నైన్త్ వండర్ | Running five kilometers as the pregnant woman | Sakshi
Sakshi News home page

నైన్త్ వండర్

Published Mon, Apr 27 2015 10:51 PM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

నైన్త్  వండర్

నైన్త్ వండర్

తల్లి కాబోతుందని తెలిస్తే చాలు... ఇంటి నుంచి కాలు కదపొద్దంటారు. అవి తినొద్దు... ఇవి తినొద్దు... పథ్యం పాటించాల్సిందేనంటారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కామారపు లక్ష్మి (42) మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఏకంగా రన్నింగే చేసేశారు!  రన్నింగ్ చేస్తే పోయేదేమీ లేదు అనారోగ్యాలు తప్ప అని చెబుతున్నారు. నిండు గర్భిణిగా ఉంటూ కిలోమీటర్ల కొద్దీ రన్నింగ్ చేస్తున్నారు లక్ష్మి. బొప్పాయిసహా అన్ని రకాల పండ్లను ఆరగిస్తున్నారు. అంతేకాదు, చంద్ర గ్రహణం రోజు బయటకు వెళ్లొద్దని పెద్దలు చెప్పిన మాటలను  కూడా పట్టించుకోకుండా స్టేడియానికి వెళ్లి కిలోమీటర్ల కొద్దీ రన్నింగ్ చేసి వచ్చారు.  మొన్నటికి మొన్న (ఆదివారం) 9 నెలల నిండు గర్భిణిగా అయినప్పటికీ,  మరో వారం పది రోజుల్లో కాన్పు అయ్యే అవకాశాలున్నాయని తెలిసినప్పటికీ 30 నిమిషాల  20 సెకన్లలో ఏకంగా 5 కిలో మీటర్ల రన్నింగ్ చేసి ఔరా అనిపించారు.  120 కోట్ల జనాభాగల భారతదేశంలో నిండు గర్భిణిగా 5 కిలోమీటర్లు ఏకధాటిగా రన్నింగ్ చేసిన ఏకైక మహిళగా రికార్డు సృష్టించి సాహస ‘లక్ష్మి’గా అవతరించారు. అయినా ఇంత సాహసం ఎందుకు చేశారని అడిగినప్పుడు లక్ష్మి చెప్పిన విశేషాలివి.
సిలివేరి మహేందర్, సాక్షి, కరీంనగర్

 మాది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్. ఆరేళ్ల కిందట శ్రీనివాస్‌తో పెళ్లయింది. ప్రస్తుతం రెండేళ్ల కూతురు. పేరు ఆశ్రీత. నాన్న పోలీస్ ఉద్యోగం చేసేవారు. ఇప్పుడాయన లేరు. నేను పదవ తరగతిలోనే బడి మానేసా. అప్పట్లో ఈ ఆట పాటలు లేవు. నాలుగేళ్ల నుంచి భర్త శ్రీనివాస్ తో కలిసి రోజు రన్నింగ్ చేస్తున్నాను. ఏదో సాధించాలనే పట్టుదల కంటే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా తపనతోనే ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నా.

నా విజయం వెనుక ఉన్నది ఆయనే !
 
నా విజయం వెనుక మా వారు శ్రీనివాస్ పాత్ర చాలా ఉంది. పెళ్లయినప్పటి నుంచి ‘నీలో ఏదో టాలెంట్ ఉంది’ అని చెబుతుండేవారు.  ఇంట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. మా వారు రోజూ ఉదయం సాయంత్రం స్టేడియంకు వెళ్లి రన్నింగ్ చేసేవారు. ఓ సారి ఆయన కూడా వెళ్లినప్పుడు నాకూ రన్నింగ్ చేయాలని అనిపించింది. మరుసటిరోజే రన్నింగ్ చేయడం ప్రారంభించాను. ఫస్ట్ రెండు రౌండ్లు కొట్టాను. రన్నింగ్ ఎలా చేయాలి? ఏ విధంగా చేస్తే అలసట రాదు? ఎక్కువ సేపు పరుగెత్తాలంటే ఎలా చేయాలి... ఇలాంటివన్నీ మావారు నేర్పేవారు. ఆయన ఇచ్చిన కోచింగే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది.

చంఢీఘర్ స్ఫూర్తి

తొలిరోజుల్లో నేను వ్యాయామం కోసం కొంతసేపు రన్నింగ్ చేసేదాన్ని. ఒకసారి చంఢీఘర్‌లో జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీలుండటంతో మా ఆయన తీసుకెళ్లారు. అ పోటీల్లో 70 ఏళ్ల వయస్సున్న మహిళలు రన్నింగ్ చేయడం కన్పించింది. వాళ్లను చూశాకే తెలిసింది... మా వారు నాలో టాలెంట్ ఉందని ఎందుకు అంటున్నారో అని. తిరిగొచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ 2, 3, 5 కిలోమీటర్ల చొప్పున రన్నింగ్ చేయడం ప్రారంభించాను. అప్పుడు మొదలైన రన్నింగ్ నేటి వరకు కొనసాగుతూనే ఉంది.
 
అమ్మ ఏడ్చింది...


నేను తొలిసారి ప్రెగ్నెంట్ అని తెలియగానే సంతోషించిన అమ్మ రోజూ వ్యాయామం చేస్తున్నట్లుగా తెలియగానే చాలా భయపడింది. అయినా వినకుండా వ్యాయామం, వాకింగ్ చేశాను. ఆపరేషన్ లేకుండా తొలికాన్పు జరిగింది. ఇప్పుడు రెండోసారి ప్రెగ్నెంట్ సమయంలో నేను రన్నింగ్, ఎక్సర్‌సైజులు చేస్తుండటంతో అమ్మ వారించింది. వినకపోవడంతో చాలా ఏడ్చింది. నా బిడ్డను ఏమో చేస్తున్నావని మా ఆయనను దూషించింది. మొన్న (ఆదివారం) కూడా 5 కిలోమీటర్లు ఆగకుండా రన్నింగ్ చేయబోతున్నానని తెలిసి బాగా ఏడ్చేసింది. కానీ ఏ ఇబ్బంది లేకుండా పూర్తి చేయడంతో అమ్మ ఊపిరి పీల్చుకుంది.

 పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకే ఈ సాహసం!

మొదటి కాన్పుకు ముందు కూడా వ్యాయామం బాగా చేశాను. అప్పుడు ఈ 5 కిలో మీటర్ల రన్నింగ్ చేయలేదు కాని 2, 3 కిలో మీటర్ల రన్నింగ్ చేశాను. పాప ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఒకే దగ్గర ఉండి పని చేయడం కాదు. అటు ఇటు కదిలే పనులూ చేసుకుంటూ పోవాలి. అప్పుడే పుట్టబోయే వారు ఆరోగ్యంగా ఫుడతారు అని మా వారు చెప్పారు. పెద్ద పాప ఆశ్రీత ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంది. ఈ కాన్పు కూడా అలాగే ఉండాలని 5 కిలోమీటర్లు రన్నింగ్ చేయడం ప్రారంభించాను. సుమారు 4 నెలలు నిండినప్పటి నుంచి రోజు ఉదయం, సాయంత్రం స్టేడియంలో 13 రౌండ్లు తిరిగేదాన్ని. నాకెలాంటి నొప్పులు, అనారోగ్యాలూ, ఇబ్బందులూ ఏమీ లేవు. చాలా సంతోషంగా ఉన్నాను.

ఆశయాలు ఏమీ లేవు...

నేను ఏదో రికార్డు సాధించాలని ఈ సాహసం చేయలేదు. ఆశయాలు కూడా ఏమీ లేవు. రికార్డ్ ను సాధిస్తానని కూడా అనుకోలేదు కూడా. రికార్డ్ మీట్‌లో నన్ను చాలా మంది ప్రోత్సహించారు. రోజూ నువ్వు ఏ విధంగా రన్నింగ్ చేస్తావో ఇప్పుడు కూడా అదే విధంగా చేయమని చెప్పారు. అలాగే చేశాను. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కినందుకు ఆనందంగా ఉంది. గిన్నిస్ బుక్ కూడా పంపుతారట. చాలా సంతోషం. కెనడా దేశం మహిళా అమీ గర్భిణిగా ఉండి మారథాన్ ను 6 గంటల 12 నిమిషాల్లో చేసిందని విన్నాను. నాకా ఛాన్స్ లేదు కదా. (నవ్వుతూ).
 ఫోటోలు: గుంటపల్లి స్వామి
 
మనమే స్పూర్తి కావాలి

 పాశ్చాత్య దేశాల్లో గర్భిణీ స్త్రీలకు వ్యాయామము తప్పనిసరి. వ్యాయామంతో పుట్టబోయే పాపకు సరియైన ఆక్సిజన్ అందుతుంది. ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. గర్భిణుల సుఖ ప్రసవానికి వ్యాయామ అవసరమని తెలియజేయడానికి, వారిలో స్పూర్తిని నింపడానికి నేనీ సాహసం చేశాను. అందరూ సహకరించారు. రికార్డ్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని మహిళలందరికీ భారతీయులే స్పూర్తిగా నిలవాలన్నదే నా ఆకాంక్ష.
 - కామారపు లక్ష్మి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement