
అదొక జంతు ప్రదర్శనశాల. అక్కడ ఒకే బోనులో ఓ పులి, మేక కలిసి ఉంటున్నాయి. ఈ విచిత్రాన్ని చూడడానికి రోజూ ప్రజలు అక్కడికి వచ్చేవారు. పులి నిద్రపోతున్నప్పుడు దాని పొట్టకు ఆనుకుని ఓ మేక విశ్రాంతి తీసుకుంటూ ఉన్న దృశ్యం చూసిన వారికి ఆశ్చర్యంగా ఉండేది.
ఓ మహిళ ఇది చూసి ఆశ్చర్యంతో ఆ ప్రదర్శనశాల నిర్వాహకులలోని ఓ ప్రతినిధితో ‘‘ఇదెలా సాధ్యమైంది?’’ అని ఎంతో ఆసక్తితో అడిగింది.
ఆరోజే ఆ ప్రతినిధి విధుల నుంచి రిటైర్ అవుతున్న రోజు. ఆయన ఆ మహిళతో నెమ్మదిగా చెప్పాడిలా...
‘‘ఇందులో రహస్యమేమీ లేదు. రోజూ ఓ మేకను మారుస్తుంటాం. ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పకండి’’ అన్నాడతను.
పులి ఇతర జంతువులను చంపి తినే క్రూరమృగమే. కాదనను. కానీ అది ఆకలి వేసినప్పుడు మాత్రమే తనకు అవసరమైన మేరకు మరొక జంతువును చంపుతుంది. ఆకలి తీరిపోతే అది మహాసాధువవుతుంది. ఇంకేదీ పట్టించుకోదు. ఎవరి మీదా దాడికి పూనుకోదు. కానీ మనిషే కారణం లేకున్నా సరే ఇతరులను నాశనం చేసే గుణం కలిగి ఉంటాడు. ఓ అణుబాంబుతో వేలాది మందిని హతమార్చగలడు. హిట్లర్ వంటి మనుషులే లక్షల మంది మరణానికి కారకులయ్యారు. అలాటి వారు ఎంతటి దుర్మార్గానికైనా వెనుకాడరు. – యామిజాల జగదీశ్