నడుస్తోంది నడిపిస్తోంది | sai padma her real story about handiacaped and Organization | Sakshi
Sakshi News home page

నడుస్తోంది నడిపిస్తోంది

Published Thu, Mar 31 2016 11:40 PM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

నడుస్తోంది నడిపిస్తోంది

నడుస్తోంది నడిపిస్తోంది

మొన్న ‘ఊపిరి’ సినిమా వచ్చింది. ఆ సినిమాకు ఆ పేరెందుకు పెట్టారు? ఎందుకంటే ఆ కథ మార్పుకు ఊపిరి. వికలాంగులను చూసే దృక్పథంలో... వారిని పునరావిష్కృతం చేసే మార్గంలో మార్పుకు సాయి పద్మ ఒక ఊపిరి. మార్పు చలనానికి సందేశం. చిన్నప్పట్నుంచీ ఆ చలనానికి నోచుకోకపోయినా మార్పుకి ప్రయత్నిస్తూనే ఉంది. ఇతరుల కోసం తన సంస్థ నడుస్తోంది. తను ఇతరులను నడిపిస్తోంది.

కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం ఉంటే ఎంతటి వైకల్యాన్నయినా జయించవచ్చని నిరూపించారు సాయిపద్మ. బాల్యం నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమె ఎప్పుడూ ఓడిపోలేదు. నైరాశ్యం పొందలేదు. తను కదల్లేకపోయినా తన ఆశను, ఆకాంక్షను కదిలిస్తూనే ఉన్నారు. తన జీవితం గురించి ఆమె మాటల్లోనే..

 ‘నాన్న బీఎస్‌ఆర్ మూర్తి, అమ్మ ఆదిశేషు. విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీలో డాక్టర్లు. నా తమ్ముడు, చెల్లెలు కూడా వైద్యులే. 1971లో మా స్వస్థలం విజయనగరం జిల్లా గజపతినగరంలో పుట్టాను. నాకు పోలియో రాకుండా ముందుజాగ్రత్తతో వ్యాక్సిన్ తెచ్చి ఉంచారు అమ్మానాన్న. కానీ నెలన్నరకే పోలియో సోకింది. అప్పటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధన ప్రకారం 90 రోజులు నిండిన వారికే ఈ వ్యాక్సిన్ వేయాలి. అందువల్ల అందుబాటులో వ్యాక్సిన్ ఉన్నా నాకు వేయలేని పరిస్థితి. ఇలా విశాఖ కేజీహెచ్‌లో తొలి పోలియో కేసు నాదే. పోలియోతో నా కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి.

గొంతు మూగబోయింది. 52 షాక్ ట్రీట్‌మెంట్లు ఇచ్చారు. ఎట్టకేలకు కాళ్లు తప్ప మిగిలిన అవయవాలు పనిచేయడం మొదలెట్టాయి. పన్నెండేళ్లు వచ్చేవరకు నన్ను ఎత్తుకునే వారు. అవయవాలు బలం పుంజుకోవడానికి ఒంటికి ‘పులి’కొవ్వు రాసేవారట. బీచ్‌లో ఇసుకలో మెడ వరకు పాతిపెట్టి ఉంచేవారట. నా వెన్నెముక ‘ఎస్’ ఆకారంలో వంగిపోతే పక్కటెముకలను కట్ చేసి సరిచేశారు. సెలవులకు పిల్లలందరూ అమ్మమ్మ, నాన్నమ్మల ఇళ్లకు వెళ్తే నన్ను విశాఖలోని అమెరికన్ ఆస్పత్రికి తీసుకెళ్లేవారు శస్త్రచికిత్సల కోసం. అలా నా శరీరానికి 18 సర్జరీలు జరిగాయి. మెడిసిన్ చదవడానికి నా శరీరం సహకరించదని అసలు ఆ  ఆలోచన చేయలేదు నేను.

 నేను నలుగురికి ఉపయోగపడాలి
అన్నిరకాల ఆసరా ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి ఆసరా లేని వికలాంగుల పరిస్థితి ఏమిటన్నది నా ఆవేదన.. ఆలోచన. సీఏ చదివి, డబ్బు సంపాదించి నాలాంటి వారికి ఉపయోగపడేలా ఓ సంస్థను స్థాపించాలన్నది కోరిక. ఎంకాం పూర్తి చేసి మంచి కాలేజీలో ఎంబీఏ చేయాలని, ఉన్నత ఉద్యోగం చేయాలని అనుకునేదాన్ని. వెలుగు పథకంలో ప్రాజెక్టు డెరైక్టర్‌గా పోస్టు వచ్చినా చేరలేదు. బీఎల్ చేసి న్యాయవాదిగా పనిచేస్తూ జూనియర్ సివిల్ జడ్జి ప్రిలిమ్స్ పరీక్ష పాసయ్యాను. రెండున్నర గంటల సమయం ఉండే ఫైనల్ ఎగ్జామ్‌ను రాయలేను. స్క్రైబ్‌ను అడిగితే టెన్త్, ఇంటర్ వారినే ఇస్తామన్నారు. అందువల్ల నాకు న్యాయం జరగదని దీనిపై కోర్టులో ఫైట్ చేస్తున్నా.

కౌన్సెలింగ్.. ఉచిత న్యాయ సలహా
మాలాంటి వారి హక్కుల గురించి ఎవరూ అడగరు. మామూలు వారికంటే మాకే ఎక్కువ అవసరాలుంటాయి. మాలాంటి వారి కోసం ఉచితంగా కోర్టులో కేసులు వాదిస్తున్నా. వికలాంగులకే కాదు.. ఇతరుల దాంపత్య జీవితాల్లో తలె త్తే వివాదాలపై కౌన్సెలింగ్ ఇస్తుంటాను. ఇప్పటిదాకా వంద డిజేబుల్డ్ ఫ్యామిలీలకు కౌన్సెలింగ్ ఇచ్చాను. వీటిలో 75 శాతం సక్సెస్ అయ్యాయంటే ఎంతో తృప్తిగా ఉంటుంది.
అనురాగ బంధం
సాయి పద్మ జీవితంలోకి ఆనంద్ ప్రవేశం విచిత్రంగానే జరిగింది. 2005-06లో ప్రజ్ఞానంద్ ఓ స్వచ్ఛంద సంస్థకు కన్సల్టెంట్‌గా పనిచేసేవారు. వికలాంగులకు చేయూతనివ్వడంలో భాగంగా  వివిధ సంస్థలతో సాయిపద్మ మెయిల్ ద్వారా సంప్రదింపులు చేసేవారు. అలాంటి ఒక సందర్భంలోనే ప్రజ్ఞానంద్‌తో ఆమెకు పరిచయమేర్పడింది. ఆయన 2006లో విజయనగరం వచ్చినప్పుడు తొలిసారిగా ఒకరికొకరు చూసుకున్నారు. ప్రజ్ఞానంద్ చిన్నాన్న, సాయిపద్మ తండ్రి ఆంధ్ర మెడికల్ కళాశాలలో సహచరులని పరిచయాల ద్వారా తెలిసింది. దీంతో పద్మ బంధువులు ప్రజ్ఞానంద్‌తో పెళ్లి ప్రతిపాదన చేశారు. సామాజిక సేవ కోసం తపిస్తున్న పద్మతో పరిణయానికి సుముఖత వ్యక్తం చేశారు ప్రజ్ఞానంద్. అలా 2008లో వాళ్ల పెళ్లి జరిగింది. ఇప్పుడామె కాళ్లకు చక్రాలు, కాలిపర్సులు ఆయనే. కాళ్లకు బ్రేసెస్  వేయించుకుని ఇప్పుడిప్పుడే నడ‘కల’ను నెరవేర్చుకుంటోంది పద్మ. మరణానంతరం తమ శరీరాలను దానమివ్వడానికి అంగీకారపత్రాన్ని రాసిచ్చి మరో ఆదర్శానికి అంకురార్పణ చేశారీ దంపతులు!

మంచంపై ఉన్నప్పుడూ..
ఆపరేషన్లు జరిగినప్పుడు రెండేళ్ల పాటు మంచంపైనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంగ్లిష్‌లో ‘లైఫ్’ అనే కవితల పుస్తకాన్ని రాశాను. తెలుగులో 15 కథలు, ట్రావెలాగ్, తమ్మిమొగ్గలు (కలువ మొగ్గలు) వంటి పుస్తకాలు రాశాను. ఇలా నా బాధను కాస్త మరిచిపోయే మార్గం ఎంచుకున్నాను. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కథల పోటీల్లో నా కథకు ప్రథమ బహుమతి వచ్చింది. సంగీతంపై ఆసక్తితో ఏయూ నుంచి మ్యూజిక్‌లో డిప్లొమా చేశాను. 2007లో అమెరికాలో నేను పాడిన ‘వైష్ణవజనతో’ పాటకు ఏడు నిమిషాల్లో రూ.20 లక్షలు సమకూరింది. ఆ సొమ్ము వికలాంగుల సర్జరీల కోసం ఇచ్చేశాను.


నాకన్నా ఆమె గొప్పది
నాకన్నా ఆమే చాలా టాలెంటెడ్. కొన్ని నేను చేయలేను. ఆమె చేయలేనిది నేను చేస్తాను. ఈ గ్యాప్ ఫిల్లింగ్ వల్ల  హ్యాపీగా ఉండగలుగుతున్నాం. మా ఇద్దరికీ సామాజిక సేవా ధృక్పథం ఉంది. దాంతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. 
                                             -ప్రజ్ఞానంద్, సాయి పద్మ భర్త
గ్లోబల్ ఎయిడ్ ద్వారా..

నాలాంటి వారికి ఏదైనా సాయం చేయడం కోసం అమెరికా వెళ్లి అధ్యయనం చేశాను. ఆ తర్వాత ఎనిమిదేళ్ల్ల కిందట  గ్లోబల్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాను. దీని ద్వారా వికలాంగులకు, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బాధితులకు విద్య, వైద్య సాయం, వీల్‌చైర్లు, కాలిపర్స్‌ల పంపిణీ వంటివి చేపడుతున్నాం. గజపతినగరంలో వికలాంగులు, పేదల కోసం హాస్టల్ నడుపుతున్నార.. నిరుద్యోగ వికలాంగులకు ఉద్యోగావకాశాలకు తోడ్పాటునందిస్తున్నాం. కార్లకు మోడిఫికేషన్ చేయించి వికలాంగులు స్వయంగా నడిపేలా ఒక నిపుణుడికి పూణేలో శిక్షణ ఇప్పించాం. ఇలా ఇప్పుడు నగరంలో సుమారు 80 మంది వికలాంగులు తమ కార్లను మోడిఫికేషన్ చేయించుకుని తిరుగుతున్నారు. స్పోర్ట్స్‌లోనూ వికలాంగులకు ప్రోత్సాహం అందిస్తున్నా. నేనూ పారా షూటింగ్ నేర్చుకున్నాను.

 భవిష్యత్తులో..
వికలాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి స్పోర్ట్సుపై ఆసక్తి పెంచుతాం. మావద్దకు వచ్చే పేద, అనాథ పిల్లలను హీల్ ఇండియా నడుపుతున్న విద్యాలయానికి పంపుతాం. అక్కడ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందుతుంది. కాలిపర్స్‌ని ఇండియాలో అవసరమైన వారికి అందుబాటులోకి తేవాలన్నది నా ప్రయత్నం. దీనిపై అమెరికాలోని డైనమిక్ బ్రేసింగ్ సొల్యూషన్స్‌తో ఒప్పందం కుదిరింది. వారే ఇక్కడకు వచ్చి తయారు చేసిస్తారు. దీంతో సగం ధరకే వాటిని పొందే వీలుంది. వీటితో చిన్నారుల్లో వైకల్య తీవ్రతను తగ్గించవచ్చు. వికలాంగుల కు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.

 జీవితంలోకి ‘ఆనంద’ం
నాకు లేని కాళ్లు నా భర్త ప్రజ్ఞానంద్. నేను ఆలోచించలేని పరిధి ఆయన. అన్నీ బాగున్నా ఆడపిల్ల పుట్టిందని పుట్టింటికి పంపేసే భర్తలున్న రోజులివి. అలాంటిది ఉన్నత విద్యావంతుడైన (నాలుగు ఎంఏలు, ఎంఫిల్) ఆయన వైకల్యం ఉన్న నన్ను జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఓ యోగితో జీవితాన్ని పంచుకున్న అదృష్ట్టవంతురాలిని. ప్రేమకన్నా గొప్పది నమ్మకం. ఆ నమ్మకమే జీవితం. నాకది ఆనంద్ రూపంలో దొరికింది.

 - బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం,
ఫొటోలు: ఎమ్.డి.నవాజ్, సాక్షి ఫొటోగ్రాఫర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement