సామాన్య అసామాన్యులు!
కళ
పట్టణ సంస్కృతి, వీధి జీవితం అనేవి ముంబాయికి చెందిన సమీర్ కులవూర్ కుంచెలో కొత్త కాంతులతో కనిపిస్తాయి. నిత్యజీవితంలోని ఎన్నో సామాన్య దృశ్యాలను తన కళ్లలో దాచుకొని, ఆ తరువాత వాటికి కుంచెతో కళాకాంతులు చేరుస్తాడు.
‘ఘోడా సైకిల్’ పేరుతో ఆయన చేసిన ప్రాజెక్ట్‌లో సామాన్యులు ఎంత అసామాన్యంగా కనిపిస్తారో చెప్పలేం!
సామాన్యులు తమ దైనందిన పనులకు సైకిల్‌ను ఎన్ని రకాలుగా, ఎన్ని సృజనాత్మక మార్గాల్లో ఉపయోగిస్తారో చక్కగా గీసి చూపించారు సమీర్.
‘‘పనిగట్టుకొని పట్టణ సంస్కృతిని, వీధి సంస్కృతిని ప్రేమించడం లేదు. అది సహజంగానే నాలో భాగం అయింది’’ అని చెబుతున్న సమీర్‌కు ముంబాయిలో ‘డాక్ డిజైన్స్’ పేరుతో ఒక స్టూడియో ఉంది. చిత్రకారులు, కళాభిమానుల రాకపోకలతో అదెప్పుడూ సందడిగా ఉంటుంది.
‘బ్లూడ్’ పుస్తకం సమీర్‌కు అవార్డ్‌లనే కాదు ఎంతో గుర్తింపును తీసుకువచ్చింది. ఆ పుస్తకంలో కనిపించేవి బొమ్మలు మాత్రమే కాదు దైనందిన సమస్యలను పరిష్కరించుకొనే సృజనాత్మక మార్గాలు కూడా!
సామాన్యులు తమ రోజువారీ పనులకు సైకిల్‌ను ఎన్ని రకాలుగా, ఎన్ని సృజనాత్మక మార్గాల్లో ఉపయోగిస్తారో చక్కగా గీసి చూపించారు సమీర్.