వారెవా! ఏమి గోవా!! | sakshi food special | Sakshi
Sakshi News home page

వారెవా! ఏమి గోవా!!

Published Fri, Mar 25 2016 10:55 PM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

వారెవా! ఏమి గోవా!!

వారెవా! ఏమి గోవా!!

ఈ మాట ప్లేస్ గురించి మాత్రమే కాదు...
ఫుడ్డు గురించి కూడా!
గోవాలో తిరిగొస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది.
వాలో తిని వస్తే బాడీ రీచార్జ్ అవుతుంది.
సీఫుడ్డు, కోకోనట్టు, రైస్, కూరగాయలు.. కొంచె స్పైస్...
అన్నిచోట్లా ఉండేవే కానీ...
గోవా స్టెయిల్లో చేస్తే ఆ టేస్టే వేరు. ట్రై చెయ్యండి.


గోవా సమోసా

కావల్సినవి:  మైదా - కప్పు; వెన్న - 2 టీ స్పూన్లు  ఉల్లిపాయల తరుగు - అర కప్పు బంగాళదుంపల ముక్కలు (ఉడికించి, సన్నగా తరగాలి) - కప్పు  పచ్చిబఠాణీ - అర కప్పు; పచ్చిమిర్చి - 1  అల్లం ముద్ద- అర టీ స్పూన్  కొత్తిమీర తరుగు - పావు కప్పుకారం - అర టీ స్పూన్; ఉప్పు - తగినంతనూనె - వేయించడానికి తగినంత

 తయారీ:     ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల మైదా వేసి, నీళ్లు పోసి దోసె పిండిలా ఉండలు లేకుండా కలిపి పక్కనుంచాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో ఉల్లిపాయల తరుగు వేసి, వేయించాలి. తర్వాత అల్లం పేస్ట్, ఉప్పు, కారం, బంగాళదుంపలు వేసి కలపాలి. అన్నీ బాగా వేగాయనిపించాక దించాలి.మైదాలో కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా, కొద్దిగా నీళ్లు పోసి గట్టి ముద్దలా కలపాలి. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని, పూరీ పరిమాణంలో వత్తాలి. కత్తితో సగానికి కట్ చేసి, దీంట్లో సిద్దం చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి, త్రికోణాకారంలో మడవాలి. ఇలా మడిచేటప్పుడు లోపలి మిశ్రమం బయటకు రాకుండా కలిపి ఉంచుకున్న మైదా మిశ్రమంలో వేళ్లను అద్దుకుంటూ చివర్లను అదమాలి. ఇలాగే అన్నీ తయారుచేసుకొని, కాగుతున్న నూనెలో వేసి ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీయాలి.

 

గోవా చేపల కూర

కావల్సినవి: చేప ముక్కలు (పాంఫ్రెట్) - 600 గ్రా.లు కొబ్బరి తురుము - ముప్పావు కప్పు  కొబ్బరి పాలు - ముప్పావు కప్పు ధనియాలు - టేబుల్ స్పూన్ జీలకర్ర - టీ స్పూన్; అల్లం పేస్ట్ - 4 టీ స్పూన్లు వెల్లులి పేస్ట్ - టీ స్పూన్; పచ్చిమిర్చి - 4 పల్లీ నూనె - 5 టేబుల్ స్పూన్లు  నిమ్మరసం - 3 టేబుల్‌స్పూన్ల  ఉల్లిపాయల తరుగు - 3 టేబుల్ స్పూన్లు  ఎండుమిర్చి - 15; ఉప్పు - రుచికి తగినంత  చింతపండు గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు టొమాటో తరుగు - పావు కప్పు పసుపు - అర టీ స్పూన్

తయారీ: తగినంత ఉప్పు, నిమ్మరసంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసుకున్న చేప ముక్కలపై పోసి, గంట సేపు ఉంచాలి. నిమ్మరసంలో నానిన చేప ముక్కలు రుచిగా ఉంటాయి. మిక్సర్‌జార్‌లో కొబ్బరి తరుగు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్‌చేయాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొబ్బరి పాలు పోసి బ్లెండ్ చేయాలి. కడాయి వేడి చేసి, నూనె వేయాలి. నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు వేయించాలి .దీంట్లో టొమాటో ముక్కలు వేసి 3-4 నిమిషాలు వేయించి, కప్పు నీళ్లు కలిపి ఉడికించాలి. పచ్చిమిర్చి తరుగు, చేప ముక్కలను 7 నిమిషాలు సన్నని మంటమీద ఉడికించాలి. పైన మూత పెట్టకుండానే ఈ కూరను వండాలి. మంట తీసి కొత్తిమీర చల్లి దించాలి.

 

రొయ్యల కూర

కావలసినవి: రొయ్యలు - పావుకేజీ నూనె - 3 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి - అర టీ స్పూన్; అల్లం - టీ స్పూన్ ఉల్లిపాయ - 1 (తరగాలి); పసుపు - పావు టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ; ఉప్పు - తగినంత


పేస్ట్ కోసం.. జీలకర్ర - టీ స్పూన్  కొబ్బరి తరుగు పాలు - అర కప్పు మిరియాలు - 15; కారం - టీ స్పూన్ వెనిగర్ - అర టీ స్పూన్; అల్లం - అర టీ స్పూన్  వెల్లుల్లి - అర టీ స్పూన్
 

తయారీ
ఉల్లిపాయలను, వెల్లుల్లిని గ్రైండ్ చేసి పేస్ట్ కోసం తీసుకున్న దినుసులన్నీ కలిపి మెత్తగా నూరుకోవాలి. దీంట్లో వెనిగర్ కలపాలి. రొయ్యలను శుభ్రపరచి, కడాయిలో నూనె వేసి వేడి చేయాలి.  దీంట్లో వెల్లుల్లి వేయించి, తరిగిన ఉల్లిపాయలు వేయాలి. కరివేపాకు, నూరిన మిశ్రమం కూడా కలపాలి.  దీంట్లో రొయ్యలు వేసి 15 నిమిషాలు ఉడికించాలి.   

 

కోకనట్ కేక్

కావల్సినవి: బొంబాయి రవ్వ - కప్పు, ఎండు కొబ్బరి తురుము - కప్పు జీడిపప్పు పొడి - అర కప్పు, బేకింగ్ పౌడర్ - టీ స్పూన  కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) - టీ స్పూన్, వెన్న - 2 టేబుల్ స్పూన్లు కండెన్స్‌డ్ మిల్క్ - పావు కప్పు, పాలు - అర కప్పు యాలకులు - 4, బాదంపప్పు - అలంకరణకు తగినన్నిపంచదార పొడి - తగినంత
 

 తయారీ:     ఒక గిన్నెలో వేయించిన రవ్వ, కొబ్బరి తురుము, బేకింగ్ పౌడర్, కార్న్‌ఫ్లోర్, పంచదార పొడి, జీడిపప్పు పొడి వేసి కలపాలి. దీంట్లో కరిగించిన వెన్న, కండెన్స్‌డ్ మిల్క్, పాలు వేసి మళ్లీ బాగా కలపాలి. మరీ గట్టిగా ఉంటే మరికొన్ని పాలు కలపాలి. దీనిపైన మూత పెట్టి, 7 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తీసి, అరగంట సేపు బయట ఉంచాలి. దీంట్లో యాలకుల పొడి, వెనిల్లా ఎసెన్స్ కలపాలి.

  

ఈ కేక్‌ను ప్రెషర్ కుకర్‌లో తయారుచేసుకోవచ్చు. అయితే, గ్యాస్‌కట్, వెయిట్ అవసరం లేదు. పాత ఇడ్లీపాత్రలా ఉండే మందపాటి కుకర్ అయితే బాగుంటుంది.కేక్ బేక్ చేసే పాత్ర అడుగునే 2 కప్పుల టేబుల్ సాల్ట్ వేయాలి. 2 కప్పుల ఇసుక వేయాలి.దీంట్లో కేక్‌పాత్ర పెట్టడానికి అనువుగా ఒక స్టాండ్‌ను ఉంచాలి. ఇప్పుడు ఈ పాత్రను వేడి చేయాలి.కుకర్‌లో పెట్టే పాత్ర అడుగున నూనె లేదా వెన్న రాసి మిశ్రమం అంతా అందులో వేసి, స్పూన్‌తో ప్లాట్‌గా సర్ది, పైన బాదం, జీడిపప్పు తరుగులు వేయాలి. ఈ పాత్రను కుకర్‌లో పెట్టి, పైన మూత పెట్టాలి. (గ్యాస్‌కట్, విజిల్ అవసరం లేని గట్టి మూత ఉండాలి) సన్నని మంట మీద 45-50 నిమిషాల సేపు బేక్ చేయాలి.మిశ్రమం బాగా ఉడికి, ముదురు గోధుమ రంగులోకి వస్తుంది. దీనిని తీసి నిల్వ చేసుకోవచ్చు. 4-5 రోజుల వరకు ఉపయోగించవచ్చు.


మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ

 

కావల్సినవి: అరటికాయ ముక్కలు - కప్పు గుమ్మడికాయ ముక్కలు - కప్పు మునక్కాడ ముక్కలు - 1 కప్పు (మూడు అంగుళాల పరిమాణంలో ముక్కలు చేయాలి) ముల్లంగి - 1 (ముక్కలు చేయాలి) పచ్చి బఠాణీ - అర కప్పుకందిపప్పు - పావు కప్పుపచ్చి కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు కారం - 3 టీ స్పూన్లు పసుపు - అర టీ స్పూన్ టెఫ్లేమ్ (ఇవి గోవాలో దొరికే సుగంధద్రవ్యాలలో ఒకటి. వంటలకు మంచి సువాసన రావడానికి దీనిని వాడతారు. మనం మిరియాలను ఉపయోగించవచ్చు) - 10 చింతపండు గుజ్జు - టేబుల్ స్పూన్ ఉప్పు - తగినంత


తయారీ:చింతపండు గుజ్జు, కారం, కొబ్బరి తరుగు, పసుపు, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీంట్లో టెఫ్లేమ్స్ లేదా మిరియాలు, 3 కప్పుల నీళ్లు కలిపి ఉడికించాలి. దీంట్లో మునక్కాడలు, ముల్లంగి ముక్కలు, పప్పు వేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత గుమ్మడి, అరటికాయ ముక్కలు, పచ్చిబఠాణీలు వేసి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కొబ్బరి తరుగు మిశ్రమం, ఉప్పు, కప్పు నీళ్లు కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి దించాలి. ఈ కూర చపాతీ, పూరీ, అన్నంలోకి వడ్డించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement