ఆ మేని మచ్చలకు కారణం.. మెలాస్మా!
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 31 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా ముక్కు, బుగ్గలు, నుదురు భాగాలలో గోధుమరంగు మచ్చలు ఏర్పడ్డాయి. డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి వారి సూచనల మేరకు మందులు వాడాను. ఉపశమనం లేదు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? సలహా ఇవ్వండి. – సుచరిత, గుంటూరు
మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు మెలాస్మా అనే చర్మ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చర్మంపై గోధుమ/బూడిద రంగులో మచ్చలు రావడాన్ని మెలాస్మా అంటారు. ఇది ఒక సాధారణ చర్మ సమస్య. సాధారణంగా ఇది బుగ్గలపై, ముక్కుకు ఇరువైపులా, నుదురు, గడ్డం (చిన్)తో పాటు పై పెదవి భాగాల్లో కనిపిస్తుంది. కొందరిలో సూర్యకాంతి పడే చర్మ భాగాలపైనా, మరికొందరిలో చేతులు, మల భాగాలపై కూడా ఈ మచ్చలు రావచ్చు. 10 శాతం మంది పురుషుల్లో, 90 శాతం మంది మహిళల్లో వచ్చే ఈ సమస్య గర్భిణుల్లో అధికంగా కనిపిస్తుంది. ఈ వ్యాధి వల్ల మనిషికి ఆరోగ్యపరంగా ఎలాంటి హానీ కలగదు. అయితే ముఖంపై మచ్చలు ఉన్న ఫీలింగ్‌తో కొందరు ఆత్మన్యూనత భావాన్ని పెంపొందించుకుంటారు. హోమియో వైద్య విధానం ద్వారా ఈ సమస్యను పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది.
కారణాలు: ఈ చర్మ సమస్యకు అసలు కారణాలు ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ కొన్ని అంశాలు మన శరీరంలోని రంగును ఉత్పత్తి చేసే కణాలను (మెలనోసైట్స్) ఎక్కువగా వృద్ధి చెందేలా ప్రేరేపిస్తాయి. దాంతో ఈ సమస్య ఏర్పడుతుంది.
సమస్యను ప్రేరేపించే అంశాలు
⇒సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు మెలనోసైట్స్‌ను ఉత్తేజపరచడం వల్ల ఈ మచ్చలు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు ఎండలో తిరిగితే సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.
హార్మోన్లలో మార్పుల వల్ల: గర్భధారణ సమయంలో హార్మోన్‌లలో మార్పులు సంభవించడం వల్ల ఈ మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే గర్భిణుల్లో ఇవి ఏర్పడే అవకాశం ఎక్కువ. గర్భనిరోధక మాత్రలు, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీలో ఉపయోగించే మందుల వల్ల ఈ మచ్చలు రావచ్చు.
⇒ కొన్ని సౌందర్య సాధనాల్లోని ఉపయోగించే పదార్థాలు కూడా ఈ సమస్యను ప్రేరేపించే అవకాశం ఉంది.
చికిత్స: హోమియో విధానంలో అందించే కాన్‌స్టిట్యూషన్ చికిత్స ద్వారా శరీరంలోని రోగ నిరోధక శక్తి మెరుగుపడి, ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా శరీరం ఎదుర్కొంటుంది. దాంతో మెలాస్మా వ్యాధి కూడా ప్రేరేపితం కాని విధంగా దేహం బలపడుతుంది. అలా హోమియో ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. అంతేకాకుండా శరీరంలోని హార్మోన్ల అసమతౌల్యతలను సరిదిద్దడం వల్ల ఈ వ్యాధి మళ్లీ తిరగబెట్టకుండా నయం చేసే అవకాశం ఉంది.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్
వయసు పెరుగుతున్నా ఫిట్‌నెస్ ఎలా?
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్
నా వయసు 56 ఏళ్లు. గతంలో చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. అయితే ఇటీవల నా ఫిట్‌నెస్ తగ్గినట్లు అనిపిస్తోంది. మెట్లు ఎక్కే సమయంలో, బైక్ వరకు వెళ్లే టైమ్‌లో మునుపటిలా చురుగ్గా లేకపోవడం వల్ల నాకు ఈ ఫీలింగ్ వస్తోంది. నేను ఇదివరకులా ఆరోగ్యాన్నే పొందడానికి ఏం చేయాలో సలహా ఇవ్వండి. – సుబ్బారాయుడు, విజయవాడ
ఇది మీ వయసు వారంతా ఆలోచించాల్సిన విషయం. వయసు పెరుగుతున్న సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రధానమైన అంశం. మీ వయసు వారిలో డయాబెటిస్ లేదా హైబీపీ లాంటి వ్యాధి లక్షణాలు ఏవైనా ఉంటే, వాటికి తగిన చికిత్స పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అంశాలు ఎంతగానో దోహదపడతాయి. వీటన్నింటిలోనూ వ్యాయామం చాలా ముఖ్యం. మీరు ఏ వయసువారైనప్పటికీ వ్యాయామంతో తగిన ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల గుండెజబ్బులు, మతిమరపు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, అధికరక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం కూడ నివారితమవుతుంది. దాని వల్ల వయసుపైబడ్డవారు పడిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ పడిపోయినప్పుడు ఎముకల విరిగే అవకాశమూ తగ్గుతుంది. పైగా వ్యాయామం చేసేవారిలో ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు ఎక్కువగా స్రవించి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు అవి దిగులుగా ఉండటం, యాంగై్జటీ, డిప్రెషన్‌ను కూడా రాకుండా నివారిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే కాస్త వయసుపైబడ్డవారు వ్యాయామాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్ నుంచి తగిన సలహా పొందాలి. వారి వ్యక్తిగత రుగ్మతలకూ, జీవనశైలికి తగిన వ్యాయామ విధానాల గురించి డాక్టర్ నుంచి సూచనలు పొందాలి. ఉదాహరణకు డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు తాము తీసుకుంటున్న మందులు, ఆహారానికి తగినట్లుగా తమ వ్యాయామ పద్ధతులు, వేళల గురించి డాక్టర్ నుంచి సలహా పొందడం అవసరం. పైగా వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు భారమైన పెద్దపెద్ద వ్యాయామాలను ఒకేసారి ప్రారంభించకూడదు. వ్యవధినీ, శరీరం మీద పడే భారాన్ని మెల్లమెల్లగా పెంచాలి. రోజులో రెండుసార్లు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వల్ల అయ్యే గాయాలను నివారించడానికి ఎక్సర్‌సైజ్‌కు ముందుగా వార్మింగ్ అప్, తర్వాత కూలింగ్ డౌన్ వ్యాయామాలు చేయడం మేలు. వ్యాయామం మనల్ని మరింత చురుగ్గా ఉండేలా చేయాలి. అంతేతప్ప నిస్సత్తువను పెంచకూడదు. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పులు పెరిగినా, ఒంట్లో ఎక్కడైనా ఎర్రబారినా, శ్వాస అందకపోయినా, చెమటలు ఎక్కువగా పట్టినా, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యాయామం ఆపేయాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్సనూ, సలహాలు, సూచనలను పొందాలి.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్
రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్