సాల్ట్‌..హాల్ట్‌ | Salt Room Therapy in Hyderabad | Sakshi
Sakshi News home page

సాల్ట్‌..హాల్ట్‌

Published Mon, Feb 24 2020 9:44 AM | Last Updated on Mon, Feb 24 2020 9:44 AM

Salt Room Therapy in Hyderabad - Sakshi

కాలుష్యభూతం  నగరాల్ని వణికిస్తూ సృష్టిస్తున్న  సమస్యల్లోశ్వాసకోశ వ్యాధులే ప్రధానమైనవి. దగ్గో, జలుబో, మరొకటో... సిటిజనుల శ్వాసకోశ సమస్యలు  ఒకప్పుడు వృద్ధులు, చిన్నారులకే పరిమితమైనా ఇప్పుడు యువతలోనూ సాధారణమైపోయాయి. వీటిలో కొన్ని మందులకూ లొంగని పరిస్థితి ప్రత్యామ్నాయ మార్గాలను మనకు పరిచయం చేస్తోంది. అలాంటిదే సాల్ట్‌ రూమ్‌ థెరపీ. శ్వాస కోస వ్యాధులతో పాటు మరిన్ని ఆరోగ్యలాభాలనూ ఇది అందిస్తుందంటున్నారు సాల్ట్‌రూమ్‌ నిర్వాహకులు.

సాక్షి, సిటీబ్యూరో: వరల్డ్‌ వార్‌ సమయంలో పోలండ్‌లో సైనికులు అనుకోకుండా సాల్ట్‌ గుహలో దాక్కుటారు. అప్పుడు తమ శరీరంలో కలిగిన ఆరోగ్యకరమైన మార్పులతో వారు సాల్ట్‌ రూమ్స్‌ వృధ్ది చేయడం ప్రారంభించారట. సాల్ట్‌ థెరపీని యూరప్‌ దేశాల్లో హెలో థెరపీ అని పిలుస్తారు. సాల్ట్‌కు గ్రీకు పదం హెలో. ఇప్పటికే యూరప్‌తో పాటు విదేశాల్లో మంచి ప్రాచుర్యంలో ఉన్న ఈ థెరపీ ఇటీవలే మన దేశానికి కూడా వచ్చింది. ముంబై, బెంగుళూర్‌ తర్వాత ఇటీవలే నగరంలోనూ సాల్ట్‌రూమ్స్‌ ఏర్పాటు షురూ అయింది.  

ఫీల్‌ తెలుస్తుంది...
క్లయింట్స్‌ వచ్చి క్‌లైమేట్‌ కంట్రోల్‌ రూమ్‌లోకి ఫుట్‌వేర్‌ లేకుండా, హెడ్‌ గార్డ్‌తో వెళ్లి రిలాక్స్‌గా కూర్చున్న తర్వాత హెలో జనరేటర్‌  మెషిన్‌ ద్వారా రూమ్‌లోకి సాల్ట్‌ని స్ప్రెడ్‌ చేస్తారు. తద్వారా  ఊపిరి పీల్చినప్పుడు సదరు ఉప్పు కణాలు లోపలికి ప్రవేశిస్తాయి. ఆ గదిలో ఎటువంటి ప్రత్యేక పరిమళం ఉండదు. శరీరానికి చెమట పట్టదు. అయినప్పటికీ సాల్ట్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత కలిగే  వ్యత్యాసం మనకు తెలుస్తుంది. ఇది మనం ఆహారంలో ఉపయోగించే సాల్ట్‌ లాంటిది కాదు కాబట్టి బీపీ ఉన్నప్పటికీ ఈ సాల్ట్‌ థెరపీకి అదేమీ అడ్డంకి కాదు.  ప్రతి సెషన్‌ 55 నుంచి 60 నిమిషాల పాటు పూర్తయ్యాక స్నానం వంటివి ఏమీ చేయనక్కర్లేదు. తిన్నగా మన పనులకు మనం వెళ్లిపోవచ్చు.  

శ్వాసకోశ సమస్యలకు చెక్‌...
సాల్ట్‌ రూమ్‌ థెరపీ పూర్తి సహజమైనదని, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇది స్వస్థత చేకూరుస్తుందని నిపుణులు అంటున్నారు.  స్వల్ప పరిమాణంలో గాలి నిరంతరం సరఫరా అవుతున్న  గదిలో కూర్చున్న తర్వాత గాలిలో కలిసే ఉప్పు రేణువులు నాసిక ద్వారా లోపలికి వెళ్లిన అడ్డంకులను తొలగిస్తాయని బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయని అంటున్నారు. మ్యూకస్‌ సాధారణంగా ప్రయాణించేలా చేసి అస్తమా ను నియంత్రిస్తాయని చెబుతున్నారు. అస్తమా, క్రానిక్‌ బ్రాంకైటిస్, సైనసైటిస్, అలర్జిక్, చర్మ వ్యాధులకు ఇది ఒక ప్రత్యామ్నాయ
చికిత్సగా పనిచేస్తుంది.  

హై ఇంటెన్సిటీవర్కవుట్‌ చేసినా...
ఫిట్‌నెస్‌ ఇంట్రెస్ట్‌ అధికంగా ఉన్నవాళ్లు హై ఇంటెన్సిటీ వర్కవుట్‌ చేసి అలసిపోయిన శరీరం మళ్లీ తిరిగి యథాతధ స్థితికి రావడానికి ఇది ఉపకరిస్తుందని సాల్ట్‌ రూమ్‌ నిర్వాహకులు చెప్పారు. అలాగే గర్భవతులకు, మారథాన్‌ రన్నర్స్, క్రీడాకారులకు మాత్రమే కాకుండా సింగర్స్‌కి తమ గొంతు సమస్యల నివారణకు... ఇలా విభిన్న రకాలుగా ఇది ఉపకరిస్తుందని అంటున్నారు.  

వెల్‌నెస్‌కు సాల్ట్‌ స్పా..
ఎంబిఏ చేసి ఆ తర్వాత ఫిట్‌నెస్‌ రంగంలోకి వచ్చాను.  అయితే ఇప్పుడు ఫిట్‌నెస్‌ కూడా వెల్‌నెస్‌లో భాగమైపోయింది... సాల్ట్‌ థెరపీ గురించి తెలిసి మన సిటీలో లేదని ఇక్కడ ఏర్పాటు చేశాం.  ప్రతి వాతావరణం, ప్రతి వయసుకూ ఈ థెరపి వల్ల ఉపయోగమే. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అద్భుతమైన పరిష్కారంగా ఇది పనిచేస్తుంది.  –మిథాలి, సాల్ట్‌ వరల్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement