పూసే విరబూసే పండగ
నాస్టాల్జియా
సంక్రాంతి పండగ అంతకు పది రోజుల ముందు నుంచి న్యూస్ పేపర్ల ఫుల్‌పేజీ సినిమా యాడ్లతో మొదలయ్యేది. జనవరి 11 ఉ.9.30 గం. ఆటతో బ్రహ్మాండమైన విడుదల. దాంతో పాటే థియేటర్ల లిస్టూ ఇచ్చేవారు. మనూరులో మనం రోజూ చూసే థియేటర్ పేరు పేపర్లో రావడం ఒక గొప్ప. అందులో మన హీరో సినిమా రావడం ఇంకా గొప్ప. 11న ఒకటి, 12న ఒకటి, 13న ఒకటి, పద్నాలుగున ఒకటి. అన్నింటికీ డబ్బు కూడ బెట్టుకోవడం పెద్ద ఇబ్బంది కాదు. సంక్రాంతి అంటే పెద్ద పండుగ. పెద్దలు పెద్ద మనసు చేసుకొని పిల్లలకు పైసలు ఇచ్చే పండగ. పిల్లలు నిజమైన సంబరంలో మునిగే పండగ.
కాని సగం ఆనందం టైలర్లు కాజేసేవారు. రైలు రాకపోకలకన్నా గ్యారంటీ ఉండేదేమోకాని వీళ్లు కుట్టిన గుడ్డలు ఇస్తారో ఇవ్వరో అనేదానికి మాత్రం ఎవరూ గ్యారంటీ ఇచ్చేవారు కాదు. అసలే కొత్తబట్టలంటే సంక్రాంతికి మాత్రమే కుట్టించేవారు. వాటి కోసం సంవత్సరం మొత్తం ఆగాలి. స్కూల్లో గొప్పలు చెప్పుకోవాలి. పండగ రోజు ధరించి ఫ్రెండ్స్ ఇంటికి క్యాజువల్‌గా వెళ్లినట్టు వెళ్లి చూపించుకోవాలి. చెప్పులు లేకపోతే ఏమీ టక్ చేసుకొని దర్జాగా తిరగాలి. కాని ఎన్నిసార్లు టైలర్ షాప్ ముందు తిరిగినా మన బట్టలు అలాగే మూట గట్టి పడి ఉండేవి. అదృష్టం బాగుంటే ష్రింక్ కోసమని తడిపి ఆరేశాక దండెం మీద కనిపించేవి. అన్నాళ్లు ఎవరూ పట్టించుకోని టైలర్ ఆ కొన్నిరోజులు ఊరి ఎమ్మెల్యే చేత కూడా సలాం కొట్టించుకునేవాడు. స్లీపింగ్ టేప్‌రికార్డర్‌లో పాటలు వింటూ అర్ధరాత్రి కూడా అతడు కుడుతూ ఉంటే అమ్మా నాన్నలకు చెప్పి అక్కడే కూర్చొని తెల్లారుతుండగా కాజాలు పూర్తి చేసి ఇంటికి పరిగెత్తుకురావడం జ్ఞాపకం.
హరిదాసులకు బియ్యం పొయ్యడం బాగుండేది. గంగిరెద్దులవాళ్లకు పాత వస్త్రం ఇవ్వమని నాన్న అంటే అమ్మ ఒకటి కాదని మరొకటి ఇవ్వడమూ బాగుండేది. బుడబుడలవాడు నల్లగొడుగేసుకొని వచ్చి కుడిచేయి విసురుతూ చిట్టి డమరుకం డమడమలాడిస్తుంటే వీధి కుక్కలు వెంట పడాల్సింది పోయి తోక ముడిచేవి. పిల్లలు ఎందుకైనా మంచిదని అమ్మ కొంగుచాటు దాక్కుని చూసేవారు. కాని ఆ దేవర దీవెన ఎంత చల్లన!
ఔట్‌లైన్ అక్క వేస్తుంది. లోపల కలర్ మనమే నింపాలి. ముగ్గుల సౌందర్యం ముగ్గుతో వస్తుందా? తల్లిదండ్రులు చూస్తూ ఉండగా వాటిలో మునిగే వంశాంకురాలతో వస్తుంది. అరిసెలు చేసే పెద్దమ్మ అంతకు నాలుగు వీధుల అవతల ఉంటుంది. మంచి మాటలు చెప్పి లాక్కురావాలి. ఆమె తీయని అరిసెలు చేసి పెడుతుంటే అంతకంటే తియ్యని కబుర్లను నంజుకోవాలి. జంతికలు సరిగ్గా కుదిరితే కరకరా. కాదంటే హరహరా. నిప్పట్లకు చప్పట్లు. లడ్డూ పిల్లసన్నాసుల హెడ్డుకొకటి.
పూలకాలం కదా ఇది. దోసిట్లో నీళ్లు తీసుకొని నేల మీద అలా చిమ్మగానే ఇలా బంతిపూలు పూసుకొచ్చేవి. డిసెంబరాలు ఎరుపుకొచ్చేవి. మందారాలు మౌనంగా మొగ్గ విచ్చేవి. సీతమ్మ జడకుచ్చులు మంచుకు చెమ్మగిల్లి రామయ్యను తలుచుకునేవి. గుమ్మడిపూలు గొబ్బెమ్మల్లోకి... కనకాంబరాలు అమ్మ జడలోకి.
తేలిక రంగులు గాలిపటాలకు పనికి రావు. వంకాయ రంగు బాగుంటుంది. రాణీ రంగు బాగుంటుంది. ఎరుపు ఎవర్‌గ్రీనే. ముదురు ఆకుపచ్చ ముస్తాబే వేరు. కాదూ కూడదూ అని లేత నీలిరంగు గాలిపటాన్ని కొని ఎగురవేస్తే అది మబ్బుల్లో ఎగిరి కలగలిసిపోతే మాయమైపోయిందని పిల్లాడు ఏడిస్తే చుట్టూ ఉన్న స్నేహితులందరికీ అది నవ్వుల సంక్రాంతి.
చేయి తిరిగినవారు వెజ్ బిరియానీని కూడా మటన్ బిరియానీలా వండుతారు. ప్రావీణ్యం ఉన్నవారు పాయసాన్ని పాయసంలానే చేస్తారు. గారెల సైజు మనసును బట్టి. పులిహోర రుచి హృదయాన్ని బట్టి. అరిటాకులో రోటి పచ్చడి పడితే జిహ్వచాపల్యం ఉన్నవాడికి అది రుచుల సంక్రాంతి.
ఈ పండగ ఇంటికి ధాన్యం తెస్తుంది. తీక్షణతను నింపుకున్న వెలుతురును తెస్తుంది. తియ్యని మమతలను పంచే బంధువులను తెస్తుంది. మరో సంక్రాంతి వరకూ కలిసి నడవగలిగిన సంతోషాన్ని తెస్తుంది. వాట్సప్ రావచ్చు. ఫేస్‌బుక్ రావచ్చు. ఫోన్ కాల్ రావచ్చు. ఈ మెయిల్ రావచ్చు. కాని వేల సంవత్సరాల పరంపర నిండిన ఆ పండగ మనల్ని తాకే తీరుతుంది. దేనికి చెందుతామో దానిని గుర్తు చేసే పండగ ఇది. దేనికి పులకరిస్తామో ఆ పులకరింపును ఇచ్చే పండగ ఇది. దేనిని మర్చిపోకూడదో ఆ జ్ఞాపకాన్ని ఇచ్చే పండగ ఇది.
సంక్రాంతి మనది. మనందరిది.
- సాక్షి ఫ్యామిలీ
దోసిట్లో నీళ్లు తీసుకొని నీళ్ల మీద అలా చిమ్మగానే ఇలా బంతిపూలు పూసుకొచ్చేవి. డిసెంబరాలు ఎరుపుకొచ్చేవి. మందారాలు మౌనంగా మొగ్గ విచ్చేవి. సీతమ్మ జడకుచ్చులు మంచుకు చెమ్మగిల్లి రామయ్యను తలుచుకునేవి. గుమ్మడిపూలు గొబ్బెమ్మల్లోకి. కనకాంబరాలు అమ్మ జడలోకి.