
పటమట(విజయవాడతూర్పు): ‘రూ.2వేలు ఇస్తామని చెప్పి లోకేశ్ యువగళం పాదయాత్రకు తీసుకువెళ్లారు. వెళ్లిన తర్వాత కేవలం రూ.500 ఇచ్చి మోసం చేశారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు బెదిరిస్తున్నారు. దాడికి ప్రయత్నించారు.’ అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, 13వ డివిజన్ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్, ఆయన కారు డ్రైవర్ దుర్గారావుపై పటమట కృష్ణానగర్‌కు చెందిన గద్దె తంబి అనే దివ్యాంగుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇందుకు సంబంధించిన వివరాలు... ‘ఈ నెల 20వ తేదీన విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమటలో జరిగిన నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు వస్తే రూ.2వేలు ఇస్తామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాకు చెప్పారు. అయితే, కేవలం రూ.500 మాత్రమే ఇచ్చారు..’ అని గతంలో తంబి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అనుచరుడు, కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్, ఆయన కారు డ్రైవర్ దుర్గారావు సోమవారం సాయంత్రం అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు తనను తీసుకువెళ్లారని తంబి ఫిర్యాదులో పేర్కొన్నారు.
అక్కడ తనతో బలవంతంగా ఎమ్మెల్యేకు అనుకూలంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారని తెలిపారు. ఈ స్టేట్‌మెంట్‌ను సోషల్ మీడియాలో పెట్టడంతో తాను ప్రశ్నించానని, దీంతో తనపై దాడికి ప్రయత్నించారని తంబి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. తనను బెదిరించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ముమ్మినేని ప్రసాద్, దుర్గారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సీఐ కాశీవి«శ్వనాథ్ దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment