ఉదయం నిద్రలేవగానే మడమలో నొప్పి!
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. డయాబెటిస్ ఉంది. నా బరువు 75 కేజీలు. ఉదయం నిద్రలేచిన తర్వాత నడవలేకపోతున్నాను. మడమలో విపరీతమైన నొప్పి 10 – 15 నిమిషాల పాటు ఉంటోంది. తర్వాత విశ్రాంతి తీసుకుంటే తగ్గి, మళ్లీ నడిచినప్పుడు వస్తోంది. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – రమాదేవి, హైదరాబాద్
అరికాలులో ప్లాంటార్ ఫేషియా అనే కణజాలం ఉంటుంది. అడుగులు వేసే సమయంలో ఇది కుషన్‌లా పనిచేసి, అరికాలిని షాక్ నుంచి రక్షిస్తుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ దీనిలోని సాగే గుణాన్ని కోల్పోయి, గట్టిగా మారుతుంది. ఇది పలచబారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తి కోల్పోతుంది. దాంతో ప్లాంటార్ ఫేషియా చిన్న చిన్న దెబ్బలకూ డ్యామేజ్ అవుతుంది. దాంతో మడమ నొప్పి, వాపు వస్తాయి. ఈ నొప్పి అరికాలు కింది భాగంలో ఉంటుంది. ఉదయం పూట మొట్టమొదటిసారి నిల్చున్నప్పుడు మడమలో ఇలా నొప్పి రావడాన్ని ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అంటారు. ఈ నొప్పి పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా వస్తుంది.
కారణాలు: ∙డయాబెటిస్ ∙ఊబకాయం/బరువు ఎక్కువగా ఉండటం ∙ఎక్కువ సేపు నిలబడటం, పనిచేస్తూ ఉండటం ∙చాలా తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువ చురుకుగా పనిచేయడం ∙హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో వచ్చే నొప్పికి ఇది ముఖ్యమైన కారణం).
లక్షణాలు: ∙రాత్రిళ్లు నొప్పి అధికంగా వస్తుంది ∙మడమలో పొడిచినట్లుగా నొప్పి ఉంటుంది ∙కండరాల నొప్పులు వ్యాధి నిర్ధారణ: అల్ట్రాసౌండ్ స్కానింగ్
చికిత్స: హోమియో విధానంలో మడమనొప్పికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను విశ్లేషించి, తగిన మందులను వైద్యులు సూచిస్తారు. మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడోడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రస్టాక్స్, అమోనియమ్ మూర్ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని వైద్యనిపుణుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు వెంటనే అనుభవజ్ఞులైన హోమియో వైద్య నిపుణుడిని సంప్రదించండి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి హైదరాబాద్
హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సతో గుండె దిటవు!
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా భార్య వయసు 45. మూడు నెలల క్రితం హఠాత్తుగా కుప్పకూలిపోవడంతో ఆసుపత్రిలో చేర్పించాం. అప్పటికే తనకు షుగర్, హైబీపీ ఉంది. ఆమె అకస్మాత్తు అనారోగ్యానికి కారణం హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పారు. ప్రస్తుతానికి పరిస్థితిని అదుపు చేసినా గుండెమార్పిడి ఆపరేషన్‌కు సిద్ధం కావాలని ఆ హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు. జీవన్‌దాన్‌లో పేరు కూడా నమోదు చేసుకున్నాం. అయితే మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తనను కాపాడగలుగుతుందా? అది ఎంతకాలం? దయచేసి వివరించండి.
– సుధీర్, సిద్ధిపేట
అధిక రక్తపోటు, డయాబెటిస్ వల్ల మీ భార్య గుండెకు చాలా నష్టం జరిగినట్లుంది. స్థూలకాయం, వాపులు, ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి కూడా వాటికి తోడయి ఉండవచ్చు. ఈ కారణాలు హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తాయి. దాంతో రోగులు అలసిపోయినప్పుడు, పడుకున్నపుపడు శ్వాస అందకపోవడం, మితిమీరిన అలసట, ఒళ్లు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె ఇక ఏమాత్రం పనిచేయలేని స్థితి (ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్)కి చేరుకున్న వ్యాధిగ్రస్తులకు గుండెమార్పిడే ప్రాణరక్షణకు గల ముఖ్యమైన ప్రత్యామ్నాయం. కాలేయం, మూత్రపిండాలు. ఊపిరితిత్తులకు సంబంధించి తీవ్రమైన వ్యాధులు ఏమీ లేనట్లయితే హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్లవచ్చు.
వ్యాధిగ్రస్తమై పనిచేయలేని స్థితిలో ఉన్న గుండెను తొలగించి, దాని స్థానంలో ఆరోగ్యకరమైన మరో గుండెను అమర్చడానికి చేసే సర్జరీనే గుండె మార్పిడి శస్త్రచికిత్స. అవయవ దానానికి అంగీకరించిన వ్యక్తి బ్రెయిన్ మృతిచెందిన (బ్రెయిన్‌డెడ్ అయిన) వెంటనే అతడి నుంచి సేకరించిన గుండెను అవసరమైన రోగికి అమర్చుతారు. కొత్తగా అమర్చిన గుండెను రిజెక్షన్ నుంచి కాపాడతారు. అంటే కొత్తగా అమర్చిన అవయవాన్ని శరీరం తిరస్కరిస్తుంది. అలా ఆ రోగి సొంత రోగనిరోధక వ్యవస్థ కొత్త గుండెపై దాడి చేస్తుంది). అలా జరిగినప్పుడు ఆ కండిషన్‌నుంచి కాపాడటమే రిజెక్షన్ నుంచి కాపాడటం అన్నమాట. శస్త్రచికిత్స ద్వారా అమర్చిన గుండె కొత్తవ్యక్తి శరీరంలో సర్దుకుపోయేందుకు అవసరమైన ఇంజెక్షన్లు, మందులు ఇస్తారు. రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతారు. అదే సమయంలో మార్చిన గుండెను కాపాడుకుంటూ అది సరిగా పనిచేసేట్లు చూసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్న వ్యక్తికి, కుటుంబానికి తెలియజెబుతారు.
గుండెమార్పిడి ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తులు సర్జరీ తర్వాత ఇరవై నుంచి ముప్పయి ఏళ్లకు పైగా ఆరోగ్యంగా జీవిస్తున్న దాఖలాలు ఉన్నాయి. గుండె వ్యాధుల చికిత్స రంగం, ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్స్ మన వద్ద కూడా బాగా అభివృద్ధి చెందింది. గుండెమార్పిడి సర్జరీ గురించి మీరు ఆందోళన పడాల్సిన పనిలేదు.
డాక్టర్ పి.వి.నరేశ్ కుమార్, సీనియర్ కార్డియో
థొరాసిక్ అండ్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్