చలి రోజులలో... | in cold days... | Sakshi
Sakshi News home page

చలి రోజులలో...

Published Sun, Dec 6 2015 4:12 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

చలి రోజులలో...

సీజన్
ముందు ఒక చిన్న కథ.
ఒక ఊళ్లో ఒక ముసలామె. దేనికీ భయపడదు. ఎవరినీ లెక్క చేయదు. ఒక రాత్రి ఆ ముసలామె ఇంటి మీదకి దొంగలు వచ్చారు. కర్ర తీసుకొని తరిమి కొడితే మళ్లీ ఆరేళ్ల వరకూ ఆ ఇంటివైపు ఏం ఖర్మ ఆ ఊరి వైపే ఏ దొంగా కన్నెత్తి చూడలేదు. మరోసారి అడవిలో నుంచి పులి ఊరి మీద పడి మేకల్ని తినడానికి వచ్చి నేరుగా ఈ ముసలామె ఇంటి ముందు బైఠాయించింది. బయట పులి. లోపల ముసలామె.

భయపడిందా? ఊహూ. ఏమే... దొంగముకందానా... ఇంత అడవీ వదిలిపెట్టి నా ఇల్లే కావాల్సి వచ్చిందా అని పొయ్యిలో నుంచి కాలే నిప్పుల్ని చేటలో తీసుకొని విసిరితే పులి అదే పరుగు. రోజులు గడిచాయి. ఉన్నట్టుండి ముసలామె బయట కనపడటం తగ్గిపోయింది. ఇంట్లోనే ఉంటోంది. ఎప్పుడూ తలుపులూ కిటికీలు వేసుకొని ఉంటుంది. ముసుగుతన్ని ఉంటోంది.

ఇది గమనించిన దారిన పోయే మనవరాలు ఏం అవ్వా... ఎందుకలా ఉన్నావు అనడిగితే ముసలామె ఓపిక తెచ్చుకుని లేస్తూ ఏం చెప్పనమ్మా నిజం పులికి భయపడలేదు... కాని ఈ పులికి భయపడుతున్నానే అంది.
 
ఏ పులి అవ్వా అంది మనవరాలు.
ఇంకేపులి చలి పులి... అని బయట ఉన్న చలికి మళ్లీ ముసుగు తన్నింది ముసలామె.
 ఆ ముసలామెనేంటి మహామహా మొనగాళ్లను కూడా మూలకూచోబెట్టే మహా బలాఢ్యురాలు చలి. తెల్లవారకముందే పల్లె లేచింది... తనవారినందరినీ తట్టి లేపింది... అని ఏ సీజన్‌లో అయినా పాడుకోవచ్చేమోగాని చలికాలంలో మాత్రం కాదు.

తట్టి లేపితే ఎవరూ లేవరు. తన్నిలేపినా ఎవరూ లేవరు. మంచాలనే నెచ్చెలులుగా భావించి కరుచుకుని పడుకుని ఉంటారు. వాళ్లేనా సూర్యుడు కూడా మబ్బులను కప్పుకుని బద్దకించడూ?
 చలికాలం మనుషులు దగ్గరగా కూడే కాలం. నిండు వస్త్రాలతో మనుషులు మర్యాదగా ఉండే కాలం. జగడాలు తక్కువ. రెండు చేతులూ ప్యాంట్ జేబుల్లో ఉంటే కొట్లాటకు స్థానం ఎక్కడ? ప్యాంట్, షర్ట్, షూస్, స్వెటర్, కోట్...

డబ్బున్నవాడు బీదవాడు అన్న తేడా లేదు. అందరికీ కావాలి. కాని కొందరికే దక్కుతాయి. గమనించారా? ఎండకు ఆరుబయలు చాలు. వానకు కారని ఒక చూరు చాలు. కాని చలికి గది కావాలి. దుప్పటి కావాలి. రగ్గు కావాలి. మేజోళ్లు కావాలి. వెచ్చటి ఒక పడక కావాలి. రోడ్ల మీద తిరిగే దీనులకు అభాగ్యులకు అనామకులకు పరిగెత్తిపోవడానికి స్థలం ఉండదు.

చలి కోతను కాచుకోవడానికి వీలు ఉండదు. పేపర్లను కప్పుకుని ఒకరు గోతం పట్టాలు కప్పుకుని ఒకరు టాప్ వేసుకుంటే రిక్షావాడు దొరక్కుండా పోతాడా... ఆ వెనుక సీట్లో వణుకుతూ నిదురిస్తున్న ఆటో డ్రైవర్ తెల్లారి పాసింజర్ల కోసం రాత్రంతా పళ్లను అరగదీసుకుంటాడు. అందరికీ ఎంతో సంతోషాన్నిచ్చే చలి... వీళ్లను మాత్రం నిర్దాక్షిణ్యంగా మేసేసి వెళ్లిపోతుంది.
 
ఈ కాలం పూలు భలే బాగుంటాయి. బంతిపూలు విరగబూస్తాయి. గుమ్మడి తీగలు పసుపుపచ్చటి పూలను ఇళ్ల పైకప్పుల మీద వెదజల్లుతాయి. పున్నాగలు, పారిజాతాలు. పొగడలు... పొగమంచుకు తడిసి తుషార బిందువుల వస్త్రాలతో ముస్తాబు చేసుకుంటాయి. ఇక పూలూ పిల్లలూ ఒకటే కదా.

ఈ కాలంలో వీళ్లసలు కళ్లే తెరవరు. ఎంత బలవంతం చేసినా స్కూళ్లకు త్వరగా తెమలరు. పడుకోనీయమ్మా... ఆ బుజ్జితండ్రులు అడిగే వరాన్ని ఇచ్చే తపశ్శక్తి ఎందరు తల్లిదండ్రులకు ఉంది కనక. ఎండాకాలమే ఎందుకు సెలవులిస్తారో... అసలు చలికాలం కదా ఇవ్వాలి.
 ఆడవాళ్లకు కొంచెం విసుగు. బట్టలు దిబ్బలు దిబ్బలుగా పోగుపడతాయి. ఉతికేద్దామంటే ఆరక సతాయిస్తాయి. అన్నం చప్పున చల్లారి పోతుంది. కూరలు మొహాలు వేలాడేస్తాయి. వేణ్ణీళ్ల స్నానానికి గ్యాస్ అయిపోతుందేమోనే భయం.

గీజర్ వేద్దామంటే కరెంటు బిల్లును చూసి భీతి. కాని కొత్త పెళ్లికూతురు మాత్రం మగని ఛాతీ మీద నెగడు కాచుకుంటుంది. నేపాలీలు చలికాలం అతిథులు. కొండకు వెళ్లే స్వాములు ఈ కాలపు యోగులు. స్థితిమంతులు శబరిమలకు వెళ్లి జ్యోతిని చూస్తారు. లేనివాళ్లు చలిమంటలోని అగ్నికి నమస్కారం పెట్టుకుంటారు. వృద్ధులు జ్ఞాపకాల ట్రంకుపెట్టెలను తెరిచే కాలం ఇది.

హాని చేస్తాయని తెలిసినా చుట్టలను చుట్టాలుగా చేసుకునే కాలం. తేగల్ని కాల్చి తినాలి. పాత పేపర్లనీ పుస్తకాలనీ కాలనివ్వాలి. ఇంట్లో అడ్డంకులన్నీ స్వాహా. బజారున నడుస్తుంటే బజ్జీలు బోర విరుచుకుని కనిపిస్తాయి. ఇక ఈ మూడు నెలలూ టీ- జాతీయ పానీయం. యాలకులు కొట్టి. అల్లం దంచి, నిమ్మకాయ పిండి.... చల్లటి చేతిలో పొగలు కక్కే టీ.... తేయాకు చెట్టుకి కిరీటం పెట్టాల్సిన సమయం ఇది.
 
తొందరగా రాత్రి అయిపోతుంది. ఊరు తొందరగా సద్దుమణిగిపోతుంది. ఫస్ట్ షో ఫస్ట్ హాఫ్‌కే ఏ అర్ధరాత్రో అయిపోయిన ఫీలింగ్. సెకండ్ షోకి వెళ్లి వస్తుంటే పళ్లు మొలిచిన చలి కొరికి కొరికి వేధిస్తుంది. అభయ హస్తం అంటే ఏమిటో అరిచేతులను చూస్తేనే తెలుస్తుంది. పాపం కాస్త గట్టిగా రుద్దుకోగానే చెకుముకిలా పని చేసి వేడిని బుగ్గలకు చేరవేస్తాయి.

అసలు బలహీనులు చెవులు. తాళాలు లేని ఈ గేట్లలో నుంచి శత్రుదేశపు సైన్యాధిపతిలా చలి దూరిపోతుంది. దూది అడ్డం పెట్టి అడ్డుకట్ట వేయాలి. తలపాగా చుట్టి కందకం తవ్వాలి. ఇళ్ల ముందు ఆడపిల్లలు ముగ్గులు వేసి మొగ్గలకు రంగులు అద్దుతారు. కాసిన్ని రోజుల్లో గుమ్మాలకు క్రిస్మస్ స్టార్లు వేళ్లాడగడతారు.

మంకీ క్యాపులతో మార్నింగ్‌వాక్ చేస్తున్నవారు అజా వింటూ నమాజుకు వెళుతున్న ముస్లిం భాయ్‌లకు హలో చెబుతారు. కొందరు దయార్ద్ర హృదయులు సేవా కార్యక్రమాలు మొదలుపెడతారు. సముద్రమంత చలిని కాచుకోవడానికి బకెట్టంత ప్రయత్నం చేస్తారు. కొందరికి కొన్ని రగ్గులు అందుతాయి. అవి కప్పుకుని పడుకున్న రాత్రి అంత కన్నా దౌర్భాగ్యులు వాటిని దోచుకుని వెళతారు.
 
సాటి మనిషి వైపు చూడమని చెప్పడానికి చలికాలం వస్తుంది.
 సాటి వానికి సాయం చేయమని చెప్పడానికి చలికాలం వస్తుంది.
 అది అందరినీ సమానంగా చూస్తుంది. మరి మనం ఎందుకు సమానంగా ఉండకూడదు?
 - ఖదీర్
 
రోడ్ల మీద తిరిగే దీనులకు అభాగ్యులకు అనామకులకు పరిగెత్తిపోవడానికి స్థలం ఉండదు. చలి కోతను కాచుకోవడానికి వీలు ఉండదు. పేపర్లను కప్పుకుని ఒకరు... గోతం పట్టాలు కప్పుకుని ఒకరు... టాప్ వేసుకుంటే మాత్రం రిక్షావాడు దొరక్కుండా పోతాడా... ఆ వెనుక సీట్లో వణుకుతూ నిదురిస్తున్న ఆటో డ్రైవర్ తెల్లారి పాసింజర్ల కోసం రాత్రంతా పళ్లను అరగదీసుకోక తప్పదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement