పరిశోధనలకు కేరాఫ్.. టీఐఎఫ్‌ఆర్ | Research Care of .. TIFR | Sakshi
Sakshi News home page

పరిశోధనలకు కేరాఫ్.. టీఐఎఫ్‌ఆర్

Published Mon, Feb 2 2015 12:08 AM | Last Updated on Tue, Oct 16 2018 8:03 PM

పరిశోధనలకు కేరాఫ్.. టీఐఎఫ్‌ఆర్ - Sakshi

పరిశోధనలకు కేరాఫ్.. టీఐఎఫ్‌ఆర్

మై క్యాంపస్ లైఫ్
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్‌‌చ (టీఐఎఫ్‌ఆర్)- ముంబై..   దేశంలోని ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థల్లో ఒకటి. ఫిజిక్స్, కెమిస్ట్రీ,  బయాలజీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, సైన్స్ ఎడ్యుకేషన్‌లో    పరిశోధనలు నిర్వహిస్తూ, మాస్టర్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌లో డిగ్రీలను అందిస్తోంది. ఇక్కడ తాజాగా కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన కోటమర్తి హేమచంద్ర తన క్యాంపస్ అనుభవాలను వివరిస్తున్నారిలా..
 
అత్యున్నత వసతులు: క్యాంపస్‌లో అత్యున్నత సదుపాయాలు ఉన్నాయి. ప్రయోగశాలలు ప్రపంచస్థాయి లేబొరేటరీలకు దీటుగా ఉంటాయి. పీహెచ్‌డీలో సబ్జెక్టును బట్టి సుమారు ఏడాదిన్నర కోర్సు వర్క్ ఉంటుంది. వీలును బట్టి విద్యార్థులు నిరంతరం ప్రాక్టికల్ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారు. లైబ్రరీలో ప్రముఖ జర్నల్స్, పుస్తకాలు లభిస్తాయి. విశాలమైన హాస్టల్ గదులతోపాటు నిరంతర ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. అన్ని రకాల భారతీయ వంటకాలతోపాటు వెస్టర్న్ ఫుడ్ కూడా లభిస్తుంది.
 
ప్రవేశం: మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో చేరడానికి గ్రాడ్యుయేట్ స్కూల్ ఎగ్జామ్ రాయాలి. సంబంధిత సబ్జెక్టుతో ఎంఎస్సీ/బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంఏ/బీఏ/బీఎస్సీ తత్సమాన అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షను డిసెంబర్‌లో నిర్వహిస్తారు.
 
పరిశోధన పత్రాల సమర్పణ: పీహెచ్‌డీ చేసేవారు దేశ, విదేశాల్లో జరిగే పరిశోధన సదస్సుల్లో పత్రాలు సమర్పించడానికి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. అంతేకాకుండా ఎన్నో అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యేందుకు అవకాశం ఉంది. దేశీయ కాన్ఫరెన్స్‌ల్లో భాగంగా ఏషియన్ బయోఫిజిక్స్ అసోసియేషన్, ఇండియన్ బయోఫిజికల్ సొసైటీల్లో పరిశోధన పత్రాలు సమర్పించాను. యూఎస్‌ఏ, ఇజ్రాయెల్‌తోపాటు యూరప్ దేశాల్లో జరిగిన కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యాను. శాన్‌ఫ్రాన్సిస్కోలో 2014లో జరిగిన బయోఫిజికల్ సొసైటీ మీటింగ్‌లో స్టూడెంట్ రీసెర్చ్ అచీవ్‌మెంట్ అవార్డును గెలుచుకున్నాను. పీహెచ్‌డీ పూర్తయిన తర్వాత పరిశోధనను కొనసాగించడానికి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో అవకాశం లభించింది.
 
ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్: క్యాంపస్‌లో క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ తదితర క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫౌండర్స్ డే, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 
ఓపెన్ డే: సైన్స్ మౌలికాంశాలను, ఆవశ్యకతను ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రతి రెండు వారాలకు ఒకసారి ‘చాయ్ అండ్ వై’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సైన్స్‌ను వివరిస్తారు. అంతేకాకుండా ప్రతి నవంబర్‌లో ‘ఓపెన్ డే’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనిలో విజ్ఞాన శాస్త్రానికి వినోదాన్ని జోడించి విద్యార్థుల్లో పరిశోధన నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తారు. ముంబైలోని పాఠశాల విద్యార్థులను ఈ కార్యక్ర మానికి ఆహ్వానిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement