‘మై షాయర్ తో నహీ’... అంటూ 1970లలో ‘బాబీ’ సినిమా ద్వారా కుర్రకారును ఉర్రూతలూగించిన రిషి కపూర్ (67) బుధవారం అభిమానుల నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకున్నాడు. రంగు రంగుల ఉన్ని జెర్సీలు, స్వెటర్లు మారుస్తూ అందమైన పాటలు పాడుతూ ప్రేక్షకులను అలరించిన రిషి కపూర్ ఈ కరోనా కాలంలో చివరి చూపుకు కూడా వీలు ఇవ్వకుండా ఒక కలలాగా తరలి వెళ్లిపోయాడు. గత రెండేళ్లుగా ఆయన బ్లడ్ కేన్సర్‌తో బాధ పడుతున్నాడు. అమెరికాలో చాలా కాలం ఉండి వైద్యం చేయించుకుని 2019 సెప్టెంబర్‌లో తిరిగి వచ్చాడు. అప్పటినుంచి ముంబైలోనే అదే ఉత్సాహంతో కేన్సర్‌ని జయిస్తానన్న ధీమాతో కుటుంబాన్ని, మిత్రులను ఉత్సాహ పరుస్తూ వచ్చిన రిషి కపూర్ ఆస్పత్రిలో చేరిన ఒకరోజులోనే తుది శ్వాస విడిచాడు. ఆయన భార్య నీతూ సింగ్ ప్రసిద్ధ నటి. కుమారుడు రణబీర్ కపూర్ బాలీవుడ్ టాప్‌స్టార్. కుమార్తె రిధిమ వివాహం చేసుకుని ఢిల్లీలో స్థిరపడింది.
‘మేరా నామ్ జోకర్’లో తన తండ్రి రాజ్‌కపూర్ ద్వారా తెర పరిచయం అయిన రిషి కపూర్ ఆ తర్వాత తండ్రి ద్వారానే ‘బాబీ’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయ్యాడు. 1973–95ల మధ్య రిషి కపూర్ బిజీస్టార్‌గా నిలిచాడు. రాజ్‌కపూర్ తన ముగ్గురు కుమారునూ హీరోలుగా చేద్దామని అనుకున్నా పెద్దన్న రణధీర్ కపూర్, చిన్న తమ్ముడు రాజీవ్ కపూర్ ఆ కుటుంబ పరంపరను కొనసాగించలేకపోయారు. షమ్మీ కపూర్, శశికపూర్ తర్వాత రిషి కపూరే ఆ స్థాయి హీరోగా ఎదిగాడు. రణ్‌ధీర్ కపూర్ తన తమ్ముణ్ణి ముద్దుగా పిలుచుకున్న ‘చింటూ’ అన్న పేరు స్థిరపడి చింటూ కపూర్‌గా కూడా ఆయన కొనసాగాడు. రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘హెనా’లో రిషి కపూరే హీరో.
అమితాబ్ బచ్చన్ ‘జంజీర్’తో, రిషి కపూర్ ‘బాబీ’తో ఒకే సంవత్సరం (1973) స్టార్‌డమ్‌ను అందుకున్నారు. అమితాబ్ అంటే రిషి కపూర్‌కు మొదట్లో వ్యతిరేకత ఉన్నా ఆ తర్వాత కలిసి నటించి ‘అమర్ అక్బర్ ఆంధోని’, ‘నసీబ్’, ‘కభీ కభీ’, ‘కూలీ’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చారు. ఇటీవల ‘102 నాట్ అవుట్’లో మళ్లీ కలిసి నటించారు. రిషి కపూర్ తన కెరీర్‌లో తొలి కాలంలో కంటే మలి కాలంలో నటనకు అవకాశం ఉన్న సినిమాలు చేసి మెప్పించాడు. ‘కపూర్ అండ్ సన్స్’, ‘ముల్క్’, ‘డి–డే’ అతనికి అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టాయి. రిషి కపూర్ తన భోజన, మద్యపాన ప్రియత్వాలను ఎప్పుడూ దాచుకోలేదు. తన ఆత్మకథ ‘ఖుల్లం ఖుల్లా’లో వాటిని వివరించాడు.
రిషి కపూర్ మరణవార్త పట్ల అతని కుటుంబం ప్రకటన విడుదల చేస్తూ ‘రిషికపూర్‌ను చిరునవ్వులతో గుర్తుపెట్టుకోవాలిగానీ కన్నీళ్లతో కాదు’ అంది. రిషి కపూర్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4.30 గంటలకు ముంబైలోని చందన్‌వాడి క్రిమెటోరియమ్‌లో జరిగాయి. కరోనా లాక్‌డౌన్ కారణాన అతి కొద్దిమందే పాల్గొన్నారు. వారిలో కుమారుడు రణబీర్, భార్య నీతూ సింగ్, రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, ఆలియా భట్ ఉన్నారు. కుమార్తె రిధిమ చివరి చూపుకు హాజరు కాలేకపోవడం విషాదం. ఆమె ఢిల్లీలో ఉన్న కారణాన రోడ్డు ప్రయాణాన బయలుదేరి రాత్రికి ముంబై చేరుకుంటారని తెలుస్తోంది.
ఖవాలీ స్టార్
రిషి కపూర్ తన పాటల కోసమే కాకుండా ఖవాలీలకు కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు. హిందీ సినిమాలలోని రెండు గొప్ప ఖవాలీలు అతని మీద చిత్రీకరింప బడ్డాయి. రెంటినీ మహమ్మద్ రఫీయే పాడాడు. ‘హమ్ కిసీసే కమ్ నహీ’ సినిమాలో టైటిల్ సాంగ్‌ను ఖవాలీగా చిత్రీకరించారు. ‘ఏ అగర్ దుష్మన్’... అంటూ సాగే ఆ ఖవాలీ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ‘అమర్ అక్బర్ ఆంధోని’లోని ‘పరదాహై పరదా’ అనే ఖవాలీ ఇంకా పెద్ద హిట్ అయ్యింది. ఇందులో అమితాబ్ కూడా రిషి కపూర్‌తో గొంతు కలుపుతాడు. ఖవాలీ వజ్రాసనంలో కూచుని పాడతారు. కాని రిషి కపూర్‌కు అలా కూచోవడం చిన్నప్పటి నుంచి రాదు. అందుకని రెండు ఖవాలీలలో అతను మోకాళ్ల మీద నిలబడి పాడటం కనిపిస్తుంది. రిషి కపూర్ వల్ల శైలేంద్ర సింగ్ సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. బాబీ నుంచి మొదలెట్టి చాలా సినిమాలకు శైలేంద్ర సింగ్ రిషి కపూర్‌కు పాడాడు. ‘హమ్‌తుమ్ ఏక్ కమరేమే బంద్ హో’... ఎంత పెద్ద హిట్టో అందరికీ గుర్తుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment