్ హై.... వాటిని వింటూ అనేక రాత్రులు నిద్రపోలేదు. ఆ రోజులు పోయాయి. క్యాసెట్లూ పోయాయి. అమాయక ముఖాలతో మూగే జన సందోహం మాయమయ్యింది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన రికార్డులను ఎవరికో ఇచ్చేసి షావుల్భాయ్ నెల్లూరు వెళ్లిపోయాడు.జ్ఞాపకాలు మాత్రం కావలిలో ఉండిపోయాయి.ఈ ఎండల్లో ఎప్పుడైనా నిద్రపట్టకపోతే ఆ తలపులే కాసిని నిద్రమాత్రలు. - ఖదీర్