
పేదల కోసం... పరిశుభ్రత కోసం...
రీసైక్లింగ్
గూంజ్, చింతన్... రెండూ వేర్వేరు సంస్థలు.వాడి పడేసిన దుస్తులను, వస్తువులను పునర్వినియోగంలోకి తెచ్చి పేదవాళ్లకు అందిస్తుంది గూంజ్. పరిసరాల పరిశుభ్రత కోసం చెత్తాచెదారాన్ని ఏరిపారేస్తుంటుంది చింతన్. న్యూఢిల్లీలోని ఈ రెండు సంస్థలకు ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘డచ్ బ్యాంక్ అర్బన్ ఏజ్ అవార్డ్-2014 లభించింది. ఈ సందర్భంగా గూంజ్, చింతన్‌ల పరిచయం.
గూంజ్
ఢిల్లీ శివారు గ్రామం మదన్‌పూర్-ఖాదర్‌లోని ‘గూంజ్’ భవంతిలో ఒక వైపు గుట్టలుగా దుస్తులు, మరో వైపు ‘పిల్లలు’ ‘పెద్దలు’ ‘మగవాళ్లు’ ‘ఆడవాళ్లు’ ‘పెళ్లి బట్టలు’ ‘దుప్పట్లు’...ఇలా రకరకాల షో కేసులు కనబడతాయి. అక్కడ పనిచేసే మహిళలు దుస్తుల గుట్ట నుంచి ఒక్కొక్కటీ ఓపికగా తీస్తూ సంబంధిత షోకేసులో సర్దుతుంటారు. ఆ తరువాత వీటిని అవసరమైన పేదలకు అందిస్తుంటారు.
1999లో ఏర్పడిన ‘గూంజ్’ స్వచ్ఛందసంస్థ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ‘ఏదీ వృథా కాదు...ప్రతిదీ ప్రయోజనకరమే’ అనేది ‘గూంజ్’ నినాదం. ‘‘ప్రతి సంవత్సరం ఇంటింటికీ వెళ్లి...‘మీ ఇంట్లో నిరుపయోగంగా ఉన్న ఒక్క వస్తువు ఇచ్చినా సంతోషమే’ అని అడుగుతాం. మా ఉద్దేశం ఏమిటో తెలుసుకొని వారు ఉత్సాహంగా స్పందిస్తారు’’ అంటారు ‘గూంజ్’ సహ వ్యవస్థాపకురాలైన మీనాక్షీగుప్తా. కేవలం గృహాలకు మాత్రమే కాకుండా కాలేజీలు, కంపెనీలు, పాఠశాలలకు కూడా వెళుతుంది ‘గూంజ్’.
అలాగే కాటన్ దుస్తుల నుంచి శానిటరీ నాప్‌కిన్‌లను తయారుచేసి ప్యాక్‌ల రూపంలో మహిళలకు అందిస్తుంది ‘గూంజ్’. ప్రతి ప్యాక్‌లో అయిదు న్యాప్‌కిన్‌లు ఉంటాయి. ‘మై పాడ్’ పేరుతో కలర్‌ఫుల్ క్లాత్‌బ్యాగ్ ఇవ్వడమే కాకుండా... నాప్‌కిన్‌లను ఎలా శుభ్రపరచాలి, ఎంత కాలం వరకు ఉపయోగించాలి... మొదలైన విషయాలు కూడా తెలియజేస్తారు. ప్రస్తుత చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ‘‘ ఇప్పుడు మా ముందు ఒక పెద్ద పని ఉంది. వీలైనంత ఎక్కువగా స్వెటర్లను సేకరించాలి’’ అంటున్నారామె. ఇలా కాలానికి, పరిస్థితులకు తగినట్లుగా ఎప్పటికప్పుడు పేద శ్రామికులకు అవసరమైన వస్తువులు, దుస్తులు అందిస్తూ ‘భేష్’ అనిపించుకుంటోంది ‘గూంజ్’.
చింతన్
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఆ పరిసర ప్రాంతాలలో ఒక దృశ్యం తరచుగా ఎదురవుతుంటుంది. మెడలో గుర్తింపు కార్డుతో, గ్రీన్ కలర్ టీషర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకున్న కొందరు యువకులు చెత్తను ఏరుతూ తెల్లటి కవర్లలో నింపుతూ కనిపిస్తారు. చాలామంది అనుకున్నట్లు ఆ యువకులు కొత్తగా నియమితులైన రైల్వే ఉద్యోగులు కారు. కాంట్రాక్టు ఉద్యోగులు అంతకంటే కాదు... ‘చింతన్ మెటీరియల్ ఫెసిలిటీ’లో సభ్యులు.
‘చింతన్’ అనేది పర్యావరణ సంబంధిత పరిశోధన సంస్థ. ‘చింతన్’లో పని చేసేవారిని ‘సఫాయి సేన’ అని కూడా పిలుస్తారు. పగటి పూట రోజుకు మూడుసార్లు, రాత్రిపూట రెండుసార్లు చెత్తను ఏరివేసి ఆర్గానిక్, నాన్-ఆర్గానిక్‌లుగా వాటిని విభజిస్తారు. ఇలా సేకరించిన చెత్తను ఘజియాబాద్, ముజఫర్‌నగర్‌లలో ఉన్న ‘చింతన్’ రీసైకిలింగ్ ఫ్యాక్టరీకి తరలిస్తారు.
‘సఫాయి సేన’ రైల్వేస్టేషన్‌లో రోజుకు మూడు నుంచి నాలుగు టన్నుల చెత్తను క్లియర్ చేస్తుంది. రోజుకు 5000కు తక్కువ కాకుండా ఖాళీ మినరల్ బాటిళ్లను సేకరిస్తుంది. ‘చింతన్’కు సంబంధించిన షెడ్‌లలో ఎటు వైపు చూసినా మినరల్ వాటర్ బాటిళ్లు కొండలుగా కనిపిస్తాయి. అన్నీ బాటిళ్లే అయినప్పటికీ... హార్డ్ ప్లాస్టిక్ బాటిళ్లను వేరు చేస్తారు. మిగిలినదంతా ఒక ఎత్తు. ఈ ఖాళీ మినరల్ బాటిళ్లను సేకరించడం ఒక ఎత్తు.
‘చింతన్’ ప్రాజెక్ట్ టీంలోని 115 మంది సభ్యులకు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్, దాని పరిసర ప్రాంతాలలో చెత్త ఏరుకునే పిల్లలు, యువకుల నుంచి తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. కొన్నిసార్లు అయితే ‘చింతన్’ సభ్యులపై దాడులు కూడా జరిగాయి. ‘సఫాయి సేన’ సభ్యులు రైల్వేస్టేషన్ సమీపంలోనే నివసిస్తారు. వీరికి నెలకు *8,500 గౌరవ వేతనాన్ని అందిస్తారు.
‘‘ప్రతి నెల రైల్వేశాఖకు పది లక్షల రూపాయలు ఆదా చేస్తున్నాం’’ అని చెబుతున్నారు జయప్రకాశ్ చౌధురి. చౌధురి ‘సఫాయి సేన’కు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ‘‘శ్రమైక జీవన సౌందర్యానికి మేము చేస్తున్న పని ఒక సజీవమైన ఉదాహరణ. స్వచ్ఛభారత్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారుగానీ ఆ పని మేము ఎప్పుటి నుంచో చేస్తున్నాం’’ అంటున్నారు చౌధురి.