
ఆడ పిల్ల.. అక్కర్లేని పిల్లా!
మహారాష్ట్ర సతారా జిల్లాలోని ఆడపిల్లల్ని ప్రశ్నిస్తే, వారిలో చాలామంది నుంచి వచ్చే సమాధానం ఇదే!
బేటీ బచావ్
‘నీ పేరు ఏంటి?’
‘నా పేరు... నా పేరు... ఆ....’
‘మరి నీ పేరు’
‘నా పేరు ....నా పేరు... ఆ....’
మహారాష్ట్ర సతారా జిల్లాలోని ఆడపిల్లల్ని ప్రశ్నిస్తే, వారిలో చాలామంది నుంచి వచ్చే సమాధానం ఇదే! అదేంటి మీకు పేర్లు లేవా అంటే, మేం ఎందుకూ పనికిరాని వాళ్లం కదా అని అంటారు వాళ్లు. పేర్లు లేకుండా ఎలా ఉన్నారా అని ఆశ్చర్యం వేస్తోంది కదూ. ఆశ్చర్యం వేసినా, విడ్డూరం అనుకున్నా ఇది మాత్రం నిజం. సతారా జిల్లాలో గ్రామాల్లో ఆడపిల్లలకు ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. ఇలా ప్రాధాన్యత లేని వారి సంఖ్య వందకు పైమాటే. మగ పిల్లల్ని మాత్రమే గారాబంగా పెంచుతున్నారు. ఇంట్లో మొదటి ఆడపిల్లనైతే బాగానే చూస్తున్నారు. రెండవ, మూడవ ఆడపిల్లల పరిస్థితి అధ్వానంగా ఉంది. వారిని కనీసం పేరు పెట్టి పిలవక పోగా, నకుష అంటున్నారు. మరాఠీలో నకుష అనే పదానికి ‘అక్కర్లేని వారు’ అని అర్థం. తల్లిదండ్రులే ఆ పిల్లల్ని ఆ విధంగా పిలుస్తుంటే, ఇంక ఇతరులకు లోకువే కదా. అందుకే ప్రభుత్వం ఆ పిల్లలను చేరదీసి వారికి ఒక శుభ ముహూర్తం నిర్ణయించి, పేర్లు పెట్టి, ఆ పేర్లు వాళ్ల చేత రాయిస్తోంది. అదొక పెద్ద వేడుకలా నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆ పిల్లలు వారి వారి పేర్లు పలకల మీద రాసి చూసుకుంటూ, ఎంతో సాధించామన్న గర్వంతో తలెత్తుకు తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అలా 265 మంది ఆడపిల్లలకు పేరు పెట్టింది. ఇంకా వందమందికి పెట్టాల్సి ఉంది.
ఇక్కడ ఇంకోలా...
పై పరిస్థితికి భిన్నంగా మహారాష్ట్రలోని పుణేలో డా. గణేశ్ రఖ్.. ‘బేటీ బచావ్’ నినాదంతో ఆడపిల్లలను రక్షిస్తున్నారు. తన ఆసుపత్రిలో ఆడశిశువుకు జన్మనిస్తే, వారి ఖర్చులను స్వయంగా తానే భరిస్తున్నారు. 2012లో ఆయన ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రస్తుతం 50 పడకలతో మెడికేర్ హాస్పిటల్ ఫౌండేషన్ పేరుతో నడుస్తున్న ఈ ఆసుపత్రిలో ఇప్పటికి 407 మంది ఆడ శిశువులు ఉచితంగా జన్మించారు. సమాజంలో ఆడపిల్లలపై ఉన్న వివక్ష తొలగాలంటే అన్ని రంగాల్లోనూ డాక్టర్ గణేశ్ రఖ్ లాంటి వాళ్లు ఉండాలి.