
ఒకసారి ఆకాశవాణి హైదరాబాద్ ఆవరణలో జరిగిన సంఘటన. అప్పట్లో రేడియోలో స్పోకెన్ వర్డ్ ప్రయోక్తగా పనిచేస్తున్న రావూరి భరద్వాజ గేటువైపు నడుస్తూ బయటికి వెళుతున్నారు. గేటులోంచి ఆకాశవాణికే చెందిన ఒక ఉన్నతాధికారి తన భార్యతో లోనికి ప్రవేశించారు. ఆయన రావూరి గారికి అభివాదం చేసి, తన భార్యని వారికి పరిచయం చేశారు. ఉన్నట్టుండి భరద్వాజ సీరియస్‌గా మొహం పెట్టి ‘‘మొన్నామధ్య భార్య అంటూ మరొకరినెవర్నో పరిచయం చేశారు?’’ అని అన్నారు. దాంతో ఆ అధికారి బిత్తరపోయి ఇబ్బందిగా మొహం పెట్టారు. తన చమత్కారానికి తనే భళ్లున నవ్వేస్తూ వాతావరణాన్ని తేలికపరిచారు రావూరి. విషయం అర్థమయ్యి దంపతులిద్దరూ ఫక్కున నవ్వారు.
-ఎస్.హనుమంతరావు
(ఆకాశవాణి విశ్రాంత అధికారి)