రిక్షావాలాల దేవుడు! | Rikshawala God! | Sakshi
Sakshi News home page

రిక్షావాలాల దేవుడు!

Published Sun, Apr 20 2014 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM

రిక్షావాలాల దేవుడు!

రిక్షావాలాల దేవుడు!

ఒక పెద్ద విజయం సాధించడానికి... ఒక చిన్న ప్రయత్నం చాలు. ఓ గొప్ప నిర్ణయం తీసుకోవడానికి... ఒక చిన్న అనుభవం  చాలు. అలాంటి ఓ  అనుభవమే ఎదురయ్యింది డాక్టర్ ప్రదీప్ శర్మకు.  
 అది  ఆయనపై చాలా ప్రభావం చూపింది.  
 ఓ కొత్త అడుగు వేయడానికి పురికొల్పింది.
 ఓ గొప్ప కార్యసాధన వైపు ఆయనను నడిపించింది.
 కొందరి జీవితాలనే మార్చేసేందుకు దోహదపడింది.

 
రిక్షా... మన దేశంలో ఏ మూలకు వెళ్లినా కనిపించే వాహనం. కొన్ని వేల మంది రిక్షా తొక్కుతూ జీవితాలను సాగిస్తున్నారు. కొన్ని లక్షలమంది వాటిలో ప్రయాణిస్తూ గమ్యస్థానాలను చేరుతున్నారు. కానీ ఎప్పుడూ ఏ ప్రయాణికుడికీ రాని సందేహం... డాక్టర్ ప్రదీప్ కుమార్ శర్మకి వచ్చింది. ఆ సందేహం ప్రశ్నగా నోటి వెంట వెలువడింది. ఆ ఒక్క ప్రశ్న... భారతదేశంలోని రిక్షావాలాల జీవితాలను మార్చేసింది.
 
అనుభవం ఆశయమై..

 అది 2002వ సంవత్సరం. డాక్టర్ ప్రదీప్‌శర్మ ఒక చోటికి వెళ్లడానికి రిక్షా ఎక్కారు. వెళ్తూ ఉండగా హఠాత్తుగా ఆయన రిక్షావాలాని ఓ ప్రశ్న అడిగారు... ‘నువ్వు రోజుకెంత సంపాదిస్తావ్’ అని.
 ‘‘ఎనభై నుంచి వంద వరకూ వస్తాయి సార్. అందులో ఓ పాతిక రూపాయలు రిక్షా అద్దెకే పోతాయి’’ అన్నాడతను.
 ‘‘అలా రోజూ అద్దె కట్టే బదులు నువ్వే ఓ రిక్షా కొనుక్కోవచ్చుగా’’ అన్నారు శర్మ.
 ‘‘భలేవారు సార్. రిక్షా ఖరీదు 6,500 రూపాయలు. అంత పెట్టి కొనే స్థోమతే ఉంటే ఈ కష్టాలెందుకు చెప్పండి’’...
 
అతడి సమాధానం సూటిగా శర్మ మనసు పొరలను తాకింది. ఇంటికి వెళ్లినా కూడా ఆ మాటలు ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. కేవలం రూ.6,500 లేకపోవడం వల్ల ఆ వ్యక్తి జీవితాంతం ఇలా పేదవాడిగానే ఉండి పోవాలా? సంపాదించినదానిలో పావుశాతం రోజూ రిక్షా అద్దెకే పోతుంటే ఏం తిని బతుకుతాడు? కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడు? ఏ రోగమో రొష్టో వస్తే ఏం చేస్తాడు? ఎడతెగని ఆలోచనలు శర్మకు కునుకులేకుండా చేశాయి. నిద్ర లేని ఆ రాత్రి ఆయనకో కొత్త లక్ష్యాన్ని ఏర్పరచింది. ఉదయం లేస్తూనే ఆ లక్ష్యం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు శర్మ.
 
దాదాపు మూడు వందల మంది రిక్షావాలాలను కలిశారు శర్మ. వారి సంపాదన ఎలా ఉంటోంది, ఏం తింటున్నారు, ఎలా బతుకుతున్నారు అంటూ ఆరా తీశారు. రోజంతా కష్టపడుతున్నా వాళ్లంతా దారిద్య్రరేఖకు దిగువన ఉండటానికి కారణం... వాళ్లకు సొంత రిక్షాలు లేకపోవడం వల్లనే అని అర్థమైంది శర్మకి. ప్రతి రిక్షావాలా నెలకి 650 రూపాయలు అద్దె చెల్లిస్తున్నాడు. అంటే యజమానులు పది నెలల్లో రిక్షా వెలను అద్దె రూపంలో వసూలు చేసేస్తున్నారు.
 
అలా అయితే తన జీవిత కాలంలో ప్రతి రిక్షావాలా ఎన్ని రిక్షాల వెలను అద్దె రూపంలో చెల్లిస్తాడు? అలా లెక్కేసుకుంటే అతడు తన సంపాదనను ఎంతగా నష్టపోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. అదేదో అప్పో సప్పో చేసి ఓ రిక్షా కొనేసుకుంటే... ఆ అప్పు కాస్తా తీరాక అంతా మిగులే కదా! ఇలా అనుకోగానే ఆయన మనసులో ఓ ఆలోచన మెదిలింది. వెంటనే ఆ ఆలోచనను అమలు చేసేందుకు నడుం బిగించారు. అస్సామ్ లోని గౌహతిలో ఓ ‘రిక్షా బ్యాంకు’ను స్థాపించారు శర్మ.
 
ప్రతి రిక్షావాలాకీ సొంత రిక్షా ఉండేలా చూడాలన్న లక్ష్యంతోనే రిక్షా బ్యాంకు పని చేస్తుంది. అస్సామ్
లో తాను నడుపుతున్న ‘సెంటర్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్’ సంస్థతో బ్యాంకును అనుసంధానం చేశారు. దానిద్వారా సేకరించే విరాళాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థల సహాయంతో బ్యాంకును నిర్వహిస్తున్నారు. ముందు ప్రతి రిక్షావాలాతో అడ్వాన్సుగా రూ. 500 కట్టించుకుని రిక్షా ఇస్తారు. అంతకు ముందు యజమానికి చెల్లించినట్టుగానే... బ్యాంకుకి కూడా రోజుకి రూ. 25 చెల్లించాలి. ఇప్పుడు రిక్షా ఖరీదు 9000 రూపాయల పైనే ఉంది. ఆ మొత్తం, ఇన్సూరెన్సు మొత్తం వంటివన్నీ కలిపి లెక్కవేసి, ఇన్ని నెలలకి అని ఇస్తారు. అప్పు తీరిపోయిన తర్వాత ఇక ఆ రిక్షా మీద సర్వహక్కులూ రిక్షావాలావే.
 
మొదట గౌహతిలో మొదలుపెట్టినప్పుడు రిక్షా వాలాలకు ఈ విధానం అర్థం కాలేదు. కానీ శర్మ అందరినీ స్వయంగా కలిసి, తాను ఏమనుకున్నారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, దీనివల్ల లాభమేమిటి వంటి విషయాలన్నీ వివరించడంతో రిక్షావాలాలంతా ఉత్సాహంగా రిక్షాలు తీసుకోవడానికి ముందుకొచ్చారు. దాంతో ఈ రిక్షా బ్యాంకును ఇప్పుడు దేశమంతటా విస్తరిస్తున్నారు శర్మ.

దేశం మొత్తంలో దాదాపు కోటి మంది రిక్షావాలాలు ఉన్నారు. వారందరికీ సొంత రిక్షాలు ఉండాలి అంటారు శర్మ. అలా ఉండేలా చూడటమే లక్ష్యంగా అడుగులు కదుపుతున్నారు. త్వరలో మిగతా రాష్ట్రాలన్నింటిలోనూ రిక్షాబ్యాంకులను స్థాపించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారాయన. అది మాత్రమే కాక... కూరగాయలు, సరుకుల రవాణాకి పనికి వచ్చే రిక్షాలను కూడా ఇవ్వడం మొదలుపెట్టారు.
 
శర్మ వినూత్నమైన ఆలోచనలకు మరో ఉదాహరణ... మెడి-రిక్షా. అనారోగ్యం ఏర్పడినా, వైద్యపరీక్షలు, ఇంజెక్షన్లు చేయించుకోవాలన్నా ఈ రిక్షావాలాలకు ఫోన్ చేస్తే చాలు, వాళ్లు వెంటనే వచ్చి తీసుకెళ్లిపోతారన్నమాట. త్వరలోనే సౌరశక్తితో నడిచే రిక్షాలను కూడా తయారు చేయాలని భావిస్తున్నారు. దాని కోసం ఆయన గౌహతిలోని ఐఐటీని కూడా సంప్రతించారు. ఆదాయాన్ని పెంచుకుని, డబ్బు నిల్వ చేసుకునే మార్గాన్ని చూపించాక... వారి శ్రమను కూడా కాస్త తగ్గిస్తే బాగుండుననేది ఆయన ఉవాచ. అందుకే సౌరశక్తితో నడిచే రిక్షాల్ని రూపొందించాలనుకుంటున్నారు.
 
ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు వచ్చాక రిక్షావాలాల జీవనభృతికి గండిపడింది. బతుకుబండి కుంటు పడింది. అలాంటి సమయంలో వారి జీవితాలను, ఆశలను మళ్లీ చిగురింపజేశారు శర్మ. అందుకే ఆయనను రిక్షావాలాలంతా ఎంతో అభిమానిస్తారు. ఆయన గురించి చెప్పమంటే... ‘మా దేవుడు’ అంటారు ముక్త కంఠంతో!
 
 - సమీర నేలపూడి
 
 పదీప్‌శర్మ పశువైద్యుడు. అనుకోకుండా ఆ రోజు రిక్షా ఎక్కారు. ఫలితంగా రిక్షావాలాల జీవితాలనే మార్చేశారు. ఆ కృషికిగాను...  మైక్రో ఇన్సూరెన్‌‌స, ఏషియన్ ఇన్నోవేషన్, కమ్యూనిటీ డెవెలప్‌మెంట్ యాక్షన్ అవార్‌‌డ ఆఫ్ అస్సామ్, ఇండియా ఎన్జీవో, సిటిజన్ బేస్ గవర్నమెంట్, గ్లోబల్ చేంజ్‌మేకర్‌‌స, మైక్రోఫైనాన్‌‌స ఎక్స్‌లెన్‌‌స తదితర ప్రతిష్ఠాత్మక అవార్డులెన్నో ప్రదీప్ శర్మను వరించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement