అయ్ బాబోయ్ బాబోయ్!
రండి రండి రండి.. దయచేయండి...
గోదావరి భోజనాలు రుచి చూడండి.
ఆప్యాయతలకు.. ఆతిథ్యానికి..
ఉభయ గోదావరులే అడ్రెస్సండీ!
అయ్ బాబోయ్ బాబోయ్...
అలా అనేశారేటండీ..!
భోజనం పెట్టడం కూడా మర్యాదేటండీ?!
కోడి రేకులు
కావల్సినవి: చికెన్ (బెస్ట్ పీస్) - అర కేజీ (ఆలూ చిప్స్‌లా పలచని పొరలుగా కట్ చేయాలి; మొక్కజొన్న పిండి - 4 టీ స్పూన్లు ఉప్పు - తగినంత; కారం - అర టీ స్పూన్; పసుపు - పావు టీ స్పూన్
తయారీ: వెడల్పాటి గిన్నెలో పై పదార్థాలన్ని వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె పోసి ఒక్కో చికెన్ పీస్ వేస్తూ బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. పైన కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, వేయించిన పచ్చిమిర్చి, క్యారట్ తరుగుతో అలంకరించి, టొమాటో సాస్ లేదా వెల్లుల్లి సాస్‌తో సర్వ్ చేయాలి.
రోజ్ మిల్క్
కావల్సినవి: చిక్కటి పాలు (కాచి చల్లార్చినవి) - గ్లాస్; రోజ్ మిల్క్/సిరప్ - 50 ఎం.ఎల్; గులాబీ రేకలు - కాసిని; పంచదార - 2 టీ స్పూన్లు; యాలక్కాయ - 1 (పొడి చేయాలి)
తయారీ: రాత్రి పూట పాలు కాచి, ఫ్రిజ్‌లో పెట్టాలి. ఉదయం రోజ్‌మిల్క్, పంచదార కలిపి, గులాబీ రేకలు కలిపి మిక్సీలో బ్లెండ్ చేయాలి. సర్వ్ చేసేముందు చితగ్గొట్టిన ఐస్ వే యాలి.
రాజుగారి వెజ్ పలావ్
కావల్సినవి: బియ్యం - అర కేజీ; పాలు - పావు లీటరు; సాంబార్ ఉల్లిపాయలు - పావు కేజీ; క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్ - అర కేజీ (సన్నని ముక్కలు); నెయ్యి - 100 గ్రాములు; బిర్యానీ మసాలా (దాల్చిన చెక్క, లవంగ, సాజీర) - టీ స్పూన్; బిర్యానీ ఆకులు-2; జీలకర్ర-ఆవాలు - టీ స్పూన్; పెరుగు - 3 టేబుల్ స్పూన్లు; అల్లం -వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; పచ్చిమిర్చి - 4 (సన్నగా చీరాలి); పసుపు - పావు టీ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; కొత్తిమీర - టీ స్పూన్
తయారీ: కడాయిలో నూనె పోసి ఉల్లిపాయలు వేయించి, చల్లారాక పెరుగు కలిపి మెత్తగా రుబ్బి పక్కనుంచాలి. కుకర్‌లో నెయ్యి వేసి కాగాక జీలకర్ర-ఆవాలు, ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. దీంట్లో పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, కూరగాయల ముక్కలు వేసి కలపాలి. లీటరు నీళ్లు పోసి మరుగుతుండగా కడిగిన బియ్యం వేసి కలపాలి. తగినంత ఉప్పు వేసి కలిపి కుకర్ మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చాక దించి, మూత తీసి పాలు పోసి కలిపి మరో 10 నిమిషాలు ఉడికించి చివరగా కొత్తిమీర చల్లాలి. ఈ పలావ్‌ను పనసతొనలు, గోంగూర కట్టా లేదా రైతాతో వడ్డించాలి.
పండుమిర్చి మటన్ పలావ్
కావల్సినవి: మటన్ - అర కేజీ; పండు మిర్చి ముద్ద - 150 గ్రాములు; చింతపండు - 2-3 రెబ్బలు (నానబెట్టాలి); నెయ్యి, నూనె - 100గ్రాములు; పచ్చిమిర్చి-2; ఉప్పు - తగినంత; బియ్యం - అర కేజీ; గరం మసాలా-(సాజీర, లవంగాలు, యాలకులు) 2 టీ స్పూన్లు; బిర్యానీ ఆకు - 2; ఉల్లిపాయలు-1 (పొడవుగా సన్నగా తరగాలి), జీడిపప్పు - 10
తయారీ: పండుమిర్చి- చింతపండు కలిపి కచ్చాపచ్చాగ దంచి పక్కనుంచాలి. బియ్యంలో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. ఉల్లిపాయలు విడిగా కడాయిలో నూనె వేసి వేయించి ఉంచాలి. కుకర్‌లో నెయ్యి-నూనె వేసి కాగాక సాజీర, బిర్యానీ ఆకు, లవంగా, యాలకులు వేసి వేయించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి కలపాలి. దీంట్లో మటన్ వేసి కలపాలి. మగ్గాక పండుమిర్చి పేస్ట్, జీడిపప్పు పొడి కలపాలి. కనీసం 15 నిమిషాలు ఉడికించాలి. దీంట్లో ఒకటి బిర్యానీ రైస్‌కు రెండు నీళ్లు పోసి మరగించాలి. తగినంత ఉప్పు వేసి కలిపి, ఆ తర్వాత నానబెట్టిన బియ్యం మరుగుతున్న నీళ్లలో వేసి కలపాలి. కుకర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచి తర్వాత దించాలి. రైస్‌ను గరిటతో కలపకుండా కుకర్ మూత తీసి వెడల్పాటి గిన్నెలో బోర్లించాలి. కింద ఉడికిన రైస్, పైన మటన్.. ఉంటుంది. దీనిపై వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, కొత్తిమీర, ఉడికించిన గుడ్డుతో అలంకరించాలి.
బొంగు కోడి పలావ్
కావల్సినవి: చికెన్ - పావు కేజీ బాస్మతి రైస్ - పావు కేజీ; పెరుగు - కప్పు నిమ్మరసం - 2 టీ స్పూన్లు; కారం - టీ స్పూన్ ఉల్లిపాయలు - 1 (సన్నగా తరగాలి) పచ్చిమిర్చి - 2 (చీలికలు చేయాలి) ధనియాల పొడి - టీ స్పూన్; ఉప్పు - తగినంత జీలకర్ర - టీ స్పూన్; గరం మసాలా - టీ స్పూన్ పసుపు - పావు టీ స్పూన్; నూనె-నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు; వెదురు బొంగు - 1 (ఒక వైపు మూసి రెండోవైపు తెరిచి ఉండాలి)
తయారీ: గిన్నెలో బియ్యం మినహా మిగతా అన్ని పదార్థాలు+సగం ఉప్పు వేసి కలిపి గంట సేపు పక్కనుంచాలి. బియ్యం కడిగి, తగినన్ని నీళ్లు, పోసి, మిగతా ఉప్పు కలిపి సగం (హాఫ్ బాయిల్డ్) ఉడికనివ్వాలి. వెదురు బొంగును శుభ్రం చేసుకొని, ఒక పొర ఉడికీ ఉడకని అన్నం .. ఆ తర్వాత చికెన్ ముక్కలు, ఆ తర్వాత అన్నం... ఇలా అన్ని 3-4 పొరలుగా వేసుకోవాలి. బొంగుపైనుంచి ఆవిరి రాకుండా చపాతీ పిండిలా కలిపిన గోధుమపిండి ముద్దను అదమాలి. వెడల్పాటి కుండ లేదా, కుంపట్లో బొగ్గులు వేసి మండించి సిద్ధం చేసుకున్న వెదురు బొంగును నిప్పుల మీద వేసి అటూ ఇటూ తిప్పుతూ కాలుస్తూ ఉండాలి. పైన మంటకు బొంగు లోపల చికెన్, అన్నం ఉడికిపోవాలి. పూర్తిగా ఉడికాక ప్లేట్‌లోకి తీసుకొని వేయించిన ఉల్లిపాయ ముక్కలు అలంకరించి రైతాతో వడ్డించాలి.
జున్ను
కావల్సినవి: జున్ను పాలు - పావు లీటర్; తెల్లటి బెల్లం తురుము - 100 గ్రాములు; యాలక్కాయ పొడి - చిటికెడు; మిరియాల పొడి - చిటికెడు; లవంగ మొగ్గ - 1
తయారీ: బెల్లంలో తగినన్ని నీళ్లు పోసి కరిగించి, వడకట్టి, జున్ను పాలలో కలపాలి. ఈ పాలను ఒక గిన్నెలో పోసి యాలక్కాయపొడి, మిరియాల పొడి, లవంగ మొగ్గ వేయాలి. ఇడ్లీపాత్ర అడుగున నీళ్లు పోసి ఆ పైన జున్ను పాల గిన్నెను ఉంచి, ఆ పైన మూత పెట్టాలి. సన్నని మంట మీద పాల మిశ్రమం ఉడికి కేక్‌లా తయారయ్యేంతవరకు ఉంచి, దించాలి.
కదంబం
కావల్సినవి: బియ్యం - 3 కప్పులు; గుమ్మడి కాయ, సొరకాయ, క్యారెట్ , బెండకాయ, వంకాయ, ఉల్లిపాయ, టొమాటో... (నచ్చిన కూరగాయ ముక్కలను చేర్చుకోవచ్చు) - కావల్సినన్ని. క్యాప్సికమ్ వేసుకుంటే లోపలి గింజలు తీసేయాలి; పచ్చిమిర్చి - 4; మునక్కాడలు - 1; కందిపప్పు - 50 గ్రాములు; పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు - టేబుల్ స్పూన్; శనగపప్పు - టేబుల్ స్పూన్; ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు రెమ్మలు - 2; ఎండుకొబ్బరి - టేబుల్ స్పూన్; ఉప్పు - తగినంత; వెల్లుల్లి రెబ్బలు- 5; ఎండుమిర్చి - 2; ఆవాలు-జీలకర్ర - టీ స్పూన్; నువ్వుపప్పు నూనె - 3 టేబుల్ స్పూన్లు; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; చింతపండు గుజ్జు - అరకప్పు కొత్తిమీర - 60 గ్రాములు (కాడలు ఉడికించాలి)
తయారీ: కూరగాయ ముక్కలన్నీ ఒక మందపాటి గిన్నెలో వేసి నీళ్లుపోసి, అరచెంచా కారం, పావు చెంచా పసుపు వేసి రెండు పొంగులు వచ్చేంతవరకు ఉడికించి, దించాలి. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు కుకర్‌లోపెట్టి మెత్తగా ఉడికించాలి. ఇంకా మెత్తదనం కోసం మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. అన్నం మెత్తగా ఉడికించి పక్కనుంచాలి. కడాయిలో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసాక కూరగాయ ముక్కలు వేసి కలపాలి. చింతపండు గుజ్జు, ఉడికించిన పప్పు, కొత్తిమీర కాడలు వేసి కలపాలి. కూరగాయ ముక్కలు ఉడికాక దీంట్లో ఉప్పు, అన్నం వేసి కలపాలి. మెత్తగా ఉడకనివ్వాలి. పావు టీస్పూన్ మిరియాలపొడి, కొత్తిమీర చల్లి దించాలి. దీనికి కాంబినేషన్‌గా అప్పడాలు, అరటికాయ వేపుడు, బంగాళదుంప వేపుడు బాగుంటాయి.
చేపల పులుసు
కావల్సినవి: కొరమీను చేప - కేజీ (ముక్కలు చేయాలి); చింతపండు - పావుకేజీ (నానబెట్టి రసం తీయాలి); టొమాటోలు, ఉల్లిపాయలు - ఒక్కోటి పావుకేజీ (పెద్ద ముక్కలుగా కట్ చేయాలి); పచ్చిమిర్చి - 50 గ్రాములు (నిలువుగా చీరాలి); మెంతులు - 2 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూన్; కారం - తగినంత; ఉప్పు - తగినంత; ధనియాల పొడి - 2 టీ స్పూన్లు; ఎండుకొబ్బరి - 2 టీ స్పూన్లు; కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా; నూనె, ఉప్పు- తగినంత
తయారీ: వెడల్పాటి పాన్‌లో నూనె వేసి కాగాక మెంతులు, ఆవాలు వేయించి ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి కలపాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేగాక సరిపడా కారం, చింతపులుసు, ఉప్పు, కొబ్బరి, ధనియాలపొడి కలిపి ఉడికించాలి. గ్రేవీ చిక్కబడ్డాక చేప ముక్కలు వేసి మూత పెట్టాలి. 5 నిమిషాలాగి మూత తీసి, కొత్తిమీర చల్లి దించాలి. గరిటెతో కలపకూడదు. ముక్కలు విరిగిపోతాయి.
రొయ్యల ఇగురు
కావల్సినవి: రొయ్యలు - 250 గ్రాములు; ఉల్లిపాయలు-2 (సన్నగా తరగాలి); పచ్చిమిర్చి - 2 (పేస్ట్ చేయాలి); కరివేపాకు - రెమ్మ ఉప్పు - తగినంత; పసుపు - చిటికెడు; అల్లం -వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; కారం - పావు టీ స్పూన్; నిమ్మరసం - టేబుల్ స్పూన్; గరం మసాలా - టీ స్పూన్; కొత్తిమీర - టీ స్పూన్; నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారీ: శుభ్రపరుచుకున్న రొయ్యలలో కొద్దిగా అల్లం- వెల్లుల్లి పేస్ట్, కారం, నిమ్మరసం వేసి కలిపి పక్కన ఉంచాలి. కడాయిలో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించాక మంట తగ్గించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి. దీంట్లో కలిపి ఉంచిన రొయ్యలు వేసి ఉడికించాలి. తర్వాత తగినం కారం, పసుపు, గరం మసాలా వేసి కలపాలి. అర కప్పు నీళ్లు పోసి ఉడికించి చివరగా కొత్తిమీర చల్లి దించాలి. రోటీ, రైస్‌లోకి వడ్డించాలి.
కర్టెసీ: కోడి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ చెఫ్, కిచెన్ ఆఫ్ కూచిపూడి, మాదాపూర్, హైదరాబాద్