
ఈ ట్రిక్కులతో టైమ్ ఆదా...!
మీరు గూగుల్, జీమెయిల్ వాడుతున్నారా? వాటిల్లోని అన్ని ఫీచర్లు మీకు చిరపరచితమేనా? ఎందుకైనా మంచిది... ఈ కథనం పూర్తిగా చదివిన తరువాత మీ సమాధానాన్ని సరిచూసుకోండి. ఎందుకంటే ఎంతో కాలంగా ఉపయోగిస్తున్న ఈ మెయిల్ సర్వీసులోనూ మీ టైమ్‌ను ఆదా చేసుకునేందుకు అనేక చిట్కాలు, ట్రిక్కులు దాగి ఉన్నాయి మరి. అవేమిటో మచ్చుకు కొన్నింటిని చూద్దాం...
జీమెయిల్ ఆటో అడ్వాన్స్ గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇన్‌బాక్స్‌లోని బోలెడు మెయిళ్లను చకచక చూసేసి అవసరమైన వాటిని ఉంచుకునేందుకు, లేనివాటిని తొలగించేందుకు పనికొచ్చే చిన్న సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ఇది. జీమెయిల్ ల్యాబ్స్‌లో ఉండే దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మెయిల్ ఓపెన్ చేయకముందే దానితాలూకూ సబ్జెక్ట్, మొదటి కొన్ని లైన్లు చిన్న విండోలో కనిపిస్తుంది. దాన్నిబట్టి మెయిల్ ఉంచుకోవాలా? వద్దా? అన్నది మీరే నిర్ణయించుకోవచ్చునన్నమాట.మెయిల్ ఓపెన్ అయ్యేందుకు పట్టే సమయం ఆదా!
రోజూ మనం చేయాల్సిన పనుల జాబితాను సిద్ధం చేసుకునేందుకు కూడా జీమెయిల్ ఉపయోగపడుతుంది. గూగుల్ టాస్క్స్ టూల్‌ను వాడితే చాలు. జాబితాకు మెరుగులు దిద్దుకోవాలన్నా, మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అలాగే గూగుల్ టాస్క్స్ టూల్‌ను కూడా మరింత మెరుగ్గా తయారు చేసుకోవచ్చు. కొత్త ట్యాబ్‌లను చేర్చుకోవడం, ముఖ్యమైన వాటికి లేబుల్స్ తగిలించుకోవడం వంటి ఫీచర్లతో నోట్స్, స్టికీలు రాసుకునే టైమ్ కలిసొస్తుందన్నమాట.
ఫలానా వారి బర్త్‌డేలను కేలండర్‌లో నమోదు చేసుకుంటాం. ఆ రోజుకు ఓ మెసేజ్ పెట్టేస్తే చాల్లే అనుకుంటాం కూడా. అలాకాకుండా ఆ రోజున గూగుల్ హాంగౌట్ ద్వారా ఓ వీడియో మీటింగ్ పెట్టుకోవాలనుకోండి. గూగుల్ +లోకి వెళితే సరి. గూగుల్ కేలండర్‌లో ఈవెంట్‌ను క్రియేట్ చేసిన తరువాత ఆప్షన్స్‌లో ఉండే యాడ్ వీడియోకాల్ అన్నది క్లిక్ చేస్తే చాలు. బర్త్‌డే గ్రీటింగ్స్ కోసం ఈమెయిల్ రాసే, గ్రీటింగ్స్ వెతికే శ్రమ, సమయం మిగుల్చుకోవచ్చు.