నిర్మల,అల్లు అరవింద్
ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇండస్ట్రీ అల్లు అరవింద్! ఇప్పటికీ బిజీ! కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు. అంత ఖాళీ లేనప్పుడు ఇప్పుడెలా కూర్చున్నారు?! ఇంత దగ్గరగా! ఇంత లవ్‌లీగా! ఇంత ప్లెజెంట్‌గా! ఇదంతా ఆయన బెటర్ హాఫ్ నిర్మల ఆయనకు ఇచ్చిన స్పేస్! స్పేస్ చేసుకోవడం కాదు.. స్పేస్ ఇచ్చుకోవడం ఉంటే.. ఆ దాంపత్యం ఎప్పటికీ స్వీట్ అండ్ స్ట్రాంగ్ అంటున్నారు.. మిస్టర్ అండ్ మిసెస్ అల్లు అరవింద్.
మీ పెళ్లి బంధం ‘అల్లుకున్న’ రోజుల గురించి?
అరవింద్: (నవ్వుతూ)... మా నాన్నగారు, నిర్మల పెదనాన్న ఫ్రెండ్స్. ‘మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మావాడు పల్లెటూరి అమ్మాయిని చేసుకోనంటున్నాడు. మినిమమ్ విజయవాడ అమ్మాయి అంటున్నాడు. చూడండి’ అని ఆయనతో మా నాన్నగారు అంటే, ‘మా తమ్ముడు కూతురు పెళ్లీడుకొచ్చింది. వాళ్లతో మాట్లాడతాను’ అన్నారాయన. ఆ తర్వాత నాన్నగారు వెళ్లి చూసొచ్చి, ‘అమ్మాయి బాగుంది. నాకు నచ్చింది’ అని చెప్పేశారు. నేను చూడ్డానికి వెళ్లాక పెద్దగా ఇంటర్వ్యూలు లేవు. అమ్మాయిని చూపించారు. అంతే.. తాంబూలాలు మార్చుకున్నారు.
పెళ్లిచూపులకి, పెళ్లికి మధ్య గ్యాప్ ఎంత?
అరవింద్: 1974లో మా పెళ్లి జరిగింది. పెళ్లి చూపులకి, పెళ్లికి మధ్య ఐదు నెలలు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో ఓసారి కాఫీకి తీసుకెళదామని ట్రై చేశాను. ‘మా అమ్మను అడగండి’ అంది. ‘నువ్వు అడుగు. వాళ్లు పంపిస్తే వెళదాం’ అన్నాను. ఊహూ అంది. యాక్చువల్‌గా మా అత్తగారు పాతకాలం మనిషిలా ఉండరు. అప్పట్లో మా అత్తగారిని మ్యానేజ్ చేసుకుని ఉంటే, ఈవిడని కాఫీకి తీసుకెళ్లగలిగేవాడిని. ముందు అది తెలియలేదు. ఆ తర్వాత మా అత్తగారు పాతకాలపు మనిషి కాదని తెలిసింది.
మీకు ముగ్గురు సిస్టర్స్. మీ పెళ్లయ్యేనాటికే వాళ్ల పెళ్లయిందా?
అరవింద్: నా చెల్లి వసంత పెళ్లి, మా పెళ్లి ఒక్క రోజు తేడాలో జరిగింది. ఏప్రిల్ 7న మా పెళ్లి. 8న ఇద్దరి రిసెప్షన్ ఒకే రోజు జరిగింది.
మరి.. పెళ్లయ్యాక కాఫీకి వెళ్లారా?
నిర్మల: వెళ్లాం. మా రిసెప్షన్ మదరాసులో జరిగింది. ఆ వేడుక కోసం మా అమ్మానాన్న వచ్చారు. వాళ్లని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కి వెళ్లాం. ఇంటికి వచ్చేటప్పుడు భుహారీ హోటల్‌లో కాఫీ తాగాం. అప్పట్లో అది పెద్ద హోటల్.
అరవింద్‌గారిలో మీకు నచ్చిన లక్షణాలు?
నిర్మల: దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. కూల్‌గా ఉంటారు. అది బాగా నచ్చుతుంది. అయితే మా పెళ్లయిన కొత్తలో ‘ఏంటీ.. ఏం చెప్పినా సీరియస్‌గా తీసుకోరు’ అనుకునేదాన్ని.
అరవింద్: మామూలుగా భర్త అంటే కొంచెం సీరియస్‌గా అలా ఉంటారు కదా. నేనలా ఉండకపోయేసరికి కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది. ఇంత లైట్‌గా ఉన్నారేంటి అనుకుంది. అయితే కొన్ని సందర్భాల్లో నా కోపం చూసి, ఓహో కోపం కూడా వస్తుందనుకుంది.
మీ కుటుంబానికి సినిమా పరిశ్రమతో సంబంధం లేదు కదా.. మరి ‘అల్లువారింట్లో’ అడ్జస్ట్ కావడానికి ఇబ్బందిపడ్డారా?
నిర్మల: మా నాన్నగారిది ఆయిల్ బిజినెస్. సినిమాలతో సంబంధం లేదు. దాంతో పూర్తిగా వేరే కల్చర్‌లోకి వచ్చినట్లు అనిపించింది. మాది బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి ఇంట్లో చాలామంది పనివాళ్లు ఉండేవారు. నాన్న బిజినెస్ వ్యవహారాలు చూసుకునేదాన్ని. అంత లిబరల్‌గా పెంచారు. నన్ను క్వీన్‌లానే చూసుకున్నారు.
మరి అత్తింట్లో కూడా క్వీన్‌లానే ఉన్నారా?
నిర్మల: అరవింద్‌గారు, ఇంకా అందరూ అలానే చూసుకుంటారు (నవ్వుతూ).
అరవింద్: అయితే తనకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ. ఇంటికి పెద్ద కోడలిగా అన్నీ చూసుకుంది. పెళ్లికి ముందు ఉన్నంత లిబరల్‌గా అయితే లేదు.
జాయింట్ ఫ్యామిలీనే కదా?
నిర్మల: అవును. మా పెళ్లితో పాటు ఒక ఆడపడుచుకి పెళ్లయింది. తను కూడా కొన్నాళ్లు మాతోనే ఉంది. ఈయన అక్కగారు పెళ్లి చేసుకోలేదు. అప్పటికి సురేఖ (చిరంజీవి సతీమణి)గారికి కూడా పెళ్లి కాలేదు. సురేఖగారిది, నాదీ ఇంచు మించు ఒకే ఏజ్ కావడంతో బాగా కలిసిపోయేవాళ్లం. మా పుట్టింట్లో మా మేనత్తలతో కలిసి పెరిగాను. అలా ఉమ్మడి కుటుంబం నాకు అలవాటే. దాంతో ఇబ్బందిగా అనిపించలేదు.
అరవింద్: తనకి మనుషులంటే ఇష్టం.
చిరంజీవిగారు, సురేఖగారి పెళ్లి మీ చేతుల మీద జరిగిందనుకోవచ్చా?
అరవింద్: అవును... దగ్గరుండి తనే బాధ్యతగా చేసింది.
స్క్రీన్‌పై మీ మావయ్య (అల్లు రామలింగయ్య) గారు కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. నటుడిగా అంత జోవియల్‌గా కనిపించిన ఆయన మీతో ఎలా ఉండేవారు?
అరవింద్: ఈవిడకి ఆయన వెరీ గుడ్ ఫ్రెండ్.
నిర్మల: అవును. మావయ్యగారు వెరీ ఫ్రెండ్లీ.
అరవింద్: ఆయనకు భోజనం పెట్టడం అన్నీ చేసేది. వయసు పైబడిన తర్వాత నాన్నకు ఆరోగ్యం సహకరించకపోతే భోజనం తినిపించేది. మామాకోడలు అంత బాగుండేవాళ్లు.
నిర్మల: నన్ను కూతుళ్లతో సమానంగా చూశారు. ఎప్పుడూ నన్ను పేరుతో పిలవలేదు. ‘అమ్మాయి’ అనే పిలిచేవారు. ఆయన షూటింగ్ నుంచి ఇంటికొచ్చాక వీళ్లెవరూ దొరికేవారు కాదు. దాంతో ఏదైనా చెప్పాలనుకుంటే నాతోనే షేర్ చేసుకునేవారు.
అరవింద్: నాపై చాడీలు కూడా చెప్పేవారు. ‘ఆ వెధవ...’ అంటూ నన్ను తిట్టేవారు. మా కాపురంలో పుల్లలు పెట్టేవారు కూడా (నవ్వులు).
నిర్మల: అవును.. ‘చూడమ్మాయి.. వాడు లేట్‌గా వస్తున్నాడంటే పని ఉందని కాదు.. నువ్వు జాగ్రత్తగా ఉండాలి’ అనేవారు.
అరవింద్: ఎలా చెప్పేవారంటే.. ‘అమ్మాయి.. వాడు పది తర్వాత ఇంటికి వచ్చాడు. అంత పనేం లేదు. ఓ కంట కనిపెట్టు’ అనేవారు.
అవి విన్నప్పుడు మీకు భయం అనిపించేదా?
నిర్మల: అలా ఏం లేదు. మావయ్యగారు అలా అన్నారని ఆయనతో చెప్పేదాన్ని. ఇద్దరం నవ్వుకునేవాళ్లం.
అరవింద్: నాన్నతో ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు చాలా గౌరవం కూడా ఇచ్చేది. అంతెందుకు? ఇప్పటికీ మా అమ్మ అలా హాల్‌లోకి వస్తే టక్కున లేచి నిలబడుతుంది.
నిర్మల: ఆ రోజుల్లో అత్తగారు అంటే.. అలానే గౌరవించేవాళ్లు. ఆరోగ్యం సహకరించినంత వరకూ అత్తయ్యగారే అన్నీ చూసుకున్నారు. వంట చేసేటప్పుడు మాత్రం ఏం చేయాలని మాట్లాడుకుని చేసేవాళ్లం. నేను నాన్‌వెజ్ పెద్దగా తిననని నా కోసం వేరే చేసేవారు. నాకు వేడిగా తినడం అలవాటు. అందుకని అందరి కోసం వెయిట్ చేయకుండా తినమనేవారు. దాంతో నాకు అమ్మ ఇంటికి, అత్తింటికి తేడా తెలియలేదు.
అత్తగారిని చూడగానే లేచి నిలబడే జనరేషన్ నుంచి వచ్చారు. మారిన కాలంలో ఇప్పటి కోడళ్లు అలా చేయకపోవచ్చు. ఈ మార్పు?
నిర్మల: ఆ రోజుల్లో అలా ఒక అలవాటు ఉండేది. అత్తయ్యగారు అని కాదు. అప్పట్లో పెద్దవాళ్లు ఎవరు వచ్చినా లేచి నిలబడటం అనేది ఒక పద్ధతి. అప్పట్లో ఆడవాళ్లు పెద్దగా బయటకు వెళ్లడం ఉండేది కాదు. ఇప్పుడు ఆడవాళ్లు బయటకు వెళుతున్నారు. నిరూపించుకుంటున్నారు. ఇప్పటి కోడళ్ల అలవాట్లు ఇప్పటి కాలానికి కరెక్ట్.
అరవింద్: మీకో విషయం చెప్పనా.. మా ఆవిడని ‘ఉత్తమ అత్తగారు’ అని మా కోడళ్లే చెబుతారు. అందుకే ఇంకా ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాం. అత్తాకోడళ్లు ఫ్రెండ్లీగా ఉంటారు. మా కోడళ్లు మా ఆవిడని ‘నో నాన్సెన్స్’ అత్తగారు అని అంటారు (నవ్వుతూ).
ఉమ్మడి కుటుంబంలో గొడవలు లేకుండా ఉండాలంటే ఏదైనా టిప్స్?
నిర్మల: నేను ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంటాను. కాలంతో పాటు మనం కూడా మారాలి. ఫలానా విషయం గురించి బన్నీకి చెప్పకపోయావా అమ్మా? అంటే బన్నీ గురించి మీకు తెలుసు కదా అత్తయ్యా అంటుంది.
అరవింద్: వారి జీవితాలను ఓవర్‌ల్యాప్ చేయం. ఎవరి స్పేస్ వారికి ఇస్తాం.
బాబీ, బన్నీ, శిరీష్.. ఈ ముగ్గురి మనవళ్లను చూసుకుని అల్లు రామలింగయ్యగారు మురిసిపోయిన విశేషాల గురించి?
అరవింద్: పిల్లలతో బాగా ఆడుకునేవారు. మా పెద్దబ్బాయి బాబీ మీద ఒకసారి ఆయనకు ఎందుకో కోపం వచ్చింది. కర్ర తీసుకుని, వాడిని కొట్టడానికి ముందుకొస్తే, బాబీ పరిగెత్తాడు. కొంచెం పరిగెత్తాక ‘రేయ్.. ఆయాసం వస్తోంది. వచ్చి ఒక దెబ్బ తిని వెళ్లు’ అంటే, వాడు దగ్గరకొచ్చి ఒక్క దెబ్బ తిని వెళ్లాడు (నవ్వుతూ).
అరవింద్‌గారు 45 ఏళ్ల వయసులో తన తండ్రితో చెంప దెబ్బ తిన్నారు. ఆ విషయాన్ని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. ఆ చెంప దెబ్బ విషయం మీకు తెలుసా?
అరవింద్: కారు ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ, ఇంటికి రాగానే బ్రేక్ స్పీడ్‌గా వేశాను. నాన్నగారు విండ్ షీల్డ్‌కి కొట్టుకోబోయారు. ఆ కోపంతో నా చెంప మీద ఒక్కటిచ్చారు. మా ఆవిడ చూసేసిందేమోనని కంగారుపడ్డాను కానీ చూడలేదు. ఈ వయసులో కూడా నాన్నతో తన్నులు తిన్నాడనుకుంటుందేమోనని కంగారు. లోపలికెళ్లి నాన్న కొట్టిన విషయం చెప్పి, అమ్మ దగ్గర గొడవపడదామనుకున్నాను. కానీ అమ్మతో చెప్పేటప్పుడు తను వింటుందేమోనని మ్యాటర్‌ని సైలెంట్ చేసేశాను. కట్ చేస్తే.. బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే ఎందుకండీ మావయ్యగారు అలా కొట్టారు అంది. అబ్బా... తెలిసిపోయిందనుకున్నాను. తను వరండాలో నిలబడి చూసిందట. నాన్న నన్ను అలా కొట్టగానే భయపడి లోపలికి పారిపోయింది.
పిల్లల పెంపకం బాధ్యతను ఇద్దరూ సమానంగా తీసుకున్నారా?
అరవింద్: నేను బాధ్యత తీసుకోలేదు. ఆ అవసరం రాకపోవడం నా అదృష్టమనే చెప్పాలి. 1973లో ఇండస్ట్రీకి వచ్చినప్పటినుంచి ఈరోజు వరకూ బిజీగా ఉన్నాను. పిల్లల విషయాలను మా అమ్మ, నా పెద్ద చెల్లి వసంత, ఈవిడ.. ఈ ముగ్గురూ చూసుకున్నారు. మా చెల్లి కొన్నాళ్లు మాతోనే ఉంది. ఆవిడకి మేనల్లుళ్లు అంటే చాలా ప్రేమ. ఇప్పటికీ బాబీ, బన్నీ, శిరీష్ మా మీద కోపం వస్తే వాళ్ల మేనత్తకి కంప్లైంట్ చేస్తారు.
బన్నీ (అల్లు అర్జున్)ని హీరోని చేయాలని ఎవరు అనుకున్నారు?
నిర్మల: మా పెళ్లయిన నాలుగైదేళ్లకు చిరంజీవిగారితో సురేఖగారి పెళ్లి జరిగింది. ఆ తర్వాత చిరంజీవిగారి ఫంక్షన్స్ అవీ చూసి, బన్నీ హీరో అయితే బాగుంటుందనుకునేదాన్ని. ఇలాంటి ఫంక్షన్స్ జరుగుతాయి.. స్టేజ్ మీద బన్నీని చూసుకోవచ్చు అనే ఇమాజినేషన్ ఉండేది. కానీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి, మెచ్యుర్టీ వచ్చాక ఇండస్ట్రీలోకి వెళితే బాగుంటుందనుకునేదాన్ని. అయితే తను ఇష్టపడితేనే.. నా అభిప్రాయాన్ని పాటించాలనుకునేదాన్ని కాదు.
మీక్కూడా బన్నీని హీరోగా చూడాలని ఉండేదా? ఫస్ట్ సినిమా ‘గంగోత్రి’తో పోల్చితే ఆ తర్వాతి సినిమాల్లో బన్నీ మేకోవర్ సూపర్.. అలా మార్చుకున్న తీరు గురించి?
అరవింద్: బన్నీకి పట్టుదల ఎక్కువ. అనుకుంటే సాధిస్తాడు. యానిమేషన్ స్కూల్‌లో అడ్మిషన్ కావాలి. రోజుకు పది నుంచి 12 గంటలు ప్రాక్టీస్ చేస్తే కానీ అక్కడ పాస్ అవుతారు. ఓ మూడు నెలలు ప్రతి రోజూ 12 గంటలు సాధన చేశాడు. అక్కడ అడ్మిషన్ వచ్చింది. బన్నీ మంచి యానిమేటర్. అయితే సీట్ వచ్చాక ‘గంగోత్రి’కి చాన్స్ వచ్చింది. ‘ఒక సెమిస్టర్ మానేయ్.. ‘గంగోత్రి’ క్లిక్ అయితే చూద్దాం’ అన్నాను. ‘గంగోత్రి’ తర్వాత ‘ఆర్య’ చేశాడు. ప్రూవ్ చేసుకున్నాడు. దాంతో హీరోగా కంటిన్యూ అయ్యాడు.
అరవింద్‌గారికి ఇంటిని పట్టించుకునే తీరిక లేదు కాబట్టి ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య వాదనలు జరిగేవా?
నిర్మల: అలా ఏం లేదు. ఇల్లు బాగుండాలంటే నేనన్నా వర్క్ చేయాలి లేదా ఆయన అయినా వర్క్ చేయాలి. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండాలంటే ఆయన నాతోనే ఉండాలి అనుకుంటే కుదరదు. నేను ఈ జనరేషన్ వాళ్లకి అదే చెబుతాను. మనం అన్ని సౌకర్యాలు అనుభవించాలంటే జీవిత భాగస్వామికి తప్పనిసరిగా స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు అరవింద్‌గారినే తీసుకోండి.. ఆయన ఏ పనీ చెయ్యకుండా నాతోనే ఉండాలి అనుకుంటే గీతా ఆర్ట్స్‌లాంటి పెద్ద సంస్థను ఎలా మేనేజ్ చేస్తారు? మా పిల్లలకు అన్నీ సమకూర్చాలంటే ఆయన స్పేస్ ఆయనకు ఇవ్వాల్సిందే. అలా కాకుండా బాగా పని మీద ఉన్నప్పుడు ‘ఇంటికి రండి’ అని నేను సతాయించకూడదు. అలా ఇంట్లోవాళ్లు సతాయిస్తే.. ‘అయ్యో ఇంటికి వెళ్లాలా’ అని ఆలోచిస్తారు. ఆ ఆలోచన రాకుండా మేనేజ్ చేయటంలోనే నేను ఆయనకు స్పేస్ ఇచ్చినట్లు. తప్పనిసరిగా ఆయనకు ఆ క్రియేటివ్ స్పేస్ నేను ఇస్తాను.
ఫైనల్లీ.. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఏం చేయాలి?
అరవింద్: భార్యాభర్తల మధ్య నమ్మకం ముఖ్యం. మా పెళ్లైన ఈ 45 సంవత్సరాల్లో ఇంత పెద్ద గ్లామర్ ఇండస్ట్రీలో నేను ఉన్నప్పటికీ ఏనాడూ తను నన్ను అనుమానించలేదు. అదే మా పెద్ద సక్సెస్. అసలు మనస్పర్థలను రోజుల తరబడి సాగనివ్వకూడదు. ఏదైనా సరే ఇద్దరూ కూర్చుని, మాట్లాడుకోవాలి.
నిర్మల: మళ్లీ చెబుతున్నాను. పార్టనర్‌కి స్పేస్ ఇవ్వండి. మా ఇద్దరి విషయంలో మొదట్లోనే ఓ అగ్రిమెంట్ ఉంది. అదేంటంటే ‘క్యారెక్టర్ ఈజ్ యువర్‌సెల్ఫ్’. అంటే.. నువ్వేంటో అదే నీ క్యారెక్టర్ అని. ఆ క్యారెక్టర్ మీరు ఎలా చేసుకుంటారో అది మీ ఇష్టం. అందుకని ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని మేం ఒకరికొకరు చెప్పుకోం. మన క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉంటాం. మా జీవితం హ్యాపీగా గడిచిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే.
భార్యాభర్తలు కష్ట సుఖాలను సమానంగా పంచుకుంటూ ముందుకెళ్లడం మంచి వైవాహిక జీవితానికి నిదర్శనం. మీ జీవితంలో జరిగిన ఓ విషాద ఘటన (కుమారుడు చనిపోవడం) తాలూకు బాధను ఎలా అధిగమించారు?
అరవింద్: ఫ్యామిలీ సపోర్ట్ ముఖ్యం అండీ. నిర్మల కూడా చాలా ధైర్యం ఉన్న మనిషి. మా మూడో అబ్బాయి శిరీష్ పుట్టడం వెనకాల ఒక కారణం ఉంది. బన్నీ తర్వాత పుట్టిన అబ్బాయి చనిపోయాడు. ఆ బాబుకి ఐదేళ్లు. మాకు ఊహించని షాక్. ముగ్గురు బాబులు ఉన్నారు కదా, ఇక పిల్లలు వద్దనుకుని ఆపరేషన్ చేయించుకుంది. కానీ మూడో బాబు చనిపోయాక.. మళ్లీ తన కడుపున ఆ బాబు పుడతాడని, ‘రీకేనలైజేషన్’ (మళ్లీ పిల్లలు పుట్టడానికి) చేయించుకోవాలనుకుంది. 30ఏళ్ల క్రితం వైద్యశాస్త్రం ఇంత అభివృద్ధి చెందలేదు. అయినా తను ఆ నిర్ణయం తీసుకుంది. ‘మేజర్ ఆపరేషన్ సార్. మూడు గంటలు జరుగుతుంది. అయినా పిల్లలు పుట్టే చాన్స్ పది శాతమే’ అని డాక్టర్ అన్నారు.
అప్పట్లో మూడు గంటల ఆపరేషన్ అంటే లైఫ్ రిస్క్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా.. వద్దని నిర్మలతో అన్నాం. గైనకాలజిస్ట్ కూడా ఇదే చెప్పారు. అయినా సరే నిర్మల ఒప్పుకోలేదు. ఆపరేషన్ చేయించుకుంది. కానీ, ఆ తర్వాత కొన్ని నెలల వరకూ గర్భం రాలేదు. దీంతో ఓ వైద్య పరీక్ష చేశాం. సారీ.. ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది అన్నారు. ఈ విషయం ఆమెకు చెప్పడానికి సందేహించాం. కానీ తనకు తెలిసిపోయింది. అయితే ‘ఐ విల్ గెట్ బ్యాక్ మై సన్’ అంది నిర్మల. అన్నట్లుగానే.. ఆ తర్వాతి నెల తను ‘కన్సీవ్’ అయింది. అలా పుట్టిన బాబే శిరీష్.
నిర్మల: ఆ బాబు చనిపోయాడు, నేను ఏడ్చినా, ఏం చేసినా రాడు. ఈ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేసుకోవచ్చని ఆలోచించాను. అందుకే మొండిగా ఆపరేషన్ చేయించుకున్నాను.
స్నేహాని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు మీ ఇద్దరి రియాక్షన్?
అరవింద్: అర్జున్ ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ విషయం మా ఇంట్లో అయిదు నిమిషాల్లోనే సెటిల్ అయ్యింది. ముందు స్నేహ విషయం బన్నీ తన అమ్మ దగ్గరే చెప్పాడు.
నిర్మల: అర్జున్ వచ్చి స్నేహాని చేసుకుంటాను అంటే, నువ్వు చేసుకున్నా, మేం వేరే అమ్మాయిని చూసి చేసినా నువ్వు హ్యాపీగా ఉండాలి. మాకు ముఖ్యం అదే. నువ్వు హ్యాపీగా ఉంటే మేం హ్యాపీ అన్నాను.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment