యుద్ధం నుంచి నృత్యం వరకు... | rokni haerizadeh, a versatile artist | Sakshi
Sakshi News home page

యుద్ధం నుంచి నృత్యం వరకు...

Published Fri, Nov 8 2013 12:52 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

యుద్ధం నుంచి నృత్యం వరకు... - Sakshi

యుద్ధం నుంచి నృత్యం వరకు...

చాలా చిన్నవయసులోనే చిత్రకళలో నడకలు నేర్చాడు ఇరానీ ఆర్టిస్ట్ రోక్ని హెరిజాదె. యూనివర్శిటీ ఆఫ్ టెహ్రాన్‌లో ఫైన్ ఆర్ట్ చదువుకున్న రోక్ని శిల్పం, కోలాజ్, రోటోస్కోపింగ్, పెయింటింగ్‌లాంటి భిన్న ప్రక్రియలో కృషి చేస్తున్నాడు. పండగలు, చావులు, నవ్వులు, విషాదాలు, వివాహాలు, విహారాల నుంచి ఎన్నో దృశ్యాలను తన కళకు కేంద్రంగా ఎంచుకున్నాడు. ఇవి మాత్రమే కాదు వెనక్కివెళ్లి  19వ శతాబ్దానికి చెందిన ఇరాన్‌ను, ఆ కాలంలో కనిపించిన అవినీతిని వివిధ ప్రతీకల ద్వారా చిత్రించాడు.
 
పెయింటింగ్ విషయానికి వస్తే తన కుంచెను పదునైన విమర్శనాస్త్రంగా మలుచుకున్నాడు రోక్ని. ఇరాన్ సంస్కృతిలో తనకు నచ్చిన, నచ్చని విషయాలపై రకరకాల కోణాలలో స్పందించాడు. ‘రజ్మ్’ అంటే పార్సీలో ‘పోరాటం’ అని అర్థం.  అదేపేరుతో   రోక్ని వేసిన పెయింటింగ్‌కు విశేష స్పందన వచ్చింది. కొందరు ‘ఎపిక్ పొయెట్రి’ అని కూడా పిలిచారు. ఈ చిత్రం  కోసం  సంపన్నమైన ఇరాన్ సాహిత్యాన్ని చదివాడు, రూమీ కవిత్వాన్ని పదేపదే వల్లెవేసుకున్నాడు,  సమకాలీన ఇరాన్ సామాజిక సమస్యలను లోతుగా అధ్యయనం చేశాడు రోక్ని.
 
కత్తులతో నృత్యం చేయడం అనేది అరబ్‌ప్రపంచంలో సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారం. సాధారణంగా  స్త్రీలు ఈ నృత్యాన్ని వివాహవేడుకల్లో ప్రదర్శిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం ఖడ్గం అనేది భర్తకు ఇచ్చే గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నృత్యాన్ని తనదైన శైలిలో బొమ్మ కట్టించారు రోక్ని.
 
షోమల్ (బీచ్ ఎట్ ది కస్పియన్) పేరుతో గీసిన చిత్రంలో లింగవివక్ష గురించిన ప్రస్తావన ఉంది. కొంచెం హాస్యంగా చెప్పినట్లు అనిపించినా సీరియస్‌గా ఆలోచించాల్సి విషయం అనిపిస్తుంది. అంతిమసంస్కారానికి ఇరాన్‌లో ప్రతేక స్థానం ఉంది. ఈ టాపిక్ మీద ఒక సీరిస్ బొమ్మలు గీశాడు రోక్ని. ‘జస్ట్ వాట్ ఈజ్ ఇట్ దట్ మేక్స్  టుడేస్ హోమ్స్ సో డిఫరెంట్’ పేరుతో రోక్ని రూపొందించిన  వీడియోకు యూట్యూబ్‌లో మంచి స్పందన వచ్చింది.  

తన సోదరుడు రమిన్‌తో కలిసి 2009 నుంచి దుబాయ్‌లో ఉంటున్నాడు రోక్ని. పారిశ్రామిక ప్రాంతంలో ఒక చిన్న గదిలో, తన సోదరుడు, మిత్రుడైన మరో ఆర్టిస్ట్‌తో కలిసి ఎప్పుడూ బొమ్మలు వేస్తూ కనిపిస్తాడు రోక్ని.
 ‘‘రోక్ని బొమ్మలు కొనుగోలు చేస్తే  పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతని బొమ్మల్లో ఎన్నో వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయి’’ అనేవారు ఉన్నారు. ‘‘ఇరాన్ చిత్రకళను మరో అడుగు ముందుకు తీసుకువెళ్లాడు’’ అనే వాళ్లూ ఉన్నారు.
 
ఎవరు ఎలా అన్న అత్యాధునిక ఇరాన్ చిత్రకళకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు అనివార్యంగా ప్రస్తావించాల్సిన పేరుగా రోక్ని పేరు గుర్తింపు తెచ్చుకుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement