బాణీలకు ప్రాణ గాత్రి
బాలు, సాక్షి, విశాఖపట్నం
విశాఖపట్నంలోని ఎన్‌ఎస్‌టీఎల్ మానసి ఆడిటోరియం. రామ్‌నాథ్ సెకండరీ స్కూల్ విద్యార్థులతో సందడిగా ఉంది. ‘వెల్‌కం టు హిజ్ ఎక్స్‌లెన్సీ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ అబ్దుల్ కలాం’.. మైకులో ప్రకటన.. ఆ వెంటనే ‘నేనొక భారత యువ పౌరుడిని’ అంటూ విద్యార్థినుల బృంద గానం మొదలైంది. కలాం ఆంగ్ల కవిత ‘యాజ్ ఎ యంగ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్మ్‌డ్ విత్ టెక్నాలజీ’కి తెలుగు అనువాదమిది. హిందోళ రాగంలో రెండున్నర నిమిషాల పాటు సాగిన గానం ముగిసింది. చప్పట్లతో ఆడిటోరియం మారుమోగింది. విద్యార్థినుల్ని కలాం మనసారా దీవించారు. వారి గళాల్లో తేనెలూరిస్తున్న సంగీత ఉపాధ్యాయినిని హృదయపూర్వకంగా అభినందించారు. కలాం కవితకు అద్భుతమైన బాణీ కట్టి ప్రశంసలందుకున్న ఆమె పేరు పాలంకి సరస్వతి.
ఇరవయ్యేళ్లుగా సంగీత యజ్ఞం
పాలంకి సరస్వతి విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో పీవీ శేషయ్య శాస్త్రి శిక్షణలో సంగీత పాండిత్యానికి తుది మెరుగులు దిద్దుకున్నారు. ఎన్‌ఎస్‌టీఎల్ రామ్‌నాథ్ సెకండరీ స్కూల్‌లో ఇరవయ్యేళ్లుగా ఎందరో విద్యార్థులను గాత్రంలో తీర్చిదిద్దుతున్నారు. ఆకాశవాణి కళాకారిణిగా తన గాన మాధుర్యంతో శ్రోతలను సమ్మోహనపరుస్తున్నారు. అమెరికాలోని మసాచుసెట్ నగరంలో డబ్ల్యుఎంఎల్ 95.1 ఆన్‌లైన్ ఎఫ్‌ఎం రేడియో చానల్‌లో కూడా ఆమె గానం చేసిన భక్తి గీతాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి.
దేశభక్తితో ‘స్వరా’ర్చన
సాధారణంగా సీబీఎస్‌ఈ పాఠశాలల విద్యార్థులకు దేశభక్తి గీతాల్లో శిక్షణ ఇప్పిస్తారు. సరస్వతి తొలిసారిగా దేశభక్తి గీతాలకు స్వరాలను జతపరిచి పాడించి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. కర్ణాటక సంగీతంలో బేసిక్స్.. అంటే సరళీ స్వరాలు, జంట స్వరాలు నేర్పేవారు. ఏ గీతాన్నయినా ఆమె విభిన్నంగా బాణీ కట్టడమే పిల్లల విజయానికి కారణం.
పురస్కారాలెన్నో
పియర్‌సన్ టీచింగ్ అవార్డ్స్-2013కు దేశవ్యాప్తంగా అందిన 26 వేల ఎంట్రీల్లో సంగీతం కేటగిరీలో టాప్‌ఫైవ్‌లో మొదటి స్థానంలో పాలంకి సరస్వతి నిలిచారు. స్వర కళామణి, గాన కళారత్న, ఉమెన్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు.