పట్టు కట్టు
కంచి పట్టుచీర కట్టుకున్నప్పుడు... మెరుపు జరీతో మేనిని చుట్టుకున్నప్పుడు కళ్లు రంజించేలా కంజీవరం శారీ చేసే, మ్యాజిక్‌కు మంత్రముగ్ధులైపోవాల్సిందే. కట్టుకుంటే మాగ్నిఫిసెంట్! ఆకట్టుకోవడంలో మ్యాగ్నెట్!! ఇంతకు మంచి ఏదైనా చెప్పాలా... కంచి కథే వేరు... ఆ పట్టు కనికట్టే వేరు! రాణీ పింక్ చీరకు బంగారు రంగు పెద్ద అంచు ప్రధాన ఆకర్షణ. చీరంతా బంగారు వర్ణపు చెక్స్ రావడంతో అద్భుతంగా మెరిసిపోతుంది. సింపుల్ డిజైన్ అనిపిస్తూ గ్రాండ్‌గా లుక్‌తో వెలిగిపోతున్న పల్లూ ఈ చీరకు అదనపు హంగుగా చేరింది.
మస్టర్డ్, పచ్చ రంగులతో చూపు తిప్పుకోనివ్వని విధంగా ఉన్న ఈ పట్టుచీర కట్టుకుంటే మాటల్లో చెప్పలేని సౌందర్యంతో మెరిసిపోవాల్సిందే! రెండు రంగుల అంచులు, మామిడిపిందెల సెల్ఫ్ డిజైన్, చిన్న చిన్న బుటా ఈ చీర వైభవాన్ని వెయ్యింతలు చేస్తున్నాయి. వివాహ వేడుకలకు కళను తీసుకువచ్చేవి పట్టుచీరల రెపరెపలే! బంగారు రంగులో మెరిసిపోతున్న పెద్ద అంచు ముదురు ఎరుపు రంగు కంజీవరం పట్టుచీర పెళ్లికి ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణే. చీరంతా బంగారు జరీ బుటీ, అంచు మీద సంప్రదాయ డిజైన్ చూపరుల కళ్లను కట్టిపడేస్తాయి.
కలల్లో సాక్షాత్కరించిన మహాలక్ష్మి కళ్లముందు కనిపిస్తే మన ఇంటి అమ్మాయిగా ఇలా రూపుకడుతుంది. బంగారు, పచ్చ రంగు అంచులతో గంధం రంగు పట్టుచీర.. దానిపైన మెజెంటా రంగు పువ్వుల సెల్ఫ్ డిజైన్... వర్ణించనలవి కాని సౌందర్యం వివాహవేడుకలో ప్రత్యేకం.