మీకోసం.. మహేశ్‌బాబుని తీసుకొచ్చాం! | Sakshi Special Interview With Mahesh Babu | Sakshi
Sakshi News home page

నెవ్వర్‌ బిఫోర్‌ సంక్రాంతి

Published Wed, Jan 15 2020 1:33 AM | Last Updated on Wed, Jan 15 2020 8:34 AM

Sakshi Special Interview With Mahesh Babu

మహేశ్‌బాబు

‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నారో.. ఆ సినిమా రిలీజ్‌ అయ్యాక అంతకుమించి బిజీగా ఉన్నారు హీరో మహేశ్‌బాబు! ‘నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌’ అంటూ.. ఫ్యాన్స్‌.. స్క్రీన్‌ మీద సంక్రాంతి చేసుకుంటుంటే.. ‘ఇది నాకు మెమొరబుల్‌ సంక్రాంతి’ అని మహేశ్‌ బాబు.. మూవీ హిట్‌ని టీమ్‌తో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు! సంక్రాంతికి పంట ఇంటికి వస్తుంది.   మేము మీకోసం.. సంక్రాంతిని పండిస్తున్న మహేశ్‌బాబుని తీసుకొచ్చాం.  హ్యాపీ సంక్రాంతి.

►హ్యాపీ సంక్రాంతి మహేశ్‌బాబు గారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఎలా అనిపిస్తోంది మీకు?
చాలా సంతోషంగా ఉంది. షూటింగ్‌ సమయంలో ఈ సినిమా హిట్‌ కొడుతుందని అనుకున్నాను కానీ ఇంత పెద్ద స్థాయిలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ఊహించలేదు.  అభిమానుల్లో చూస్తున్న ఆనందం.. నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. ‘ఇలా కదా మహేశ్‌బాబును చూడాలని మేము అనుకున్నది’ అని ఒక్కొక్కరు అంటుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ క్రెడిట్‌ను అనిల్‌ రావిపూడికి ఇస్తాను. నా క్యారెక్టర్‌లో వేరియేషన్స్‌ ఉండటం, కామెడీ టైమింగ్‌ ఇవన్నీ బాగా కుదిరాయి.

►మీలాంటి సూపర్‌స్టార్‌ హీరోకు యువ దర్శకుడైన అనిల్‌ రావిపూడితో సినిమా ఎందుకు చేయాలనిపించింది?
‘సరిలేరునీకెవ్వరు’ సినిమాకు ముందు కొంతకాలంగా సిరీయస్‌ పాత్రలు చేశాను. దీంతో ఇందుకు భిన్నంగా అభిమానులకు నచ్చేలా ఏదైనా మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేయాలనుకున్నాను. ఆ సమయంలో అనిల్‌ చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. అనిల్‌ ఇదివరకు దర్శకత్వం వహించిన సినిమాలు చూశాను. నచ్చాయి. ‘ఎఫ్‌ 2’ ఇంకా బాగా నచ్చింది. అనిల్‌ కథ నేరేషన్‌ ఇచ్చిన తర్వాత రెండు నెలల్లో బ్రౌండ్‌ స్క్రిప్ట్‌తో వచ్చాడు. ఐదు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. అనిల్‌ మంచి డైలాగ్స్‌ రాశాడు. సినిమాలోని ట్రైన్‌ ఎపిసోడ్‌ ప్రేక్షకులకు బాగా కనెకై్టపోయింది. ఆర్మీ బ్యాక్‌ డ్రాప్‌ సన్నివేశాలను కూడా అనిల్‌ బాగా డిజైన్‌ చేశాడు. కశ్మీర్‌ షెడ్యూల్‌ టీమ్‌ అందరి ఎఫర్ట్‌. అక్కడి సైనికులు అందించిన సహకారం మర్చిపోలేం.

సినిమాలో విజయశాంతిగారి సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి.
సినిమాలోని భారతి పాత్రకు విజయశాంతిగారు తప్ప ఇంకెవ్వరు న్యాయం చేయలేరనిపించింది.  ఈ సినిమాను ఒప్పుకుని నటించినందుకు ఆమెకు థ్యాంక్స్‌. కొన్నేళ్ల క్రితం ‘కొడుకుదిద్దిన కాపురం’ సినిమాలో విజయశాంతిగారితో  చేశాను. అప్పుటికి ఇప్పటికీ ఆమె ఏం మారలేదు.

►సినిమా విడుదలైనప్పుడు కలెక్షన్స్‌ గురించి ఆలోచిస్తారా?
కలెక్షన్స్‌ను పట్టించుకోవాలి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలు సంతోషంగా ఉండాలి. అందుకే నంబర్స్‌ అనేవి చాలా ముఖ్యమని నేను భావిస్తాను.

►కెరీర్‌ మొదట్లో ఉన్నప్పటితో పోల్చి చూసినప్పుడు సినిమా కథల ఎంపిక గురించి మీ ఆలోచన ఎలా ఉంది?
ముందుగా నేను సినిమా చేయాలంటే స్క్రిప్ట్‌ నన్ను బాగా ఎగై్జట్‌ చేయాలి. నిజానికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఈ ఏడాది తర్వాత చేయాల్సిన సినిమా. కథ బాగా నచ్చడంతో వెంటనే చేశాను. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను అనిపించింది. ఇలాంటివి ఇంకా తీసుకుంటే నా కెరీర్‌కు, కానీ నా అభిమానులకు, సినిమా ట్రెండ్‌కు ఇంకా బాగుంటుందనిపిస్తోంది. ఎప్పుడూ కమిట్‌మెంట్‌కు కట్టుబడి ఉంటాను. పండక్కి ఒక సినిమా రావాలి. ఫ్యాన్స్‌కు ఓ సినిమా చేయాలనే స్వార్థంతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేయడం మా అందరికీ మంచిదైంది. చాలా సంతోషంగా ఉంది.

►ఓ కొత్తరకం సినిమాకు ఓకే చెప్పాలన్నప్పుడు మీ స్టార్‌డమ్‌ గురించి ఆలోచిస్తారా?
తెలుగు సినిమా చాలా పెద్దదైపోయింది. ప్రేక్షకులు, అభిమానులు, ట్రెండ్, మార్కెట్‌ వంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాలి. ఒక పెద్ద సినిమా చేయడం అనేది చాలా బాధ్యతతో కూడుకున్న పని. కేవలం కథ నచ్చింది కదా అని ఈ రోజుల్లో సినిమాలు చేయలేం. అన్ని కోణాల్లో ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.

►సోషల్‌ మీడియాను మీరు ఫాలో అవుతారా?
సోషల్‌ మీడియాను అంతగా ఫాలో కాను. నాకు కష్టపడి పనిచేయడం ఇష్టం. ఇంటికి వెళ్లి పిల్లలతో సరదాగా ఆడుకోవడం ఇష్టం.

►ఈ ఏడాది సంక్రాంతి సెలబ్రేషన్స్‌ను ఎలా ప్లాన్‌ చేశారు?
ఈ ఏడాది మాకు ఈ నెల 11నే (‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదలైన రోజు) సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. ప్రతి రోజూ స్నేహితులతో ఇంట్లో పార్టీలు జరుగుతున్నాయి. అందరం కళకళలాడిపోతున్నాం. ఇది నా మోస్ట్‌ మెమొరబుల్‌ సంక్రాంతి.
►దేవుణ్ని నమ్ముతారా?
నేను దేవుణ్ని బాగా నమ్ముతాను. ఇటీవలే షిరిడీ, తిరుపతి వెళ్లొచ్చాను. నమ్రతకు కూడా దైవభక్తి ఉంది.

►దర్శకులతో మీ బాండింగ్‌ ఎలా ఉంటుంది?
నేను డైరెక్టర్స్‌ యాక్టర్‌ని. వారితో నేను ఎమోషనల్‌గా కనెక్ట్‌ కాలేకపోతే సినిమా చేయలేను. నేను ఎవరితో సినిమా చేస్తే ఆ సినిమా దర్శకుడితో నాకు ఓ భావోద్వేగంతో కూడిన ప్రయాణం తప్పక ఉంటుంది. నా దర్శక–నిర్మాతలతో నేను చాలా స్నేహపూర్వకంగా ఉంటాను.

►ఒక నిర్మాతగా మీ బ్యానర్‌లో ఎలాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నారు?
మంచి కంటెంట్‌ ఉన్న సినిమాను మా బ్యానర్‌ లో తప్పకుండ ప్రొడ్యూస్‌ చేస్తాను. డిఫరెంట్‌ సినిమాలను నిర్మించాలనుకుంటున్నాను. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ విస్తృతి పెరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ వంటివారు పెద్ద పెద్ద హాలీవుడ్‌ స్టార్స్‌తో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం హీరోగా నా దృష్టి అంతా వెండితెరపైనే.

►పాన్‌–ఇండియా సినిమా ఎప్పుడు చేస్తారు?
మనం పాన్‌–ఇండియా సినిమాయే చేయాలి అంటే కుదరదు. మనం చేసే సినిమాకు యూనివర్సిల్‌ అప్పీల్‌ ఉండి, అది ఒక పెద్ద సినిమా అయి భాషపరమైన హద్దులు దాటి, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తే అది నా దృష్టిలో పాన్‌–ఇండియా సినిమా. భవిష్యత్‌లో రాజమౌళిగారితో సినిమా ఉంది.

►ఇండస్ట్రీలో పెద్ద హీరోల మధ్య పోటీ గురించి ఏమంటారు?
ఇండస్ట్రీలో పోటీ ఉండాలి. అప్పుడే ప్రేక్షకుల వద్దకు మంచి మంచి సినిమాలు వెళ్తాయి. కానీ ఆ పోటీ మంచి వాతావరణంలో ఉండాలి.

►మీరు చిన్న సినిమాలను బాగా ప్రొత్సహిస్తున్నారు?
బేసిగ్గా నేను సినిమా లవర్నీ. భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా విడుదల అయినా చూస్తాను. నచ్చితే ట్వీట్‌ చేస్తాను. షూటింగ్‌ లేకపోతే ఐదారు సినిమాలు చూస్తాను. సినిమాలు అంటే నాకు అంత ఇష్టం. యాక్టింగ్‌ తప్ప నాకు ఇంకేం తెలియదు. నాకు వందేళ్లు వచ్చేంతవరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటాను.

►మీ తర్వాతి చిత్రం గురించి?
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.  ‘మహర్షి’ చిత్రం కాస్త సందేశాత్మకంగా ఉంది. నెక్ట్స్‌ మేం ఇద్దరం చేయబోయే సినిమా మంచి కమర్షియల్‌ ఫార్మాట్‌లో ఉంటుంది.

►నాన్నగారు(సూపర్‌స్టార్‌ కృష్ణ) సినిమా చూసి ఏమన్నారు?
ఇప్పటివరకు నీ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అన్నారు. నీ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అన్నారు. డైరెక్టర్‌ అనిల్‌ను ఓసారి కలవాలన్నాను అని చెప్పు అన్నారు. ఈ సమయంలో ఆయన ముఖంలో నవ్వు చూసి చాలా సంతోషపడ్డాను.

►మీ పిల్లల స్పందన మీకు సంతోషాన్ని ఇచ్చిందా?
ఎప్పుడు నా సినిమాలను నా ఇంట్లోని హోమ్‌ థియేటర్‌లో చూస్తాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను కూడా చూశాను. పిల్లలు (కుమారుడు గౌతమ్, కూతురు సితార) బాగా ఎంజాయ్‌ చేశారు. సాధారణంగా గౌతమ్‌ సినిమాను రెండోసారి చూడడు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను మళ్లీ చూద్దామని నాతో కలిసి రెండోసారి కూడా చూశాడు. చాలా గర్వంగా ఫీలయ్యాను. నిజానికి గౌతమ్, సితారలతో సమయం గడపుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది.

భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితారతో మహేశ్‌బాబు

►మీ సక్సెస్‌ జర్నీలో నమ్రత (మహేశ్‌బాబు సతీమణి) పాత్ర గురించి  ఏమని చెబుతారు?
నా సక్సెస్‌ జర్నీలో నా భార్య నమ్రత పాత్ర చాలా ప్రధానమైనది. ఎవరికైనా ఇల్లు అనేది చాలా ముఖ్యం. ఇల్లు బాగుంటే మనం బాగుంటాం. అది నేను నమ్ముతాను. ఇంత కష్టపడి మనం ఇంటికి వెళితే ఒక ప్రశాంతతో కూడిన వాతావరణం ఇంట్లో ఉండాలి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ని. నమత్ర అన్నీ విషయాలు బాగా చూసుకుంటుంది.

►‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మీ డ్యాన్స్‌లు అదిరిపోయాయని ప్రేక్షకులు అంటున్నారు!
(నవ్వుతూ) ఈ సినిమాలో డ్యాన్సులు బాగా చేశానని ప్రేక్షకులు అంటున్నారు. ఆ క్రెడిట్‌ దర్శకుడు అనిల్‌కు, శేఖర్‌ మాస్టర్‌కు, సంగీత దర్శకుడు దేవీలది. షూటింగ్‌ సగంలో ఉన్నప్పుడే నాకు తెలిసింది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని. షూటింగ్‌ సమయంలో అనిల్‌కు మేసేజ్‌ చేశాను... ఈ సినిమాలో బాగా డ్యాన్స్‌ చేస్తానని. కానీ ప్రేక్షకుల నుంచి ఈ రేంజ్‌లో స్పందన వస్తుందనుకోలేదు. నా కెరీర్‌లో ‘మైండ్‌బ్లాక్‌’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది.  మిగతా పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement