నిధి నాది... జ్వరం నీది | sakshi focus on a real story | Sakshi
Sakshi News home page

నిధి నాది... జ్వరం నీది

Published Mon, Aug 15 2016 10:39 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

నిధి నాది... జ్వరం నీది - Sakshi

నిధి నాది... జ్వరం నీది

చేతనబడి


చెట్లకు డబ్బులు కాయకపోయినా పుట్టల్లో మణిమాణిక్యాలు దొరక్కపోయినా  లంకంత ఇంట్లో ఓ లంకె బిందె ఉందంటే...  ఎవరైనా ఆశపడకుండా ఉండగలరా?  ఎవర్నో ఒకర్నిఆశ్రయించకుండా ఉండగలరా??  బయటి నుంచి స్పెషలిస్టు మంత్రగాడొస్తే లోకల్ మంత్రగాడికి ఏం మిగులుతుంది?  అందుకే ఇద్దరి మధ్య ఓ అండర్‌స్టాండింగ్!  నిధి తాలూకు ఆదాయం నాది...  జ్వరాల తాలూకు ఆదాయం నీది!!  స్వాములు... స్వాములు  ఊరు పంచుకున్నారు.


‘‘లంకె బిందె ఎలా ఉంటుందమ్మా’’ అడిగింది స్వాతి. స్వాతికి జడ వేస్తున్న జయలక్ష్మి దిమ్మెరపోయింది. జడతోనే స్వాతిని వెనక్కి తిప్పి ముఖంలోకి చూస్తూ ‘‘నీకెవరు చెప్పారు’’ అని గద్దించింది. తానేం తప్పు మాట్లాడిందో తెలియలేదు స్వాతికి. మళ్లీ అడగడానికి భయపడుతోంది. జయలక్ష్మి వదల్లేదు. ‘‘నీకు లంకెబిందెల గురించి ఎవరు చెప్పారు?’’ రెట్టించింది.  ‘‘మా క్లాసులో జగదీశ్ చెప్పాడు. వాళ్లింట్లో ఉందట’’ అన్నది భయంభయంగా.  జయలక్ష్మి ఆలోచనలో పడింది. స్వాతికి కొంచెం ధైర్యం వచ్చింది. ‘‘లంకె బిందెలు ఎంతుంటాయమ్మా? మనం నీళ్లు పట్టుకునే బిందె అంత ఉంటాయా’’ చిన్ని బుర్రలో అనేక సందేహాలు. సమాధానం దొరికితే అన్నింటినీ కలుపుకుని ఒక ఇమేజ్ తెచ్చేసుకోవచ్చు. ‘‘ఆ బిందెలో బంగారం ఉంటుందంట’’ తనకు తెలిసిన సంగతుల్ని ఒక్కొక్కటే బయటపెడుతోంది స్వాతి.


‘‘ఆ బిందె బయటకు తీసిన తర్వాత జగదీశ్ వాళ్లు పేద్ద ఇల్లు కట్టుకుంటారంట, కారు కొనుక్కుంటారంట. బంగారు దండలు, ఉంగరాలు కొనుక్కుంటారంట. మనింట్లో కూడా ఉందేమో వెతకమ్మా’’ జయలక్ష్మి చీర కొంగు గుంజుతోంది స్వాతి. ఆలోచనలోంచి బయటపడిన జయలక్ష్మి వంగి చిన్నగా ‘‘ఈ సంగతి ఎక్కడా మాట్లాడకు, ఎవరినీ ఏమీ అడగకు’’ అన్నది స్వాతి చెవిలో రహస్యం చెబుతున్నట్లుగా.

 

మంత్రగాళ్లకు మంత్రగాడు!
‘‘రాములమ్మా! సూరయ్య ఇల్లు ఉతికేది నువ్వే కదా’’ ఉతికిన దుస్తులు తెచ్చిన రాములమ్మను ఆరా తీసింది జయలక్ష్మి.  ఆ మాత్రం ఆసక్తి కనిపించేసరికి అల్లుకుపోయింది రాములమ్మ. ‘‘ఆ ఇల్లు మా మరిది వాళ్లదమ్మా.  మా తోడికోడలు చెప్పింది... సూరయ్య ఇంట్లో ఏవో పూజలు చేస్తున్నాట్ట. సూరయ్య భార్య రోజూ చెరువులో మునిగి తడిగుడ్డలతోనే ఇంటికొచ్చి దీపాలెలిగిస్తదమ్మా. అట్లా నలభై రోజులు చేసింతర్వాత ఇంకేవో పూజలు చేస్తే... లంకెబిందెలొస్తాయట. ఎవరో చానా పెద్ద మంత్రగాడంట. మనూళ్లో తాయెత్తులు కట్టే మంత్రాలయ్య కంటే పెద్ద శక్తులున్నాయట. అదేదో ఊరి పేరు చెప్పినారమ్మా. మతికి రావట్లే’’ అంటూ తలగోక్కుంటూ బట్టల మూట అందుకుంది రాములమ్మ.

 

మూడడుగులు తవ్వగానే ‘ఠంగ్’ మంది!
సూరయ్య ఇంట్లో వాతావరణం గంభీరంగా ఉంది. భార్యాభర్తలు భక్తిగా కూర్చున్నారు. వారి ఎదురుగా ఒక పీట మీద తెలుపు- నలుపు గడ్డంతో నడి వయసు వ్యక్తి ఉన్నాడు. అతడి పక్కన ఓ అనుచరుడు ఇంటి నాలుగు మూలల్లోనూ, ఇంటి మధ్యలోనూ ముగ్గుతో గుర్తులు పెడుతున్నాడు. పిల్లల్ని ఆడుకోమని పంపించారు. కానీ ఆ ముగ్గురు పిల్లలు మరో నలుగురు పిల్లలను కలుపుకుని ఇంటి పరిసరాల్లోనే తచ్చాడుతున్నారు. కిటికీల్లోంచి తొంగి చూస్తున్నారు.

 

మంత్రాలు చదువుతున్నాడు గడ్డం వ్యక్తి. కళ్లు మూసుకుని చేత్తో ఇంటి ఈశాన్య దిక్కును చూపించాడు. అనుచరుడు ఆ ప్రదేశంలో ముగ్గుతో గుర్తు పెట్టిన చోట నిలబడి సూరయ్య చేత పలుగుతో నేలను తవ్వించాడు. అలా నాలుగు మూలలూ అయ్యాయి. ఇక ఇంటి మధ్యలో తవ్వకం మొదలైంది. మూడడుగులు తవ్వగానే ఠంగున శబ్దం. పలుగుకు గట్టిగా తగిలింది. సూరయ్య దంపతుల ముఖాల్లో ఆనందం. మంత్రగాడు అందరి వైపు చూశాడు. సూరయ్య మరో దెబ్బ వేసేలోపు చేత్తో ఆపమన్నట్లు సైగ చేశాడు. సూరయ్యను దగ్గరకు పిలిచి రహస్యంగా ఏదో చెప్పాడు. సూరయ్య అలాగేనన్నట్లు తలూపాడు.

 
ఆ రోజు అర్ధరాత్రి నుంచి నాలుగు గంటల వరకు నేలను తవ్వుతున్న శబ్దాలే. ఇరుగు పొరుగు వాళ్లంతా అనేక సందేహాలతో, అనేకానేక భయాలతో గడిపారు. తెల్లవారిందో లేదో ఆ వాడలో ఏ ఇద్దరు కలిసినా పలుగు చప్పుళ్ల కబుర్లే. సూరయ్యకు ఏం దొరికిందోననే ఆసక్తి. ఏదో కొంత దొరక్కపోయి ఉంటుందా? రకరకాల సందేహాలే.

 

పిశాచి నిద్ర లేచింది!
వారం తర్వాత ఓ రోజు ఉదయాన్నే రాములమ్మ మాసిన దుస్తుల కోసం జయలక్ష్మి ఇంటికి వస్తూనే రెండు రోజులు రానందుకు కారణం అడక్కుండానే చెప్పసాగింది. ‘‘మూడ్రోజుల్నుంచి మా పెద్ద పోరగాడికి జ్వరమమ్మా. మూసిన కన్ను తెరవలే. వాడి మంచం దగ్గరే తెల్లారింది మాకందరికీ. అందుకే బట్టలకు రాలేదు’’ అని మైలపెట్టె మూత తెరిచింది. బట్టలు సర్దుకుంటూ తనలో తానే... ‘‘వాళ్లకేం పోయేకాలమో గానీ, పిశాచిని నిద్రలేపి ఊరి మీదకు తరిమారు. పిల్లల్ని కళ్లలో పెట్టుకోకపోతే ఎప్పుడు మింగేస్తుందో ఏమో’’ అనుకున్నది.  అక్కడే పాత్రలు కడుగుతున్న జయలక్ష్మి ‘ఏంటంటున్నావ్ రాములమ్మా’ అంటూ లేచి వచ్చింది.


‘‘జ్వరం తగ్గడానికి తాయెత్తు కోసం పోయినప్పుడు మంత్రాలయ్య చెప్పాడమ్మా. సూరయ్య లంకె బిందె కోసం పెద్ద మంత్రగాడ్ని తెచ్చి మంత్రాలు చదివించాట్ట. డబ్బు పిశాచి నిద్రలేచి ఊరి మీద పడ్డాదంట. ఆకలి మీదున్న పిశాచి ఎవరో ఒకర్ని బలి తీసుకునే వరకు శాంతించదంటమ్మా. ఎక్కడ పిల్లల్ని పొట్టన పెట్టుకుంటుందో.. ఊళ్లో పిల్లలందరికీ అంత్రాలు కట్టించుకుంటే మంచిదన్నాడు మంత్రాలయ్య. మిగిలిన ఇద్దరికి కూడా కట్టించాం. రోగాల నుంచి బయటపడతారో, ప్రాణాలే పోతాయోనని ఊరంతా ఒకటే గుబగుబలాడిపోతోంది. స్వాతమ్మకీ కట్టించమ్మా’’ అంటూ కదిలింది.

 

బిందె డొల్ల... ఇల్లు గుల్ల
ఓ రోజు అర్ధరాత్రి పదిహేను మందికి పైగా మగవాళ్లు సూరయ్య ఇంటిని చుట్టిముట్టారు. ‘‘ఈణ్ని చంపిపాతేస్తే తప్ప ఊరిని పట్టుకున్న జాడ్యం వదలదు’’... కోపంతో ఊగిపోతున్నాడో కుర్రాడు. అక్కడ గుమిగూడిన వాళ్ల అందరి ఇళ్లలో కనీసం ఒకరైనా చలిజ్వరంతో మంచం పట్టి ఉన్నారు. ఆ సమయానికి సూరయ్య ఉండి ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. సూరయ్య భార్య ఏడుస్తూ కాళ్లావేళ్లా పడింది. చలి జ్వరంతో మంచం పట్టిన చిన్న పిల్లాడిని చూపించి మాకే పాపమూ తెలియదని, వదిలిపెట్టమని వేడుకుంది. వచ్చిన వాళ్లలో ఓ యాభై ఏళ్ల వ్యక్తి  ‘సూరయ్య వచ్చిన తర్వాత మాట్లాడదాం’ అని యువకులను సమాధానపరిచి తీసుకెళ్లిపోయాడు. ‘లంకె బిందెలంటూ నా పెనిమిటి ఇంటిని గుల్ల చేశాడు, ఇప్పుడు ప్రాణం మీదకు తెచ్చాడ’ంటూ శోకాలు పెట్టసాగింది సూరయ్య భార్య. - వాకా మంజులారెడ్డి  (గమనిక: పేర్లు మార్చడమైంది)

 

ఊరంతా ఏకమైంది
ఊరిని చలిజ్వరాలు పీడిస్తున్నాయి. ధనపిశాచిని నిద్రలేపడం వల్లనేనని ఆ ఊరి మంత్రగాడు ప్రచారం చేస్తున్నాడని, ఓ కుటుంబం మీద ఊరు దాడికి దిగిందని సమాచారం వచ్చింది. ఆ ఊళ్లోకి వెళ్లిన వెంటనే అనారోగ్యం పాలైన పిల్లలకు వైద్యం చేయించాం. గ్రామపెద్దలు, వనపర్తిలోని డాక్టర్లతో మాట్లాడి మెడికల్ క్యాంపు పెట్టించాం. కలుషితమైన నీరు, దోమలతో వ్యాపించే జ్వరాల పట్ల అవగాహన కల్పించాం. ఊళ్లో ఉద్రిక్తత తగ్గిన తర్వాత పిశాచి లేదని వారిని సమాధాన పరిచి, గొయ్యిని పూడ్పించాం. మా వాదనతో సమాధానపడిన ఊరివాళ్లు తమను మోసగించిన మంత్రాలయ్యను, సూరయ్యను మోసం చేసిన పెద్ద మంత్రగాడిని అరెస్టు చేసే వరకు ఉద్యమించారు. ఏకతాటి మీద నిలబడి పోలీసులకు అంతా వివరించారు. ఆ ఇద్దరినీ అరెస్టు చేసే వరకు వారు శాంతించలేదు.   టి. రమేశ్, జనరల్ సెక్రటరీ  ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్

 

ఏం జరిగింది?
రెండేళ్ల కిందట ఓ వర్షాకాలం. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామం. పేరు చిన చింకుంట. ఆ ఊరిలో సూరయ్యకు ఎందుకో కాని తనింట్లో లంకె బిందెలుంటాయనే మూఢనమ్మకం కలిగింది. తమ ఊళ్లో ఉన్న మంత్రగాడిని కాదని వేరే ఊళ్లోని పెద్ద మంత్రగాడిని ఆశ్రయించారు. ఇక ఆ మంత్రగాడేమో... లంకె బిందెలు బయటకు తెచ్చే మార్గం చెబుతానని, ఇంట్లో రకరకాల మంత్రాలు చదివాడు. పదివేల రూపాయల డబ్బు వసూలు చేశాడు. లంకె బిందెని పగటి పూట బయటకు తీయరాదని, రాత్రి ఊరంతా సద్దుమణిగిన తరవాత మిగిలిన తవ్వకం పూర్తి చేయమని నమ్మించి ఉడాయించేశాడు. మంత్రగాడు చెప్పినట్లే అర్ధరాత్రి మళ్లీ తవ్వారు. అయితే పలుగుకి తగిలింది బిందె కాదు, బండరాయి. ఆ తెల్లవారి పెద్ద మంత్రగాడు ఉండే ఊరికెళ్లి అడిగితే ‘మీరు పూజలో, నిష్టలో లోపం చేశారు. అందుకే లంకె బిందె ఉన్న చోట ఉండకుండా కదిలి వెళ్లి పోయిందని దబాయించాడు. ఇక చేసేదేమీ లేక, ఎవరికీ చెప్పుకోలేక ఊరుకున్నారు సూరయ్య దంపతులు. గ్రామంలో వర్షాలు, దోమలతో మలేరియా వచ్చింది. లోకల్ మంత్రాలయ్య దాన్ని అవకాశంగా తీసుకున్నాడు. జ్వరం వచ్చిన వాళ్లకు తగ్గడానికి, రాని వాళ్లకు రాకుండా ఉండడానికి తాయెత్తులు కడుతూ డబ్బు పెట్టె నింపుకున్నాడు. అంత్రం కట్టినా కూడా ఎవరైనా చనిపోతే తన మీద నమ్మకం పోతుందని ఓ ప్లాన్ వేశాడు. సూరయ్య డబ్బు పిశాచిని నిద్రలేపాడని అది ఎవరో ఒకర్ని బలి తీసుకుంటుందని భయపెట్టి, సూరయ్య మీదకు జనాన్ని ఉసిగొల్పాడు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement