వడ్డించడమే పండగ.. | Satyam Sankaramanchi Trupti Story | Sakshi
Sakshi News home page

వడ్డించడమే పండగ..

Published Mon, Jan 13 2020 12:14 AM | Last Updated on Mon, Jan 13 2020 12:48 AM

Satyam Sankaramanchi Trupti Story - Sakshi

పూర్ణయ్యని బావగాడంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరమూ లేదు. పెళ్ళి గాని, పేరంటం గాని, వంట హంగంతా బావగాడే. వంటవాళ్ళని కూర్చోనిచ్చేవాడు కాదు, నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వన సంతర్పణం పెట్టుకున్నారు. జనం అంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు కొందరు. పేకాటలో మునిగిన వారు కొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. ‘‘అందరూ వినండర్రా’’ అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు, పేకాట మూయించాడు. ‘‘వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను’’ అంటూ లిస్టు చదివాడు.

‘‘వంకాయ మెంతికారం పెట్టిన కూర
అరటికాయ నిమ్మకాయ పిండిన కూర
పెసరపప్పుతో చుక్కకూర
వాక్కాయ కొబ్బరి పచ్చడి
పొట్లకాయ పెరుగు పచ్చడి
అల్లం, ధనియాల చారు
మసాలా పప్పుచారు
అయ్యా! జీడిపప్పు, పచ్చకర్పూరాలతో పాయసం
మామిడి కోరుతో పులిహోర
గుమ్మడి వడియాలు, వూరమిరపకాయలు.
అందరికీ సమ్మతమేనా?’’ అని అరిచాడు.

సమ్మతమేమిటి నామొహం – అప్పటికప్పుడు అందరి నోళ్ళలో నీరూరించి, ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిల లాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకూ ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. ‘‘చూశారా! లేత వంకాయలు  నవనవలాడుతున్నాయి. మెంతికారం పెట్టి మరీ వండిస్తున్నాను. దగ్గరుండి కోయించుకు వచ్చాను.’’ అని అందరికీ చూపించి వెళ్ళి పోయాడు. ఆ తరవాత జనానికి వేరే ఆలోచనలు పోయినాయి కావు. వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు. కాయ కాయ పళంగా వండితే రుచా? తరిగి వండితే రుచా? అసలు రుచి వంకాయలో వుందా? వంకాయ తొడిమలో వుందా? ఇలా చర్చలు సాగాయి.

మరో అరగంటకి– నిగనిగలాడే వాక్కాయల బుట్టతో, లేత చుక్కకూర మోపుతో వచ్చి అందర్నీ పలకరించాడు. ‘‘వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి,’’ అని తలా ఓ కాయ పంచాడు. ‘‘చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది,’’ అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనం అంతా వంట కబుర్లలో పడ్డారు. బావగాడు ఇలా ప్రదర్శన లిస్తుంటే ఆకలి రెపరెప పెరుగుతోంది. ఇక అక్కడ గాడిపొయ్యి దగ్గర వంటవాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పురమాయిస్తున్నాడు. ఓ పక్క పులిహోర తిరగమాత వెయ్యగానే రయ్యిన జనం దగ్గరికి పరిగెత్తుకు వొచ్చి, ‘‘ఆ వాసన చూశారా? పులిహోర తిరగమోత సన్న బియ్యంతో చేయిస్తున్నాను,’’ అని మాయమయ్యాడు.

మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఆకలి నిలువెత్తయింది. తాటి ప్రమాణమైంది. శరీరం అంతా ఆకలే అయి కూర్చుంది. జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురు మంటున్నారు. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. ‘‘లేత అరిటాకులు, శుభ్రంగా కడుక్కోండి’’ అని వరుసల మధ్య కొచ్చి హెచ్చరించాడు.‘‘సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం? రెండు ఆకులు కలిపి వేయించు’’ అంటున్నాడు. వడ్డనలు మొదలయ్యాయి.నేతి జారీ పుచ్చుకొని పేరు పేరునా అందర్నీ అడిగి వడ్డిస్తున్నాడు. ‘‘వంకాయ అలా వదిలేయకూడదు. నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు,’’ అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు.
‘‘చుక్కకూర పప్పులో వూరమిరపకాయలు మిళాయించండి.’’
‘‘పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి.’’
‘‘వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు. తప్పు లేదు.’’
‘‘ఇంకా విస్తట్లో మిగిల్చావేం. పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో.’’
‘‘అప్పుడే మంచినీళ్ళు తాగకు. మీగడ పెరుగుంది.’’

ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ళ ముందు నుండి లేవడమే కష్టమయింది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరవాత వంటవాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. ‘‘కష్టపడి వండారు, తినకపోతే ఎలా?’’ అని కొసరి కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తరువాత అందరికంటే ఆఖరున గాడిపొయ్యి పక్కన ఒక చిన్న ఆకు వేసుకొని తను కూర్చున్నాడు. అప్పటికి కూరలు మిగల్లేదు. ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డింపించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధ లేదు. నలుగురూ హాయిగా, తృప్తిగా, రుచిగా తిన్నారన్న సంతోషమే బావగాడి తాంబూలపు పెదాలపైని చిరునవ్వు.

సత్యం శంకరమంచి కథ ‘తృప్తి’ ఇది. అమరావతి కథలు సంకలనంలోంచి. ‘అమ్మ చెప్పిన కథలు అయ్యకే చెబుదునా’ అనుకుంటాడు సత్యం శంకరమంచి(1937–1987) తన కథల అంకితంలో. అమరావతి కథలు 1978లో తొలిసారి పుస్తకంగా వచ్చాయి. అంతకుమునుపు ‘ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక’లో ధారావాహికగా ప్రచురితమైనాయి. ‘అమరావతి కీ కథాయే’ పేరిట వీటిని దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ దూరదర్శన్‌ హిందీలో దూరదర్శన్‌ కోసం తెరకెక్కించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement