
నేటి భారతం
నా పేరు భారతమ్మ. ముత్తారం ఫస్ట్ లేడీ సర్పంచ్‌ని.
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది.
తెల్లావు కడుపులో నల్లావు పుట్టదా?
నల్లావు ఇచ్చే పాలు తెల్లగా ఉండవా?
మనిషి ప్రకృతిలో భాగం.
ప్రకృతి దేవుడిలో భాగం.
సమానంలోనే సమ్మానం ఉంది. సన్మార్గంలోనే సన్మానం ఉంది.
కులానికి కొమ్ములు వద్దు.. వద్దు.. వద్దు.
కులమే వద్దు.. వద్దు.. వద్దు!!
- రామ్, ఫీచర్స్ ఎడిటర్
నా పేరు భారతమ్మ. ముత్తారం ఫస్ట్ లేడీ సర్పంచ్‌ని. ఆ సంతోషం కన్నా ఇప్పుడు ఇన్‌సల్టే ఎక్వగ అనుభవిస్తున్న. పెద్ద కులస్తుల అహంకారానికి బలైన. గా విషయం చెప్పేకంటే ముందు నేనెవర్నో సర్పంచ్‌గ ఎట్ల గెలిచిన్నో చెప్తా!
నేపథ్యం: నేను పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం వరంగల్ జిల్లా) భీమదేవరపల్లి మండలం, చాపగానితండా పక్కనున్న రాజు తండా. మావోల్లు అంటే మా అమ్మ, బాపు యెవసాయం చేసేటోళ్లు. నేను అయిదో తరగతి దాకా సదువుకున్న. 19 ఏళ్ల కిందట ముత్తారం తండాలో ఉంటున్న కొర్ర దేవ్‌సింగ్‌తో పెండ్లయింది. నా మొగడు ఐటిఐ చేసిండు. మా అత్తగారోల్లకు రెండెకరాల భూమి ఉంది. నేను, ఆయన ఇద్దరం గూడా యెవుసమే చేసుకొనేటోల్లం. కాలం లేక పంటల్లేవు. ఉన్నా యెవుసంలో అంతా తుట్టే (నష్టమే). పైసలకు మస్తు కష్టం అయితుండే. గందుకనే పదేండ్ల కిందట్నే రెండు ఆవులను కొన్నం. పాలు అమ్మి బతుకుడు మొదలువెట్టినం. మాకు ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డ సంగీత. ఇంటర్ సదువుతుంది. చిన్న బిడ్డ సింధు. పాలిటెక్నిక్ జేస్తుంది. కాలం మంచిగ జేస్తే మక్కలు, వరి పండిస్తం. ఆ పంట పైసలు, పాల పైసలతో ఇల్లు ఎల్లదీస్తం.
ఎస్టీ రిజర్వేషన్: మా ఊరి సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వేషన్ అయింది. మస్తుమంది మా ఇంటికొచ్చి ‘ఎస్టీ మహిళకు రిజర్వేషన్ అయింది కదా.. సర్పంచ్‌గా నువ్వు పోటీ చెయ్.. మేం గెలిపిస్తం’ అని అన్నరు. మా ఆయన కూడా అవ్ చెయ్ అని బలమిచ్చిండు. గందుకనే సర్పంచ్‌గా నిలవడ్డ. అన్నట్టుగనే అందరు కలిసి నన్ను గెలిపించిండ్లు. నేను సర్పంచ్ అయితనని ఎన్నడనుకోలే. గెలిచినంక సంతోషమైంది. మస్తు పనులు చేయించిన. మా తండాల, ఉర్లే.. లైట్లు వెట్టిచ్చిన. నీళ్లకు మస్తు బాధయితుండే. గందుకనే ట్యాంక్‌లు కట్టించి నీళ్లకు ఏ బాధ లేకుండా జేసిన. నా ప్రతి కష్టంల మా ఆయన తోడున్నడు.
వివక్ష...: సర్పంచ్ అయినంక గూడా బాయికాడికి పోయి పొలం పనులు చేసిన. పాలు పిండిన. అసలెన్నడూ నేను సర్పంచ్‌ననే ఫీలింగలనే లేను. కాని మా ఊర్లె కొంతమంది పెద్దకులపోళ్లు మొదటిసందీ నన్ను సర్పంచ్ తీర్గ లెక్కగట్టనేలేదు. ఆ గౌరవం ఇయ్యలేదు. ఏందే.. గీందే.. అనే పిలిశేటోల్లు. మస్తు బాధయితుండే. నా భర్తను కూడా ఒరేయ్, తొరేయ్ అని అనేటోళ్లు. అయినా ఆల్లను మేం ఒక్కమాట అన్లే. మా ఊర్లె ఎస్సీ, ఎస్టీలు తప్ప పెద్ద కులపోల్ల సపోర్టే ఉండకపోతుండె. ఎస్సీ, ఎస్టీల సపోర్ట్‌తోనే ఊరికి, తండాకు గావల్సినయి చేసుకొత్తాన్న.
అరే లంబాడోడా...: ప్రతి దసరాకు మా ఊర్లె గ్రామదేవతల దగ్గర పూజలు జరుగుతయి. ఆ పూజను ఊరి సర్పంచే చేస్తడు. గా లెక్కన ఆ వంతు నాకొచ్చింది సర్పంచ్ అయినంక. ఆ రోజు పొద్దుగల నేను, మా ఆయన మోటర్‌సైకిల్ మీద మా అమ్మోల్లింటికి పోయి సాయంత్రం నాలుగ్గంటలకు మల్లా ముత్తారం వచ్చినం. రాంగానే టైమైతుందని ఇంటిక్కూడా పోకుండా సక్కగా గ్రామపంచాయితీ ఆఫీస్‌కే పోయినం. అప్పటికే అక్కడ మంది ఉన్నరు. అప్పటికే పటేండ్లు పూజ కార్యక్రమం చేసిండ్లు. మేం ఇంకా ఆఫీస్‌కాడికి చేరుకోనన్నా లేదు.. ఆ పటేండ్లు మా మోటర్‌సైకిల్‌కి ఎదురొచ్చి ‘అరే లంబాడోడా.. ఇంకా ఎప్పుడొత్తవురా?’ అంటూ బండ బూతులు తిట్టుకుంట నన్ను, మా ఆయనను చెప్పుతో కొట్టిండ్లు. పిడిగుద్దులు గుద్దిండ్లు. అసలేమైతాందో మాకు అర్థంగాలే. వాల్లు మమ్ముల్నెందుకు కొట్టిండ్లో తెల్వలే. గింతట్లనే ఆ కొట్టుడు సప్పుడు విని అన్నికులాలోల్లు ఆడికి వచ్చిండ్లు. ‘గాల్లనట్ల ఎందుకు కొడుతుండ్లు?’ అని నిలదీసేసరికి ఆడికెంచి పటేండ్లు ఎల్లిపోయిండ్లు. యెంటనే మేం పోలీసోల్లకు ఫోన్ జేసినం. ఫోన్ జేసిన ఎంటనే పోలీసులు వచ్చిండ్లు. జరిగిన సంగతంతా ఎస్సైకి చెప్పినం. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ముల్కనూర్ పోలీస్‌స్టేషన్‌కు పోయి కంప్లయింట్ కూడా ఇచ్చినం. కాని పోలీసోల్లు పట్టించుకోలే. ఎందుకైనా మంచిదని మమ్ముల్ని కొట్టిన మాజీ సర్పంచ్ ఏనుగు ఈశ్వర్‌రెడ్డి, ఏనుగు సత్తిరెడ్డి, ఏనుగు మధు, రాజేంద్రప్రసాద్‌లను గ్రామపంచాయితీ ఆఫీస్‌కాడికి పిలిపించినం.
ఆల్లు రాలే. పోలీసోల్లు కేస్ వెట్టలే. ఎట్లరా దేవుడా.. అనుకుంట మేం మా కులం పెద్దలకు, ఎమ్మార్పీయస్ నాయకులకూ చెప్పుకున్నం. పదమూడో తారీఖున పోలీసులు మా ఊర్లెకొచ్చిండ్లు. మమ్ముల్ని చెప్పుతో కొట్టంగ చూసిన ఊరోళ్లంతా గా పోలీసోళ్లకు సాక్ష్యం సూత చెప్పిండ్లు. అయినా ఆల్ల మీద కేసు వెట్టలేదు. పద్నాలుగో తేదీనాడు జాతీయ మహిళా అధ్యయన కమిటీ సభ్యురాలు, ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత మేడంతోపాటు ఎమ్మార్పీయస్ నాయకులు సుత పోలీస్‌స్టేషన్‌కొచ్చి ఎస్సైని గట్టిగా అడిగిండ్లు. అప్పుడు ఎస్సై సంతోష్‌కుమార్ మా దగ్గర మల్ల కంప్లయింట్ తీసుకొని పద్నాలుగో తారీఖునే కంప్లయింట్ ఇచ్చినట్లు చేసి... సాయంత్రం మమ్ముల్ని గొట్టిన ఆ నలుగురిపై కేసు పెట్టిండు. కాని వాల్లను అరెస్ట్ అయితే చెయ్యలే.
కడుపు మండుతాంది: మాకు జరిగిన ఆ అవమానం తల్సుకుంటే కడుపు మండుతాంది. గిసుంటి ఇన్‌సల్ట్ పగోల్లకు కూడా రావద్దు దేవుడా.. (కళ్లనిండా నీళ్లతో). లంబాడోల్ల కులంల పుట్టుడే మేం చేసుకున్న పాపమా? అదే పెద్ద తప్పయినట్టుంది. తక్కువ కులంలో పుట్టుడే మాకు శాపమైనట్టుంది. లేకపోతే గింత అవమానమా? రెండు అవమానాలు నాకు. నాది లంబాడి కులమైనందుకు.. నేను ఆడదాన్ని అయినందుకు. పొయ్యి మా అవమానం గురించి చెప్తే కూడా పోలీసోల్లు పట్టించుకోక పోవడం ఇంకెంత తప్పు? అదే పెద్ద కులపోల్లకైతే గిట్లనే చేస్తరా? అరే.. ఊరికి నేను సర్పంచ్‌ని.. అంటే ప్రథమ పౌరురాలిని.. నాకే గిట్లాంటివి ఎదురైతే.. మిగిలిన సామాన్య దళితులు. సామాన్య మహిళల సంగతేంగాను? మనం ఏడున్నం? సదువు సంస్కారం నేర్పతదంటర.. గిదేనా గాల్ల సంస్కారం? చిన్న కులమని మమ్మల్ని నీచంగా చూస్తాండ్రు.. మరి పెద్ద కులం ఆల్లకు నేర్పిన సంస్కారం గింతేనా? ’... భారతమ్మ ఆవేదన కళ్ల నీళ్లుగా ప్రవహిస్తూనే ఉంది. - తల్లపల్లి సురేందర్ రిపోర్టర్, భీమరదేవరపల్లి, వరంగల్ జిల్లా
శిక్షపడాలె: కేవలం లంబాడోల్లు దసరా చేస్తున్నరనే కుల వివక్షతో పటేండ్లు నా మీద, నా భార్య మీద చెప్పుతో దాడి చేసి, బూతులు తిట్టిండ్లు. ఈ కాలంలో కూడా ఊర్లల్ల కుల వివక్ష పోలేదు. మా మీద దాడి చేసినోల్లను పోలీసులు అరెస్ట్ చేయలేదు. మస్తు బాధయితాంది. వాల్లకు తగిన శిక్షపడాలే. - కొర్ర దేవ్‌సింగ్ (భారతమ్మ భర్త)
వెంటనే అరెస్ట్ చేయాలి..: కులంపేరుతో దూషిస్తూ ఓ మహిళా సర్పంచ్‌ను, ఆమె భర్తను చెప్పుతో కొట్టిన పెద్ద కులస్తులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అన్యాయం. దారుణం. వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి. - పచ్చునూరి కరుణాకర్ అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
మహిళలకు రక్షణ లేదు
మన దగ్గర మహిళలకు రక్షణ లేకుండా పోయింది. గిరిజన మహిళా సర్పంచ్ కొర్రా భారతి మీదా, ఆమె భర్త మీదా పెద్ద కులస్థులు దాడి చేయడం సభ్యసమాజానికే సిగ్గుచేటు. ఇది ఒక్క భారతి పైన జరిగిన దాడి కాదు. యావత్ దళిత జాతి మీద జరిగిన సంఘటనగా మేం భావిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మహిళా సర్పంచ్‌లకు పోలీస్ రక్షణ కల్పించాలి. ఈ దాడి కారకులను కఠినంగా శిక్షించాలి. లేకపోతే ఇలాంటి దారుణాలు మరిన్ని జరిగే ప్రమాదం ఉంది. - ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, జాతీయ మహిళా అధ్యయన కమిటీ సభ్యురాలు.
కేసు నమోదు చేశాం...:
భారతి మీద, ఆమె భర్త మీద దాడిచేసిన వాళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాం. కాజీపేట ఏసీపీగారు విచారణ చేయాల్సి ఉంది. - సంతోష్‌కుమార్, ఎస్సై, ముల్కనూర్